మార్క్సిజం – పర్యావరణం

0
237

అభివృద్ధిని పర్యావరణ పరిరక్షణతో కలిపే ప్రత్యామ్నాయ వ్యూహాన్ని మనం రూపొందించవలసిన అవసరం ఉంది. అది ప్రకృతితో పాటు స్థిరంగా ఉండే అధునాతన సాంకేతిక పరిజ్ఞానంపై ఆధారపడి ఉండాలి. పెట్టుబడిదారీ వ్యవస్థను, సామ్రాజ్యవాదాన్ని నిందిస్తే సరిపోదు. దేశాలు, వ్యక్తులు, పార్టీలు, సంస్థలు భూమిని రక్షించేందుకు కలిసికట్టుగా తక్షణమే చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే చాలా ఆలస్యం అయిపోయింది.

మనం ప్రతీ సంవత్సరం జూన్‌ 5న ‘ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని’ జరుపుకుంటాం. లాభార్జన కోసం ప్రకృతి పట్ల నిర్లక్ష్యం వహించిన ఫలితంగా కరోనా వైరస్‌ మహమ్మారి వ్యాపించిన ప్రత్యేక సందర్భాన్ని ప్రపంచం సాధించింది. కరోనా వైరస్‌, ఇతర వైరస్‌ల రూపంలో, ‘అంఫాన్‌’ తరుచు తుఫాన్లు, గాలివానల ద్వారా ప్రకృతి తీవ్రమైన స్థాయిలో ప్రతీకారం తీర్చుకుంటుంది. మనం ప్రకృతిపై సాధించిన విజయాల పట్ల గర్వపడకూడదనీ, ”మనం సాధించిన ప్రతీ విజయానికి, ప్రకృతి మన పైన పగ తీర్చుకుంటుందనీ”, ప్రారంభంలో ఫలితాలు మనం ఆశించిన విధంగానే ఉంటాయి, కానీ తరువాత ఊహించని పర్యవసానాలు బహిర్గతమవుతాయనీ చాలా కాలం క్రితమే ఎంగెల్స్‌ ‘ప్రకృతి యొక్క గతితార్కిక నియమాల’ గురించి గొప్పగా వివరించాడు. మార్క్స్‌, ఎంగెల్స్‌లు ఆధునిక సమాజంలో ప్రకృతి వినాశనానికి సంబంధించిన సమస్యలకు సవివరమైన పరిష్కారాలను తెలియజేసారు.

ప్రస్తుత కరోనా వైరస్‌ సంక్షోభంపైన తెలిపిన సిద్ధాంతాన్ని సరిగ్గా స్థిరపరచింది. కొన్ని నెలల పాటు అమలు చేయబడిన లాక్‌డౌన్‌ ‘ప్రకృతి తిరిగి రావడానికి’ దారి తీసింది. గాలి, భూమి, నీళ్ళలోని విష మలినాలు తగ్గి పోయాయి. మానవులు, ప్రభుత్వ జోక్యాలు లేకుండానే నదులు వాటికవే శుద్ధి చేసుకున్నాయి. కనిపించని పక్షులు ఇప్పుడు మన ఇరుగు పొరుగు ప్రాంతాలను సందర్శిస్తున్నాయి. మనకవసరమైన ప్రాణవాయువు (ఆక్సిజన్‌)ను సమకూరుస్తూ పచ్చదనం వేగంగా విస్తరిస్తోంది. మనందరం కోరుకుంటున్న, కొనసాగా లనుకుంటున్న పర్యావరణం మరింత పరిశుభ్రంగా ఉంటుంది.

టూరిజం శాఖ సహాయం లేకుండానే వందల కిలోమీటర్ల దూరం నుంచి హిమాలయ పర్వతాల అందాన్ని మనం చూడవచ్చు. గంగా, యమునా, కృష్ణా, గోదావరి లాంటి నదులు చూడడానికి చాలా అందంగా ఉన్నాయి! మనం ఎంచుకున్న మార్గంలోనే ఏదో లోపం ఉంది.

కరోనా-ప్రకృతి: పర్యావరణ, ఆర్థిక కారణాల ఫలితం గానే కరోనా సంక్షోభం సంభవించింది. ప్రతీ జీవికి దాని నివాస ప్రాంతంపై హక్కు ఉంటుంది. వైరస్‌లకు కూడా! మానవుల నిరంతర చర్యలు వృక్షాలు, జంతువులు, సూక్ష్మజీవులు జీవించడానికి చాలా తక్కువ స్థలాన్ని వదులు తున్నాయి. దీనివల్ల పులులు, కోతులు, ఇతర జంతువులు, పక్షులు మొదలైనవి, వైరస్‌లు, బ్యాక్టీరియాతో మానవుల సంబంధాలు పెంపొందించడానికి దారితీసిన ఫలితంగా సంక్లిష్టమైన సమస్యలు, విరోధాలు సంభవిస్తున్నాయి.

కరోనా ప్రధానంగా గబ్బిలం శరీరంలో నివాసం ఉండే ఒక ప్రత్యేకమైన వైరస్‌. వైరస్‌లు నిర్జీవులు, సజీవుల మధ్య మారేటువంటి సజీవ మిశ్రితాలు (ఆర్గానిక్‌ కాంపౌండ్స్‌). బయటి సజీవ శరీరాల్లో నివాసం ఉన్నప్పుడు అవి చలనంలో ఉండవు. కానీ వృక్షాలు, జంతువులు, మానవుల్లో అవి చురుకుగా మారుతాయి. అవి సాధారణంగా స్నేహభావంతో, ఉపయోగకరంగా ఉంటూ, జీవమున్న ప్రాణులతో పరస్పర సహకార జీవనం చేస్తాయి. కొన్ని సమయాల్లో మాత్రమే అపాయకరంగా ఉంటాయి.

ఇతర వైరస్‌ల మాదిరిగా కరోనా వైరస్‌ సామాన్యమైన నిర్మాణాన్ని కలిగి ఉంటుంది. ఆర్‌ఎన్‌ఏ లేదా డీఎన్‌ఏలోని ఒక పోగు చుట్టూ రెండు పొరల ప్రోటీన్లు నిర్మితమై ఉంటాయి. కరోనా వైరస్‌లో ప్రోటీన్లు క్రొవ్వు చేత కప్పబడి ఉంటాయి. ‘కరోనా వైరస్‌’ పేరుపై భాగంలో ఉండే వాడి అయిన మొన లాంటి క్రొవ్వు పదార్థం నుంచి వచ్చింది. ‘కరోనా’ లాంటి నిర్మాణం తయారవ్వాలంటే సగటున 74 వాడి మొనలుండాలి.
కరోనా వైరస్‌ చైనాలోని గబ్బిలాల (బతికి ఉన్న జంతువుల) నుంచి వ్యాప్తి చెందాయని అనేక మంది ఊహించుకున్నారు. అదేవిధంగా 2019 చివర్లో వూహాన్‌లో జరిగిన అమెరికా-చైనా మిలిటరీ శిక్షణా శిబిరాల నుంచి ఈ వైరస్‌ వ్యాప్తి చెంది ఉండవచ్చని కూడా అనుకున్నారు. చైనాకు అప్పటికే ‘సార్స్‌’, కరోనా మహమ్మారులు, 2002-04లో సంభవించిన మరణాల అనుభవాలను కలిగి ఉంది.

కరోనా, పర్యావరణ సామ్రాజ్యవాదం: కరోనా గానీ, దాని వల్ల కలిగే ముప్పు గానీ కొత్త కాదు. దానిని (కరోనా) ఫార్మా (మందుల) పరిశ్రమలు అధిగమించి ఉండాల్సింది. ప్రపంచ ఫార్మాసీయుటికల్‌ మార్కెట్‌ విలువ 934.8 బిలియన్‌ డాలర్లు. టాప్‌ పది కంపెనీల అమ్మకాలు 30శాతం ఉంటాయి. వ్యాక్సిన్‌ మార్కెట్‌లో మెర్క్‌ అండ్‌ ఫిజర్‌ కంపెనీ ఒక్కటే 80శాతం అమ్మకాలు జరుపుతుంది. ప్రపంచంలో వచ్చే మొత్తం ఆదాయంలో అమెరికా కంపెనీల భాగస్వామ్యం 50శాతంగా ఉంది. 2001లో మొత్తం ప్రపంచ మార్కెట్‌ అమ్మకాలు 390 బిలియన్‌ డాలర్లు ఉంటే, 2019లో ఆశ్చర్యకరంగా 1.25 ట్రిలియన్‌ డాలర్లకు పెరిగాయి.

అసలు విషయం ఏమంటే, పెద్ద పెద్ద ఫార్మా కంపెనీలు, అమెరికా లాంటి దేశాలు కరోనా వైరస్‌కు వ్యాక్సిన్‌, మందులు ఎందుకు కనుగొనలేక పోతున్నాయి? పైన క్లుప్తంగా వివరించబడిన జీవరసాయన వైరస్‌ వలయాన్ని వారు ఎందుకు బద్దలు కొట్టలేకపోయారు? అమెరికాలో లక్ష మందికి పైగా ప్రజలు మరణించడం ఆశ్చర్యకరం. అది (అమెరికా) ఆలస్యంగా, నెమ్మదిగా నిర్లక్ష్యమైన చర్యలు చేపట్టింది. ఇటలీ, స్పెయిన్‌, యూకే మొదలగు దేశాల్లో లాగా, చైనా కూడా బాధ్యతల నుంచి తప్పించుకోలేక పోయింది. మన దేశంలో చేపట్టిన చర్యలు లోపభూయిష్టంగా ఉన్నాయి.
కార్పొరేట్‌ కంపెనీలు అంత ఆసక్తిగా లేవు. మాస్క్‌లు, వ్యక్తిగత రక్షణ పరికరాలు దీర్ఘకాలం పాటు ఉంటాయి కాబట్టి, కచ్చితంగా వాటి (మాస్క్‌లు, వ్యక్తిగత రక్షణా పరికరాల) మార్కెట్లు బాగా అభివృద్ధి చెందుతున్నాయి.

గుత్త ద్రవ్య పెట్టుబడి శ్రామికశక్తిని చౌకగా పొందడానికి, కరోనా వైరస్‌, పర్యావరణ సంక్షోభాలు అనుకూలమైన పనిముట్లుగా ఉపయోగపడుతున్నాయి. పెద్ద సంఖ్యలో ఉన్న వలస కార్మికుల సమస్య, గుత్త పెట్టుబడిదారీ విధానంలో ఉన్న వైరుధ్యాలను బహిర్గత పరచింది.
అమెరికా ‘రక్షణ వాదం’ (ప్రొటెక్షనిజం) వెనుక ఆశ్రయం పొందుతూ, ప్రపంచ పర్యావరణ ఒప్పందాలను వదిలేసింది. చమురు ధరలు బాగా తగ్గాయి, కానీ ఆర్థిక వ్యవస్థను, పర్యావరణాన్ని నిర్లక్ష్యం చేస్తూ వినియోగదారులకు మాత్రం ధరలు పెంచారు. అయినప్పటికీ ప్రకృతి రక్షణ చర్యలు మాత్రం కార్పొరేట్‌ శక్తుల లాభాల కోసమే ఉపయోగపడుతున్నాయి.

చమురు, ప్రపంచంలోనే ఒక పెద్ద సరుకు మార్కెట్‌. ఇది పర్యావరణాన్ని పెద్దఎత్తున కాలుష్యం చేసే కారకం. అమెరికా, మూడవ ప్రపంచ దేశాలను లొంగదీసుకునే లక్ష్యంతో ఒత్తిడి చేయడానికి ఈ చమురును ఉపయోగించుకుంటుంది. అదే విధంగా పర్యావరణానికి హాని కలిగించని విధంగా పచ్చని ప్రకృతి సిద్ధమైన ఉత్పత్తులను, శక్తులను ఆ దేశాలు వినియోగించుకునే మార్గంలో ఆటంకాలను సృష్టిస్తోంది. లాభాల కోసం వ్యాపార సంస్థలను ఏకం చేయడంలో, ప్రకృతిని ధ్వంసం చేయడంలో కూడా చమురు ఉపయోగ పడుతుందని జెరిమీ రిఫ్కిన్‌ అన్నాడు.
తన స్వప్రయోజనాల కోసం ప్రపంచ ఆర్థిక వ్యవస్థను బలహీన పరచడానికి, అమెరికా సామ్రాజ్యవాదానికి వాణిజ్య యుద్ధం, కరోనాలు ఆయుధాలుగా మారిపోయాయి. కాబట్టి, ఇది ఒక కొత్త రకమైన యుద్ధం చేయడానికి నిర్ణయించుకుంది. అది పర్యావరణ యుద్ధం! దాని ఫలితంగా, అంతర్జాతీయ ఇంధన ఏజెన్సీ తెలిపిన విధంగా, అమెరికా చమురు కంపెనీల చేతుల్లోకి అపరిమితమైన సంపద పోగుపడింది.

బిలియన్ల సంఖ్యలో ప్రజలు అత్యంత ప్రమాదకరమైన ఆరోగ్య సంక్షోభానికి తీవ్రంగా గురయ్యారు. చమురు ధరలు 0 కన్నా తగ్గినా గానీ, వినియోగదారులు వారు ఉపయోగించే గ్యాస్‌కు డబ్బు చెల్లించాల్సి వస్తుంది. మనం డీజిల్‌, పెట్రోల్‌కు ఎక్కువ మొత్తంలో చెల్లించే పరిస్థితి ఏర్పడుతోంది. ఇది ప్రజలను పిండేసే ద్రవ్య పెట్టుబడిదారీ విధానం.

భూగోళ ఉష్ణోగ్రత (గ్లోబల్‌ వార్మింగ్‌) ఇప్పుడు మొత్తంగా భూమిలో మార్పులు వచ్చే విధంగా ప్రభావం చూపుతోంది. గాలి వానలు, తుఫాన్లు, కరువు కాటకాలు సంభవించడం, ప్రపంచ ఉష్ణోగ్రతలలో హెచ్చు, తగ్గులు అన్నీ వాస్తవమైనవి. ధృవ ప్రాంతాలు మంచును కోల్పోయి ఆకుపచ్చగా మారుతున్నాయి. తిరిగి అవి సముద్ర మట్టం స్థాయిల పెరుగుదలకు కారణం అవుతున్నాయి. ధృవ ప్రాంతాల్లో ఉన్న సముద్రాలు, మహా సముద్రాల ఉపరితలాలు వేడెక్కడంతో మంచు వేగంగా కరగడానికి దారి తీస్తోంది. అది వరదలకు, కరువుకాటకాలకు కారణభూతమౌతోంది.

ప్రకృతి అదృశ్యానికి మూల్యం: గడిచిన మూడు దశాబ్దాల్లో ఆర్కిటిక్‌ గత స్థితి నుంచి 30 శాతం వెనక్కు తగ్గిందని ఇటీవల అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. సమాజం వాటి అదృశ్యానికి భారీ మూల్యాన్ని చెల్లించాల్సి ఉంటుంది. ఆ ప్రాంతాల్లో వాతావరణం చాలా వేడిగా ఉంటుంది. అది మంచు తగ్గిపోవడానికి దోహదం చేయడం వల్ల రావాల్సిన సమయంలో నదీ ప్రవాహాలు రాకుండా తగ్గి పోతాయి. భూగర్భ జలాలు తరగిపోతున్నాయి. ఆ విధంగా, తేలికగా లాభాలు గడించే లక్ష్యం కారణంగా మానవుల జీవనాధారాలు మాయమైపోతున్నాయి.

విద్యుత్తు, నీటిని చల్లపరచడం, సాగునీటికి, నీటి వనరులకు మనం చాలా ఖర్చు చేస్తున్నాం. వాతావరణంలో మార్పులు వేగంగా సంభవిస్తున్నందు వలన మనకు పంటలు పండించడం చాలా కష్టంగా ఉంటుంది. ప్రకృతి నిస్సందేహంగా మన పైన ప్రతీకారం తీర్చుకుంటుంది.
మనం నీటిని కలుషితం చేస్తూనే ఉన్నాం. పరిశుభ్రమైన నీటి పట్ల మనకు ఏ విధమైన ఆసక్తి లేకుండా పోయింది. బాటిల్‌ నీరు ఇప్పుడు ఒక పెద్దవ్యాపారంగా మారింది. సామాన్య ప్రజలు సురక్షితమైన నీటిని తక్కువ ధరకు కొనుగోలు చేయగలుగుతారా? ఇది రోగాలతో పాటు ఇబ్బందులను ఆహ్వానించడం కాదా?

అభివృద్ధి, పర్యావరణం :- అభివృద్ధిని పర్యావరణ పరిరక్షణతో కలిపే ప్రత్యామ్నాయ వ్యూహాన్ని మనం రూపొందించవలసిన అవసరం ఉంది. అది ప్రకృతితో పాటు స్థిరంగా ఉండే అధునాతన సాంకేతిక పరిజ్ఞానంపై ఆధారపడి ఉండాలి. పెట్టుబడిదారీ వ్యవస్థను, సామ్రాజ్యవాదాన్ని నిందిస్తే సరిపోదు. దేశాలు, వ్యక్తులు, పార్టీలు, సంస్థలు భూమిని రక్షించేందుకు కలిసికట్టుగా తక్షణమే చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే చాలా ఆలస్యం అయిపోయింది.

అనిల్‌ రాజిమ్‌ వాలే
అనువాదం: బోడపట్ల రవీందర్‌

Courtesy NavaTelangana

Leave a Reply