సి.పి.ఐ(ఎం.ఎల్) దాడి.. ఓపిడిఆర్ ప్రతిస్పందన

0
303

ఉసా మరణానికి విచారం పేరుతో ‘ఉసా’ వ్యక్తిత్వం, దృక్పథాల పై సి.పి.ఐ (ఎం.ఎల్) ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర కమిటీ దాడి- ఓపిడి ఆర్ ప్రతిస్పందన.

మా ప్రతిస్పందన నాలుగు భాగాలుగా ఉంటుంది.

  1. ఉ. సా. తో మా అనుబంధం.
  2. ఉసా దృక్పథం, కృషి
  3. సి.పి.ఐ ఎం.ఎల్ ఆంధ్ర ప్రదేశ్ కమిటీకి కొన్ని ప్రశ్నలు
  4. ముగింపు

1. ఉసాతో మా అనుబంధం
ఉసా మరణించడానికి 4 సంవత్సరాల ముందు నుంచి ఓ పి డి ఆర్ తెలంగాణ రాష్ట్ర కమిటీ అధ్యక్షుడు మరియు సంస్థ కేంద్ర కమిటీ సభ్యుడు. 2016 లో కాశ్మీర్ వెళ్ళిన 9 గురు ఓపిడిఆర్ అఖిల భారత వాస్తవ పరిశీలన కమిటీ లో సిబిఆర్ తో పాటు అతను కీలక సభ్యుడు. 2019లో సి పి ఐ (ఎం ఎల్) ప్రజాపంథా పార్టీ నాయకుడు లింగన్న ఎన్కౌంటర్ పై ఓపిడిఆర్ నిజ నిర్ధారణ కమిటీకి వారిద్దరు నాయకత్వం వహించారు. ఇంకా తెలంగాణలోని అనేక ఓ పి డి ఆర్ కార్యక్రమాలు ఉసా, ఓపిడిఆర్ తెలంగాణ కార్యదర్శి నరసింహ నాయకత్వంలో జరిగాయి. విశ్రాంత ఆచార్యుడు చక్రధరరావు గౌరవ అధ్యక్షుడిగాను, ఉషా యస్.డానీ ప్రధాన కార్యదర్శిగా గల ‘కాషాయ-కార్పొరేట్ ఫాసిస్టు వ్యతిరేక వేదిక, తెలంగాణ’ వ్యవస్థాపక అధ్యక్షుడు. ఈ వేదికలో ఓపిడిర్, బహుళ బహుజన శ్రామిక సమితి, కుల అసమానతల నిర్మూలన పోరాట సమితి, సి పి ఐ (ఎం ఎల్) రెడ్ స్టార్, తెలంగాణ కమిటీ మరియు యు సి సి ఆర్ ఐ (యం-యల్)కిషన్, బి.యల్.యఫ్. పార్టీలతో సహా దాదాపు 20 సంస్థ లు అందులో ఉన్నాయి.

2. ‘ఉసా’ ది ‘కుల- వర్గ’ మార్క్సిస్టు దృక్పథం
“పీడితులకు నిజమైన విముక్తి , వికాసం ఈ వ్యవస్థ మార్పుతో ముడిపడి ఉందనీ అన్ని ఉద్యమ, రాజకీయ కార్యకలాపాలు ఈ లక్ష్యంతో సాగాలనే మా ధోరణికీ, ఈ వ్యవస్థ లోపలే పీడితుల పురోగమనం వికాసం సాధ్యమేననీ, అందుకు తగ్గ సర్దుబాట్లు,తగాదాలు,పొందికలు ఉండాలనే దోరణికి మద్య ఉన్న మౌలికమైన తేడా ఇక్కడ ముఖ్య అంశం.”- ఉసా మృతికి విచారం ప్రకటన, సిపిఐ యం-యల్ ఆంధ్రప్రదేశ్ కమిటీ తరపున ఝాన్సీ గారి ప్రకటన.

ఝాన్సీ గారు,
పీడితులకు నిజమైన విముక్తి, వికాసం ఈ వ్యవస్థ మార్పుతో ముడిపడి ఉంది అనే విషయం సరి అయినదే. అయితే వ్యవస్థ అంటే ఏమిటి అనే ప్రశ్న తీసుకోవాలి! ఆర్థిక సాంఘిక రాజకీయ సాంస్కృతిక అంశాల సమ్మేళనమే వ్యవస్థ అని మార్క్సిజం చెబుతుంది. ఆర్థిక సంబంధాలు నిర్ణయాత్మకం అని మార్క్స్ ఒక సందర్భంలో చెప్పిన విషయం ను అపార్థం చేసుకుంటున్నారని ఫ్రెడరిక్ ఎంగెల్స్ 1892 సెప్టెంబరు21న ఒక మిత్రుడికి వ్రాసిన లేఖ ద్వారా స్పష్టం చేశాడు: ” చారిత్రక భౌతిక వాదం ప్రకారం వాస్తవిక జీవితంలోని ఉత్పత్తి, పునరుత్పత్తి చివరాఖరికి నిర్ణాయకం అవుతాయి. మార్క్సు గాని నేను గాని అంతకుమించి ఏమి చెప్ప లేదు. అందువల్ల, ఎవరైనా ఆర్థిక అంశం ఒక్కటే నిర్ణాయక శక్తి అని మేం చెప్పిన దాని నుంచి అర్థం తీస్తే, మా పదబంధం ను అర్ధరహితమైన సుష్క సమాసంగా మార్చి వేసిన వారు అవుతారు. రాజకీయ, న్యాయ, తాత్విక సిద్ధాంతాలు, మత దృక్పథం లు మరియు చిట్టెం కట్టిన వ్యవస్థలుగా అవి అభివృద్ధి చెందటం కూడా చారిత్రక పోరాటాల పై ప్రభావాన్ని చూపుతాయి, చాలా సందర్భాల్లో ప్రత్యేకంగా వాటి రూపాన్ని నిర్ణయిస్తాయి.” దీనిని మనదేశం సమాజానికి అన్వయించుకోవచ్చు లో భారత కమ్యూనిష్టు ఉద్యమం నాయకత్వం విఫలం అయిందని ఉసా విమర్శ.

హిందూ సమాజం యొక్క విశిష్ట లక్షణం అంటరానితనం తో కూడిన బ్రాహ్మణీయ/ నిచ్చెన మెట్ల కుల వ్యవస్థ. ఇది వేలాది సంవత్సరాల పాటు మనుగడలో వర్ణవ్యవస్థ పేరుతో ఉన్న ప్రత్యేక తరహా వర్గ వ్యవస్థ. అది కాలక్రమంలో కుల వ్యవస్థ రూపాన్ని తీసుకుంది. శూద్రులను సవాలక్ష కులాలుగా చీల్చి వేసింది. పంచమ వర్ణాన్ని సృష్టించి అంటరాని వారిగా ముద్రవేసి ఊరి బయట ఉంచింది. గత 150 సంవత్సరాలుగా, తాత్విక సామాజిక రంగాలలో జరిగిన అనేక పోరాటాల వలన కులవ్యవస్థ లోపల ఆర్థిక సంబంధాలలో కొన్ని మార్పులు జరిగినప్పటికీ మౌలిక మార్పు రాలేదు. ఈ సామాజిక ఆర్థిక రాజకీయ చట్రంలో మౌలిక మార్పు రావాలంటే ఈ మూడు రంగాలలోనూ పోరాటాలు జరగాలి అని బుద్ధుడు నుంచి జ్యోతిబా పూలే… అంబేద్కర్ ల వరకు చెబుతున్న విషయాలను సార్వజనీనం అగు మార్క్సిస్టు దృక్పథంతో అనుసంధానం చేయాలనే కామ్రేడ్ ఉ. సాంబశివరావు రచనలు ఆచరణ తేట తెల్లం చేస్తున్నాయి.

మీరు ఆరోపించి నట్లు, ఉసా మార్క్సిజం ను, వర్గ దృక్పథం ను ఏనాడు విడనాడలేదు. అందువల్లనే 1994 లో, మార్క్సిస్టు-లెనినిస్టు సెంటర్ ను బి.యస్.పి. లో విలీనం చేయాలనే ప్రతిపాదన ను ఉసా తిరస్కరించి, కె.జి. సత్యమూర్తి,నుంచి విడగొట్టు కున్నాడు. కుల – వర్గ జమిలి పోరాటం సిద్ధాంతం ప్రాతిపదికతో వీరన్న 25 అక్టోబర్ 1998 లో ఏర్పాటుచేసిన సి పి యు ఎస్ ఐ పార్టీ కి ఉసా క్రియాశీల సహకారాన్ని అందించాడు అన్న విషయం బహిరంగ రహస్యం. నిజానికి అతను ఆ నిర్మాణం ముఖ్యులలో ఒకరు. మహాజన సమితి ‘ అర్థవలస-అర్థఫ్యూడల్’ కమ్యునిస్టు ల ఐక్యసంఘటన కంటే మెరుగైన ఐక్య సంఘటకాదా?

భారత సమాజం యొక్క నిర్దిష్ట అంశమగు నిచ్చెన మెట్ల కుల నిర్మూలన పోరాటాన్ని మరియు వర్గ నిర్మూలన పోరాటాన్ని జమిలిగా నిర్వహించాలనేది అతని సిద్ధాంతం మరియు ఆచరణ. మార్క్సిజాన్ని భారతీయం చేయాలనీ, అందుకు మార్క్సిజంను-జోతిబా పులే – డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఆలోచనలను సంశ్లేషణ చేయాలని, దాని ఆధారంగా పోరాటాలను నిర్మించాలని అతను జీవితాంతం కృషి సాగించాడు. అందుకోసం వివిధ వేదికలను నిర్మించాడు. సమాజంలోని అన్ని రకాల ఆధిపత్యా లకు వ్యతిరేకంగా తన కలాన్ని గళాన్ని ఎక్కుపెట్టాడు. ఈ దేశంలో మనుధర్మం చేత వేల సంవత్సరాలుగా దోపిడి పీడన, అణచివేత లకు గురైన, దేశ జనాభాలో 90 శాతం గా ఉన్న దళితులు, బి.సి. లు, గిరిజనులు, మత, జాతి మైనారిటీ లు మరియు ఇతర శ్రామికుల అందరి పక్షాన దృఢంగా నిలబడ్డాడు. కోస్తా ఆంధ్రాలో పుట్టినప్పటికీ తెలంగాణా ప్రజల హృదయాల్లో నిలిచిపోయాడు.

ఉసా, మా సంస్థ చైర్మన్ సిబిఆర్ లిద్దరూ సిపిఐ(యం.యల్) రెడ్ స్టార్ ఆహ్వానం తో 2017 జూన్ 24న నక్సల్బరికి వెళ్ళారు. 2018 నవంబర్ లో ఆ పార్టీ 11వ కాంగ్రెస్ సందర్భంగా బెంగుళూరులో కుల సమస్యపై నిర్వహించిన సదస్సుకు వక్తలుగా హాజరయ్యారు. అట్లాగే, ఆ పార్టీవారే 2018 అక్టోబర్ లో హైదరాబాద్ లో నిర్వహించిన అక్టోబర్ విప్లవం శతవార్షిక సంవత్సర సభలో వారిరువురు ఉపన్యాసకులు; 2019 సెప్టెంబరులో ఆ పార్టీ వారే కలకత్తాలో నిర్వహించిన ఫాసిజం వ్యతిరేక సన్నాహక సదస్సుకు ఇద్దరు హాజరయి మాట్లాడారు. CPI(ML) పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు కామ్రేడ్ అలోక్ ముఖర్జీ కూడా ఈ సమాలోచన సభలో ఉపన్యాసకులు. హైదరాబాద్ లో దళిత బహుజన మత మైనారిటీ సంఘాలే గాక దాదాపు అన్ని కమ్యూనిస్టు పార్టీలు మరియు వారి ప్రజా సంఘాలు సాంబశివరావు ను తమ వేదికలపై కి ఉపన్యాసకుడిగా అనేక సందర్భాలలో ఆహ్వానించాయి.

మార్క్సిజం లోతుల్లోకి వెళ్లి పరిశోధించాలని ఉసా నిరంతరం తపన చెందుతూ ఉండేవాడు. అనారోగ్యంతో ఉన్న సమయం లో (కరోనా కారణమని అతను ఊహించలేదు, విరోచనాలు అవుతున్నాయని చెప్పలేదు) కూడా, జులై 17 న ఓపిడిఆర్ ఛైర్మన్ భాస్కరరావుకు ఫోన్ చేసి” ఆర్యన్ గ్రామం గురించి మార్క్స్ వ్రాసింది అనువాదం పూర్తి అయిందా” అని అడిగి, ” ఆ write-up గురించి ఇంత వరకు ఏ కమ్యునిస్టు పార్టీ ప్రస్తావించ లేదు, మనం వెలుగులోకి తేవాలి” అన్నారు ఉసా.

3. సి.పి.ఐ ఎం.ఎల్ ఆంధ్ర ప్రదేశ్ కమిటీ కు ప్రశ్నలు
i. 1973 నుంచి 1986 వరకు మీ నిర్మాణంలో ఉన్న కాలంలో, మీ పార్టీ నాయకత్వం అందించిన గైడెన్స్, పార్టీ నిర్మించిన ఉద్యమంల వలన ఉత్తేజితుడై ఉసా ఈరోజుకీ జనం గుండెల్లో గూడుకట్టుకొని ఉన్న గొప్ప పాటలు వ్రాశాడని, తెలంగాణాలోని పాత నల్గొండ జిల్లా మోత్కూరు ప్రాంతంలో ‘లో ఓల్టేజ’ సమస్య మీద పెద్ద ఎత్తున రైతాంగాన్ని కదిలించాడని వ్రాసారు. ఆ మోత్కూరు ఉద్యమం కూడా కొప్పుల మోహన రెడ్డి సహకారం లేకపోతే సాధ్యం అయ్యేది కాదనే ధ్వని మీ వ్రాతలో ఉంది. సరే, ఆ మాత్రమైనా వ్రాసినందుకు మీకు అభినందనలు.

మీ నిర్మాణములో ఉన్న సంవత్సరాలలో కామ్రేడ్ సాంబశివరావు వివిధ క్షేత్రాలలో (మీ గైడెన్స్ తోనే అనుకుందాం) ప్రజ్ఞ పాటవాలు కలిగిన నాయకుడుగా ఎదిగాడు కదా? రహస్య కార్యకర్త కాదు కదా? మరి, అలాంటప్పుడు 1986లో ఒంగోలులో జరిగిన రైతు కూలీ పేదల సంఘం మహాసభలో అతనిని కాదని, అప్పటికి కొన్ని మాసాల క్రితం వరకు డి ఎస్ ఓ విద్యార్థి సంస్థకు ప్రధాన కార్యదర్శిగా పని చేసిన జాస్తి కిశోర్ బాబు ను జాయింట్ కార్యదర్శిగా (రై.కూ.పే. సంఘం కు) మీ పార్టీ నాయకత్వం ఎందుకు నియమించింది? అలాగే, అతనికన్నా ఏ మాత్రం అదనపు శక్తి సామర్థ్యాలు లేని కొంతమందిని ఆ సంవత్సరమే పార్టీ రాష్ట్ర కమిటీ లోకి తీసుకున్నారు. కానీ ఉసా ను ప్రక్కన పెట్టారు! ఎందువల్ల?

దీనికి కారణాలు ఏమిటో, ఉసా ఏ తప్పిదాలు చేయటం వల్ల మీరు అతనికి వర్గ సంఘం, పార్టీ లలో ఉన్నత స్థానాలలో కి తీసుకోలేదో చెబుతారా? పార్టీ నాయకత్వం యొక్క నిరంకుశ ధోరణులను ఒక లేఖ ద్వారా ప్రశ్నించడము, కారంచేడు దళితుల ఊచకోత విశ్లేషణ విషయములో మీ పార్టీ నాయకత్వ వైఖరికి భిన్నమైన వైఖరిని ఉసా చేపట్టటం కారణాలు, అవునా? కాదా?

ii.2001లో ప్రచురించిన ‘ఇండియాలో ఏం చేయాలి’
గ్రంథం ముందు మాటలో క్రింది విధంగా వ్రాయబడి ఉంది: ” ఈ సిద్ధాంత పోరాటానికి ( కుల సమస్య సంబంధించిన- మా వివరణ) ఆంధ్రప్రదేశ్ లో “నలుపు”, “ఎదురీత” మాస పత్రికలు ప్రధాన వేదిక లయ్యాయి. అప్పటికే (1985-86 మధ్య) ఈ ప్రశ్నల్ని యు సి సి ఆర్ ఐ (ఎం ఎల్) జనశక్తి పార్టీలో, జనసాహితి, ఓ పి డి ఆర్ సంస్థలలో లేవనెత్తి నందుకు ఉ.సాంబశివరావును ( పార్టీ నుంచి, జనసాహితి నుంచి), డా|| కంచ ఐలయ్య ను (ఓ పి డి ఆర్ నుండి) తొలగించారు.”

ఉసా బ్రతికి ఉన్నప్పుడు దీనికి మీరు సమాధానం వ్రాసారా?

iii.ఏక కాలంలో, కులం ‘పునాది- ఉపరితలం’ కనుక వర్గ-కుల నిర్మూలన ఉద్యమాలను జమిలిగా నిర్వహించాలని, ఆ సందర్భంలో జోతిబా పులె, అంబేద్కర్ దృక్పథం లను కూడా స్వీకరించాలని ఉసా అంటాడు. దీని పై మీవైఖరి ఏమిటి?

అనుబంధ ప్రశ్నలు చాలా ఉండవచ్చు.

4. ముగింపు
‘మీ’ UCCRIMLనుంచి తొలగించిన తర్వాత ఉ. సాంబశివరావు మొత్తం బహుళ బహుజన శ్రామిక ప్రజల నాయకుడిగా ఎదిగాడు. ఈ విషయాన్ని హర్షించే విశాల దృక్పథం ఆనాటి మీ UCCRIML/ప్రస్తుతం CPI(ML) ఆంధ్ర ప్రదేశ్ కమిటీ నాయకత్వానికి లేనప్పుడు అత్యంత విచారకరం. ఉసా మరణం సందర్భంగా ఇతరులు మీ పార్టీ పై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని మీరు భావిస్తే వాటిని ఎదుర్కొనే ప్రజాస్వామిక హక్కు మీకు ఖచ్చితంగా ఉంది. కానీ, ఆ మిషతో ఉసా పై ఉమ్మి వేసే ప్రయత్నం చేయటం మీ పాలిటి విషాదమని చెప్పటానికి ఓ పి డి ఆర్ విచారిస్తున్నది.

మిత్రులారా.
ఉసా మరణించిన తరువాత ఈ ఏడు రోజులలో జరిగిన సంస్మరణ సభలు ఉసా అజరామరుడు అని స్పష్టం చేస్తున్నాయి. కనుక, ఇప్పటికైనా నిజాన్ని గ్రహించి ‘ఆత్మస్తుతి-పరనింద’ బలహీనతల నుంచి మీరు బయటపడి నిజమైన మార్క్సిస్టు-లెనినిస్టు విప్లవకారులు గా రూపాంతరం చెందాలని మేం కోరుకుంటున్నాం.

ఇట్లు
స్నేహాభినందనలతో

సి. భాస్కరరావు (సిబిఆర్), ఛైర్మన్, కేంద్ర కమిటీ
బి. నరసింహ, కార్యదర్శి, తెలంగాణా కమిటీ
యం. శ్రీనివాసులు, అధ్యక్షుడు, ఆంధ్ర ప్రదేశ్ కమిటీ
ఆర్ రామకుమార్, కార్యదర్శి, ఆంధ్ర ప్రదేశ్ కమిటీ
చావలి సుధాకర్, ఉపాధ్యక్షుడు,ఆంధ్ర ప్రదేశ్ కమిటీ

Leave a Reply