పడకల స్వాధీనం అటకెక్కినట్టే?

0
412

– సర్కారు ప్రకటించి వారమైనా…ముందుకుసాగని ప్రక్రియ
– 155కు పెరిగిన ప్రయివేటు ఆస్పత్రులు…786 పడకలు తగ్గిన ప్రభుత్వాస్పత్రులు
– కోవిడ్‌-19 చికిత్సలో ద్వంద్వవైఖరి

హైదరాబాద్‌ : ”ప్రయివేటు ఆస్పత్రుల్లో కోవిడ్‌-19 చికిత్స కోసం కేటాయించిన బెడ్లలో 50 శాతం ప్రభుత్వ పరిధిలోకి వస్తున్నాయి. ఇందుకోసం ఆ ఆస్పత్రుల యాజమాన్యాలు అంగీకరించాయి. ఇక ప్రయివేటు ఆస్పత్రుల్లో పేద రోగుల చికిత్స కోసం ప్రత్యేక యాప్‌ను అందుబాటులోకి తెస్తాం. దాని ద్వారానే రోగులను ఆయా ఆస్పత్రులకు పంపిస్తాం. ఇందుకు సంబంధించిన విధి, విధానాలను ఉన్నతాధికారులు, ప్రయివేటు ఆస్పత్రుల యాజమాన్యాలతో చర్చించి నిర్ణయిస్తారని”రాష్ట్ర వైద్యారోగ్యశాఖ వారం రోజుల క్రితం ప్రకటించింది. ఆ తర్వాత మొక్కుబడిగా రాష్ట్ర ప్రజారోగ్య సంచాలకులు డాక్టర్‌ జి.శ్రీనివాసరావుతో సమావేశమైన ప్రయివేటు ప్రతినిధులు చర్చను అర్థాంతరంగా ముగిసేలా చేశాయి. ప్రభుత్వానికి ఇచ్చే 50 శాతం పడకలు పోనూ, మిగిలిన వాటిలో అత్యధికంగా రూ.నాలుగు లక్షలకు మించి తీసుకోవడానికి వీల్లేదన్న ప్రభుత్వ ప్రతిపాదనకు గిట్టుబాటు కాదంటూ మోకాలడ్డాయి. దీంతో కథ మళ్లీ మొదటికొచ్చింది. మరోవైపు రోజుకో ప్రయివేటు ఆస్పత్రి తమను డబ్బుల కోసం పీడిస్తున్నదంటూ రోగుల నుంచి ఫిర్యాదులు వస్తూనే ఉన్నాయి. ప్రజారోగ్యంలో కరోనా చికిత్సను వికేంద్రీకరించాలనీ, జిల్లాలు, మండలాల, గ్రామాల వారీగా ప్రభుత్వంలో అందుబాటులో ఉండేలా చూడాలని వచ్చిన సూచనలను కార్యరూపంలోకి తీసుకురాలేదు. బోధనాస్పత్రులు, జిల్లా ఆస్పత్రులు, కొన్ని ఏరియా ఆస్పత్రులు కలుపుకుని 42 ప్రభుత్వాస్పత్రులకే చికిత్సను పరిమితం చేసింది.. 56 ప్రభుత్వాస్పత్రుల్లో కరోనా సేవలందుతుండగా 14 కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్లలో రద్దు చేసి వాటిని 42కు తగ్గించేశారు. దీంతో ప్రభుత్వాస్పత్రుల్లో పడకలు 8436 నుంచి 7862కు తగ్గాయి. మరోవైపు ప్రయివేటు ఆస్పత్రులకు ప్రతి రోజూ అనుమతిలిస్తూ ప్రోత్సహిస్తున్నది. తాజాగా మరో 23 ప్రయివేటు ఆస్పత్రులు చేరడంతో కరోనా చికిత్స చేసే ప్రయివేటు ఆస్పత్రుల సంఖ్య 155కు చేరింది. 7855 ఉన్న పడకలను కాస్తా 786 పెంచి 8641కి చేర్చింది. ప్రభుత్వాస్పత్రుల్లో మాత్రం కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్లలో వందలాది పడకలను కరోనా చికిత్స నుంచి తొలగించారు. ప్రయివటులో పెరిగిన వాటిలో వెంటిలేటర్‌ సౌకర్యమున్న ఐసీయూ బెడ్లు 144, ఆక్సిజన్‌ బెడ్లు 403 ఉన్నాయి.

ఫిర్యాదుల సంగతేంటీ?
పరిమిత సంఖ్యలో అనుమతుల సమయంలోనే కార్పొరేటు, ప్రయివేటు ఆస్పత్రులపై వెయ్యికి పైగా ఫిర్యాదులు వచ్చాయి. అందులో అధికఛార్జీలు, బీమా సౌకర్యమున్న ఆ రోగులను తీసుకునేందుకు నిరాకరించడం, బెడ్లు ఖాళీగా లేవని వెనక్కి పంపించడం తదితరాలు ఉన్నాయి. రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌ లో పేరుగాంచిన కార్పొరేట్‌, ప్రయివేటు ఆస్పత్రులపై అవే ఆరోపణలతో ప్రతి రోజూ బాధితులు జిల్లాల అధికారులతో పాటు రాష్ట్ర స్థాయిలో ఉన్నతాధికారుల వద్ద ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో వాటిని కట్టడి చేసి బాధితులను ఆదుకోవాలనీ, ఫిర్యాదులపై చర్యలు తీసుకోవాలని ప్రజాసంఘాలు, ప్రతిపక్ష పార్టీల నాయకుల నుంచి డిమాండ్‌ పెరిగింది. ప్రస్తుతం చికిత్స చేసుకుంటున్న వారిని డబ్బుల కోసం పీడించకుండా కాపాడాలని బాధితులు కోరుతున్నారు.

Courtesy Nava Telangana

Leave a Reply