అదనపు షాక్‌

0
135
  • వినియోగదారులపై ఏసీడీ చార్జీల పిడుగు
  • నెలవారీ విద్యుత్తు బిల్లుకు అదనంగా
  • మరో రెండు నెలల బిల్లు వసూలు
  • ఎన్పీడీసీఎల్‌ పరిధిలో మొదలు
  • ఏసీడీ చార్జీ చెల్లిస్తేనే నెలవారీ బిల్లు..
  • తీసుకుంటామంటున్న ట్రాన్స్‌కో సిబ్బంది
  • ప్రజల ఆగ్రహం.. అధికారుల నిలదీత
  • కామారెడ్డి జిల్లాలో సిబ్బంది నిర్బంధం
  • ఏసీడీ చార్జీ డిపాజిట్‌ మాత్రమే: సీఎండీ

విద్యుత్తు వినియోగదారులకు భారీ కరెంట్‌ షాక్‌. ఊహించని రూపంలో చార్జీల భారం వేసే విద్యుత్తు పంపిణీ సంస్థలు మరోసారి బాదుడుకు తెరతీశాయి. ఈసారి అదనపు వినియోగపు డిపాజిట్‌ (ఏసీడీ) పేరుతో వినియోగదారులపై భారీగా భారం మోపుతున్నాయి.

హైదరాబాద్‌ : ఉత్తర విద్యుత్తు పంపిణీ మండలి (ఎన్పీడీసీఎల్‌) ఏసీడీని అప్పుడే అమల్లోకి తెచ్చింది. జనవరి నెలకు సంబంధించిన బిల్లులోనే ఈ ‘అదనపు’ చార్జీని కూడా కలిపి జారీ చేసింది. నెలవారీ బిల్లుకు అదనంగా మరో రెండు నెలల బిల్లును చెల్లించాలని పేర్కొంది. దీంతో ఇదేం చార్జీయో తెలియక వినియోగదారులు అయోమయానికి గురవుతున్నారు. మరోవైపు ఏసీడీ చార్జీలు చెల్లిస్తేనే నెలవారీ బిల్లును తీసుకుంటామని సిబ్బంది చెబుతుండడంతో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కామారెడ్డి జిల్లా బ్రాహ్మణపల్లి గ్రామంలో వినియోగదారులు ఏకంగా బిల్లు వసూలుకు వచ్చిన సిబ్బందిని గ్రామపంచాయతీ కార్యాలయంలో నిర్బంధించారు.

ఏసీడీ అంటే..
సాధారణంగా ఎవరైనా విద్యుత్తు మీటరు కోసం మొదటిసారి దరఖాస్తు చేసే సమయంలో.. వినియోగించదలచిన విద్యుత్తు పరికరాల వివరాలను తీసుకొని వాటికి ఎన్ని కిలోవాట్ల విద్యుత్తువినియోగం జరుగుతుందో లెక్కగడతారు. ఆ మేరకు లోడ్‌ను పేర్కొంటూ విద్యుత్తు మీటర్‌ కనెక్షన్‌ జారీ చేస్తుంటారు. ఆ లోడ్‌కు సంబంధించి సెక్యూరిటీ డిపాజిట్‌(ఎ్‌సడీ)ను వినియోగదారుల నుంచి వసూలు చేస్తారు. అయితే ఆ తరువాత ఏదైనా విద్యుత్తు పరికరాన్ని అదనంగా వాడి లోడ్‌ పెరిగితే.. ప్రస్తుత డిజిటల్‌ మీటర్లలో ఆ అధిక లోడ్‌ నమోదవుతుంది. ఈ మేరకు అదనపు లోడ్‌కుగాను డెవల్‌పమెంట్‌ చార్జీని, కొంత సెక్యూరిటీ డిపాజిట్‌ను వసూలు చేసి దానిని క్రమబద్ధీకరిస్తారు. ఇప్పటిదాకా ఈ విధానం కొనసాగగా.. ఇప్పుడు సర్వీ్‌సపై తగినంత సెక్యూరిటీ డిపాజిట్‌ ఉండాలంటూ ఏసీడీ చార్జీ వసూలుకు నిర్ణయించారు. ఇందుకు గడిచిన సంవత్సరంలో ప్రతి నెలా వచ్చే విద్యుత్తు బిల్లు మొత్తం కలిపి సగటు బిల్లును నిర్ణయించి.. రెండు నెలల సగటు బిల్లులను ఏసీడీ కింద పరిగణిస్తారు.

అంటే ప్రస్తుత నెల వచ్చే విద్యుత్తు బిల్లుకు అదనంగా రెండు నెలల బిల్లును చెల్లించాలి. ఉదాహరణకు 2021-22 ఆర్థిక సంవత్సరంలో ఒక వినియోగదారుడు నెలకు రూ.1000 చొప్పున ఏడాదికి రూ.12 వేల బిల్లు గనుక చెల్లించి ఉంటే.. ఆ వినియోగదారుడి నుంచి గరిష్ఠంగా రెండు నెలల బిల్లు రూ.2000ను ఏసీడీ కింద విధిస్తారు. ఇలా.. ఆదిలాబాద్‌ పట్టణంలో ఓ వినియోగదారుడికి డిసెంబరు నెల వినియోగానికి కరెంటు బిల్లు రూ.2571 రాగా.. ఏసీడీ చార్జీల పేరుతో రూ.4222 అదనంగా వేశారు. అంటే ఈ నెల అతడు చెల్లించాల్సిన మొత్తం బిల్లు రూ.6793 చెల్లించాలన్నమాట. ఇక అదే పట్టణంలో మరో వినియోగదారుడికి రూ.800 బిల్లు రాగా.. ఏసీడీ చార్జీల పేరుతో మరో రూ.1500 బిల్లు వేశారు.

ఎన్పీడీసీఎల్‌ పరిధిలో వసూలు..
వరంగల్‌ కేంద్రంగా పనిచేస్తున్న ఎన్పీడీసీఎల్‌ పరిధిలో 16 జిల్లాల్లో 64 లక్షల మంది విద్యుత్తు వినియోగదారులున్నారు. వీరందరి నుంచి ఏసీడీ చార్జీలు వసూలు చేయాల్సిందిగా ఎన్పీడీసీఎల్‌ ఆదేశించింది. ప్రతి వినియోగదారుడికి కనీసం రూ.500 నుంచి రూ.2 వేల దాకా అదనపు భారం వేసింది. ఏసీడీ బిల్లు చెల్లిస్తే తప్ప నెలవారీ బిల్లు తీసుకోవడంలేదు. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో వినియోగదారులు చెల్లించాల్సివస్తోంది. ఒక్క నిజామాబాద్‌ జిల్లాలోనే.. ఇప్పటివరకు రూ.1.34 కోట్లు ఏసీడీ చార్జీల కింద వసూలు చేశారు. జిల్లాలో మొత్తం గృహ వినియోగదారుల సర్వీసులు 4లక్షల 60వేల 843 ఉండగా.. వీటిలో 3లక్షల 53వేల 237 సర్వీసులపై ఏసీడీ చార్జీల భారాన్ని ట్రాన్స్‌కో అధికారులు వేశారు. వీరి నుంచి రూ.22.12 కోట్లు వసూలు చేయాలని నిర్ణయించారు. ఇప్పటివరకు 22,462 సర్వీసు గృహ వినియోగదారుల నుంచి వసూలు చేశారు. ఈ నెలతోపాటు ఫిబ్రవరిలోనూ మొత్తం వసూలు చేయాలని సిబ్బందికి అధికారులు ఆదేశాలు జారీ చేశారు. జిల్లా వారీగా ఆయా మండలాలు, గ్రామాలు, మునిసిపాలిటీల వారీగా టార్గెట్‌లు నిర్ణయించి ఏఈల ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి మరీ.. ఏసీడీ చార్జీల వసూలు కార్యక్రమం చేపట్టారు.

వినియోగదారుల్లో అయోమయం..
చడీచప్పుడు లేకుండా జనవరి బిల్లులో ఏసీడీ పేరిట చార్జీల బాదుడుపై వినియోగదారులు ఆందోళనకు గురవుతున్నారు. ఏసీడీ బిల్లు అంటే ఏమిటో తెలియక విద్యుత్తు కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. తమకు నెలవారీ వాడకానికి రూ.వందల్లో బిల్లు వస్తే ఏసీడీ బకాయిల పేరుతో వేలల్లో వచ్చిందంటూ వాపోతున్నారు. సర్వీసు కనెక్షన్‌ తీసుకునేటప్పుడు ఇవేవీ చెప్పకుండా, అకస్మాత్తుగా భారం వేయడమేంటని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిబంధనల్ని తమకు వివరించకుండా విద్యుత్తు పంపిణీ సంస్థలు తీసుకున్న ఈ నిర్ణయంపై న్యాయస్థానానికి వెళతామని ఓ వినియోగదారుడు ఏకంగా ట్రాన్స్‌కో అధికారికి ఫోన్‌ చేసి మరీ చెప్పడం గమనార్హం. ఇదిలా ఉండగా ప్రభుత్వాలు నేరం చేసి.. ప్రజలను శిక్షిస్తున్నాయని విద్యుత్తు రంగ నిపుణులు అంటున్నారు. ప్రభుత్వ నిర్ణయాల ఫలితంగా డిస్కమ్‌లు దివాలా తీశాయని, డిస్కమ్‌లు రూ.60 వేల కోట్ల మేర నష్టాల్లో ఉన్నాయని గుర్తుచేస్తున్నారు. వ్యవసాయ వినియోగదారులకు ఇచ్చే కరెంట్‌కు పూర్తిస్థాయి చార్జీలు, ఎత్తిపోతలు, ఇతర పథకాలకు ఇచ్చే కరెంట్‌కు డబ్బులు వసూలు చేసుకోలేక ప్రజలపై పడుతున్నారని మండిపడుతున్నారు. రూ.20 వేల కోట్ల మేర ప్రభుత్వ శాఖల బకాయిలు ఉంటే.. ముక్కుపిండి బిల్లు వసూలు చేయాల్సిందని అంటున్నారు. ఉద్యోగులకు జీతాలు కూడా చెల్లించలేని పరిస్థితుల్లో వినియోగదారులపై రకరకాల బిల్లుల పేరుతో భారం వేస్తున్నారని ఆరోపిస్తున్నారు.

సిబ్బందిని నిర్బంధించిన వినియోగదారులు
విద్యుత్తు బిల్లులో ఏసీడీ అదనపు చార్జీలు వేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తూ కామారెడ్డి జిల్లాలోని పలు ప్రాంతాల్లో మంగళవారం ట్రాన్స్‌కో సిబ్బందిని నిర్బంధించారు. తాడ్వాయి మండలం బ్రాహ్మణపల్లిలో బిల్లులు వసూలు చేసేందుకు ట్రాన్స్‌కో సిబ్బంది వెంకట్‌, శంకర్‌, వెంకట్‌ రాగా.. పలువురు వినియోగదారులు ఏసీడీ చార్జీల విషయమై నిలదీశారు. వేలాది రూపాయల్లో వచ్చిన బిల్లులను తాము కట్టేది లేదని తెగేసి చెప్పారు. దీంతో ట్రాన్స్‌కో సిబ్బంది.. ప్రభుత్వ ఆదేశాలను తాము అమలు చేస్తున్నామని, ఏసీడీ చార్జీలను కచ్చితంగా చెల్లించాల్సిందేనని, లేదంటే విద్యుత్తు సరఫరా నిలిపివేస్తామని తెలిపారు. దీంతో ఆగ్రహం చెందిన గ్రామస్థులు వారిని గ్రామ పంచాయతీ కార్యాలయంలో నిర్బంధించారు. రాష్ట్ర ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రెండు గంటల తర్వాత వారిని వదిలేశారు.

దొడ్డిదారిన వసూలు చేస్తున్నారు
విద్యుత్తు అధికారులు గతంలోనే డెవల్‌పమెంట్‌ చార్జీలంటూ వసూలు చేశారు. మళ్లీ ఇప్పుడు దొడ్డిదారిన ఏసీడీ పేరిట మరింత భారం మోపుతున్నారు. మాకు ప్రతి నెలా రూ. రూ.500-600 వరకు బిల్లు వచ్చేది. ఈ నెల బిల్లుతో కలిపి అదనంగా ఏసీడీ చార్జీలు రూ.1250 వేశారు.
– భూమేశ్వర్‌, వినాయక్‌నగర్‌, నిజామాబాద్‌

ఏసీడీ పేరుతో భారీగా భారం
మాకు ప్రతి నెలా ఇంటి బిల్లు రూ.350 నుంచి రూ.500 మధ్య వస్తుంది. జనవరి బిల్లు రూ.347 రాగా ఏసీడీ చార్జీ మాత్రం రూ.3620 వేశారు. ఇంత బిల్లును ఎలా కట్టాలి!? ప్రభుత్వం మరీ ఇంత దారుణంగా వ్యవహరించడం సరి కాదు.
– బర్కి సుధాకర్‌, నందిపేట, నిజామాబాద్‌

Leave a Reply