దోచుకో..పారిపో

0
165

– వేల కోట్లలో బ్యాంక్‌లకు కార్పొరేట్ల లూటీ
– ‘మొండిగాళ్ల’పై కేంద్రం మెతక వైఖరీ
– ఏబీజీ షిప్‌యార్డ్‌ మోసంలో కాలయాపన
– జనం పొదుపు సొమ్ముకు రెక్కలు

న్యూఢిల్లీ : ‘వేల కోట్లలో అప్పు తీసుకో.. బ్యాంక్‌లను ముంచు.. ఆపై విదేశాలకు పారిపో’ ఇది భారత్‌లో కార్పొరేట్లకు పారిపాటిగా మారిపోయింది. ఇప్పటి వరకు విజరు మాల్యా, నీరవ్‌ మోడీ, మోహుల్‌ చోక్సీల ఘటనలు మర్చిపోకముందే గుజరాత్‌ కేంద్రంగా పని చేస్తున్న ఏబీజీ షిప్‌యార్డ్‌ బ్యాంక్‌లను దాదాపు రూ.23వేల కోట్లకు ముంచడంతో కార్పొరేట్ల దోపిడీ మరోసారి బయటపడటమే కాకుండా బ్యాంకింగ్‌ వర్గాలను ఒక్క సారిగా బెంబెలెత్తాయి. రాజకీయ ప్రాబల్యంతో అప్పులు పొంది ఆ తర్వాత ఇతర అక్రమాలకు పెట్టుబడులను తరలించి.. బ్యాంక్‌లను ముంచేస్తున్నారు. ఈ మోసాలపై కాంగ్రెస్‌, బీజేపీలు ఒకరిపై మరొక్కరు ప్రత్యారోపణలు చేసుకుంటున్నారు. కాగా.. ఇందులో సొమ్ము మాత్రం సామాన్యులది కావడం గమనార్హం.

ఏబీజీ షిప్‌యార్డ్‌ కంపెనీ దేశంలోని 28 బ్యాంక్‌లకు టోకరా ఇచ్చింది. ఐసీఐసీఐ బ్యాంక్‌ కన్సోరియంలోని పలు బ్యాంక్‌లకు ఏకంగా రూ.22,842 కోట్లకు మోసం చేసింది. దీంతో ఆ కంపెనీ సీఎండీ, డైరెక్టర్లపై సెంట్రల్‌ బ్యూరో ఆఫ్‌ ఇన్వెస్టిగేషన్‌ (సీబీఐ) ఇటీవల ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసింది. ఏబీజీ షిప్‌యార్డ్‌ సీఎండీ రిషి కమలేష్‌ అగర్వాల్‌, ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ సంతానమ్‌ ముతస్వామి, మరో ముగ్గురు డైరెక్టర్లు అశ్వినీ కుమార్‌, సుశీల్‌ కుమార్‌ అగర్వాల్‌, రవి విమల్‌ నెవెటియాలపై మోసం, క్రిమినల్‌ కేసులు పెట్టింది. ఈ కంపెనీ షిప్‌ల తయారీ, వాటి రిపేర్‌ వ్యాపారాలను కలిగి ఉంది. గడిచిన 16 ఏండ్లలో 165 వాణిజ్య ఓడలను తయారు చేసింది. ఈ సంస్థకు బ్యాంక్‌లు వరుస కట్టి అప్పులివ్వడం గమనార్హం. ఐసీఐసీఐ బ్యాంక్‌ కన్సోరియంలోని బ్యాంక్‌లు రుణాలివ్వగా.. ఎస్బీఐ చొరవ తీసుకుని సీబీఐకి ఫిర్యాదు చేసింది.

బ్యాంక్‌లను మాల్యా రూ.10వేల కోట్లకు, నీరవ్‌ మోడీ, మోహుల్‌ చోక్సీ ఇద్దరూ రూ.14వేల కోట్లకు ముంచింతే ఏబీజీ గ్రూపు ఏకంగా రూ.23వేల కోట్లకు ఎగనామం పెట్టి మొండి గాళ్ల రికార్డ్‌ను బద్దలు కొట్టింది. 2012 ఏప్రిల్‌ నుంచి 2017 జులై మధ్య ఏబీజీ లావాదేవీలపై ఎర్నెస్ట్‌ అండ్‌ యంగ్‌ ఫోరెన్సిక్‌ ఆడిట్‌ను నిర్వహించింది. ఇందులో నిధుల మళ్లింపు సహా అనేక అవకత వకలు జరిగిన ట్లు గుర్తించి ంది. మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 2015 నుంచి ఈ కంపెనీ పరపతి పడిపోతూ వచ్చింది. 2016 జులైలో ఈ ఖాతాలను నిరర్థక ఆస్తులుగా బ్యాంక్‌లు గుర్తించాయి. దాదాపుగా ఆరేడేండ్లు గడిచిన ఈ స్కామ్‌పై ప్రభుత్వ్వం, ఆర్‌బిఐ దృష్టి పెట్టకపోవడం గమనార్హం. 2007లో గుజరాత్‌ ప్రభుత్వం ఏబీజీ షిప్‌యార్డ్‌కు దాదాపుగా 1.21 లక్షల చదరపు అడుగుల భూమిని అప్పగించింది. ఈ ఆర్థిక మోసం కేసును ముందుకు తీసుకెళ్లడంలో ప్రభుత్వ వర్గాలు మోకాలడ్డు వేశాయని కాంగ్రెస్‌ ఆరోపిస్తోంది. మోడీ సర్కార్‌ బ్యాంక్‌లను మోసగించిన వారి కోసం ‘దాచుకో-పారిపో’ పథకాన్ని ఆవిష్కరించిందని కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి రణ్‌దీప్‌ సూర్జేవాలా ఆరోపించారు. దేశంలోని ప్రభుత్వ రంగ బ్యాంక్‌లకు కేవలం 13 మంది కార్పొరేట్లు దాదాపుగా రూ.2.85 లక్షల కోట్లు ఎగ్గొట్టారని బ్యాంకింగ్‌ యూనియన్‌ సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. యునైటెడ్‌ ఫోరం రిపోర్ట్‌ ప్రకారం.. ల్యాంకో ఇన్‌ఫ్రాకు రూ.47వేల కోట్ల అప్పులిస్తే అందులో రూ.5,300 కోట్లు మాత్రమే వసూళ్లయ్యాయి. దాదాపు 88 శాతం రుణాలు ఎగ్గొట్టబడ్డాయి. భూషన్‌ స్టీల్‌ రూ.22వేల కోట్లు, ఎస్సార్‌ రూ.12వేల కోట్లు, జ్యోతి స్ట్రక్షర్స్‌ రూ.3400 కోట్లు, డిహెచ్‌ఎఫ్‌ఎల్‌ రూ.54వేల కోట్లు, భూషన్‌ పవర్‌ రూ.29వేల కోట్లు, ఎలక్ట్రో స్టీల్‌ రూ.9వేల కోట్లు, మన్నెట్‌ ఇస్పాట్‌ రూ.8,700 కోట్లు, వీడియోకాన్‌ రూ.43వేల కోట్లు, శివశంకరన్‌ ఇండ్రస్టీస్‌ రూ.4300 కోట్ల చొప్పున బ్యాంక్‌లకు ఎగనామం పెట్టాయి.

Courtesy Nava Telangana

Leave a Reply