-
పోలీస్ -టూరిజం శాఖల ఫైట్
- తాడ్వాయి కాటేజీలకు పోలీసుల తాళం
- పేలుడు పదార్థాలు ఉన్నాయని అనుమానం
- హరిత కాటేజీల్లో పేలుడు పదార్థాలు ఏంటి!?
- అడిగినన్ని కాటేజీలు ఇవ్వకపోవడంతో కట్టుకథ
- పోలీసులపై టూరిజం శాఖాధికారుల మండిపాటు
- కాటేజీలన్నీ అప్పగించాలంటున్న రెవెన్యూ శాఖ
- తమకు ఆదాయం ఎలాగంటున్న పర్యాటక శాఖ
వరంగల్ అర్బన్ : మేడారంలో భక్తుల కోసం కాటేజీలు నిర్మించారు! కానీ, అవి మాకు కావాలంటే మాకు కావాలంటూ వివిధ శాఖల అధికారులు కొట్లాడుకుంటున్నారు! పర్యాటక శాఖ అధికారులు తమకు కాటేజీలు ఇవ్వలేదంటూ పోలీసులు వాటికి తాళాలు వేశారు! పేలుడు పదార్థాలు ఉన్నాయనే ప్రచారాన్ని తెరపైకి తెచ్చారు! పర్యాటక.. పోలీసు శాఖల మధ్య ఈ వార్ జరుగుతుండగానే.. కాటేజీలన్నీ తమకు అప్పగించాలంటూ రెవెన్యూ శాఖ డిమాండ్ చేస్తోంది. వెరసి, భక్తులకు సౌకర్యాలు ఎలా కల్పించాలని కాకుండా.. వాటిని తాము ఎలా చేజిక్కించుకోవాలనే విషయంలో శాఖల మధ్య సమరం మొదలైంది. తమ ఉన్నతాధికారుల కోసం ప్రత్యేక సౌకర్యాలు ఉండేలా ఆయా శాఖల అధికారులు ప్రత్యేక చొరవ చూపుతున్నారు.
రెండేళ్లకోసారి సమ్మక్క- సారలమ్మ జాతరను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఇందుకు ప్రభుత్వ యంత్రాంగమంతా మేడారంలోనే మకాం వేస్తుంది. ఏజెన్సీ ఏరియా కావడంతో ప్రత్యేక సౌకర్యాల కోసం అధికారులు ఆలోచించే పరిస్థితి ఉండేది కాదు. భక్తుల సౌకర్యాలకే అత్యంత ప్రాధాన్యమిచ్చేవారు. కానీ, ఇప్పుడు పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. కోట్లాది రూపాయలు వెచ్చించి రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ మేడారంలో హరిత హోటల్‌ను నిర్మించింది. దానికి అనుబంధంగా ప్రత్యేకంగా కాటేజీలను ఏర్పాటు చేసింది. వారం రోజుల క్రితమే వీటిని మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, సత్యవతి రాథోడ్, శ్రీనివా్‌సగౌడ్ ప్రారంభించారు. ఆ తర్వాత, ఆన్‌లైన్‌లో మరో ఐదుగురు కాలేజీలు బుక్ చేసుకున్నారు. వారు కాటేజీల్లో ఉండగానే.. పోలీసులు వచ్చి.. వారిని కాటేజీల నుంచి ఖాళీ చేయించి మెయిన్‌గేట్‌కు తాళం వేశారని పర్యాటక అధికారులు చెబుతున్నారు.
తాళం ఎందుకు వేస్తున్నారని అక్కడ ఉన్న సెక్యూరిటీ గార్డు ప్రశ్నించగా.. ‘‘వీటిలో పేలుడు పదార్థాలు ఉన్నాయని మాకు సమాచారం వచ్చింది. అందుకే సీజ్ చేస్తున్నాం’’ అని చెప్పారట. విషయం తెలిసిన పర్యాటక శాఖ ఉన్నతాధికారులు సంబంధిత పోలీస్ అధికారులకు ఫోన్ చేసి తాళం వేయడం ఏమిటని ప్రశ్నించారు. ‘‘ఇది నక్సలైట్ ప్రభావితం ప్రాంతం కదా! అందుకే, మా జాగ్రత్తలో మేం ఉండాలి కదా!’’ అని జవాబు ఇచ్చారని పర్యాటక శాఖ ఉన్నతాధికారులు వాపోతున్నారు. నిజానికి, పేలుడు పదార్థాలు ఉన్నాయన్న అనుమానం బూచి మాత్రమేనని, పోలీసుశాఖకు కనీసం 15 కాటేజీలు, రెండు సూట్‌లు ఇవ్వాలని అడిగారని, తాము నిరాకరించడంతో పేలుడు పదార్థాల అంశాన్ని తెరపైకి తెచ్చారని పర్యాటక శాఖ అధికారులు అంటున్నారు.
తాళం వేస్తారా?: పర్యాటక ఉన్నతాధికారి
పర్యాటక శాఖ నిర్మించిన కాటేజీల్లో పేలుడు పదార్థాలు ఉండడం ఏమిటి!? ఇంతకంటే హాస్యాస్పదం ఉంటుందా? కొన్ని కాటేజీలను విధిగా కలెక్టర్, ఎస్పీలకు కేటాయిస్తాం. మిగిలినవి భక్తులకు అందుబాటులో ఉండేలా చూడాలి. జిల్లా రెవెన్యూ, పోలీస్ అధికారులకు మొత్తం కాటేజీలను ఎలా ఇవ్వగలం? కాటేజీల్లో బస చేసేందుకు గంటల లెక్కన మాత్రమే అనుమతి ఇవ్వాలని పర్యాటక శాఖ మంత్రి శ్రీనివా్‌సగౌడ్ ఆదే శించారు. రెండు రోజులైనా కూడా తాళం తీయకపోవడంతో తాడ్వాయి పోలీస్ అధికారికి ఫోన్ చేశాను. ‘వెంటనే తాళం తీయండి. ఇతరులకు ఇబ్బందిగా ఉంది’ అని అడిగాను. దాంతో, అందులో ఉన్న బాంబులు పోయాయా మరి!? అని వ్యంగ్యంగా మాట్లాడారు.
భద్రత మా బాధ్యత: పోలీస్ అధికారి
చిన్న విషయాన్ని వివాదం చేయకూడదు. ఇది అటవీ ప్రాంతం. నక్సల్ ప్రభావిత ప్రాంతం. అనుక్షణం అప్రమత్తంగా ఉండాలి. మాకున్న సమాచారాన్ని పూర్తిగా వెల్లడించడానికి కుదరదు. కాటేజీలు వాడుకోవడం కోసం బాంబుల పేరు చెప్పాల్సిన అవసరం మాకు లేదు. తాళం వేసింది నిజమే. పూర్తి స్థాయిలో తనిఖీ చేసిన తర్వాతనే పర్యాటక శాఖకు అప్పగిస్తాం’.
Courtesy Andhrajyothi