కోట్లు రాల్చిన కిట్లు!

0
253
  • కొవిడ్‌ టెస్ట్‌ కిట్లు, మాస్క్‌ల కొనుగోళ్లలో మాయాజాలం
  • 10 నెలల్లో రూ.500 కోట్లతో కిట్లు, 
  • మాస్క్‌లు, మందుల కొనుగోలు
  • ఒక్క కంపెనీ కిట్లకే రూ.200 కోట్లు 
  • ఇతర రాష్ట్రాల్లో కంటే ఎక్కువ ధరకు..
  • టీఎస్‌ఎంఎస్‌ఐడీసీలో భారీ అవినీతి
  • కిట్ల ధరల్లో తేడాపై సర్కారు దృష్టి
  • ఇప్పటికే విజిలెన్స్‌ విచారణ!

ప్రైవేటులో ఆర్టీపీసీఆర్‌ తప్పనిసరి
రాష్ట్రంలో అన్ని ప్రైవేటు ఆస్పత్రులకు వచ్చే ఇన్‌పేషంట్‌, అవుట్‌పేషంట్‌ రోగులకు ఆర్టీపీసీఆర్‌ పరీక్షలు తప్పనిసరిగా చేయాలని ప్రజారోగ్య సంచాలకుడు డాక్టర్‌ గడల శ్రీనివాసరావు బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. కొవిడ్‌ పరీక్షల నిర్వహణ వ్యుహంలో భాగంగా అన్ని ప్రైవేటు ఆస్పత్రుల్లో పరీక్షలకు కావాల్సిన ఏర్పాట్లు చేసుకోవాలని పేర్కొన్నారు. శాస్వకోశ సమస్యలు, ప్లూ లక్షణాలు, కొవిడ్‌ లక్షణాలు లేకుండా ఆస్పత్రిపాలైన హైరిస్కు రోగులు, లక్షణాలు లేకపోయినా శస్త్రచికిత్సలు అవసరమయ్యే రోగులు, నాన్‌ సర్జికల్‌ రోగులు, ప్రసవ తేదీ సమీపించే వారితోపాటు ఆస్పత్రుల్లో డెలివరీ చేయించుకునే గర్భవతులకు ఆర్టీపీసీఆర్‌ కచ్చితంగా చేయాల్సిందేనని స్పష్టం చేశారు.

హైదరాబాద్‌, : కరోనా వైరస్‌ కొందరికి కాసుల వర్షం కురిపించిందా? కొవిడ్‌ కిట్లు, మాస్క్‌ల కొనుగోళ్లలో గోల్‌మాల్‌ చేశారా? మరో ఈఎ్‌సఐ తరహా కుంభకోణం జరిగిందా? ప్రొక్యూర్‌మెంట్‌ వింగ్‌లో సిబ్బంది భారీ అవినీతికి పాల్పడ్డారా? విజిలెన్స్‌ విచారణ జరిగింది కూడా అందుకేనా?.. అంటే అవుననే సమాధానాలే వినిపిస్తున్నాయి. గత ఏడాది మార్చి నుంచి రాష్ట్రంలో వైరస్‌ వ్యాప్తి మొదలవగా.. అదే నెల 23 నుంచి లాక్‌డౌన్‌ అమలైంది. హఠాత్తుగా వచ్చి పడిన కొత్త వైర్‌సను ఎదుర్కొనేందుకు అవసరమైన మందులు, కిట్లు లేవు. యుద్ధప్రాతిపదికన వాటిని కొనుగోలు చేయడానికి ప్రభుత్వం భారీగా నిధులు కేటాయించింది. అయితే ‘తెలంగాణ రాష్ట్ర వైద్యసేవలు, మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ (టీఎ్‌సఎంఎ్‌సఐడీసీ)’ సిబ్బంది దీన్నే ఒక అవకాశంగా మలుచుకున్నారు. అధిక ధరలకు కొనుగోలు చేసి.. జేబులు నింపుకొన్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. గత ఏడాది మార్చి 16 నుంచి డిసెంబరు 30 వరకు (10 నెలల్లో) టీఎస్ఎంఎస్ఐడీసీ కొవిడ్‌కు సంబంధించిన కిట్లు, మందులు, ఆక్సిజన్‌ సిలిండర్లు, పీపీఈ కిట్లు కొనుగోలు చేసింది. వాటి విలువ రూ.506,24,28,780. ఈ కొనుగోళ్లకు సంబంధించిన సమాచారాన్ని ‘ఆంధ్రజ్యోతి’ సంపాదించింది. కొవిడ్‌ వ్యాధి నిర్ధారణ కోసం తొలుత ఆర్టీపీసీఆర్‌ పరీక్షలను చేశారు. వాటికి అవసరమైన సామగ్రిని కొన్ని నెలల పాటు కేంద్రమే ఉచితంగా పంపిణీ చేసింది. అయితే కేసులు పెరగడం, ఇతర రాష్ట్రాల్లో ర్యాపిడ్‌ యాంటీజెన్‌ కిట్లను వాడుతుండడంతో మన దగ్గర కూడా వాటి కొనుగోలు ప్రక్రియను చేపట్టారు. తొలుత ఏకంగా ఐదు నెలల పాటు ఒకే కంపెనీ కిట్లను కొన్నారు. 46.80 లక్షల కిట్లను కొనుగోలు చేశారు. వాటి విలువ రూ.200 కోట్లు. టీఎస్ఎంఎస్ఐడీసీ ర్యాపిడ్‌ యాంటీజెన్‌ కిట్లను తొలిసారిగా గత ఏడాది జూలై 7న కొనుగోలు చేసింది.

జూలై నుంచి నవంబరు 30 వరకు అదే కంపెనీకి ఇండెంట్‌ పెడుతూ వచ్చారు. అప్పటికే మార్కెట్లో ఇతర కంపెనీల కిట్లు తక్కువ ధరకే అందుబాటులో ఉన్నా.. ఆ ఒక్క కంపెనీ కిట్లనే ఐదు నెలల పాటు కొనడంలో ఆంతర్యమేంటో అధికారులకే తెలియాలి. నవంబరు 12, 13 తేదీల్లో ఒక ఏజెన్సీ నుంచి రెండు రోజుల వ్యవధిలో 5 లక్షల ర్యాపిడ్‌ యాంటీజెన్‌ కిట్లను కొనుగోలు చేశారు. ఒక్కో కిట్‌కు రూ.274 చెల్లించారు. వాటి మొత్తం విలువ రూ.13.72 కోట్లు. నవంబరు 13న మరో ఏజెన్సీ నుంచి రూ.274 చొప్పున 1,49,770 కిట్లను కొనుగోలు చేశారు. వాస్తవానికి ఆ ఏజెన్సీలు సరఫరా చేసిన కిట్లను కేరళలో రూ.156.80 చొప్పునే సరఫరా చేస్తామని అదే కంపెనీ కోట్‌ చేసింది. ఆ కంపెనీ కిట్లనే టీఎ్‌సఎంఎ్‌సఐడీసీ రూ.118 అధిక రేటుకు కొనుగోలు చేయడం గమనార్హం. ఒకే రోజు ఒకే కంపెనీ కిట్లను ఇలా ఏకంగా రూ.7.67 కోట్ల ఎక్కువ ధరకు కొనుగోలు చేశారు. ఒక్క రోజు వ్యవధిలో ఒక్క కిట్ల విషయంలోనే ఇంత భారీ వ్యత్యాసం ఉంటే.. 10 నెలల్లో రూ.500 కోట్ల వ్యయంతో చేసిన కొనుగోళ్లలో ఏ మేరకు గోల్‌మాల్‌ జరిగి ఉంటుందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

తిరిగి రాబట్టాల్సిందే..
ఏదైనా ఒక కంపెనీ ప్రభుత్వ రంగ సంస్థకు మందులు సరఫరా చేస్తే ఇక్కడ సరఫరా చేసే తేదీలో ఏ రేటుకు ఇస్తామని చెబుతుందో ఇతర చోట్ల కూడా అదే ధరకు సరఫరా చేయాల్సి ఉంటుంది. ఒకవేళ ధరల్లో తేడా ఉంటే ఆ వ్యత్యాసాన్ని కంపెనీ నుంచి తిరిగి రాబట్టాలని నిబంధనలు చెబుతున్నాయి. ఉదాహరణకు ఒక హెల్త్‌ ప్రొడక్ట్‌ను మన రాష్ట్రానికి రూ.100కు సరఫరా చేస్తే ఇతర చోట్లా అదే ధరకు ఇవ్వాలి. అలా కాకుండా అక్కడ రూ.80కే సరఫరా చేస్తే, ఆ వ్యత్యాసాన్ని టీఎ్‌సఎంఎ్‌సఐడీసీ సదరు సరఫరాదారు నుంచి రికవరీ చేయాల్సి ఉంటుంది. దీన్నే ఫాల్స్‌ క్లాజు నిబంధన అంటారు.

మాస్కుల్లోనూ భారీగా మింగేశారు
కొవిడ్‌ ఒక్కసారిగా విజృంభించడంతో తొలుత త్రీలేయర్‌ మాస్కుల కొరత కారణంగా వాటిని అధిక ధరకు కొనుగోలు చేశారు. అయితే ఆ తర్వాత వాటి ఉత్పత్తి భారీగా జరిగింది. బహిరంగ మార్కెట్లో 50 పైసల కంటే తక్కువకే లభించాయి. కానీ, టీఎ్‌సఎంఎ్‌సఐడీసీ మాత్రం.. ఉత్పత్తి పెరిగిన కొద్దీ వివిధ ఏజెన్సీలు, డిస్ట్రిబ్యూటర్ల నుంచి ఎక్కువ ధరకు కొనుగోలు చేసింది. మాస్కుల కొనుగోలులో కోట్లాది రూపాయల వ్యత్యాసం కనిపిస్తోంది. సదరు కంపెనీల నుంచి ఇచ్చే కమీషన్ల కోసమే అధిక ధరకు కొనుగోలు చేశారన్న ఆరోపణలున్నాయి.

జూన్‌ 6న త్రీ లేయర్‌ ఫేస్‌మాస్కును ఒక ఏజెన్సీ నుంచి ఒక్కో దానికి రూ.1.34 చెల్లించి కొనుగోలు చేయగా, అదే మాస్కును అదే ఏజెన్సీ నుంచి అక్టోబరు 21, నవంబరు 19న రూ.1.50 చెల్లించి కొనుగోలు చేశారు. వాస్తవానికి ధర తగ్గాల్సి ఉండగా.. పెంచి కొనుగోలు చేశారు. జూన్‌లో 62 లక్షల మాస్కులు కొనుగోలు చేస్తే, అక్టోబరు, నవంబరులో 40 లక్షల మాస్కులు కొన్నారు. ఇదే త్రీ లేయర్‌ మాస్కును సెప్టెంబరు 23, 26 తేదీల్లో మరో ఏజెన్సీ నుంచి ఒక్కో దానికి కేవలం 79 పైసల చొప్పున కోటి మాస్కులు కొనుగోలు చేశారు. అంటే మొదటి ఏజెన్సీకి మాస్కుల్లో రూ.3.18 కోట్లను దోచిపెట్టినట్లు స్పష్టమవుతోంది.

ఏప్రిల్‌ 2న ఓ ఫుడ్‌ కంపెనీ నుంచి త్రీలేయర్‌ మాస్కులు ఒక్కోటి రూ.10.50 చొప్పున 3 లక్షల మాస్కులను కొనుగోలు చేశారు.

ఏప్రిల్‌ 9, 11 తేదీల్లో ఓ ఫార్మా కంపెనీ నుంచి రూ.9.20 చొప్పున 10 లక్షల మాస్కులు కొనుగోలు చేశారు.

జూన్‌ 6న, ఆగస్టు 4న రూ.1.34 పైసల చొప్పున ఓ డిస్ట్రిబ్యూటర్‌ నుంచి 62.50 లక్షల మాస్కులను కొనుగోలు చేశారు. అదే డిస్ట్రిబ్యూటర్‌ నుంచి అక్టోబరు 21న రూ.1.50 చొప్పున 10 లక్షల మాస్కులు, నవంబరు 19న 30 లక్షల మాస్కులు కొనుగోలు చేశారు. అంటే జూన్‌లో కంటే నవంబర్‌లోనే ఎక్కువ ధరకు కొన్నారు. ధర తగ్గాల్సి ఉండగా.. పెంచి కొనుగోలు చేశారు.

ఆగస్టు 27న ఇదే త్రీలేయర్‌ మాస్కులు ఓ కంపెనీ నుంచి కేవలం 80 పైసల చొప్పున 39.45 లక్షల మాస్కులను కొన్నారు.

నవంబరు 19న మరో ఏజెన్సీ నుంచి రూ.1.50 చొప్పున 10 లక్షల మాస్కులు కొన్నారు.

విజిలెన్స్‌ విచారణ
టీఎస్ఎంఎస్ఐడీసీ  కొనుగోలు చేసిన ర్యాపిడ్‌ యాంటీజెన్‌ కిట్లలో గోల్‌మాల్‌ జరిగిందన్న విషయం ప్రభుత్వం దృష్టికి వచ్చింది. దీంతో విజిలెన్స్‌ను రంగంలోకి దించింది. ఇప్పటికే  టీఎస్ఎంఎస్ఐడీసీ  ఉన్నతాధికారులు, సిబ్బందిని ప్రశ్నించినట్లు సమాచారం. కిట్లు, మాస్కులు, మందులు, పీపీఈ కిట్ల ధరల్లో వ్యత్యాసంపై విచారణ చేపట్టి సర్కారుకు నివేదిక కూడా ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇటీవలి కాలంలో వైద్య ఆరోగ్యశాఖలోనే అత్యధిక విజిలెన్స్‌ విచారణలు జరిపినట్లు ఓ ఉన్నతాధికారి ‘ఆంధ్రజ్యోతి’కి తెలిపారు. కాగా, విజిలెన్స్‌ నివేదికపై తదుపరి చర్యలు తీసుకోకుండా పెద్దయెత్తున పైరవీలు జరిగాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.

 టీఎస్ఎంఎస్ఐడీసీలో తిష్ఠ వేసినవారి వల్లే..!
టీఎస్ఎంఎస్ఐడీసీలో కొందరు ఉద్యోగులు ఏళ్ల తరబడి కొనసాగుతున్నారు. వారి వల్లే ఇంత పెద్ద అవినీతి జరిగిందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రొక్యూర్‌మెంట్‌ విభాగంలో పనిచేసే ఓ ఉద్యోగి అయితే కొవిడ్‌ సమయంలో వనస్థలిపురంలో ఏకంగా కోట్లాది రూపాయల విలువ చేసే ఇళ్ల స్థలాన్ని కొనుగోలు చేశారని సంస్థ ఉద్యోగులే చెప్పుకొంటున్నారు. ఇక టీఎ్‌సఎంఎ్‌సఐడీసీలో ఉద్యోగుల అవినీతి, అక్రమాలపై ఇప్పటికే వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌కు పెద్దఎత్తున ఫిర్యాదులు అందినట్లు సమాచారo

Courtesy Andhrajyothi

Leave a Reply