దళితబిడ్డలకు దిక్కెవరు!

0
213

– మొన్న యూపీ.. ఇపుడు ఢిల్లీలో దారుణం
– హై సెక్యురిటీజోన్‌లో చిన్నారులకు రక్షణ కరువు : నోరువిప్పని కేంద్రహోంమంత్రి అమిత్‌షా
– లైంగికదాడుల్ని నిరోధించటమే కాదు. ఆడపిల్లలు.మహిళల రక్షణ ధ్యేయంగా పనిచేస్తాం.. – 2014 సార్వత్రిక ఎన్నికల్లో మోడీ

దేశంలో దళితులకు రక్షణ లేకుండా పోయింది. హై సెక్యురిటీ జోన్‌ అయిన ఢిల్లీలోనే తొమ్మిదేండ్ల చిన్నారిపై అతి పైశాచికంగా లైంగికదాడి.. కొద్ది సేపటి తర్వాత శవాన్ని తగలబెట్టేశారు. విచారణ జరపటానికి ఆనవాళ్లు లేకుండా నిందితులు దారుణానికి ఒడిగట్టారు. యూపీలోని హత్రాస్‌లో దళిత బాలిక(గుడియా)పై దారుణానికి పాల్పడి.. పోలీసులే దగ్గరుండి ఆమె మృతదేహాన్ని కాల్చి బూడిదచేశారు. తలిదండ్రులు విలపిస్తూ…కడసారి గుడియాను చూసుకుంటామన్నా.. రాత్రికి రాత్రి బూడిద చేశారు. ఢిల్లీలో జరిగిన దారుణాన్ని చూస్తే..నిర్భయపై జరిగిన హత్యాచారం గుర్తుకొస్తున్నది.

న్యూఢిల్లీ : దేశరాజధాని ఢిల్లీలో తొమ్మిదేండ్ల చిన్నారిపై దారుణం జరిగితే..ముగ్గురు పండితులు బలవంతంగా దహనసంస్కారాలు నిర్వహించినట్టు మీడియా కథనాలు వెల్లువెత్తుతున్నాయి. ఇంతటి ఘోరం జరిగినా… సమాజంలో ఎలాంటి ఆక్రోశం కనిపించటంలేదు.నిర్భయ ఘటన జరిగినపుడు సమాజమంతా ఒక్కటై బాధితురాలికి అండగా నిలిచింది. మరిపుడెందుకని అలాంటి పోరాట పటిమ కనిపించటంలేదనే ప్రశ్న తలెత్తుతున్నది.

న్యూస్‌లాండ్రీ వెబ్‌ పత్రికకు ఇచ్చిన ఇంటర్వూలో బాధితురాలి తల్లి చెప్పిన వివరాలు…నేను లోపలికి వెళ్లి చూడగా..నా బిడ్డ విగతజీవిలా పడిఉన్నది. పెదాలు కొరికి ఉన్నాయి. నాలుక ఊదా రంగులో కనిపించింది. కండ్లు మూసుకుందామని ఆమె ప్రయత్నిస్తున్నా..అలా సాధ్యంకావటంలేదు.కుడి చేయిపై గాయం ఉన్నది. అచేతనంగా పడిఉన్న బిడ్డ సరిగా చూడలేకపోతున్నది..

దీన్నిబట్టి తనపై జరిగిన సామూహిక అఘాయిత్యంతో ఆ బిడ్డ ఎంతగా తల్లడిల్లిపోయి ఉంటుందో చెప్పలేనంతగా నిందితులు దారుణానికి పాల్పడ్డారు. దోషులుగా గుర్తించిన వారిలో ఒకరు పూజారిగా ఉండటం గమనార్హం. అంతేకాదు బిడ్డపై సామూహిక దారుణానికి పాల్పడ్డ దోషులు 20 వేలు లంచమిచ్చి.. పోలీసులకు చెప్పవద్దని బెదిరించారు.

ఇలాంటి నేరాలు,ఘోరాలు జరుగుతుంటే.. మనం ఏ సమాజంలో బతుకుతున్నామని మష్తిష్కంలో మెదులు తున్నది. సామూహిక లైంగికదాడికి పాల్పడ్డ వారు 51 ఏండ్ల నుంచి 63 ఏండ్ల దాకా ఉన్న వారు ఈ దారుణానికి పాల్పడితే..అఘాయిత్యానికి గురైన దళిత బాలిక వయసు కేవలం తొమ్మిదేండ్లు మాత్రమే.

అమ్మాయిని కోల్పోయి బాధలోఉంటే..
ఘటనా జరిగినపుడు మార్కెట్లో ఉన్నా..నాకు సాయంత్రం 7.30 గంటలకు తెలిసింది. అపుడు నా బిడ్డ శవం తగలబడుతున్నది. విషయం తెలిసి పరుగున వెళ్తే..ఒకతను నన్ను పట్టుకుని పిడిగుద్దులు కురిపించాడు. పోలీసులకు ఎక్కడ చెబుతానోనని నా మీద తెగబడ్డాడు. ఈ 20 వేలు తీసుకుని గమ్మునుండు. అని చెప్పినట్టు బాలిక తండ్రి వాపోయాడు. ఆ డబ్బులు తీసుకోవటానికి నిరాకరించినట్టు తెలిపాడు. దోషికి ఉరిశిక్ష విధించాలని డిమాండ్‌ చేశాడు. హత్రాస్‌లో రాత్రికి రాత్రి గుడియాపై దారుణం జరిగితే ..’అలాంటిదేమీ లేదని లా అండ్‌ ఆర్డర్‌ డీజీ బుకాయించే ప్రయత్నం చేశాడు. యోగి సర్కార్‌ దళితమహిళపై జరిగిన దారుణాన్ని కప్పిపెట్టడానికి ఎంతగానో ప్రయత్నించింది. అయితే ప్రతిపక్షాలు, సోషల్‌ మీడియాలో భగ్గుమన్నాక..మోడీ సర్కార్‌ సీబీఐని రంగంలోకి దింపింది. హత్రాస్‌లో గ్యాంగ్‌రేప్‌ జరిగిందని నిర్ధారించింది. ముందు లైంగికదాడి, ఆ తర్వాత గుడియాను తగలబెట్టారని సీబీఐ దర్యాప్తులో తేలింది.

ఢిల్లీ ఘోరంపై ప్రతిపక్షాలు పార్లమెంట్‌లో గళం విప్పాయి. కేంద్రహౌం శాఖ మంత్రి అమిత్‌ షా సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశాయి. కానీ ఇలాంటి ఘటనలు జరిగినపుడు అమిత్‌షా గైర్హాజరవ్వటం సర్వసాధారణమేనన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఢిల్లీ లాఅండ్‌ ఆర్డర్‌ అంతా అమిత్‌షా చేతుల్లోనే ఉన్నది. దీనిపై సీపీఐ(ఎం)పొలిట్‌ బ్యూరో సభ్యురాలు బృందాకరత్‌, రాహుల్‌ గాంధీ, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌, భీమ్‌ ఆర్మీ ఇలా మరెందరో నిలదీస్తున్నారు. బాధిత కుటుంబాన్ని పరామర్శించి..వారికి అండగా నిలుస్తామని భరోసా ఇచ్చారు. మరోవైపు అమిత్‌షా యూపీ పర్యటనకు వెళ్లి.. యోగి లా అండ్‌ ఆర్డర్‌ బాగుందని కితాబిచ్చారు. వాస్తవానికి దళిత బాలిక గుడియా, గుడిలోనే ఓ వృద్ధమహిళపై దారుణానికి పాల్పడి..ఆమెను తెచ్చి ఇంటిముందు పడేశారు. ఇలాంటి దారుణాలు కేంద్రహౌంమంత్రి కండ్లకు కనిపించలేదా..? అని సమాజం ప్రశ్నిస్తున్నది.

సమాజంలో ఇలాంటి ఘోరాలు జరిగినపుడు బాధితపక్షాన నిలవకుండా బీజేపీ ప్రభుత్వం దోషులకు అండగా నిలుస్తుందనటానికి కాశ్మీర్‌లోని కథువాలో 8 ఏండ్ల చిన్నారిపై జరిగిన దారుణమే ఒక ఉదాహరణగా చెప్పవచ్చు. అప్పటి సంకీర్ణ ప్రభుత్వంలోని ఇద్దరు బీజేపీ మంత్రులు దోషులకు అండగా నిలిచారు. ప్రదర్శనలు నిర్వహించారు.ఇక ఢిల్లీలో జరిగిన దారుణంపై పరదా కప్పేందుకు మోడీ సర్కార్‌ పరోక్షంగా సహకరిస్తున్నది. ఇప్పటికే ఆ బాలికపై నిందారోపణలు సామాజిక మాధ్యమాల్లో షురూ చేసింది. ఎవరైనా ఇదెక్కడి దారుణ మని ప్రశ్నిస్తే.. ప్రభుత్వాన్ని నిలదీస్తారా..? రాజద్రోహం కేసులు పెట్టండని బీజేపీ ప్రభుత్వం పురమాయిస్తున్నది. జాతీయత పేరుతో హిందూత్వముసుగులో ఎన్నో దారుణాలకు ఒడిగడుతున్నది.మన మధ్య ఢిల్లీలో సామూహిక దారుణానికి బలైన తొమ్మిదేండ్ల దళిత చిన్నారి, హత్రాస్‌లో కాలిబూడిదైన మరో చిన్నారి మనమధ్యలేక పోయినా.. చనిపోయిక వారిపై బురదజల్లే ప్రయత్నాలు చేస్తుంటే..మనం ఏ సమాజంలో బతుకుతున్నాం. దీన్ని నాగరిక సమాజమనాలా..లేక ఆటవిక సమాజమనాలో నిర్ణయించుకోవాల్సింది దేశ ప్రజలే.

ఈ ప్రశ్నలకు జవాబేది..?
– దళిత బాలికలపై దారుణాలు జరుగుతుంటే సభ్యసమాజం నిస్తేజంగా ఉంటుందా..?
– దేశంలో హత్రాస్‌ లాంటి హత్యాచారాలకు అంతం లేదా..?
– నిర్భయ ఘటన జరిగినపుడు దేశమంతా భగ్గుమన్నది. మరి తొమ్మిదేండ్ల దళిత బాలికపై హత్యాచారం జరిగితే సైలెంటా..?
– అప్పటి ప్రభుత్వం, పౌరసమాజం బాధితురాలికి అండగా నిలిచింది. ఇప్పుడెందుకని స్పందించటంలేదు..?

Courtesy Nava Telangana

Leave a Reply