ఇలాగైతే యమ డేంజర్‌!

0
258

అడ్డూఅదుపూ లేని వైరస్‌
రోజూ 200 దాటుతున్న కేసులు.. డాక్టర్లు, పోలీసులు విలవిల
కీలక రంగాలు మూలపడితే సమాజంలో సంక్షోభమే
ప్రజల్లోనూ బాధ్యత పెరగాలి
లేదంటే దారుణ పర్యవసానాలు

ఆంధ్రప్రదేశ్‌లో గత రెండు వారాల్లో ఏకంగా 2,500కు పైగా కరోనా కేసులు.. 22 మరణాలు… కొన్నాళ్లుగా రోజుకు 200మందికి పైగా వైరస్‌ బారిన పడుతున్నారు. డాక్టర్లు, పోలీసులు, సచివాలయ ఉద్యోగులు… ఇలా కీలక రంగాలవారు ఆస్పత్రిపాలవుతున్నారు.

అమరావతి: రాష్ట్రంలో కరోనా శరవేగంగా విజృంభిస్తోంది. వైరస్‌ వ్యాపిస్తున్న వేగం ఆందోళన కలిగిస్తోంది. మున్ముందు కేసుల సంఖ్య మరింతగా పెరగొచ్చని వైద్య, ఆరోగ్యశాఖే అంచనా వేస్తోంది. ఇప్పటికే పనిభారం, ఒత్తిడి భరించలేక ప్రభుత్వ వైద్యసిబ్బంది ఆందోళనబాట పడుతున్నారు. తమకు నాణ్యమైన పీపీఈ కిట్లు అందించాలని, పనిఒత్తిడి తగ్గించాలని డిమాండ్‌ చేస్తున్నారు. అటు పొరుగు రాష్ట్రమైన తెలంగాణలోనూ పరిస్థితి తీవ్రంగా మారుతోంది. ఆ రాష్ట్రంలో ఆదివారం ఒక్కరోజే 237 కేసులు నమోదయ్యాయి. మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 4,974కు చేరింది. దేశవ్యాప్తంగానూ పలు రాష్ట్రాల్లో కరోనా శరవేగంతో వ్యాప్తి చెందుతోంది. దేశంలో రోజువారీ కేసుల సంఖ్య సుమారు 12వేలకు చేరింది. మరణాలు రోజుకు 300 దాటాయి. జూలై, ఆగస్టుల్లో కరోనా విశ్వరూపం చూపబోతోందని, లక్షల సంఖ్యలో ప్రజలు వైరస్‌ బారినపడతారని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే సామాజిక వ్యాప్తి జరుగుతోందని చెబుతున్నారు. వైరస్‌ వ్యాప్తి ఇలాగే కొనసాగితే రానురాను పరిస్థితి అదుపు తప్పి, వ్యవస్థలు కుప్పకూలి, సంక్షోభం ఏర్పడుతుందనే భయాందోళనలు కూడా వ్యక్తమవుతున్నాయి. వైద్యులు, పోలీసులు, ప్రభుత్వ యంత్రాంగంలో ఎక్కువమంది వైరస్‌ బారిన పడితే సమాజంపైనా దాని పర్యవసానాలు తీవ్రంగా ఉండే ప్రమాదం కనిపిస్తోంది.

కరోనాను అదుపుచేసే ఉద్దేశంతో మార్చి 22నుంచి లాక్‌డౌన్‌ విధించారు. దాదాపు రెండు నెలలు సాగిన లాక్‌డౌన్‌తో ప్రజలు అష్టకష్టాలపాలయ్యారు. వ్యాపారాలు కుదేలయ్యాయి. వలస కూలీలు పొట్ట చేతపట్టుకుని వందల, వేల కిలోమీటర్లు నడిచి స్వస్థలాలకు చేరుకోవాల్సిన దుస్థితి ఏర్పడింది. వీధి వ్యాపారులు, దినసరి కూలీల వంటి వారు ఉపాధి లేక విలవిల్లాడారు. లక్షలాదిమంది ఉద్యోగాలు కోల్పోయారు. ఇంత మూల్యం చెల్లించి లాక్‌డౌన్‌ విధించినప్పుడు ప్రభుత్వాలు దానిని పూర్తిగా సద్వినియోగం చేసుకుని ఆ సమయంలో వైరస్‌ను నియంత్రించాలి. కానీ ఆ దిశగా మనం పెద్దగా సఫలమైనట్లు కనిపించడం లేదు. లాక్‌డౌన్‌ సమయంలోనూ కేసులు పెరుగుతూనే వచ్చాయి. రాష్ట్రంలో కీలక రంగాలవారు పెద్దసంఖ్యలో వైరస్‌ బారిన పడటం ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటికే 105మందికి పైగా వైద్యులు, వైద్యసిబ్బందికి వైరస్‌ సోకింది. మున్ముందు ఈ సంఖ్య మరింత పెరిగే ప్రమాదం ఉంది.

వారు మూలనపడితే ప్రజలు మరింత ప్రమాదకర పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది. అలాగే శాంతిభద్రతలకు గుండెకాయలాంటి పోలీసులు కూడా వైరస్‌ ధాటికి అల్లాడుతున్నారు. వైద్య ఆరోగ్యశాఖ లెక్కల ప్రకారమే ఇప్పటివరకు రాష్ట్రంలో 70మందికి పైగా పోలీసులకు కరోనా సోకింది. నిత్యం విధుల్లో ఉండటంతో వారు హైరిస్కు జోన్‌ పరిధిలోకి వచ్చేశారు. అలాగే పరిపాలనకు అత్యంత కీలకమైన సచివాలయం ఉద్యోగులు కూడా కరోనా బారిన పడుతున్నారు. దాంతో మిగిలినవారిని క్వారంటైన్‌తో ఇళ్లకే పరిమితం చేయాల్సివస్తోంది. ఇలాంటి కేసులు పెరిగితే పాలన అంతా కుంటుపడుతుంది. ఇలా ప్రభుత్వ యంత్రాంగం, వైద్యులు, పోలీసులు లాంటి కీలక రంగాలు అస్తవ్యస్తమైతే దాని పర్యవసానాలు చాలా తీవ్రంగా ఉంటాయి. ప్రజల సమస్యల్ని గుర్తించడానికి, పరిష్కరించడానికి అవకాశమే లేకుండా పోతుంది. ఇది సంక్షోభానికి దారితీస్తుంది. ఆ పరిస్థితి రాకముందే మేల్కొని తగిన దిద్దుబాటు చర్యలు తీసుకోవడం అత్యవసరం.

లాక్‌డౌన్‌ కాలంలో తామే రక్షకులమంటూ అభయమిచ్చిన ప్రభుత్వాలు ఇప్పుడు ‘‘కరోనాతో కలిసి జీవించాల్సిందే’’ అంటూ చేతులెత్తేశాయి. బాధ్యతను ప్రజల మీదికి నెట్టేశాయి. అయితే ప్రజల్లోనైనా ఆ అవగాహన, బాధ్యత కనిపించడం లేదు. భారీఎత్తున బర్త్‌డే ఫంక్షన్లు, కుటుంబ వేడుకలు, దుకాణాల దగ్గర గుమిగూడటాలు వంటివి చూస్తుంటే మనం నానాటికీ ఎంత ప్రమాదం దిశగా వెళుతున్నామో ఇట్టే అర్థం అవుతుంది. లాక్‌డౌన్‌ కాలంలోనూ రాష్ట్రంలో రాజకీయ కార్యక్రమాలు జోరుగా సాగాయి. భౌతిక దూరం అపహాస్యానికి గురైంది. ప్రజల్లో అవగాహన పెంచడానికి, భౌతిక దూరం, మాస్కుల నిబంధనలు అమలు చేయడానికి గట్టి చర్యలు తీసుకోకపోతే పరిస్థితి చేయిదాటిపోతుందనే ఆందోళన వ్యక్తమవుతోంది. తెలంగాణలో పలు ఆలయాల్లో కూడా భక్తులు భౌతిక దూరం పాటించడం లేదంటూ తరచు వార్తలు వస్తున్నాయి. మృగశిరె కార్తెకు ముందురోజు హైదరాబాద్‌లోని రాంనగర్‌ చేపల మార్కెట్‌కు ఒకేసారి పెద్దసంఖ్యలో ప్రజలు చేపలు కొనడానికి వచ్చారు. దాంతో ఆ ప్రాంతంలో నాలుగు రోజుల నుంచి పెద్ద ఎత్తున కేసులు వస్తున్నాయి.

భారత్‌లో నవంబర్‌ నాటికి కరోనా అత్యధిక స్థాయికి చేరుతుందని, అప్పుడు ఐసొలేషన్‌ పడకలుగానీ, ఐసీయూ పడకలుగానీ, వెంటిలేటర్లుగానీ సరిపోక తీవ్ర ఇబ్బందులు తలెత్తుతాయని ఐసీఎంఆర్‌ ఆధ్వర్యంలో జరిగిన ఒక తాజా అధ్యయనంలో తేలింది. అయితే వాస్తవ పరిస్థితి అంతకంటే చాలా తీవ్రంగా ఉంది. ముంబైలో అందుబాటులో ఉన్న ఐసీయూ బెడ్స్‌లో 99 శాతం, వెంటిలేటర్లలో 94 శాతం ఇప్పటికే వినియోగిస్తున్నట్లు ముంబై నగర కార్పొరేషన్‌ శనివారం తెలిపింది. అవి అవసరమయ్యే రోగుల సంఖ్య భారీగా పెరిగితే ఎలాగనే ఆందోళన ముంబైవాసుల్లో వ్యక్తమవుతోంది. జిల్లాల్లోనూ కరోనా చికిత్సలు అందిస్తామని తెలంగాణ ప్రభుత్వం చెబుతున్నప్పటికీ, అక్కడి ఆస్పత్రుల్లో 50-60 శాతం సిబ్బంది కొరత ఉందని సమాచారం. ఆరోగ్య సదుపాయాలు ఎంతో బాగుండే ఇటలీ… కరోనా విజృంభించినప్పుడు అల్లాడిపోయింది. పడకలు సరిపోని స్థితిలో ఎవరిని బతికించాలి, ఎవర్ని చావనివ్వాలి అని నిర్ణయించుకోవాల్సిన దుస్థితిలో పడిపోయింది. దాదాపు 140కోట్ల జనా భా ఉన్న భారత్‌లో కరోనా ఒకస్థాయి దాటి విజృంభిస్తే దాని పర్యవసానా లు ఊహించుకోవడం కూడా కష్టమే! అటు ప్రభుత్వం, ఇటు ప్రజలు పూర్తి బాధ్యతతో వ్యవహరిస్తేనే అలాంటి దుస్థితి నుంచి తప్పించుకోగలుగుతాం!!

రాష్ట్రంలో కరోనా బాధితుల్లో..
వైద్య సిబ్బంది 105కి పైగా…
పోలీసులు 70కి పైగా…
సచివాలయ ఉద్యోగులు15కి పైగా…

Courtesy Andhrajyothy

Leave a Reply