దళితునిపై పెత్తందారుల దాష్టీకం

0
108
  • ఆస్పత్రిలో వారం తర్వాత మృతి
  • నిందితులను శిక్షించాలని దళిత సంఘాల ఆందోళన

బైరెడ్డిపల్లి (చిత్తూరు) :చిత్తూరు జిల్లాలో పెత్తందార్ల దాష్టీకానికి దళితుడు బలయ్యాడు. వారం రోజులుగా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందాడు. జిల్లాలోని పడమటి మండలాల్లో ‘వివక్ష’ వేళ్లూనుకునే ఉందనడానికి బైరెడ్డిపల్లి మండలం ధ్యానాభిరామ బ్రహ్మోత్సవాల సందర్భంగా జరిగిన ఈ ఘటన నిదర్శంగా నిలుస్తోంది. దళితుల కథనం ప్రకారం… బైరెడ్డిపల్లి గ్రామంలో ధ్యానాభిరామ బ్రహ్మోత్సవాలు వారం రోజుల క్రితం జరిగాయి. గతంలో కరపత్రంలో నిర్వాహకుల పేర్లలో దళితుల పేర్లూ ముద్రించేవారు. ఈసారి దళితుల పేర్లు లేకపోవడంతో మాజీ సర్పంచ్‌ రామప్ప కుమారుడు అంజప్ప స్థానిక పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. దీంతో, పెత్తందారులు ఆగ్రహించి దళితుడైన అంజప్పపై కర్రలు, చేతులతో విచక్షణా రహితంగా దాడి చేశారు. దీంతో, తీవ్రగాయాలపాలైన ఆయనను కుటుంబీకులు పలమనేరు ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. వారం రోజుల పాటు మృత్యువుతో పోరాడి మరణించాడు. దళితుడిపై దాడి చేసిన పెత్తందార్లపై పోలీసులు నేటికీ కేసు నమోదు చేయలేదు. అంజప్ప కుటుంబాన్ని ఆదుకోవాలని, ఆయన మృతికి కారణమైన పదిమంది పెత్తందారులను కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేస్తూ బైరెడ్డిపల్లి, పలమలేరు, చిత్తూరులో దళిత, ప్రజాసంఘాల జెఎసి ఆధ్వర్యంలో ధర్నా జరిగింది. ఎస్‌సి, ఎస్‌టి అట్రాసిటీ కేసు నమోదు చేసి, 307 సెక్షన్‌ కింద కేసు నమోదు చేయాలని వక్తలు డిమాండ్‌ చేశారు.

పెత్తందారులను వెంటనే అరెస్టు చేయాలి : కెవిపిఎస్‌
దళితుని కొట్టి చంపిన పెత్తందారులను వెంటనే అరెస్టు చేయాలని కెవిపిఎస్‌ జిల్లా అధ్యక్షులు ఈశ్వర్‌, పలమనేరు మండల అధ్యక్ష, కార్యదర్శులు భాస్కర్‌, సుబ్రమణ్యం డిమాండ్‌ చేశారు. రాజకీయ ఒత్తిళ్లకు తలగ్గకుండా నిష్పక్షపాతంగా విచారణ జరిపి దోషులను కఠినంగా శిక్షించాలని కోరారు. మృతుని కుటుంబానికి రూ.50 లక్షల పరిహారంతో పాటు, ఒకరికి ఉద్యోగం, ఐదు ఎకరాల వ్యవసాయ భూమి, పక్కా గృహం నిర్మించి ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. అంజప్ప కుటుంబాన్ని ఆదుకోవాలని సిపిఎం పశ్చిమ కమిటీ జిల్లా కార్యదర్శి వాడా గంగరాజు కోరారు. మృతికి కారణమైన వారిని వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్‌ చేశారు.

Courtesy Prajashakti

Leave a Reply