రిక్షాలో కరోనా మృతుని తరలింపు

0
536

బాపట్ల : కరోనా మహమ్మారి మనుషుల్లోని మానవత్వాన్ని చంపేస్తోంది. వైరస్‌ తమకు సోకుతుందన్న భయంతో బాధితులకు జనం దూరంగా పారిపోతున్నారు. కోవిడ్‌ బలితీసుకున్న వారికి అంతిమ సంస్కారాలు నిర్వహించేందుకు కుటుంబ సభ్యులు కూడా భయపడే దారుణ పరిస్థితులు నెలకొన్నాయి. కరోనా కారణంగా చనిపోయిన వారిని వదిలేసి పారిపోతున్న ఘటనలు చాలా చోట్ల వెలుగులోకి వస్తున్నాయి. కరోనా మృతులకు అంత్యక్రియలు జరపలేని దుస్థితులు దాపురించాయి. మృతదేహాలను ఆటోలు, రిక్షాలు, ట్రాక్టర్లలో తరలిస్తున్న విదారక దృశ్యాలు నిత్యకృత్యంగా మారాయి.

కరోనాతో మరణించిన వ్యక్తి మృతదేహాన్ని రిక్షాపై తీసుకెళ్లిన అమానవీయ ఘటన గుంటూరు జిల్లా బాపట్లలో వెలుగు చూసింది. వైద్యాధికారుల వివరాల ప్రకారం.. ప్రకాశం జిల్లా పేరాలకు చెందిన 68 ఏళ్ల వృద్ధుడు తీవ్ర ఆయాసంతో బాధపడుతుండటంతో కుటుంబీకులు బుధవారం బాపట్ల ఏరియా వైద్యశాలకు తీసుకువచ్చారు. చికిత్స అందించే క్రమంలో అతడు మరణించాడు.

అనంతరం కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా పాజిటివ్‌ వచ్చింది. ఈ విషయం తెలిసిన కుటుంబీకులు అక్కడి నుంచి వెళ్లిపోయారని, వారు కనిపించకపోవడంతో తాము మున్సిపల్‌ అధికారులకు సమాచారం ఇచ్చామన్నారు. మన్సిపల్‌ సిబ్బంది వృద్ధుని మృతదేహాన్ని ప్రత్యేక కవర్‌లో చుట్టి రిక్షాలో రెండు కిలోమీటర్ల దూరంలోని శ్మశానవాటికకు తరలించి దహన సంస్కారాలు చేశారు.

Leave a Reply