మహిళలపై పెరిగిన నేరాలు

0
710

– గతేడాది 13,618… ఈ ఏడాది 19,953 ఫిర్యాదులు
– నేరాల్లో 46శాతం పెరుగుదల : జాతీయ మహిళా కమిషన్‌ వెల్లడి
– యూపీలోనే 10,084 కేసులు

న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా మహిళలపై నేరాలు భారీగా పెరిగాయి. గత ఏడాదితో పోల్చితే ఈ ఏడాదిలో (8నెలల గణాంకాలు) నేరాలు 46శాతం పెరిగాయని, మొత్తం నేరాల్లో సగం ఒక్క ఉత్తరప్రదేశ్‌లో నమోదయ్యాయని ‘జాతీయ మహిళా కమిషన్‌’ తాజాగా గణాంకాల్ని విడుదల చేసింది. మహిళలపై నేరాలకు సంబంధించి గత ఏడాది జాతీయ మహిళా కమిషన్‌కు 13,618 ఫిర్యాదులు రాగా, ఈ ఏడాది జనవరి-ఆగస్టు మధ్య 8 నెలలకాలంలో మొత్తం 19,953 ఫిర్యాదులు వచ్చాయి. ఈ ఏడాది జులై నెలలో అత్యధికంగా 3248 ఫిర్యాదులు నమోదయ్యాయని కమిషన్‌ తెలిపింది.

గృహహింసకు సంబంధించి-4289, అదనపు కట్నం కోసం, వేధింపులపై 2923 ఫిర్యాదులు, గౌరవంగా జీవించే హక్కును(మానసికింగా వేధింపులు) కాలరాస్తున్నారనే ఆరోపణ కింద 7036 ఫిర్యాదులు నమోదయ్యాయి. మహిళలపై వేధింపులు-1116, లైంగికదాడులు-1022, లైంగికదాడికి ప్రయత్నించటం-585 కేసులు నమోదయ్యాయి. కేసుల సంఖ్యను రాష్ట్రాల వారీగా పరిశీలిస్తే, అత్యధిక కేసులు(10,084) ఉత్తరప్రదేశ్‌లో, ఆ తర్వాత అత్యధికంగా ఢిల్లీ(2147), హర్యానా(995), మహారాష్ట్ర(974)లలో ఉన్నాయని కమిషన్‌ పేర్కొంది.

నేరాల సంఖ్య పెరుగుదలపై జాతీయ మహిళా కమిషన్‌ చీఫ్‌ రేఖా శర్మ మాట్లాడుతూ..”నేరాలు జరిగితే వాటిపై ఫిర్యాదు చేసే విధంగా అవగాహనా కార్యక్రమాలు చేపడుతున్నాం. మహిళల్లో అవగాహన తీసుకురావటం వల్లే కమిషన్‌ను ఆశ్రయించి ఫిర్యాదులు చేయటం పెరిగింది. ఎక్కడ ఫిర్యాదుచేసినా బాధిత మహిళకు కమిషన్‌ అండగా ఉండేందుకు కొన్ని ప్రత్యేక చర్యలు చేపడుతోంది. ఉదాహరణకు..24 గంటలూ అందుబాటులో ఉండేవిధంగా ఒక హెల్ప్‌లైన్‌ నెంబర్‌ను తీసుకొచ్చాం. తగిన సాయం చేస్తున్నాం. ఎక్కడ ఫిర్యాదుచేసినా కమిషన్‌ సేవల్ని పొందే ఏర్పాటుచేశా”మని అన్నారు.

Courtesy Nava Telangana

Leave a Reply