గ్రామ ప్రథమ పౌరురాలు బోనాల ఉత్సవాల్లో దేవుడికి కొబ్బరికాయ కొట్టేందుకు వెళ్లగా.. పెత్తందారులు అడ్డుకొని దాడి చేశారు. ”మా దేవునికి నువ్వెలా కొబ్బరికాయ కొడతావ్” అంటూ సర్పంచ్ దంపతులపై దాడి చేశారు. దాంతో గర్భిణి అయిన దళిత సర్పంచ్ తీవ్ర అస్వస్థతకు గురికావడంతో వెంటనే ఆస్పత్రికి తరిలించారు. ఆమె భర్తకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ మేరకు సర్పంచ్ భర్త కుమార్ ఇబ్రహీంపట్నం పోలీసులకు ఫిర్యాదు చేశారు. అందుకు సంబంధించిన వివరాలు.. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం, తుర్కగూడలో ఈనెల 18వ బోనాల పండుగ జరిగింది. గ్రామ సర్పంచ్ కత్తుల పవిత్రకుమార్ బోనాల ఉత్సవాలకు అన్ని ఏర్పాట్లు చేశారు.సంప్రదాయం ప్రకారం.. పోచమ్మకు గ్రామ ప్రథమపౌరుడు టెంకాయ కొట్టడం ఆనవాయితీ. అందులో భాగంగానే సర్పంచ్ కత్తుల పవిత్ర, భర్త కుమార్‌తో కలిసి కొబ్బరికాయ కొట్టేందుకు పోచమ్మ ఆలయానికి వెళ్లారు. అక్కడ వారిని పెత్తందారులు అడ్డుకున్నారు. ”మా ఆలయంలో దళితులైన మీరు ఎలా కొబ్బరికాయ కొడతారు” అంటూ జయేందర్‌రెడ్డి, తిరుమల్‌రెడ్డి, మారుతిరెడ్డి, నరేందర్‌రెడ్డి, జనార్దన్‌రెడ్డి, రాంరెడ్డి, సుధాకర్‌రెడ్డి తదితరులు అడ్డుకున్నారు. దాంతో సర్పంచ్ దంపతులకు వారికి మధ్య తోపులాట జరిగింది. గర్భిణీ అయిన సర్పంచ్ పవిత్రకు ఆ తోపులాటలో తీవ్ర గాయమై స్పృహ తప్పి పడిపోయింది. ఆమె భర్త చొక్కా పూర్తిగా చినిగిపోయింది. పవిత్రను వెంటనే స్థానికులు ఆస్పత్రికి తరలించారు. మాల, మాదిగలు తమ గుడి వద్ద కొబ్బరికాయ కొట్టే అధికారం లేదని అడ్డుకోవడమే కాకుండా.. తమను కులం పేరుతో దూషించారని సర్పంచ్ భర్త కుమార్ ఇబ్రహీంపట్నం పోలీసులకు ఫిర్యాదు చేశారు. గ్రామస్తులు పెత్తందారులను ఎంత వారించినా వినకుండా దాడి చేశారని సర్పంచ్ వాపోయారు. తమ పట్ల దురుసుగా వ్యవహరించి దాడి చేసిన పెత్తందారులపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు.
ఆధునిక సమాజంలోనూ వివక్ష : కేవీపీఎస్ జిల్లా కార్యదర్శి సామెల్
ఆధునిక యుగంలోనూ దళితులపై వివక్ష కొనసాగడం హేయమైన చర్యని కేవీపీఎస్ జిల్లా కార్యదర్శి సామెల్, నాయకులు విజ్ఞేష్ ఆందోళన వ్యక్తం చేశారు. దళిత సర్పంచ్ ఆలయంలో కొబ్బరికాయ కొట్టకుండా అడ్డుకోవడం చట్టరీత్యా నేరమన్నారు. ప్రతి ఒక్కరికీ ఆలయంలో కొబ్బరికాయ కొట్టే అవకాశం ఉందన్నారు. సర్పంచ్ దంపతులపై దాడి చేసిన పెత్తందారులపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు.
(Courtacy Nava Telangana)