క్రిమినల్‌ చెరలో 24 మంది చిన్నారులు

0
216
క్రిమినల్‌ చెరలో 24 మంది చిన్నారులు
  •  బందీలుగా కొందరు మహిళలు కూడా!
  • బర్త్‌ డే పార్టీకని పిలిచి చెరబట్టిన నేరగాడు
  • లోపలి నుంచే కాల్పులు… బెదిరింపులు
  • ఓ కేసులో గ్రామస్థులు పట్టించారని కోపం
  • నాటు బాంబులతో పోలీసులపై దాడి
  • ఇంటిని చుట్టుముట్టిన కమెండోలు
  • స్వయంగా పర్యవేక్షిస్తున్న సీఎం యోగి

అతడి సాదర ఆహ్వానం వెనుక ఓ శాడిజం! నా కూతురు పుట్టిన రోజు వేడుకలో మీరే అతిథులంటూ ఒలకబోసిన ఆప్యాయత వెనుక ఓ క్రూరమైన పథకం!! పిలిచాడని సంబురంగా పార్టీకి వెళితే.. 24 మంది అభం శుభం తెలియని పిల్లలను, తోడుగా వెళ్లిన కొందరు తల్లులను తన ఇంట్లో బంధించాడు. వారిపై తుపాకీ గురిపెట్టాడు. ఎవ్వరైనా విడిపించే ప్రయత్నాలు చేశారో పిల్లలను కాల్చి చంపుతానని బెదిరిస్తున్నాడు. గాల్లోకి కాల్పులు జరిపి.. పోలీసులపై బాంబులేసి భయోత్పాతం సృష్టించాడు. అతడి ఉన్మాదం వెనుక కారణం.. ఊరోళ్లంతా కలిసి ఓ హత్య కేసులో తనను ఇరికించారనే కోపం!!

ఫరూకాబాద్‌ : ఉత్తరప్రదేశ్‌లోని ఫరూకాబాద్‌లో ఓ నేరగాడు 24 మంది పిల్లల్ని, కొందరు మహిళల్ని బందీలుగా చేసి చంపేస్తానని హెచ్చరిస్తున్నాడు. స్థానిక పోలీసుల కథనం ప్రకారం… సుభాష్‌ బాథమ్‌ అనే వ్యక్తికి ఓ హత్యకేసులో జీవితఖైదు పడింది. ప్రస్తుతం పెరోల్‌ మీద బయటకొచ్చాడు. గురువారం మధ్యాహ్నం 2:30 గంటల ప్రాంతంలో కసారియా గ్రామంలోని తన ఇంటికి సమీపంలో ఉన్న ఇతర ఇళ్లకు వెళ్లి తన కుమార్తె పుట్టినరోజు ఉందనీ, వెంటనే పిల్లల్ని పంపించాలని అందరినీ కోరాడు. తాను మారిపోయిన వ్యక్తినని అందర్నీ నమ్మించాడు. వారంతా నిజమేననుకొని తమ పిల్లల్ని బర్త్‌డే ఫంక్షన్‌ నిమిత్తం సుభా్‌షతో అతని ఇంటికి పంపారు. ఒకరిద్దరు తల్లులైతే తోడు కూడా వెళ్లారు. కాసేపయ్యాక మరికొందరు పిల్లలు వచ్చారు. అంతా వచ్చాక ఇంటి కిందనున్న సెల్లార్‌లోని గదిలో కూర్చోబెట్టాడు. లోపల్నుంచి గడియలు వేసేసి, తాళాలు కూడా వేసి వారందరినీ బందీలుగా చేశాడు. ఆఖరికి తన భార్య, పిల్లలను కూడా చెరలో పెట్టాడు. ఎంతసేపటికీ తమ పిల్లలు తిరిగి రాకపోయేసరికి వీధిలోని కొందరి తండ్రులు అక్కడికొచ్చి వాకబు చేయబోయారు.

సుభాష్‌ లోపలి నుంచే వారిని బయటకు తరిమేశాడు. పిల్లల గురించి మాట్లాడితే కాల్చిపారేస్తానని బెదిరించాడు. ‘మాకొచ్చిన సమాచారం ప్రకారం- ఇంట్లోపలి నుంచే అతగాడు ఆరు రౌండ్లు గాల్లోకి కాల్పులు జరిపాడు’ అని అదనపు డీజీపీ పీవీ రామశాస్త్రి చెప్పారు. స్పెషల్‌ ఆపరేషన్‌ కమెండోలను హుటాహుటిన అక్కడకు పంపినట్లు డీజీపీ ఓపీసింగ్‌ తెలిపారు. వారు ఆ ఇంటిని చుట్టుముట్టారు. అవసరమైన పక్షంలో నేషనల్‌ సెక్యూరిటీ గార్డ్స్‌ను కూడా రంగంలోకి దించుతామన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ స్వయంగా పోలీసులతో మాట్లాడుతూ నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. పిల్లల్లో ఖుషీ (7), ముస్కన్‌ (6), ఆదిత్య (4), రోష్నీ (8), ఆరణి (5), లక్ష్మి (8), బ్రజ్‌కిషోర్‌ శాస్ర్తి (7), ఆకాశ్‌ (6) మొదలైన చిన్నపిల్లలే అంతా ఉన్నారనీ, గంటల తరబడి అదే ఇంట్లో బందీగా ఉండిపోవడంతో తలిదండ్రుల కోసం వారు ఏడుస్తున్నారనీ, గ్రామస్థులు అంటున్నారు. పిల్లలను రక్షించేనిమిత్తం సతీశ్‌ చంద్ర దూబే అనే గ్రామస్థుడు ఇంటి సమీపం దాకా వెళ్లాడు. బయటే నిలబడి నచ్చచెప్పబోయాడు.

అమాయకులైన పిల్లల్నేమీ చేయొద్దని విజ్ఞప్తి చేశాడు. సుభాష్‌ మొదట రావొద్దని అతనిని హెచ్చరించి ఆ వెంటనే అతనిపైనే కాల్పులు జరిపాడు. అయితే బులెట్లేవీ దూబేకు తగల్లేదు. ఈ పరిణామంతో గ్రామస్థులు పోలీసులకు సమాచారం అందించడం, వారు హుటాహుటిన చేరుకోవడం జరిగాయి. లోపలి నుంచి సుభాష్‌ ఓ గ్రనేడ్‌ కూడా విసిరినట్లు సమాచారం. ‘నేను మీ ఎవరితోనూ మాట్లాడను, ఎమ్మెల్యేను పిలిపించండి’ అని చెప్పాడు. వెంటనే భోజ్‌పూర్‌ ఎమ్మెల్యే నాగేంద్రసింగ్‌కు కబురుపెట్టారు. సాయంత్రానికి నాగేంద్రసింగ్‌ అక్కడకు చేరుకున్నారు. ఆయన్ను కలవడానికి కూడా సుభాష్‌ ఒప్పుకోలేదు. అప్పుడే జిల్లా ఎస్పీ అనిల్‌ కుమార్‌ మిశ్రా, జిల్లా కలెక్టర్‌ మానవేంద్రసింగ్‌ కూడా వచ్చారు. అర్ధరాత్రి 12 దాటినా ఈ బందీ డ్రామా కొనసాగుతూనే ఉంది. నిందితుడు 6 నెల పాపను మాత్రం వదిలి పెట్టాడు.

ఎందుకీ కోపం?
సుభాష్‌ ఓ మహిళ హత్యకేసులో దోషి. ఆ హత్యతో తనకు సంబంధం లేదని, ఆ సమయంలో తాను ఆ చోటే లేనని వాదించాడు. కానీ గ్రామస్తులు కొందరు అతనూ ఉన్నాడని చెప్పడంతో పోలీసులు అరెస్ట్‌ చేశారు. దాంతో ఊరిమీదే కోపం పెంచుకున్నాడు సుభాష్‌! ‘‘నన్ను పోలీసులకు పట్టిస్తారా… మీ పని చెబుతాను’’ అని ఈ దారుణానికి తెగబడ్డాక వారినుద్దేశించి అన్నట్లు సమాచారం. సుభాష్‌ మానసిక స్థితి సరిగా లేదని, ఎపుడేం చేస్తాడో తెలియడం లేదని పోలీసులు అంటున్నారు.

Courtesy Andhrajyothi

Leave a Reply