వినోద పర్వంలో వెలవెలబోతున్న సంస్కృతి

0
270

నాగిని కందాళ

మారియో వర్గస్‌ లోసా తన ‘నోట్స్‌ ఆన్‌ ద డెత్‌ ఆఫ్‌ కల్చర్‌’ రచనలో సంస్కృతి కనుమరుగవ్వడం పట్ల ఒక ఆర్టిస్టుగా కలవరాన్ని వ్యక్తం చేశారు. సంస్కృతిని కాపాడుకునే దిశగా నాగరికత తెలిసిన మనిషికి ఉండాల్సిన కనీస సామాజిక బాధ్యతలను గుర్తు చేసే ప్రయత్నం చేశారు. ఆయన విశ్లేషణలన్నీ స్థిరగంభీరమైన సాధికారక స్వరంలో, ఒక కళాకారుడిలో పేరుకున్న నిస్సహాయతతో కూడిన ఆగ్రహాన్ని ప్రతిబింబిస్తాయి.

తరతరాలుగా సంస్కృతికి ఉన్న నిర్వచనాలు మారుతూ వస్తున్నాయి. శాస్త్ర సాంకేతిక విప్లవం జనసామాన్యానికి చేసిన మేలుతో పాటు కీడు కూడా ఉంది. ముఖ్యంగా కళారంగం మీద దాని దుష్ప్రభావం ఎక్కువగా కనిపిస్తోందన్నది ఆర్టిస్టుల అభియోగం. అభివృద్ధి మాటున కనుమరుగైపోతున్న సంస్కృతిని గురించి నోబుల్‌ గ్రహీత, స్పానిష్‌/ పెరూ రచయిత మారియో వర్గస్‌ లోసా ‘నోట్స్‌ ఆన్‌ డెత్‌ ఆఫ్‌ కల్చర్‌’ పేరిట కొన్ని వ్యాసాలు రాశారు. ఆ పుస్తకం చదివాక కదిలిన భావాలివి.

సంస్కృతిని హైబ్రో, లోబ్రో కల్చర్స్‌ అంటూ దాని నాణ్యత దృష్ట్యా రెండు విధాలుగా విభజించడం మనకు తెలిసిందే. ఇలియట్‌, జేమ్స్‌ జోయ్స్‌ వంటివారి రచనలు హైబ్రో కల్చర్‌కి చెందితే, ఎర్నెస్ట్‌ హెమ్మింగ్వే, వాల్ట్‌ విట్మన్‌ లాంటివారి రచనలు సాధారణ పాఠకులకు అర్థమయ్యే రీతిలో లోబ్రో కల్చర్‌కి చెందుతాయి. ఈ విభజన రేఖల్ని చెరిపేస్తూ రష్యన్‌ తత్వవేత్త మిఖాయిల్‌ బఖ్తిన్‌, ఆయన అనుయాయులు రష్యన్‌ ఫార్మలిజం పేరిట తెలిసో తెలియకో ఒక రాడికల్‌ స్టెప్‌ తీసుకున్నా రంటారు లోసా. బఖ్తిన్‌ ఫిలాసఫీ సంస్కృతి మీద ప్రభావం చూపిస్తూ కళారంగంలో గణనీయమైన మార్పులకు దారితీసింది.

‘‘ఒక దశలో సంస్కృతిలేని తరం రూపొందుతుంది’’ అని ఇలియట్‌ చెప్పిన జోస్యాన్ని నిజం చేస్తూ, సామాన్యతకు అసామాన్యతను ఆపాదించడం వల్ల సంస్కృతి విలువ క్రమేపీ తగ్గనారంభించింది. లోసా ఈ పుస్తకంలో టి.ఎస్‌.ఇలియట్‌ ‘Notes Towards the Definition of Culture’ పేరిట రాసిన పరిశీలనాత్మక వ్యాసంలోని కొన్ని అంశాలను ప్రస్తావి స్తారు. ఆదర్శవంతమైన సంస్కృతి- వ్యక్తి, సమూహం, సమాజం ఈ మూడింటి సమన్వయ, సహకారాలతో ఏర్పడుతుందని ఇలియట్‌ అభిప్రాయపడతారు. ఉన్నత వర్గం (elite class) పరిధిలో ఉండే సంస్కృతి నాణ్యత పరిరక్షింపబడాలంటే అది మైనారిటీ కల్చర్‌గా ఉండడం తప్పనిసరి అనేది ఆయన భావన. ఈ వాదన అందరూ సమానమని చాటే ప్రజా స్వామిక విలువలకూ, లిబరల్‌ భావజాలాలకూ వ్యతిరేకంగా ఉన్నప్పటికీ ప్రస్తుత పరిస్థితుల్లో సాంస్కృతిక విలువలను చూసినప్పుడు ఇలియట్‌ జోస్యం నిజమైంది కదా అనిపిస్తుంది.

ఇలియట్‌ కలలుగన్న ‘హయ్యర్‌ క్లాస్‌’ స్థిరమైనది కాదు. అభిరుచులను ఆసరా చేసుకుని వ్యక్తిగత నైపుణ్యంతో ఎవరైనా ఒక వర్గం నుంచి మరొక వర్గంలోకి వెళ్ళవచ్చు. ఈ బదలాయింపు ఒక నియమంగా కంటే ఒక మినహాయింపుగా ఉంటుంది. ఇటువంటి వ్యవస్థ సమాజాన్ని క్రమబద్ధీకరిస్తుం దని నమ్ముతారు ఇలియట్‌. కానీ కేవలం విద్య ద్వారా సంస్కృతిని సమాజంలోకి అన్ని వర్గాలకూ వ్యాప్తి చెయ్యవచ్చనే భ్రమ నేటి తరంలో హయ్యర్‌ కల్చర్‌ను నిర్వీర్యం చేస్తోందంటారు లోసా. ఎందుకంటే సంస్కృతిని జ్ఞానంతో పోల్చడం సరికాదు. దీనికి తోడు సంస్కృతి క్షీణించడానికి దాన్ని ప్రజాస్వామ్యబద్ధం చెయ్యడం కూడా మరో కారణమని అభిప్రాయపడతారు లోసా. ఒకప్పుడు కేవలం కొన్ని వర్గాల నియంత్రణలో ఉన్న సంస్కృతి, ప్రజాస్వామిక, లిబరల్‌ సొసైటీలో అందరికీ అన్నీ సమాజంగా అందుబాటులో ఉండాలన్న ‘మోరల్‌ ఆబ్లిగేషన్‌’ కారణంగా విద్య ద్వారా, కళలను, సాహిత్యాన్నీ ప్రోత్సహించడం పేరిట అందరికీ లభ్యమవు తోంది. ‘అందరికీ సమానావకాశాలు’/ ‘అందరూ సమానం’ అనే రెండు వాక్యాలకు అర్థాలు వక్రీకరించబడి, కంప్యూటర్‌ కీ బోర్డు మీద టైపు చెయ్యడం వచ్చిన ప్రతివారూ రచయితలూ, ప్రచురించబడిన ప్రతిదీ సాహిత్యం అన్న తీరుగా తయారవుతోంది. ఏ కళారూపమైనా సంఘాన్ని దృష్టిలో పెట్టుకుని అధిక సంఖ్యలో జనానికి చేరాలన్న ‘సివిక్‌ డ్యూటీ’ (Quantity at the expense of quality) కళ నాణ్యతను తగ్గించింది. కొత్త సంస్కృతికి కావాల్సినదల్లా మాస్‌ ఇండస్ట్రియల్‌ ప్రొడక్షన్‌, కమర్షియల్‌ సక్సెస్‌ మాత్రమే. వెలకూ, విలువకూ తేడాలు అదృశ్యమైపోయిన తరుణంలో ఆ రెండిటినీ ఒకే అర్థంలో వాడుతు న్నారు. ఈ కాలంలో విజయవంతమైనదీ, అమ్ముడుపోయేదీ మంచిది. జనరంజకం కానిదీ, అమ్ముడుపోనిదీ చెడ్డదిగా మిగిలిపోతోంది. విలువ ఏదైనా ఉందీ అంటే అది మార్కెట్‌ నిర్దేశించే ‘కమర్షియల్‌ వేల్యూ’ మాత్రమే.

ఈ పుస్తకంలోని వ్యాసాల్లో ఇదే అంశంపై పలు తత్వవేత్తల రచనల్ని కూడా ప్రస్తావించారు లోసా. వీరిలో ఫ్రెంచి సోషియాలజిస్ట్‌ జీన్‌ బాడ్రిల్లార్డ్‌ వాస్తవానికీ, మీడియా సృష్టించిన కాల్పనికతకీ మధ్య పరిధులు చెరిగిపోయిన ఈ తరాన్ని ‘ఏజ్‌ ఆఫ్‌ సిములాక్రా’గా అభివర్ణిస్తారు. బాడ్రిల్లార్డ్‌ అభిప్రాయం ప్రకారం నేడు వాస్తవికత కనుమరుగైపోయింది. మనం టీవీల్లో, సోషల్‌ మీడియాలో, మీడియా ప్రొఫెషనల్స్‌ ఎంపికచేసి సృష్టించే వార్తల్లో, ప్రమోషన్స్‌లో, మార్కెటింగ్‌ యాడ్స్‌లో చూసేది వాస్తవికతకు క్లోన్డ్‌ వెర్షన్‌ మాత్రమే. ‘ప్రిన్సిపుల్‌ ఆఫ్‌ రియాలిటీ’ మీద దాడి నైతిక విలువలపై దాడి కంటే గర్హనీయం అంటారు బాడ్రిల్లార్డ్‌.

ఈ తరంలో ఇలా నిజాల్ని నిగ్గు తేల్చే మేధావులు లేరా అంటే ఉన్నారు. కానీ, వాళ్ళు తమ తమ రంగాల్లో మాత్రమే ప్రతిభా వంతులు. ఈ స్పెషలిస్టులకు తమ రంగానికి ఆవల ప్రపంచంలో ఏం జరుగుతోందో తెలీదు. తాము సాధించిన విజయాలు సమాజంపై ఎటువంటి ప్రభావం చూపిస్తాయో కనీస అవగాహనా లేదు. లోసా ఈ ‘వన్‌ డైమెన్షనల్‌ మనుషుల్ని’ ఏకకాలంలో ప్రతిభావంతులూ, సంస్కృతి లేని అనాగరికులు అని అంటారు. వారి సముద్రంలో నీటి బొట్టంత జ్ఞానం అందరితోనూ కలవడానికి బదులు వారిని ఏకాకిని చేస్తొందంటారు లోసా.

నేటి తరంలో ‘లైట్‌ లిటరేచర్‌’, అంటే సులభంగా చదవగలిగే సాహిత్యం, వినోదాన్ని పంచడమే పరమావధిగా మెజారిటీ పాఠకులకు ప్రాతినిధ్యం వహిస్తోంది. ఒక గొప్ప రచన చేసిన రచయితతో సరిసమాన స్థాయిలో చదివి ఆకళింపు చేసుకోవాలంటే పెట్టవలసిన ‘ఇంటెలెక్చువల్‌ కాన్సంట్రేషన్‌’ పెట్టడానికి ఎవరూ ఇష్టపడడం లేదు.

ఈ కాలంలో సాహితీ విమర్శ ఒక అంతరించిపోతున్న ప్రక్రియ. సోషల్‌ మీడియా ముఖస్తుతులూ, మార్కెటింగ్‌ మాయాజాలాల మధ్య నిజాయితీగా రచన నాణ్యతను తూకం వేసే పనికి ఎవరైనా పూనుకో వడం బహు అరుదు. అందువల్ల సాహిత్య విమర్శ ఉత్తుత్తి ప్రశంస లతో కూడిన సమీక్షలుగా మిగిలిపోతోంది. నేడు విమర్శకులు కూడా సర్కస్‌లో కోతుల్లా వినోదం పంచని పక్షంలో వాళ్ళకు ఎటువంటి ప్రాధాన్యతా లేదంటారు లోసా. దానికితోడు ఈ రోజుల్లో సాంస్కృతిక చర్చలు కూడా ఆ దారిలోనే నడుస్తున్నాయి. యాభయ్యేళ్ళ క్రితం అమెరికా లాంటి దేశాల్లో ది న్యూయార్కర్‌, ది న్యూ రిపబ్లిక్‌ లాంటి పత్రికల్లో ఎడ్మండ్‌ విల్సన్‌, సుశాన్‌ సొంటాగ్‌, జాన్‌ బెర్జర్‌ లాంటి వాళ్ళు తమ వ్యాసాల ద్వారా ఒక పుస్తకాన్నో, నవలనో, కవితనో, వ్యాసాన్నో విశ్లేషించి నాణ్యతను అంచనా వేసేవారు. ఇప్పుడు ఓప్రా విన్ర్ఫె షోలూ, బుక్‌ క్లబ్‌లూ, సోషల్‌ మీడియా సమీక్షలూ ఇలాంటివి నిర్ణయిస్తు న్నాయి. వినోదం పంచడమే పరమావధిగా ఉన్న ఈ సంస్కృతిలో వినియోగదారుడు దేవుడు. అతడికి ఏ ప్రత్యేకమైన విద్యార్హతలూ ఉండవలసిన అవసరంలేదు. ఒకప్పటి సంస్కృతికీ, నేటి సంస్కృతికీ మౌలికమైన వ్యత్యాసం ఏదైనా ఉంటే, ఒకప్పటి సంస్కృతి కాలదోషం పట్టకుండా తరాల పాటు నిలిచి ఉంది.

ఈనాటి సంస్కృతి క్షణికం. ఇప్పుడు చూసే సినిమా పూర్తయ్యేసరికి గుర్తు ఉండదు. ఈ రోజు చదివిన పుస్తకం రేపటికల్లా మరచిపోతాం. ఇవి తమ స్థానంలో మరో విజయవంత మైన, తాత్కాలిక ప్రదర్శనలకు చోటు వదిలి అదృశ్యమైపోతాయి. నేటి తరంలో సంస్కృతి అంటే వినోదం. వినోదాన్ని పంచనిదేదీ సంస్కృతి కాదు. జీవితంలో నిరంతరం ఎదురయ్యే సందిగ్ధతలకూ, సమస్యలకూ, ఎనిగ్మాలకూ సమాధానాలు ఇవ్వగలింది హయ్యర్‌ కల్చర్‌ మాత్రమేననీ, నేటి వినోద ప్రధానమైన సరదా సంస్కృతి ఆ ఖాళీని పూరించలేదనీ అంటారు లోసా. ఒకప్పుడు ఇంగ్లాండ్‌లో బెర్ర్టాండ్‌ రస్సెల్‌; ఫ్రాన్స్‌లో కామూ, సాత్రే; ఇటలీలో మొరావియా, విట్టోరినీ; జర్మనీలో గుంటర్‌ గ్రాస్‌, హన్స్‌ మాగ్నస్‌ ఎంజెంస్‌బర్గర్‌ లాంటి విద్యావంతులూ, మేధావులు ప్రముఖులుగా చలామణీ అయ్యేవారు. వీళ్ళందరూ రాజకీయ సామాజిక వ్యవహారాల్లో కీలకమైన పాత్ర పోషించేవారు. కానీ నేడు ఇటువంటి పండితులు పబ్లిక్‌ అఫైర్స్‌లోంచి తెరమరుగై పోయారు. కొందరు అడపాదడపా పత్రికలకు సంపాదకీయాలు రాస్తున్నా వాటి ప్రభావం నేటి సమాజం మీద అతి స్వల్పం. దీనికి కారణం dominant cultureలో జ్ఞానం కంటే వినోదానికీ, ఆలోచనలకంటే ఆకారానికీ, విలువైన విషయాల కంటే సాధారణ అంశాలకీ ప్రాధాన్యత పెరిపోవటమే.

ఈ వ్యాసాల్లో భాగంగా లోసాకి ఇష్టమైన ‘ఎరోటికా’ కూడా చర్చకు వచ్చింది. సెక్స్‌ పట్ల లోసా అభిప్రాయాలు చదివాకా ఆయన రచనల పట్ల ఉండే కొన్ని అపోహలు తొలగిపోయి ఆయనపై గౌరవం రెట్టింపైంది. ఎరోటిసిజం కూడా క్రిటిసిజం, హై కల్చర్‌లలాగే కనుమరుగై పోయిందంటారాయన. సెక్స్‌కు సంప్రదాయపు కట్టడి నుంచి స్వేచ్ఛను అందివ్వాలనే దిశగా చేస్తున్న ప్రయత్నాలు నిజంగానే మంచివా అనే దిశగా ఇందులో పలు విశ్లేషణలు ఉన్నాయి.

ఆధునిక సమాజంలో సెక్స్‌ గురించి బాహాటంగా, నిర్భీతిగా మాట్లాడుకోవాలనీ, అది చాటు మాటు వ్యవహారంగా ఉండడం సరికాదనే వాదనలు తరచూ వినిపిస్తున్నాయి. కానీ ఇటువంటి స్వేచ్ఛ ఒక ‘డివైన్‌ ఆక్ట్‌’ను సాధారణమైన పనిలా మార్చేస్తుందని అభిప్రాయపడతారు లోసా. నేటి తరానికి సెక్స్‌ ఒక డాన్స్‌ క్లాసుకో, జిమ్‌కో వెళ్ళడంతో సరిసమానంగా, కేవలం భౌతిక అవసరాలు తీర్చుకునే ఆటలా తయారైంది. ఇలా సెక్స్‌ను పనిగా మార్చడం వల్ల ఉపయోగం లేదంటారు లోసా. సెక్సువల్‌ లిబర్టీస్‌ పెరినా అభివృద్ధి చెందిన దేశాల్లో సైతం సెక్స్‌ క్రైమ్స్‌ ఏవీ తగ్గడం లేదు. పైపెచ్చు ప్రేమ, ఊహాత్మకత, భావోద్వే గాలకు తావులేని ‘లైట్‌ సెక్స్‌’ విపరీతంగా పెరింది. అటువంటి సెక్సువల్‌ ఆక్ట్‌ను పూర్తి instinctive and animal sexగా అభివర్ణి స్తారు లోసా. ఈ తరహా సెక్సువల్‌ ఆక్ట్‌ మనిషి భౌతికావసరాన్ని తీరుస్తుందిగానీ ఇంద్రియాలనూ, భావోద్వేగాలనూ తృప్తిపరిచి, మనుషుల్ని దగ్గర చేసి, జీవితాన్ని పరిపూర్ణం చెయ్యడంలో మాత్రం ఘోరంగా విఫలమవుతుంది. అందుకే సెక్స్‌ నేడు పోర్న్‌గా, బహిరంగ స్థలాల్లో చేసే చవకబారు ప్రదర్శనగా మిలిపోయింది.

లోసా ఈ రచనలో సంస్కృతి కనుమరుగవ్వడం పట్ల ఒక ఆర్టిస్టుగా కలవరాన్ని వ్యక్తం చేశారు. సంస్కృతిని కాపాడుకునే దిశగా నాగరికత తెలిసిన మనిషికి ఉండాల్సిన కనీస సామాజిక బాధ్యతలను గుర్తు చేసే ప్రయత్నం చేశారు. ఆయన విశ్లేషణలన్నీ స్థిరగంభీరమైన సాధికారక స్వరంలో, ఒక కళాకారుడిలో పేరుకున్న నిస్సహాయతతో కూడిన ఆగ్రహాన్ని ప్రతిబింబిస్తాయి. ఎలైట్‌ క్లాసులు అభివృద్ధి పేరిట కావాలని శీతకన్ను వేస్తున్న అంశాలన్నీ ఈ పుస్తకంలో చర్చకు వచ్చాయి. క్యాపిటలిస్టు కల్చర్‌లోని చీకటి కోణాలనూ, దుష్ప్రభావాలనూ ఈ వ్యాసాల ద్వారా వెలుగులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు లోసా.

Courtesy Andhrajyothi

Leave a Reply