పంజాబ్‌లో అవినీతి మంత్రిపై వేటు

0
212

సీఎం ఆదేశంతో వెనువెంటనే అరెస్ట్‌

చండీగఢ్‌: అవినీతి రహిత పాలన అందిస్తామని బాధ్యతలు చేపట్టిన పంజాబ్‌ ముఖ్యమంత్రి భగవంత్‌ మాన్‌.. ఆ దిశగా కీలక నిర్ణయం తీసుకున్నారు. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆరోగ్యశాఖ మంత్రి విజయ్‌ సింగ్లా(52)ను పదవి నుంచి తొలగించారు. వెనువెంటనే పోలీసులు సింగ్లాను అరెస్టు చేశారు. ఆరోగ్యశాఖలో టెండర్లు, కొనుగోళ్లకు సంబంధించి మంత్రి ఒక శాతం కమీషన్‌ డిమాండు చేస్తున్నట్లు తన దృష్టికి వచ్చిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సీఎం మాన్‌ తెలిపారు.

ఆయనపై కేసు కూడా నమోదు చేయాలని పోలీసులను ఆదేశించినట్లు చెప్పారు. అవినీతికి పాల్పడింది నిజమేనని సింగ్లా సైతం ఒప్పుకొన్నట్లు తెలిపారు. ఈ అవినీతి బాగోతం గురించి ఓ అధికారి పది రోజుల క్రితం మాన్‌కు తెలియజేశారని.. ఆ వెంటనే ఓ ‘ఆపరేషన్‌’ ద్వారా ధ్రువీకరించుకున్న సీఎం ఈ మేరకు చర్యలు తీసుకున్నారని సమాచారం. సింగ్లాను పదవి నుంచి తప్పించడంపై ఆప్‌ అధినేత, దిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ హర్షం వ్యక్తం చేశారు. భగవంత్‌ తీసుకున్న నిర్ణయం పట్ల దేశం గర్విస్తోందని ప్రశంసించారు.

Leave a Reply