ఎస్సీ సబ్‌ప్లాన్‌కు ప్రణాళికేది?

0
77
మెరుగుపడని దళిత బతుకులు…

కొత్త ప్రభుత్వాలు కొలువుదీరి పథకాలు మారినా.. భారత్‌లో దళితుల పరిస్థితులు మాత్రం మారటం లేదు. 75 ఏండ్ల స్వతంత్ర భారతావనిలో వారి బతుకులు ఆశించినంతగా ముందుకు సాగలేదు. ఏండ్లుగా చారిత్రక వివక్ష, పేదరికాన్ని దళితులు ఎదుర్కొంటున్నారు. వారి బాగు కోసమే రాజ్యాంగబద్ధంగా ప్రత్యేకించి ఉద్దేశించిన పథకాలు, బడ్జెట్‌లో నిధుల కేటాయింపులు ఉన్నాయి. కాని ఇవి వారి జీవితాల్లో వెలుగులు నింపటం లేదు. ఇలాంటి వాటిలో ఎస్సీ సబ్‌ప్లాన్‌ నిధులు ఒకటి.

సామాజిక, విద్య, ఆర్థిక అంశాల్లో ఇప్పటికీ వెనకబాటే
ఇతర అవసరాలకు ఎస్సీ, ఎస్టీ నిధుల మళ్లింపు
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై దళిత సంఘాల ఆగ్రహం

న్యూఢిల్లీ : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇలాంటి పథకాల విషయాల్లో శ్రద్ధ కనబర్చకపోవటం దళితుల పరిస్థితులు మారకపోవటానికి ప్రధాన కారణమని దళిత సంఘాల నాయకులు, నిపుణులు ఆరోపించారు. పైగా తమ సంక్షేమానికి కేటాయించిన నిధులను ఇతర అవసరాలకు ప్రభుత్వాలే దారి మళ్లించటంతో నిర్దేశిత లక్ష్య సాధనకు ఆటంకం ఏర్పడుతున్నదని చెప్పారు. ఇప్పటికీ దేశంలోని దళితులు సామాజికపరంగా, విద్య, ఆర్థిక విషయాల్లో అట్టడుగు స్థాయిలో కొనసాగుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.

పేదరికంలో 33 శాతానికి పైగా దళితులు
దేశంలో ఎస్టీల తర్వాత వివిధ స్థాయిల్లో పేదరికాన్ని ఎదుర్కొంటున్నది ఎస్సీలే. భారత్‌లో మొత్తం ఎస్సీల జనాభా 28.3 కోట్లుగా ఉన్నది. వీరిలో 33.3 శాతం మంది పేదరికంలో కొట్టు మిట్టాడుతున్నారని గ్లోబల్‌ మల్టీ డైమెన్షియల్‌ పావర్టీ ఇండెక్స్‌, 2021 సమాచారం. జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే (ఎన్‌ఎఫ్‌హెచ్‌ఎస్‌) సమాచారం ప్రకారం ఎస్సీ చిన్నారుల్లో పోషకాహార లోపం అధికంగా విస్తరించి ఉన్నది. సెకండరీ స్థాయిలోనూ ఎస్సీ విద్యార్థుల డ్రాపౌట్లు అధికంగా ఉన్నాయి. ఆ తర్వాతి ఉన్నత స్థాయి చదువుల్లో నమోదు నిష్పత్తి.. ‘అందరు విద్యార్థుల సగటు’తో పోలిస్తే తక్కువగా నమోదు కావటం వారు అనుభవిస్తున్న పరిస్థితులు, ప్రభుత్వాలకు వారి పట్ల ఉన్న శ్రద్ధ గురించి తెలియజేస్తున్నది.

కరోనా కాలంలో ఉపాధిపై దెబ్బ
కరోనా అనంతర లాక్‌డౌన్‌ వంటి పరిస్థితులు ఎస్సీల ఉపాధిపై తీవ్రంగా ప్రభావం చూపింది. పెత్తందారీ కులాలతో పోలిస్తే ఎస్సీలు ఉపాధి కోల్పోవటం 21 శాతం పాయింట్లు అధికంగా ఉండటం పరిస్థితి తీవ్రతను తెలియజేస్తున్నది. అయితే, ఎస్సీల కోసం ఇంతగా చేస్తున్నప్పటికీ.. వారి జీవితాలు మారకపోవటానికి గల కారణాలు ఏమిటి అని విశ్లేషిస్తే.. విధాన రూపకల్పనలో అనేక లోపాలు, సరిపడా వనరుల కేటాయింపు లేకపోవటం, షెడ్యూల్‌ కులాల ఉప ప్రణాళిక (ఎస్సీఎస్పీ) పేలవమైన అమలు దీనికి సమాధానంగా వినబడుతుందని దళిత సంఘాల నాయకులు, విశ్లేషకులు చెప్పారు.

ఎస్సీ సబ్‌ప్లాన్‌లో అనేక సమస్యలు
ఎస్సీ సబ్‌ప్లాన్‌ ఎస్సీల మనుగడ కోసం అమలు చేయబడుతోంది. ఆరో పంచవర్ష ప్రణాళిక ద్వారా గుర్తించబడిన నిర్మాణాత్మక, ఆర్థిక మద్దతు లేమితో గత ప్రయత్నాలు తీవ్ర సమస్యలను ఎదుర్కొన్నాయి. అయితే, ఎస్సీ సబ్‌ప్లాన్‌ అమలు పేలవమైన రూపకల్పన, ప్రణాళిక, బడ్జెట్‌లో తక్కువ కేటాయింపులు, నోషనల్‌ ఫండింగ్‌, నిధుల మళ్లింపు, రాష్ట్రాల అంతటా ఏకరూపత లేకపోవటం, బడ్జెట్‌ ప్రదర్శన, సామాజిక సమూహాల వారీగా లబ్దిదారుల సమాచారం లేకపోవటం వంటి సమస్యలు ఎస్సీ సబ్‌ప్లాన్‌లో కొనసాగుతున్నాయి. ప్రాంతీయ, స్థానిక, కమ్యూనిటీ వారీగా వ్యత్యాసాన్ని పరిగణలోకి తీసుకోకపోవటం కారణంగా ఈ సబ్‌ప్లాన్‌ ఆశించిన ఫలితాలను చూపటం లేదు. ఉదాహరణకు, పథకాల నుంచి ప్రణాళిక వ్యయాలు గ్రామాలు, పట్టణాల వెలుపల ఉన్న ఎస్సీ నివాసాలకు చేరటం లేదు. విద్య, ఆరోగ్యం, ఎస్సీలకు వృత్తిశిక్షణ మొదలైన ప్రాధాన్యతా రంగాల పథకాలు అవసరాలకు అనుగుణంగా ప్రణాళిక చేయబడటం లేదు. అదనంగా, రోడ్లు, ప్రధాన నీటిపారుదల ప్రాజెక్టులు, మెగాపవర్‌, విద్యుత్‌ ప్రాజెక్టులకు సంబంధించిన అభివృద్ధి పథకాలు ఎస్సీలకు ఎలాంటి ప్రత్యక్ష, తక్షణ ప్రయోజనాలను అందించకపోవటం గమనార్హం. పథకాలకు కేటాయించే నిధులు కాగితాలపై కేవలం అంకెలుగా మారాయనీ, సబ్‌ప్లాన్‌ నిధులు ఇతర సాధారణ రంగాలకు మళ్లించబడుతున్నాయని నిపుణులు విశ్లేషించారు.

నేషనల్‌ కమిషన్‌ ఫర్‌ ఎస్సీ (ఎన్‌సీఎస్సీ) నివేదిక 2016 ప్రకారం.. అణగారిన వర్గాలకు ఉద్దేశించిన నిధులు ఇతర పనులకు వినియోగించబడ్డాయి. ఎస్సీ, ఎస్టీ స్కాలర్‌షిప్‌ల కోసం ఉద్దేశించిన నిధులను 2018-19లో బీహార్‌ ప్రభుత్వం రోడ్లు, మెడికల్‌ కాలేజీలు, ప్రభుత్వ బిల్డింగ్‌ల నిర్మాణాల కోసం ఉపయోగించటం సబ్‌ప్లాన్‌ నిధులను వినియోగించే తీరుకు అద్దం పడుతున్నది.

2017లో నిటి ఆయోగ్‌ కొత్త మార్గదర్శకాలు జారీ చేసింది. ఎస్సీ సబ్‌ప్లాన్‌ను ‘ఎస్సీల అభివృద్ధి కార్యాచరణ ప్రణాళిక’ (డీఏపీఎస్సీ)గా మార్చారు. సంబంధిత బడ్జెట్‌, నిధుల మళ్లింపును నిర్ధారించటానికి నిర్ధిష్ట పథకాలపై దృష్టి పెట్టారు. ఎస్సీ సబ్‌ప్లాన్‌కు నిధులు కేటాయించే మంత్రిత్వ శాఖల సంఖ్య పెరిగినప్పటికీ.. మొత్తం స్కీమ్‌ కేటాయింపులో డీఏపీఎస్సీ కేటాయింపు శాతం 2021-22 నుంచి గణనీయంగా తగ్గింది. అలాగే, మొత్తం పథకం బడ్జెట్‌లో డీఏఈపీఎస్సీ కేటాయింపు వాటా 2021-22, 2022-23 లో ఎస్సీ జనాభా కంటే తక్కువగా ఉండటం గమనార్హం. నిటి ఆయోగ్‌ మార్గదర్శకాల ద్వారా నిర్దేశించిన 16.2 శాతం కేటాయింపుల కంటే తక్కువగా ఉన్నాయి. డీఏపీఎస్సీ నిధులు ఎస్సీల అవసరాలకు అనుగుణంగా ఉండాలని నిపుణులు, దళిత సంఘాల నాయకులు సూచించారు. అలాగే, ఎస్సీ సాధికారత, విద్య, నైపుణ్యాభివృద్ధిపై దృష్టి సారించే పథకాల కింద బడ్జెట్‌ కేటాయిం పులు ఎస్సీ జనాభా నిష్పత్తికి అనుగుణంగా ఉండాలన్నారు. మొత్తం పథకాల కేటాయింపులో డీఏపీఎస్సీ వాటా కనీసం ఎస్సీ జనాభాకు అనుగుణంగా ఉండేలా చూడాల్సిన అవసరమున్నదని చెప్పారు. ఎస్సీ సబ్‌ప్లాన్‌ కోసం కేటాయించిన నిధుల పెంపుపై దృష్టి ఉండాలన్నారు. అదనపు సంఖ్యలో ఎస్సీ లబ్దిదారులను కవర్‌ చేయాలని సూచించారు. రాష్ట్ర స్థాయిలో ఎస్సీ సబ్‌ప్లాన్‌ లేదా డీఏపీఎస్సీ కేటాయింపు, ప్రత్యేక బడ్జెట్‌ ప్రకటన మరింత పారదర్శకత, జవాబుదారీ తనాన్ని నిర్ధారిస్తుందని దళిత సంఘాల నాయకులు, నిపుణులు చెప్పారు.

Leave a Reply