- తెలంగాణలో 1-8 తరగతుల విద్యార్థుల్లో 11.7 శాతం మందిది ఇదే పరిస్థితి
- అంకెలను గుర్తించలేని వారు 6 శాతం
- ఏఎస్‌ఈఆర్ నివేదికలో వెల్లడి
న్యూఢిల్లీ : తెలంగాణలోని కొంత మంది పాఠశాల విద్యార్థులు తెలుగు అక్షరాలు చదవలేకపోతున్నారు. పదాలు చదివేందుకు కష్టపడుతున్నారు. మరోవైపు కొందరు విద్యార్థులు అంకెలను గుర్తించలేకపోతున్నారని తాజా నివేదిక చెబుతోంది. తెలంగాణలో 1వ తరగతి నుంచి 8వ తరగతి వరకు పాఠశాల పిల్లల్లో తెలుగు అక్షరాలు చదవడంరాని వారు 11.7 శాతం మంది ఉన్నారని యాన్యువల్ స్టేటస్ ఆఫ్ ఎడ్యుకేషన్ (ఏఎ్‌సఈఆర్) నివేదిక వెల్లడించింది. ఒకటి నుంచి ఎనిమిదో తరగతి (5-16 మధ్య వయస్సు పిల్లలు) వరకు విద్యా స్థితిపై ప్రథమ్ అనే స్వచ్ఛంద సంస్థ గురువారం వార్షిక నివేదిక విడుదల చేసింది. రాష్ట్రంలో ఉమ్మడి జిల్లాలవారీగా 9 గ్రామీణ జిల్లాల్లో 259 పాఠశాలలను సందర్శించి నివేదిక రూపొందించింది. దీని ప్రకారం.. ఒకటో తరగతిలో తెలుగు అక్షరాలు చదవలేని పిల్లలు 41.7 శాతం మంది ఉండగా.. 2వ తరగతిలో 18.7 శాతం, 3వ తరగతిలో 12.4 శాతం, 4వ తరగతిలో 7.2 శాతం, 5వ తరగతిలో 4.3 శాతం, 6వ తరగతిలో 3.8 శాతం, 7వ తరగతిలో 3.3 శాతం, 8వ తరగతిలో 2.3 శాతం మంది ఉన్నారు. కేవలం అక్షరాలు మాత్రమే చదవగలిగే పిల్లలు 1వ తరగతిలో 42 శాతం మంది ఉండగా.. 2వ తరగతిలో 42.1 శాతం, 3వ తరగతిలో 28.5 శాతం, 4వ తరగతిలో 21.9 శాతం, 5వ తరగతిలో 11.8 శాతం, 6వ తరగతిలో 12.3 శాతం, 7వ తరగతిలో 6.5 శాతం, 8వ తరగతిలో 4.6 శాతం మంది ఉన్నారు.
మూడో తరగతి విద్యార్థుల్లో 12.4 శాతం మంది తెలుగు అక్షరాలు చదవలేకపోతున్నారని, 28.5 శాతం మంది అక్షరాలు చదువుతున్నా పదాలను మాత్రం చదవలేకపోతున్నారని నివేదిక పేర్కొంది. ఇంగ్లిష్ పెద్ద అక్షరాలు చదవడంరాని విద్యార్థులు 1వ తరగతిలో 26.1 శాతం, 2వ తరగతిలో 13.2 శాతం, 3వ తరగతిలో 10.2 శాతం, 4వ తరగతిలో 5.19 శాతం, 5వ తరగతిలో 3.3 శాతం, 6వ తరగతిలో 2 శాతం, 7వ తరగతిలో 1.8 శాతం, 8వ తరగతిలో 1.8 శాతం మంది ఉన్నారు. ఒకటో తరగతి నుంచి 8వ తరగతి వరకు చదువుతున్న పిల్లల్లో 6.07 శాతం మంది అంకెలను గుర్తించలేకపోతున్నారు. 1 నుంచి 9 వరకు అంకెలు గుర్తించ లేని వారు 1వ తరగతిలో 25.7 శాతం మంది ఉండగా.. 2వ తరగతిలో 9.6 శాతం, 3వ తరగతిలో 5.3 శాతం, 4వ తరగతిలో 2.8 శాతం, 5వ తరగతిలో 0.9 శాతం, 6వ తరగతిలో 1.7 శాతం, 7వ తరగతిలో 1.3 శాతం, 8వ తరగతిలో 1.3 శాతం మంది ఉన్నారు. కూడికలు, తీసివేతలు కూడా రాని విద్యార్థులు 8వ తరగతి వరకు అన్ని తరగతుల్లోనూ ఉన్నారని నివేదిక పేర్కొంది.
ఇక 1 నుంచి 8 తరగతుల వరకు చదువుతున్న విద్యార్థుల్లో ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న వారిలో 5.2 శాతం మంది ట్యూషన్లకు వెళ్తుండగా… ప్రైవేటు పాఠశాలల పిల్లలు 8.8 శాతం మంది వెళ్తున్నట్టు నివేదిక తెలిపింది.