- గ్రామానికి ఒకరికి కూడా దళితబంధు రాని పరిస్థితి..
- తక్కువ మంది ఉన్న గ్రామాలను ఎంపిక చేయాలని నిర్ణయం
- తమకు ముందుగా వర్తింపజేయాలని దివ్యాంగుల విన్నపం
- ఎంపిక చేసిన చోట్ల ఆందోళనలు
హైదరాబాద్ : దళితబంధు లబ్ధిదారుల ఎంపిక ప్రజాప్రతినిధులు, అధికారులకు తలనొప్పిగా మారింది. తొలి విడతలో నియోజకవర్గానికి వంద మందిని ఎంపిక చేయాల్సి ఉంది. ఏ ప్రాతిపదికన ఎంపిక చేయాలో అర్థం కాక వారు తలలు పట్టుకుంటున్నారు. ఒక్కో నియోజకవర్గంలో వందకు పైగా గ్రామాలున్నాయి. గ్రామానికొక్కరికి కూడా ఎంపిక చేయలేని పరిస్థితి నెలకొంది. మరో పక్క ప్రభుత్వానికి శనివారంలోగా జాబితా ఇవ్వాలి. అయినా ఇంకా ఎక్కడా ఎంపిక ప్రక్రియ పూర్తి కాలేదు. ప్రజాప్రతినిధులు, అధికారులు దళిత బంధు అవగాహన సదస్సులు నిర్వహించారు. లబ్ధిదారులు అధిక సంఖ్యలో ఉండటంతో ఎవరిని ఎంపిక చేస్తే ఏమి సమస్యలు వస్తాయోనని ప్రజాప్రతినిధులు ఆందోళన చెందుతున్నారు. చివరికి సమస్యను అధిగమించేందుకు దళిత కుటుంబాల సంఖ్య తక్కువగా ఉన్న గ్రామాల్ని ఎంపిక చేయాలని నిర్ణయించారు.
ఆ గ్రామాల్లో మొదటి దశలో ఎంపిక చేేస్త తర్వాత మిగతా గ్రామాలకు విస్తరింపజేయ వచ్చని భావిస్తున్నారు. ఇలా చేయడం వల్ల గ్రామాల్లో ఒకరికి వచ్చి మరొకరికి రాలేదనే విమర్శలు, రాజకీయ ఇబ్బందుల్ని అధిగమించవచ్చనేది వారి ఆలోచన. పథకం గ్రౌండింగ్‌లో రోజుకో సమస్య ఎదురవుతుండగా ఇప్పుడు తాజాగా దళిత దివ్యాంగుల అంశం తెరపైకి వచ్చింది. విధి చిన్నచూపు చూసిన తమను ప్రభుత్వం ఆదుకోవాలని వారు కోరుతున్నారు. దళిత బంధు సహాయం ముందుగా తమకే ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తున్నారు. కనీసం ఇతర ప్రభుత్వ పథకాల్లో ఇచ్చినట్లుగా 5ు రిజర్వేషన్ అయినా అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. వికలాంగులకు రిజర్వేషన్ అమలుపై ప్రత్యేక కార్యదర్శి దివ్య దేవరాజన్‌కు వినతి పత్రం అందజేశామని అఖిల భారత వికలాంగుల హక్కుల వేదిక జాతీయ అధ్యక్షుడు కొల్లి నాగేశ్వర రావు తెలిపారు. ఈ సమస్యలన్నింటి నేపథ్యంలో లబ్ధిదారుల ఎంపికకు మరింత సమయం పట్టేలా ఉంది.
ఎక్కడో ఒక చోట లబ్ధిదారుల ఎంపిక పూర్తయినా స్థానికంగా ఆందోళనలు జరుగుతున్నాయి. వికారాబాద్ జిల్లా పెద్దేముల్ మండలం జనగాంలో ఎంపిక చేసిన లబ్ధిదారుల జాబితాను రద్దు చేయాలని గ్రామంలోని అర్హులందరికీ అవకాశం కల్పించాలని దళితులు ఆందోళన చేశారు. అధికారులను అడ్డుకోవటంతో పోలీసులు జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. గ్రామానికి 15 యూనిట్లు మంజూరు కాగా శుక్రవారం తహసీల్దార్ పహీం ఖాద్రీ, ఎంపీడీవో లక్ష్మప్ప లబ్ధిదారుల విచారణకు వచ్చారు. ఈ సందర్భంగా యూనిట్లు మంజూరు కాని గ్రామానికి చెందిన ఇతర దళితులు వారిని అడ్డుకున్నారు. ఎలాగోలా పోలీసులు అధికారులను అక్కడి నుంచి పంపించాక తహసీల్దార్ కార్యాలయం వద్ద ఆందోళనకు దిగారు.
Courtesy Andhrajyothi