రాజస్థాన్‌లో రచ్చ రచ్చ

0
43
92 మంది కాంగ్రెస్‌ ఎమ్మెల్యేల రాజీనామా!
  • పైలట్‌ను సీఎంను చేయొద్దంటూ నిరసన
  • గహ్లోత్‌ వర్గం నేతనే చేయాలని డిమాండ్‌
  • ప్రభుత్వాన్ని కూల్చే ప్రయత్నం చేసిన వారిని..
  • ముఖ్యమంత్రిని చేస్తే ఒప్పుకోబోమని స్పష్టీకరణ
  • రంగంలోకి అధిష్ఠానం.. సీఎల్పీ భేటీ రద్దు
  • అశోక్‌ గహ్లోత్‌, పైలట్‌ ఢిల్లీకి రావాలని పిలుపు

జైపూర్‌/న్యూఢిల్లీ : ఏఐసీసీ అధ్యక్ష ఎన్నికల ముంగిట కాంగ్రె్‌సకు కొత్త సమస్య ఎదురైంది. రాజస్థాన్‌ కాంగ్రె్‌సలో తీవ్ర సంక్షోభం తలెత్తింది. అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయనున్న అశోక్‌ గహ్లోత్‌ను ముఖ్యమంత్రి పదవిని వదులుకోవాలని చెప్పడం ఈ సమస్యకు కారణమైంది. గహ్లోత్‌ స్థానంలో కొత్త ముఖ్యమంత్రిని ఎన్నుకోవడం ఆ పార్టీకి క్లిష్టంగా మారింది. రాజస్థాన్‌కు తదుపరి ముఖ్యమంత్రి తానే కావాలని సచిన్‌ పైలట్‌ భావిస్తుండగా.. పార్టీ అధిష్ఠానం కూడా ఆయన వైపే మొగ్గు చూపుతోంది. దీంతో పైలట్‌ను ఎట్టిపరిస్థితుల్లోనూ సీఎంను చేయడానికి వీల్లేదంటూ గహ్లోత్‌ వర్గం ఎమ్మెల్యేలు తేల్చిచెప్పారు. ఆదివారం సాయంత్రం సీఎల్పీ భేటీ నిర్వహించి తదుపరి సీఎంను ఎన్నుకోవాలని నిర్ణయించగా.. అంతకుముందే గహ్లోత్‌ వర్గానికి చెందిన 92 మంది ఎమ్మెల్యేలు తమ పదవులకు రాజీనామా చేశారు. మరోవైపు పీసీసీ అధ్యక్షుడు కూడా రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. దీంతో అధిష్ఠానం సీఎల్పీ భేటీని కూడా రద్దు చేసి.. గహ్లోత్‌, పైలట్‌ సహా సీఎల్పీ భేటీకి పరిశీలకులుగా వెళ్లినవారిని వెంటనే ఢిల్లీకి రావాల్సిందిగా ఆదేశించింది. వాస్తవానికి ఏఐసీసీ అధ్యక్ష పదవితోపాటు రాజస్థాన్‌ ముఖ్యమంత్రి పదవిలోనూ తానే కొనసాగాలని గహ్లోత్‌ తొలుత భావించారు. అయితే ఒకరికి ఒకే పదవి అని రాహుల్‌గాంధీ స్పష్టం చేయడంతో.. తనకు విశ్వాసపాత్రుడైన నేతను సీఎంను చేయాలని నిర్ణయించుకున్నారు. కానీ, ప్రస్తుతం డిప్యూటీ సీఎంగా ఉన్న సచిన్‌ పైలట్‌ పట్ల అధిష్ఠానం మొగ్గు చూపుతుండడంతో దీనిని అడ్డుకునేందుకు గహ్లోత్‌ మొదటనుంచీ ప్రయత్నిస్తున్నారు.  తన వర్గానికే చెందిన ప్రస్తుత శాసనసభ స్పీకర్‌ సీపీ జోషిని ముఖ్యమంత్రిని చేయాలనే ఆలోచనతో గహ్లోత్‌ ఉన్నారు. ఆదివారం సాయంత్రం సీఎల్పీ భేటీ నిర్వహించి తదుపరి సీఎంను ఎన్నుకోవాలని ఎమ్మెల్యేలకు సూచించారు.

కాగా, సీఎల్పీ భేటీకి అధిష్ఠానం పరిశీలకులుగా మల్లికార్జున ఖర్గే, అజయ్‌ మాకెన్‌లను పంపించింది. వీరు గహ్లోత్‌తో కలిసి సీఎం అధికారిక నివాసానికి చేరుకోగా అక్కడ కేవలం 25 మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నారు. గహ్లోత్‌ మద్దతుదారులైన మిగిలిన ఎమ్మెల్యేలు పెద్ద సంఖ్యలో మంత్రి శాంతి ధరివాల్‌ నివాసంలో సమావేశమయ్యారు. పైలట్‌ను ఎట్టిపరిస్థితుల్లోనూ సీఎంగా అంగీకరించబోమంటూ తేల్చి చెప్పారు. 2020లో గెహ్లోత్‌ సర్కారుపై పైలట్‌ తిరుగుబాటును గుర్తు చేస్తూ.. ప్రభుత్వాన్ని కూల్చే ప్రయత్నం చేసిన వారికి సీఎం పదవి ఎలా కట్టబెడతారని ప్రశ్నించారు. ఆనాడు ప్రభుత్వానికి మద్దతుగా నిలిచిన ఎమ్మెల్యేల్లోనే ఒకరికి ముఖ్యమంత్రి పదవి అప్పగించాలని డిమాండ్‌ చేశారు. అధిష్ఠానం ఆలోచనను నిరసిస్తూ ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేయాలని నిర్ణయించారు. 92 మంది ఎమ్మెల్యేలు అక్కడినుంచి నేరుగా శాసనసభ స్పీకర్‌ సీపీ జోషి నివాసానికి చేరుకొని రాజీనామా పత్రాలను సమర్పించారు. మరోవైపు రాజస్థాన్‌ పీసీసీ అధ్యక్షుడు గోవింద్‌సింగ్‌ దోతస్రా కూడా తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. కాగా, పార్టీలో సంక్షోభం మరింత ముదరడంతో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌.. అశోక్‌ గహ్లోత్‌కు ఫోన్‌ చేశారు. అయితే ఎమ్మెల్యేలంతా ఆగ్రహంతో ఉన్నారని, ప్రస్తుతం తన చేతుల్లో ఏమీ లేదని గెహ్లోత్‌ సమాధానమిచ్చినట్లు తెలిసింది. పరిస్థితులు చేయి దాటిపోతున్నట్లు గ్రహించిన కాంగ్రెస్‌ అధిష్ఠానం.. సీఎల్పీ భేటీని రద్దు చేసింది. గహ్లోత్‌, పైలట్‌ సహా ఖర్గే, మాకెన్‌ను ఢిల్లీకి రావాలని ఆదేశించింది.

Leave a Reply