- ‘దళితబంధు’లో ఎమ్మెల్యేల అనుచరుల దందా
- రెండో విడత లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ ప్రారంభమవకముందే బేరసారాలు
- అడిగిన మొత్తాన్ని ఇస్తేనే జాబితాలో పేరు..
- లేదంటే కుదరదని తేల్చి చెబుతున్న వైనం!
- మొదటి విడతలోనూ ఇదే తరహాలో వసూళ్లు
- రాష్ట్రవ్యాప్తంగా కొనసాగుతున్న నిరసనలు
- మంత్రులు, పార్టీ నేతల ఇళ్ల ముందూ దళితుల ఆందోళనలు
హైదరాబాద్ : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన ‘దళిత బంధు’ పథకం లబ్ధిదారులకంటే కొందరు ఎమ్మెల్యేల అనుచరులకు బాగా ‘ఉపయోగకరంగా’ మారిందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. మొదటి విడతలో పలువురు లబ్ధిదారుల నుంచి రూ.లక్షల్లో వసూలు చేసిన ఎమ్మెల్యేల అనుచరులు తాజాగా రెండో విడతకు బేరసారాలు ప్రారంభించారన్న ఆరోపణలు వస్తున్నాయి. సీఎం కేసీఆర్ అధ్యక్షతన ఇటీవల జరిగిన క్యాబినెట్ సమావేశంలో రెండో విడతలో 1500 మంది లబ్ధిదారుల ఎంపికపై చర్చ జరిగింది. ఇటీవల ప్రభుత్వం ఈ పథకానికి రూ.600 కోట్లు విడుదల చేసింది. ఈ నేపథ్యంలో దళిత బంధు రెండో విడత అర్హుల ఎంపిక ఏ క్షణమైనా ప్రారంభం అవుతుందని ప్రచారం చేస్తున్న కొందరు ఎమ్మెల్యేల అనుచరులు బేరసారాలు మొదలుపెట్టారు. మొదటి విడతలో తాము చెప్పిన వారికే లిస్ట్‌లో పేరు దక్కిందని చెప్పి రెండో విడత ఎంపిక ప్రక్రియ ప్రారంభమవకముందే వసూళ్లకు తెరతీశారు. రూ.10 లక్షల ఆర్థిక సహాయం అందుతుందనే ఆశతో కొందరు అడిగిన మొత్తం ఇచ్చేందుకు ముందుకు వస్తున్నారు. దీంతో ఇదే అదనుగా రూ.10 లక్షల దళిత బంధు ఆర్థిక సహాయం కావాలంటే రూ.2 లక్షలు చెల్లించాల్సిందేనని డిమాండ్ చేస్తున్నారు. అడిగినంత ఇవ్వకుంటే లిస్ట్‌లో పేరు ఉండదని తెగేసి చెబుతున్నారు.
రెండో విడత దళిత బంధుకు ఎమ్మెల్యేల వద్దకు ఇప్పటికే పెద్ద సంఖ్యలో దరఖాస్తులు వచ్చి చేరుతున్నాయి. ఈ పథకం లబ్ధిదారుల ఎంపికలో ఎమ్మెల్యేలదే తుది నిర్ణయం కావడంతో దళితులు ఆధార్ నంబరు సహా తమ పూర్తి వివరాలతో దరఖాస్తు చేసుకుంటున్నారు. ఎమ్మెల్యే రూపొందించే అర్హుల జాబితా జిల్లా ఇన్‌చార్జి మంత్రి ఆమోదంతోనే అధికారుల వద్దకు చేరుతుంది. మొదటి విడతలో 60 శాతం మంది అధికార పార్టీ కార్యకర్తలు, నాయకులే పథకాన్ని దక్కించుకోగా.. 40 శాతం మందిని పార్టీకి అతీతంగా ఎంపిక చేశారు. ప్రస్తుతం ఇతరులను ఎంపిక చేసేందుకు ప్రాధాన్యం ఇవ్వాలని ఎమ్మెల్యేలు భావిస్తున్న తరుణంలో వారి అనుచరులు ‘రేటు’ పెంచేసి, దొరికిన కాడికి దోచుకునేందుకు సిద్ధమయ్యారు. వాస్తవానికి ఏప్రిల్ నుంచి దళిత బంధు రెండో దశ లబ్ధిదారుల ఎంపిక ప్రారంభం కావాల్సి ఉన్నా.. ఇప్పటి వరకు అది మొదలు కాలేదు. ఎప్పటికప్పుడు త్వరలోనే ప్రారంభం అవుతుందని ప్రకటిస్తున్నారు. దీంతో రెండో విడతపై ఆశ పెట్టుకున్న దళితులతో ఎమ్మెల్యేల అనుచరులు బేరసారాలు జరుపుతున్నారు.
మొదటి విడతలోనూ ఇదే తంతు..
దళిత బంధు జాబితాలో పేరు ఉండాలంటే అడిగిన కాడికి ఇవ్వాల్సిందేనంటూ కొన్ని చోట్ల ఎమ్మెల్యేల అనుచరులు డిమాండ్ చేయడంతో రూ.లక్ష నుంచి 2 లక్షల వరకు అప్పులు తెచ్చి మరీ ముట్టచెప్పారు. వారడిగిన డబ్బులిచ్చి సంవత్సరం కావస్తున్నా.. ఇప్పటికీ దళిత బంధు అందకపోవడంతో రుణదాతల ఒత్తిడి పెరగడంతో పాటు వడ్డీ కూడా తడిసి మోపెడవుతోందని దళితులు వాపోతున్నారు. మొదటి విడతలో హుజూరాబాద్, వాసాలమర్రితోపాటు మరో నాలుగు మండలాల్లో అన్ని దళిత కుటుంబాల్లో లబ్ధిదారులను ఎంపిక చేయగా, ఇతర ప్రాంతాల్లో ఒక్కో నియోజకవర్గం నుంచి 100 మందిని ఎంపిక చేశారు. లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ మొత్తం ఎమ్మెల్యేల కనుసన్నల్లో నడవడంతో జిల్లాల్లో కొన్ని చోట్ల వారి అనుచరులు వసూళ్లకు పాల్పడ్డారు. దళిత బంధు ద్వారా రూ. 10 లక్షల ఆర్థిక సహాయం అందుతుండటంతో అవకాశాన్ని బట్టి రూ. 2 లక్షల వరకు వసూలు చేశారు.
రాష్ట్రవ్యాప్తంగా నిరసనల సెగ..
దళిత బంధుకు డబ్బుల వసూలు, అనర్హుల ఎంపికపై రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తమయ్యాయి. కొన్ని చోట్ల ఏకంగా దండోరా వేయించి మరీ నిరసనలు వ్యక్తం చేశారు. మరికొన్ని చోట్ల ప్రజాప్రతినిధులు, అధికారులను అడ్డుకున్నారు. నిర్మల్‌లోని గొల్లమాడకు చెందిన దళితులు అనర్హుల్ని దళిత బంధుకు ఎంపిక చేశారంటూ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి ఇంటి వద్ద ఇటీవల నిరసన తెలిపారు. గ్రామంలో సర్వే నిర్వహించి అర్హులైన వారిని ఎంపిక చేయాలని డిమాండ్ చేశారు. దళిత బంధుకు అనర్హుల ఎంపికపై కలెక్టర్ కార్యాలయంలోనూ ఫిర్యాదు చేశారు.
అసంపూర్తిగా యూనిట్లు..
దళిత బంధు లబ్ధిదారులకు అధికారులు దశలవారీగా నిధులు విడుదల చేస్తున్నారు. యూనిట్ల గ్రౌండింగ్‌కు జరుగుతున్న పనుల మేరకు నిధులు విడుదల చేస్తున్నామని అధికారులు చెబుతున్నా.. మొదలు పెట్టిన పనులకు నిధులు ఇవ్వకపోవడంతో మధ్యలోనే నిలిచిపోయాయని లబ్ధిదారులు వాపోతున్నారు. పశువుల యూనిట్లు ఏర్పాటు చేసుకునేందుకు షెడ్లు నిర్మించుకున్న వారికి మిగతా మొత్తం నిధులు అందని పరిస్థితి నెలకొంది. దుకాణాలకు అడ్వాన్సులు చెల్లించిన వారు మిగతా మొత్తం అందక ఖాళీ దుకాణాలకే అద్దెలు కడుతున్నారు. ఉన్న ఉపాధిని వదిలి వచ్చిన వారు తిరిగి పనుల్లో చేరుతున్నారు. హైదరాబాద్ జిల్లాలో ఇప్పటివరకు 1200 మందికి యూనిట్లను పంపిణీ చేశారు. మరో 254 మందికి నెల రోజుల్లోపు అందజేయనున్నట్లు అధికారులు చెబుతున్నారు. సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మండలంలో 2223 మందికిగాను 2002 మంది ఖాతాల్లో నగదు జమకాగా కేవలం 745 యూనిట్లు మాత్రమే గ్రౌండ్ అయ్యాయి. నిజాంసాగర్ మండలంలో 1298 మంది లబ్ధిదారుల్ని ఎంపిక చేయగా 1268 మంది ఖాతాల్లో నగదు జమకాగా 1268 యూనిట్లు గ్రౌండ్ అయ్యాయి. ఖమ్మం జిల్లా చింతకాని మండలంలో 3462 మంది లబ్ధిదారుల్ని ఎంపిక చేసిన అధికారులు 3320 మంది ఖాతాల్లో జగదు జమచేయగా 3314 యూనిట్లు గ్రౌండ్ అయ్యాయి. నాగర్‌కర్నూల్ జిల్లా చారగొండ మండలంలో 1407 మంది లబ్ధిదారుల్ని ఎంపిక చేసి 1373 మంది ఖాతాల్లో నగదు జమచేయగా అదే స్థాయిలో యూనిట్లు గ్రౌండ్ అయ్యాయి.
మరో నెలలో పూర్తి చేసేందుకు గడువు..
దళిత బంధు మొదటి విడత మరో నెల రోజుల్లో పూర్తి చేసేందుకు ఎస్సీ కార్పొరేషన్ అధికారులు చర్యలు చేపట్టారు. ప్రభుత్వం ప్రకటించిన మేరకు గత మార్చి 31తోనే దళిత బంధు మొదటి విడత పూర్తి కావాల్సి ఉంది. కానీ, ఇప్పటి వరకు పూర్తిస్థాయిలో యూనిట్లు గ్రౌండింగ్ కాలేదు. ఇటీవల సీఎం కేసీఆర్ నిర్వహించిన సమీక్షలో నెల రోజుల్లో దళిత బంధు మొదటి విడత యూనిట్ల గ్రౌండింగ్ పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు. సీఎం ఆదేశాల నేపథ్యంలో ఇప్పటి వరకు లబ్ధిదారుల ఖాతాల్లో నిధులు జమచేసిన అధికారులు ఇప్పుడు యూనిట్ల గ్రౌండింగ్‌పై దృష్టి సారించారు.