రాష్ట్రాలను ఆదుకోవడం కేంద్రం బాధ్యతకాదా?

0
273
ఎ. కృష్ణారావు

కరోనా విపత్తు వల్ల రాష్ట్రాలకు ఎంత నష్టం జరిగిందన్న విషయమై కేంద్రానికి అవగాహన లేనట్టు పార్లమెంటులో మంత్రుల లిఖిత పూర్వక సమాధానాలు స్పష్టం చేశాయి. మరి రాష్ట్రాల సమస్యలను కేంద్రం ఏ విధంగా అర్థం చేసుకుంటుంది? పైగా ఆత్మ నిర్భర్ భారత్ క్రింద రాష్ట్రాలకు అప్పులు చేసుకునే అవకాశం కల్పించామని మోదీ ప్రభుత్వం చెప్పుకుంటోంది. రాష్ట్రాలు అప్పులు చేసుకుంటే అది ఆత్మ నిర్భర్ ఎలా అవుతుంది?

‘కరోనా మహమ్మారి కారణంగా, ఆర్థిక కార్యకలాపాలు మందకొడిగా సాగడం వల్ల రాష్ట్రాలకు వచ్చిన రెవెన్యూ నష్టాన్ని కేంద్రం ఏమైనా అంచనా వేసిందా? అంచనా వేస్తే వివరాలివ్వండి. ఈ సందర్భంగా ఆర్థిక సవాళ్లను ఎదుర్కోవడానికై రాష్ట్రాలకు కేంద్రప్రభుత్వం ఏ రకంగా సహాయం చేయనుంది?’- పార్లమెంట్ వర్షాకాల సమావేశాల మొదటి రోజు బిజూ జనతాదళ్ సభ్యుడు చంద్రశేఖర్ సాహు, భారతీయ జనతా పార్టీ సభ్యురాలు ప్రీతమ్ గోపీనాథ్ ముండే వేసిన ప్రశ్నలివి. ఈ ప్రశ్నలకు కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ సమధానమిస్తూ రాష్ట్రాలకు జరిగిన నష్టంపై తాము ఎలాంటి అంచనా వేయలేదని చెప్పారు. అందువల్ల తాము రాష్ట్రాలకు జరిగిన నష్టంపై ఎలాంటి వివరాలు ఇచ్చే ప్రసక్తే తలెత్తదని కూడా ఆమె స్పష్టం చేశారు. ఆత్మనిర్భర్ భారత్ కింద స్థూల రాష్ట్ర దేశీయోత్పత్తిలో 2 శాతం మేరకు అదనపు అప్పులు చేసే అవకాశం కల్పించామని, అందులో ఇప్పటి వరకు 0.5 శాతం మేరకు అప్పులకు అనుమతినిచ్చామని ఆర్థిక మంత్రి పేర్కొన్నారు.

కరోనా విపత్తు విరుచుకుపడినప్పటి నుంచీ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆరేడుసార్లు ముఖ్యమంత్రులతో సమావేశమయ్యారు. తద్వారా ప్రధానమంత్రి మొత్తం దేశంలో కరోనాను కేంద్రమే నియంత్రిస్తున్నదన్న అభిప్రాయాన్ని ప్రజలలో కల్పించడంలో సఫల మయ్యారు. మరి సభ్యుల ప్రశ్నలకు ఆర్థికమంత్రి సమాధానాలు కరోనా మహమ్మారి వల్ల రాష్ట్రాలకు జరిగిన ఆర్థికనష్టం భరించేందుకు కేంద్రం ఏమీ చేయలేదన్న విషయాన్ని స్పష్టం చేశాయి. కనీసం రాష్ట్రాలకు ఎంత నష్టం జరిగిందన్న విషయంలో కేంద్రానికి అవగాహన కూడా లేకపోతే రాష్ట్రాల సమస్యలను ఏ విధంగా అర్థం చేసుకుంటుంది? పైగా ఆత్మ నిర్భర్ భారత్ కింద రాష్ట్రాలకు అప్పులు చేసుకునే అవకాశం కల్పించామని కేంద్రం చెప్పుకుంటోంది. రాష్ట్రాలు అప్పులు చేసుకుంటే అది ఆత్మనిర్భర్ ఎలా అవుతుంది?

కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ రాజకీయాల్లో ఢక్కామొక్కీలు తిని ఉన్నత స్థాయికి ఎదిగిన నాయకురాలు కాదు. రాజకీయాల్లో ప్రవేశించిన అనతికాలంలోనే ఆమెకు అత్యంత ప్రతిష్ఠాత్మక అవకాశాలు లభించాయి. దశాబ్దాలుగా రాజకీయాల్లో ఉన్నా ఎలాంటి పదవులు రాని నేతలు ఉన్న ఈ రోజుల్లో 2008లో బిజెపిలో చేరిన నిర్మలా సీతారామన్‌కు ఆరేళ్లలోనే కేంద్ర కేబినెట్‌లో అవకాశం లభించింది. అందువల్ల ఆమెకు తిమ్మిని బమ్మిని చేసి జవాబులు చెప్పడం, అరుణ్ జైట్లీలా ఆర్థిక, న్యాయశాస్త్రాలు కలగలిపి ఆకట్టుకునేలా మాట్లాడడం అంతగా అబ్బలేదు. ఉన్నత విద్యార్హతలు ఉన్నప్పటికీ ఆర్థిక పరిస్థితి గురించి మసిపూసి మారేడుకాయ చేయడం, సెంట్రల్ హాలులో జర్నలిస్టులను చుట్టూ ఉంచుకుని ఆసక్తికరమైన కబుర్లు చెప్పడం ఆమెకు సాధ్యం కాదు. కనుకనే నిర్మలా సీతారామన్ ఉన్నదున్నట్లు దేశ దుర్భర పరిస్థితి గురించి వివరించడం, తామేమీ చేయలేమని చేతులెత్తేయడం చేయగలుగుతున్నారు. ఈ నేపథ్యంలో ఆర్థిక మంత్రి పై తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ, సీనియర్ నేత సౌగత్‌రాయ్ చేసిన వ్యక్తిగత వ్యాఖ్యలు ఏ మాత్రం ఆహ్వానించదగినవి కావు.

భారత రాజకీయాల్లో మహిళలు ఎంత ఉన్నత స్థానాలకు ఎదిగినా వారిని గౌరవించే సంస్కృతి ఇంకా అభివృద్ధి చెందలేదని చెప్పడానికి సౌగత్ రాయ్ వ్యాఖ్యలే నిదర్శనం. అయినా ప్రధానమంత్రి నరేంద్రమోదీపై ఎక్కుపెట్టాల్సిన విమర్శలు నిర్మలా సీతారామన్ పై ఎక్కుబెడితే మాత్రం ఆమె ఏం చేయగలరు? రక్షణ మంత్రిగా ఎంత ముక్కుసూటిగా మాట్లాడారో, ఆర్థికమంత్రిగా కూడా ఆమె అంతే నిక్కచ్చిగా మాట్లాడడం వల్లనే ఇవాళ దేశ ఆర్థిక పరిస్థితి ఎంత దుర్భరంగా ఉన్నదో మనకు అర్థం అవుతున్నది. ఆర్థిక మంత్రిత్వశాఖకు చెందిన స్వతంత్ర పరిశోధనా సంస్థ ‘నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఫైనాన్స్ అండ్ పాలసీ’ (ఎన్.ఐ. పి.ఎఫ్.పి) కూడా ప్రస్తుత పరిస్థితి గురించి స్పష్టంగానే అంచనా వేసింది. దేశ ఆర్థిక వ్యవస్థ ఆందోళనకరంగా ఉన్నదని, జీడీపీ భారీ పతన దిశలో ఉండగా ద్రవ్యలోటు జీడీపీలో 6 నుంచి 8 శాతానికి పెరుగుతున్నదని ఆ సంస్థకు చెందిన ఆర్థిక వేత్తలు తమ పరిశోధనా పత్రాల్లో స్పష్టం చేశారు. రిజర్వు బ్యాంకు అదనపు నోట్లు ప్రింట్ చేసేందుకు పెద్దగా అవకాశం లేదని, విదేశాల్లో అప్పులు చేయాలంటే కూడా మన ఆర్థికమూలాలు బాగుండాలని ఈ ప్రభుత్వ సంస్థ వ్యాఖ్యానించడం గమనార్హం. జీఎస్టీ వసూళ్ళు 2020 మార్చి నుంచే పడిపోవడం ప్రారంభమయిందని, ఏప్రిల్ నాటికే ఆ వసూళ్లు 72 శాతం పడిపోయాయని తెలిపింది. ఈ నేపథ్యంలో రాష్ట్రాలకు చెల్లించాల్సిన జీఎస్టీ నష్ట పరిహారం రూ.1,51,365 కోట్ల తాము చెల్లించలేమని కేంద్రం చేతులెత్తేయడంలో ఆశ్చర్యం లేదు. ఈ నష్టాన్ని భరించేందుకు రాష్ట్రాలకు అప్పులు చేసుకునే అవకాశం కల్పించామని కేంద్ర ఆర్థిక మంత్రి మొదటి రోజే సభ్యులకు మరోసారి స్పష్టం చేశారు. దాదాపు అన్ని రాష్ట్రాల ఎంపీలు తొలిరోజే జీఎస్టీపై ప్రభుత్వంపై ప్రశ్నలు సంధించారు. కేంద్ర ప్రభుత్వం నుంచి చిల్లిగవ్వ రాదని తెలియడంతో తెలంగాణ రాష్ట్ర సమితి సభ్యులు తమ రాష్ట్రాన్ని కేంద్రం ఆదుకోవాలంటూ బుధవారం గాంధీ విగ్రహం ముందు ధర్నాకు పూనుకోవడం ఒక ముఖ్య పరిణామం.

కరోనా మూలంగా దేశ ప్రజలు అనారోగ్యం పాలై నానా అవస్థలు పడుతున్న ప్రస్తుత సమయంలో జరుగుతున్న ఈ సమావేశాల్లో సభ్యులకు ప్రశ్నలు అడిగే అవకాశం లేదు. లిఖితపూర్వక జవాబుల్లో నిరాశాజనకమైన జవాబులు వస్తున్నాయి. తద్వారా, ప్రశ్నోత్తరాల సమయం లేకపోయినప్పటికీ ఈ సమావేశాల మూలంగా మంత్రుల నుంచి వాస్తవాలు మరింతగా కళ్లు తెరిచేలా చేస్తోంది. వలస కార్మికుల గురించి కూడా ప్రభుత్వం వాస్తవాలను తెలియజేసింది. వారు లాక్ డౌన్ మూలంగా వందలాది మైళ్లు నడిచి అనేక చోట్ల కుప్పకూలి, ఆకలికి, ప్రమాదాలకు గురై మరణించడం జరిగింది. ఆ అభాగ్యుల గురించి పత్రికల్లో అనేక వార్తలు వచ్చినప్పటికీ తమ వద్ద ఎలాంటి సమాచారం లేదని కేంద్రం జవాబు చెప్పడం ఆశ్చర్యకరం. అలా మరణించిన వారి సమాచారం తమ వద్ద లేదని, కనుక ఆ మృతులకు నష్టపరిహారం చెల్లించే ప్రశ్నే లేదని కేంద్ర కార్మిక శాఖ మంత్రి సంతోష్ కుమార్ గంగ్వార్ మరో లిఖిత పూర్వక సమాధానంలో సమావేశాల మొదటి రోజే స్పష్టం చేశారు. కనీసం మీడియాలో వచ్చిన వార్తలను క్రోడీకరించినా ప్రభుత్వం వద్ద ఒక డేటా ఉండేది. కాని అభాగ్యులు మరణిస్తే వారి వివరాలు సేకరించాలన్న శ్రద్ధ ప్రభుత్వానికి లేకపోయింది. కరోనా మూలంగా లక్షలాది మంది ఉపాధి కోల్పోగా, ఎంత మంది ఉపాధి కోల్పోయారో కూడా తాము సమాచారం సేకరించలేదని ఇదే మంత్రి చెప్పడం బాధ్యతారాహిత్యం కాదా?

పార్లమెంట్‌లో లిఖితపూర్వక జవాబుల్లోనే ఇంత ఆసక్తికరమైన విషయాలుంటే, ప్రశ్నోత్తరాల సమయాన్ని అనుమతిస్తే మరింత కీలకమైన సమాచారం వచ్చేందుకు ఆస్కారం తప్పకుండా ఉండేది. స్వతంత్ర భారత దేశంలో తొలి అవినీతి కుంభకోణం 1957లో ప్రశ్నోత్తరాల సమయంలోనే బయటపడింది. జీవితబీమా సంస్థ నుంచి కోటి రూపాయలు ఒక ప్రైవేట్ సంస్థలో పెట్టుబడి పెట్టడానికి సంబంధించి 1957 సెప్టెంబర్ 4న లోక్‌సభలో రాంసుభా సింగ్ అనే కాంగ్రెస్ సభ్యుడు ప్రశ్నించారు. ఆ ప్రశ్నే తర్వాతికాలంలో ముంద్రా కుంభకోణంగా ప్రసిద్ధి కెక్కింది. దరిమిలా ఆర్థికమంత్రి టీటీ కృష్ణమాచారి తన పదవికి రాజీనామా చేయగా, కోల్‌కతా వ్యాపారవేత్త హరిదాస్ ముంద్రా 22 సంవత్సరాలు జైలులో మగ్గాల్సి వచ్చింది. ఇప్పుడు అలాంటి ప్రశ్నలు, అలాంటి పర్యవసానాలను ఊహించలేం.

విచిత్రమేమంటే భారత- చైనా సరిహద్దుల్లో ఏం జరుగుతోందన్న విషయాన్ని పార్లమెంట్‌లో చర్చించడానికి ప్రభుత్వం సిద్ధంగా లేదు. భారతదేశ సమగ్రతను, సార్వభౌమికతను ఎట్టి పరిస్థితుల్లోను కాపాడేందుకు తాము సిద్ధంగా ఉన్నామని రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్ చేసిన ప్రకటనతో సరిపుచ్చుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ప్రకటనపై పార్లమెంట్‌లో చర్చించడానికి కానీ, జవాబు ఇవ్వడానికి కానీ ప్రధానమంత్రి సిద్ధపడలేదు. పార్లమెంట్ సమావేశాల మొదటి రోజు ప్రధానమంత్రి చేసిన ప్రకటనతోనే సరిహద్దు ఘర్షణలపై చర్చకు ఆయన ఎలాంటి ఆస్కారం ఇవ్వదలుచుకోలేదన్న విషయం స్పష్టమయింది. దేశమంతా ఐకమత్యంతో, మన సరిహద్దులను కాపాడుతున్న సాహస సైనికుల వెంట నిలుస్తుందని ఆయన విశ్వాసం ప్రకటించారు. చైనా తప్ప మరే అంశాన్నీ ఆయన ప్రస్తావించకపోవడం గమనార్హం.

నిజానికి ఈ వర్షాకాల సమావేశాలను ప్రభుత్వం తన ఎజెండా, బిల్లులు, ఆర్డినెన్స్‌లు ఆమోదించేందుకే ఏర్పాటు చేసిందన్న విషయం మొదటి రెండు రోజుల్లోనే స్పష్టం మయింది. మొదటి రెండు రోజుల్లోనే ఏడు బిల్లులను ప్రవేశపెట్టి, నాలుగు బిల్లులను ఆమోదింపచేసుకున్నారు. తమకు కావల్సిన మేరకు 2.35 లక్షలకోట్ల అనుబంధ పద్దులను ప్రవేశపెట్టారు. నిజానికి కరోనా మూలంగా చాలామంది ఎంపీలు పార్లమెంట్ రావడానికి భయపడుతుండగా, మొదటి రోజు లోక్‌సభకు 350మంది మాత్రమే హాజరయ్యారు. పలువురు ఎంపీలకే కాక, 50 మందికి పైగా పార్లమెంట్ సిబ్బందికి కరోనా సోకింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం తమ ఎజెండాను హడావిడిగా ముగించుకుని పార్లమెంట్‌ను ముందుగానే వాయిదా వేయవచ్చుని వార్తలు వస్తున్నాయి. ఏరు దాటిన తర్వాత తెప్ప ఏమై పోయినా అడిగేవారెవరు? మన దేశంలో ప్రజల పరిస్థితి ప్రస్తుతం అలాగే ఉంది.

Courtesy Andhrajyothi

Leave a Reply