కార్యాలయాల్లో కరోనా ముప్పు!

0
232

ఉద్యోగులు ఎదురెదురుగా కూర్చోవద్దు
ఇతరుల ఫోన్లను, వస్తువులను వినియోగించొద్దు
లిఫ్టు కంటే మెట్లు వాడడం మంచిది
కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ మార్గదర్శకాలు జారీ

హైదరాబాద్‌: లాక్‌డౌన్‌ సడలింపుల అనంతరం ప్రభుత్వ, ప్రైవేట్‌ కార్యాలయాల్లో సేవలు పూర్తిస్థాయిలో పునరుద్ధరించడంతో ఆయా పని ప్రదేశాల్లో కరోనా వైరస్‌ వ్యాప్తి ముప్పు పొంచి ఉందని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ హెచ్చరించింది. ఎట్టి పరిస్థితుల్లోనూ పని ప్రదేశాల్లో ఉద్యోగులు ఎదురెదురుగా కూర్చోవద్దని, డెస్కులు, కుర్చీలను జిగ్‌జాగ్‌ విధానంలో అమర్చాలని సూచించింది. సాధ్యమైనంత వరకు సహ ఉద్యోగుల మొబైల్‌ ఫోన్లను, డెస్కులను, ఇతర వస్తువులను వినియోగించొద్దని, వాటిని ఉపయోగించడానికి ముందు, తర్వాత ఇన్‌ఫెక్షన్‌ రహిత ద్రావణాలతో తప్పకుండా శుభ్రపర్చాలని తెలిపింది.

ఉద్యోగులు ఏవైనా ఆరోగ్య సమస్యలుంటే తప్ప లిఫ్ట్‌ సౌకర్యాన్ని ఉపయోగించవద్దని, ఎక్కువగా మెట్ల మీదుగా వెళ్లడాన్నే అలవాటు చేసుకోవాలని స్పష్టం చేసింది. లిఫ్టులోనూ ఒకేసారి నలుగురి కంటే ఎక్కువమంది వెళ్లకూడదని, ఆ నలుగురు కూడా లిఫ్టు గోడలవైపు ముఖం ఉండేలా నిలబడాలని సూచించింది. కొవిడ్‌ కట్టడిపై మరింత కఠినంగా వ్యవహరించాలని, ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం ద్వారానే వైరస్‌ వ్యాప్తిని కార్యాలయాల్లో అరికట్టడం సాధ్యమవుతుందని సూచించింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ గురువారం మార్గదర్శకాలు జారీచేసింది. అవి..

ఉద్యోగులందరు తప్పనిసరిగా మాస్కు ధరించాలి.

పదే పదే కళ్లు, ముక్కు, నోటిని తాకొద్దు.

ఒకవేళ కార్యాలయంలో ఉన్నప్పుడు దగ్గు, తుమ్ములు వస్తే రుమాలును గానీ, టిష్యూ పేపరును గానీ అడ్డుగా పెట్టుకోవాలి. అనంతరం దాన్ని మూత మూసి ఉంచే డబ్బాలో పడేయాలి.

చేతులను సబ్బుతో 20 సెకన్ల పాటు కడుక్కోవాలి. సబ్బు లేకపోతే శానిటైజర్‌తో శుభ్రపర్చుకోవాలి.

కార్యాలయాల్లో ఎక్కువమంది, ఎక్కువసార్లు తాకడానికి అవకాశమున్న ప్రదేశాలను, వస్తువులను, ఉపరితలాలను తరచూ శుభ్రపర్చాలి.

అపరిశుభ్ర ప్రదేశాలను ఇన్‌ఫెక్షన్‌ రహిత ద్రావణాలతో శుభ్రపర్చాలి.

సాధ్యమైనంత మేరకు సెంట్రలైజ్‌డ్‌ ఏసీని వినియోగించకపోవడమే మంచిది.

అంతా ఒకేసారి ఒకే గేటు ద్వారా ప్రవేశించకుండా వేర్వేరు మార్గాల్లో కార్యాలయం లోనికి ప్రవేశించాలి.

కొవిడ్‌ 19 పాజిటివ్‌ వ్యక్తితో సన్నిహితంగా మెలిగిన ఉద్యోగి.. కేంద్ర ఆరోగ్య శాఖ నిబంధనల ప్రకారం కచ్చితంగా తనకు తానుగా స్వీయ గృహనిర్బంధ పరిశీలనలో ఉండాలి.

కరోనా నిర్ధారణ పరీక్షలకు నమూనాలిచ్చిన వ్యక్తి పరిపాలన విభాగానికి సమాచారమివ్వడంతో పాటు ఫలితాల్లో నెగిటివ్‌ వచ్చే వరకు కార్యాలయానికి రావొద్దు.

అందరూ కలిసి కూర్చుని ఉమ్మడిగా భోజనాలు చేయడాన్ని మానేయాలి.

భోజన సమయాలను కూడా అందరికీ ఒకేసారి కేటాయించకుండా వేర్వేరు సమయాల్లో వెళ్లేలా ప్రణాళిక అమలు చేయాలి.

కారిడార్లలో ఎక్కువమంది గుమిగూడి మాట్లాడుకోవడం మానుకోవాలి. వ్యక్తిగత దూరాన్ని పాటించాలి.

కార్యాలయాల్లో సమావేశాలను వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా నిర్వహించుకోవాలి.

Courtesy Eenadu

Leave a Reply