రైతుకు ధీమా ఇవ్వని పంటల బీమా

0
53

కన్నెగంటి రవి

వాన,చలి, ఎండ లాంటి వాతావరణ పరిస్థితులకు ప్రభావితమవుతూ, ఎటువంటి ఆచ్ఛాదనా లేకుండా ఆకాశం కింద నేరుగా సాగే ఉత్పత్తి ప్రక్రియ వ్యవసాయం. వాతావరణం సహకరిస్తే రైతులకు ఇబ్బంది లేదు. కానీ ప్రకృతి వైపరీత్యాలు – ముఖ్యంగా కరువులు, వర్షాభావ పరిస్థితులు, వడగండ్ల వానలు, పిడుగులు, భారీ వర్షాలు, వరదలు, తుఫాన్లు – సంభవిస్తే పంట దిగుబడులు పడిపోవడం, రైతులు సమస్తం కోల్పోవడం, పండించిన పంట కూడా నాణ్యంగా లేక నష్టాల ఊబిలో కూరుకుపోవడం జరుగుతుంది.

రైతుల నష్టాలను తగ్గించి భరోసా ఇవ్వాలనే లక్ష్య ప్రకటనతో దేశంలో 1972లో మొదటిసారి పంటల బీమా కార్యక్రమం రూపొందించి, పైలట్ గా అమలు చేశారు. 50ఏళ్లు గడిచిన తరువాత కూడా దేశంలో పంటల బీమా పథకాల పరిధిలోకి వచ్చిన సాగు విస్తీర్ణం, రైతుల సంఖ్య చాలా తక్కువ. రైతులకు అందిన నష్ట పరిహారం, ప్రయోజనాలు కూడా తక్కువే. పైగా ఈ పథకాలు కొన్ని పంటలకు, కొన్ని ప్రాంతాలకు పరిమితమయ్యాయి.

2014లో కేంద్రంలో అధికారంలోకి వచ్చిన మోదీ ప్రభుత్వం 2016 ఖరీఫ్ నుంచి ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన, వాతావరణ ఆధారిత పంటల బీమా పథకాన్ని అట్టహాసంగా ప్రారంభించింది. ఈ పథకం అమలు ప్రక్రియలోకి ప్రైవేటు బీమా కంపెనీలను కూడా అనుమతించింది. నిర్దిష్ట మార్గదర్శకాలను కూడా విడుదల చేసింది. కానీ 2019–2020 నాటికే ఈ పథకాలు బలహీనతలను చాటుకున్నాయి. భారీ ప్రీమియం రేట్లతో ప్రైవేటు కంపెనీలను ఆకర్షించిన ఈ పథకాలు 50శాతం రైతులను కూడా బీమా పరిధిలోకి తీసుకురాలేకపోయాయి. రైతుల ప్రీమియం వాటా, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ప్రీమియం సబ్సిడీ వాటా మాత్రం వేల కోట్లకు చేరుకుంది. ఫలితంగా బీమా పరిధిలోకి వచ్చిన రైతులకు కలిగిన ప్రయోజనం తక్కువే అయినా, ప్రైవేటు, ప్రభుత్వ రంగ బీమా కంపెనీలు మాత్రం వేల కోట్ల లాభాలను మూట కట్టుకున్నాయి.

2015–2016 గణాంకాల ప్రకారం దేశంలో 14 కోట్ల 60లక్షల మంది భూ కమతాలు ఉంటే, 2016–2017లో 5కోట్ల 83లక్షల మంది రైతులు బీమా పరిధిలోకి వచ్చారు. ఈ సంఖ్య 2019–2020 నాటికి 6కోట్ల 12లక్షల మందికి మాత్రమే పెరిగింది. 2016–17లో బీమా పరిధిలోకి వచ్చిన సాగు భూమి విస్తీర్ణం 5కోట్ల 61లక్షల హెక్టార్లు కాగా, 2019–2020 నాటికి అది 5 కోట్ల ఎకరాలకు పడిపోయింది. విస్తీర్ణం పడిపోయినా, రైతులు చెల్లించిన ప్రీమియం వాటా మాత్రం రూ.4078 కోట్ల నుంచి 4502 కోట్లకు పెరిగిపోయింది. ఈ వాటా డబ్బుతో కలిపి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ నాలుగేళ్లలో బీమా కంపెనీలకు లక్షా 7 వేల 382 కోట్ల రూపాయలు ప్రీమియంగా చెల్లించాయి. కానీ ఈ కంపెనీలు రైతులకు చెల్లించిన పరిహారం కేవలం 92 వేల 878 కోట్ల రూపాయలు మాత్రమే. అంటే నాలుగేళ్లలో ఈ బీమా కంపెనీలు రూ.14,504 కోట్ల లాభాలను దండుకున్నాయి.

రాష్ట్రంలో 2016–2017లో 9 లక్షల 74 వేల మంది, 2017–2018లో 10 లక్షల 96 వేల మంది, 2018–2019లో 7 లక్షల 99 వేల మంది, 2019–2020లో 10 లక్షల 33 వేల మంది రైతులు పంటల బీమా పరిధిలోకి వచ్చారు. రాష్ట్రంలో 60 లక్షల మంది రైతులు ఉన్నారని దృష్టిలో ఉంచుకుంటే, ఈ సంఖ్య ఎంత తక్కువో అర్థమవుతుంది. 2016–2017లో 8 లక్షల 24 వేల హెక్టర్లు బీమా పరిధిలోకి రాగా, 2019–2020 నాటికి కేవలం 11 లక్షల 34 వేల హెక్టార్ల పంటల సాగు మాత్రమే బీమా పరిధిలోకి వచ్చింది. అంటే మొత్తం 1 కోటీ 45 లక్షల ఎకరాల సాగు విస్తీర్ణంలో చాలా తక్కువ భూమి మాత్రమే బీమా పరిధిలోకి వచ్చింది. పైగా మొదటి రెండేళ్ళు ఎంతో కొంత బీమా పరిహారం సమయానికి చెల్లించినా, 2018–2019, 2019–2020 సంవత్సరాల పరిహారం మాత్రం – ఇంకా కొన్ని సమస్యలు పెండింగులో ఉన్నప్పటికీ – ఈ మధ్యనే రైతులకు అందింది. 2020 ఖరీఫ్ నుంచి రాష్ట్రంలో పంటల బీమా పథకాలు పూర్తిగా ఆగిపోయాయి. సీజన్ పూర్తి అయిన రెండు నెలల లోపే బీమా పరిహారం రైతులకు చెల్లించాలని మార్గదర్శకాలు ఉన్నప్పటికీ ఆ నియమం అమలు కావడం లేదు. పంటల బీమా పథకం అమలు చేయకపోవడమే కాదు, గత మూడేళ్లుగా ఇన్‍పుట్ సబ్సిడీగా ఒక్క రూపాయి కూడా రైతులకు రాష్ట్ర ప్రభుత్వం సహాయంగా అందించలేదు. ఈ విషయంలో రాష్ట్ర హైకోర్టు రైతులకు అనుకూలంగా తీర్పు ఇచ్చినా అమలు చేయకుండా సుప్రీంకోర్టుకు అప్పీలుకు వెళ్లింది.

అన్ని పంటలలో సాగు ఖర్చులు భారీగా పెరిగిపోయాయి. రైతులకు ఎం‌ఎస్‌పి కూడా చట్టబద్ధ హక్కుగా అందడం లేదు. ప్రకృతి వైపరీత్యాలు ప్రతి సంవత్సరం పెరుగుతున్నాయి. కానీ పంటల బీమా కింద అందే పరిహారం కానీ, ఇన్‍పుట్ సబ్సిడీగా అందే మొత్తాలు కానీ, రైతులకు జరిగే నష్టంలో 10 శాతం కూడా పూడ్చవు. పైగా ఈ బీమా పరిహారం, ఇన్‍పుట్ సబ్సిడీ మొత్తాలు తప్పకుండా వాస్తవ సాగుదారులకే అందుతాయన్న గ్యారంటీ లేదు. కౌలు రైతులు, పోడు రైతులు, భూమిపై హక్కులు లేని మహిళా రైతులు ఈ పరిహారం అందక ఎక్కువ నష్టపోతున్నారు. అప్పుల ఊబిలో కూరుకుపోయి అనివార్యంగా ఆత్మహత్యలు చేసుకుంటున్నారు.

రైతులకు పంట రుణాలు సకాలంలో అందకపోవడం, స్వయంగా ప్రీమియం చెల్లించడానికి రైతుల ఆదాయాలు అతితక్కువ ఉండడం, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బీమా కంపెనీలకు సకాలంలో ప్రీమియం చెల్లించకపోవడం, పంట దిగుబడులు అతి తక్కువగా ఉండడం, ఇండెమ్నిటి స్థాయి 80శాతంగా ఉండడం, పరిహారం చెల్లింపుకు ఏడేళ్ళ సగటుతో పంట సగటు దిగుబడులు లెక్కించడం, ఎక్కువ పంటలకు గ్రామం యూనిట్ గా పంటల బీమా పథకం అమలు కాకపోవడం వల్లా బీమా ప్రయోజనాలు రైతులకు అందడం లేదు.

వాతావరణ పంటల బీమా పథకంలో కొన్ని పంటలు మాత్రమే ఉంటున్నాయి. వరి ధాన్యం కంకులు నీళ్ళలో ఎక్కువ రోజులు మునిగి ఉండి నష్టం జరిగినా బీమా పరిహారం అందడం లేదు. అడవి జంతువుల వల్ల జరిగే పంట నష్టాలను బీమా పరిధిలోకి తేవాలని 2017లోనే నిర్ణయించినా, రాష్ట్రం అమలు చేయడం లేదు. కేంద్రం తన వాటాగా చెల్లించాల్సిన ప్రీమియం సబ్సిడీ మొత్తాన్ని 50 శాతం నుండీ 30 శాతానికి తగ్గించుకోవడం, రైతులు బీమా పథకంలో చేరాలా వద్దా అనేది రైతుల అభీష్టానికే వదిలేయడం తదితర కారణాల వల్ల కూడా ఈ బీమా పథకాల అమలు ఆగమ్య గోచరంగా తయారయ్యింది. రైతులకు జరుగుతున్న నష్టాన్ని దృష్టిలో ఉంచుకుని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 2023 ఖరీఫ్ నుంచి అన్ని పంటలకూ గ్రామం యూనిట్ గా స్వంత పంటల బీమా పథకాలను అమలు చేయాలి. ఎప్పటికప్పుడు నష్టపోయిన రైతుల వివరాలను సేకరించి పంట నష్టపరిహారాలను చెల్లించాలి.

రైతు స్వరాజ్య వేదిక

Leave a Reply