అమానుషం !

0
244

తెలంగాణలోని యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు పోలీస్‌స్టేషన్‌లో ఇటీవల జరిగిన లాకప్‌డెత్‌ ఘటనలో ఒక ఎస్సై, ఇద్దరు కానిస్టేబుళ్ళను బుధవారం ఉన్నతాధికారులు సస్పెండ్‌ చేశారు. మూడురోజుల క్రితం మరియమ్మ అనే మహిళను ఒక చోరీ కేసులో అరెస్టు చేసి, విచారించే క్రమంలో పోలీసులు ఆమెను చిత్రహింసలు పెట్టి, అంతిమంగా ఆమె మరణానికి కారకులైన వి‌షయం తెలిసిందే. ఒక ఏసీపీ ఆధ్వర్యంలో ఈ ఘటనపై అంతర్గత దర్యాప్తు చేయించి, విధినిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించారంటూ ముగ్గురు పోలీసులను సస్పెండ్‌ చేసినంత మాత్రాన ఈ లాకప్‌డెత్‌ ఘటనలో ప్రభుత్వ బాధ్యత తీరినట్టూ బాధితులకు న్యాయం చేకూరినట్టూ కాదు.

ఒక దొంగతనం కేసులో పోలీసులు ఇంత అత్యుత్సాహం ప్రదర్శించి, కేవలం ఆరోపణ ఎదుర్కొంటున్న మహిళపట్ల ఇంత అమానుషంగా వ్యవహరించడం ఆశ్చర్యం, ఆవేదన కలిగిస్తున్నాయి. ఖమ్మంజిల్లాకు చెందిన మరియమ్మ పరిచయస్తుల ద్వారా అడ్డగూడూరు మండలం గోవిందాపురంలో ధర్మారపు బాలశౌరి అనే చర్చి ఫాదర్‌ వద్ద పనికి కుదిరింది. ఆమెతో పాటు కుమారుడు ఉదయ్‌కూడా ఉంటున్నాడు. బాలశౌరి ఏదోపనిమీద మరోఊరువెళ్ళి, తిరిగి గోవిందాపురం చేరుకొనేలోగా మరియమ్మ స్వగ్రామానికి వెళ్ళింది. తన ఇంట్లో ఉన్న రెండులక్షల రూపాయలు పోయాయనీ, తనకు చెప్పకుండా మరియమ్మ వెళ్ళిపోయిందనీ, అందువల్ల ఆమే దొంగతనం చేసిందనీ బాలశౌరి పోలీసులకు ఫిర్యాదుచేశాడు. దీంతో పోలీసులు పిలిపించి, ఓవర్‌యాక్షన్‌ ఆరంభించారు. డబ్బుతీయలేదనీ, పైగా ఫాదర్‌ అనుమతి తీసుకొనే ఊరుకెళ్ళానని మరియమ్మ కాళ్ళావేళ్ళాపడింది. బాలశౌరి అనుమతిలేకుండా చర్చి పనివారు ఎవరూ కదిలే అవకాశం లేదని గ్రామస్థులు కూడా అంటున్నారు. వివిధ కథనాలను బట్టి ఆమె ముందుగా స్వగ్రామంలోనూ, అనంతరం అడ్డగూడూరు పోలీసుస్టేషన్‌లోనూ తీవ్రహింసలకు గురైంది. స్వగ్రామంలో కన్నకూతురు ఎదురుగానే పోలీసులు మరియమ్మను హింసించారు. అడ్డగూడూరులో పోలీసులు తల్లిని కొడుతుండగా అడ్డుపడినందుకు ఆమె కుమారుడు, ఆతని మిత్రుడు కూడా దెబ్బలు తిన్నారు. చివరకు చావుబతుకుల మధ్య ఉన్న ఆమెను పోలీసులు ముందుగా స్థానిక ఆస్పత్రికీ, పరిస్థితి విషమించడంతో అక్కడనుంచి భువనగిరి జిల్లా ఆస్పత్రికీ తరలించారు. అక్కడ మరియమ్మ చనిపోయింది. పోలీసు హింసకే ఆమె మరణించిందని అడ్డగూడూరు ప్రజలూ, అమ్మను తనకళ్ళముందే పోలీసులు ఎంతగా హింసించినదీ ఆమె కుమారుడూ విస్పష్టంగా చెబుతున్నారు. దెబ్బలకు తాళలేక తల్లి తన చేతుల్లోనే కన్నుమూసిందని కుమారుడు భోరుమన్నాడు.

చర్చి నియమాలు, విలువల ప్రకారం ఫాదర్‌ తన దగ్గర అంత సొమ్ము ఉంచుకోవచ్చునా, ఫిర్యాదులో ఆ ధనం ఎక్కడిదో, ఎందుకు తన వద్దనే ఉన్నదో తెలియచేశారా? మరియమ్మను ఇతరత్రా ఏమైనా కారణాలతో కేసులో ఇరికించారా వంటి ప్రశ్నలు అనేకం సామాజిక మాధ్యమాల్లో వెల్లువెత్తుతున్నాయి. పోలీసుల ఇంటరాగేషన్‌ అంత క్రూరంగా ఉండటం వెనుకా, మరియమ్మ మరణం వెనుకా పైకి కనిపించని ఇతరత్రా కారణాలూ లక్ష్యాలూ ఉండవచ్చునని కూడా కొందరు అనుమానిస్తున్నారు. ఏదిఏమైనప్పటికీ, ముగ్గురు పోలీసులను సస్పెండ్‌ చేయడంతో చేసిన పాపం తీరినట్టూ కాదు, బాధిత కుటుంబానికి న్యాయం జరిగినట్టూ కాదు. మరియమ్మ మరణానికి దారితీసిన ఈ మొత్తం వ్యవహారంపై ఒక ఉన్నతస్థాయి విచారణ జరగాలి. ఎవరిపాత్ర ఎంతో, ఒక పేదరాలిపై అంత కక్షపూరితంగా, నిర్దయగా వ్యవహరించడానికి పురిగొల్పిన కారణాలేమిటో వెలుగుచూడాలి. బాధిత కుటుంబానికి నష్టపరిహారంతో పాటు, కళ్ళెదుటే తల్లిని కోల్పోయిన కుమారుడికి ఉపాధి కల్పించాలి. గతంలో చోటుచేసుకున్న ఈ తరహా ఘటనల్లో దోషులపై చర్యలు లేకపోవడం, పోలీసులకు అడ్డూ అదుపూలేని స్వేచ్ఛతో పాటు, తమను అడిగేవారు లేరన్న ధైర్యం కలిగించడం మరియమ్మ లాకప్‌డెత్‌కు కారణం. పాలకులు ఈ ఘటనను తీవ్రంగా పరిగణించినప్పుడు మాత్రమే భవిష్యత్తులో ఇటువంటివి జరగకుండా ఉంటాయి.

Courtesy Andhrajyothi

Leave a Reply