బాత్ రూములే.. ఆవాసాలు

0
234

– గూడు.. నిలువ నీడ లేక పేదల గోస
– జాతీయ రహదారి పక్కన దళితుల అవస్థలు
– పిల్లలను పట్టుకొని ఒంటరి మహిళల జీవన పోరాటం
– తిరుమలగిరి, మల్లెపల్లి గ్రామాల్లో దైన్యస్థితి

కనీసం కూడు, గూడు, గుడ్డకు నోచుకోని దుర్భర స్థితిలో పేదలు జీవితాలను గడుపుతున్నారు. మరుగుదొడ్లు.. పూరి గుడిసెల్లోనే కాలం వెళ్లదీస్తున్నారు. ఒక వైపు రాష్ట్రం బంగారు తెలంగాణ వైపు పరుగులు తీస్తుందంటున్న పాలకులకు పేదల దయనీయ స్థితి పట్టడం లేదు. ముఖ్యంగా ఒంటరి మహిళల పరిస్థితి మరీ దారుణం.. ఇంటి పెద్ద లేక.. పిల్లలు, కుటుంబ పోషణ భారం మోస్తున్న వారికి ఇల్లు లేక తీవ్ర అవస్థలు పడుతున్నారు. మహబూబ్‌నగర్‌ జిల్లా జడ్చర్ల నియోజకవర్గం బాలనగర్‌ మండలం తిరమలగిరి, రాజాపూర్‌ మల్లెపల్లి గ్రామాల్లోని కొందరు పేదల పరిస్థితిపై కథనం.

మహబూబ్‌నగర్‌ : బాలనగర్‌ మండలం తిరుములగిరికి చెందిన గుమ్మడి సుజాత భర్త రెండేండ్ల కిందట అనారోగ్యంతో మృతిచెందాడు. వారికి భూమి ఏమీ లేదు. ఇటీవల వారి పాత ఇల్లు కూలిపోయింది. దాంతో గతంలో సర్కారు నిర్మించిన మరుగుదొడ్డే వారికి ఆవాసమైంది. తన ఇద్దరు కుమారులు అత్తతో కలిసి బాత్‌రూములోనే కాలం వెల్లదీస్తున్నారు. వర్షం వస్తే రాత్రంతా జాగారమే.

రాజాపూర్‌ మండలం మల్లెపల్లి గ్రామానికి చెందిన ఒడ్డె లలితమ్మకు నలుగురు సంతానం. ఆమె భర్త చనిపోయాడు. గతంలో ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలకు పాత మట్టిమిద్దె ఇల్లు నేల మట్టమైంది. ఆస్తుపాస్తులేవీ లేవు. ఇద్దరు కొడుకుల వివాహమైంది. ఇద్దరు కుమార్తెలకు వివాహం కాలేదు. ఈడుకొచ్చిన అమ్మాయిలతో ఆరుబయట పడుకుంటే ఎప్పుడు ఏ ఆపద కల్గుతుందోనని భయం భయంగా గడుపుతు న్నారు. అదే మండలం చొక్కంపేట గ్రామంలో బాలమ్మ, నవనీతల పరిస్థితులు సైతం దుర్భరంగా ఉన్నాయి. బాలమ్మది మట్టిమిద్దే. ఇటీవల కురిసిన వర్షాలకు పూర్తిగా కూలిపోయింది. భర్త బాలయ్య మూడేండ్ల కిందట అనారోగ్యంతో చనిపోయారడు. ఇద్దరు కుమారులు వలసపోయారు. నవనీత విక లాంగురాలు. ఈమెకు ఇద్దరు పిల్లలు పుట్టిన తర్వాత భర్త వెంకటయ్య వారిని వదిలేసి వెళ్లాడు. అప్పటి నుంచి బాత్‌రూములోనే బతుకులీడుస్తున్నారు.

నాగర్‌కర్నూల్‌ జిల్లాలో ఇప్పటివరకు 5500 డబుల్‌ బెడ్రూమ్‌ ఇండ్లు మంజూరయ్యాయి. అందులో 350 పురోగతిలో ఉండగా, 260 ఇండ్లను పూర్తి చేశారు. మహబూబ్‌నగర్‌ జిల్లాలో 7533 ఇండ్లు మంజూరయ్యాయి. 4211ఇండ్లు పూర్తి చేశారు. ఇంకా 2456 ఇండ్లు పూర్తి చేయాల్సి ఉంది. వనపర్తి జిల్లాలో 3840 ఇండ్లు మంజూరు కాగా, 2017 పూర్తి చేశారు. 680 ఇండ్లను పూర్తి చేశారు. గద్వాల జిల్లాలో 2525 ఇండ్లకుగాను 750 పురోగతిలో ఉన్నాయి. 680 పూర్తి చేశారు. నారాయణపేట జిల్లాలో 520 ఇండ్లు మంజూరు చేశారు. మొత్తం పురోగతిలో ఉన్నాయి. సమగ్ర సర్వే ప్రకారం ఉమ్మడి జిల్లాలో నాల్గున్నర లక్షల మందికి సొంతిళ్లు లేవని నివేదిక ఇచ్చారు. అందులో ఇప్పటివరకు 19వేలు మాత్రమే పాలన అనుమ తులు ఇచ్చారు. మిగతా వారికి సొంతింటి నిర్మాణం కలగానే మారనుంది. ఇలా ఇండ్లు లేక చాలా మంది గుడిసెలు, మరుగుదొడ్లల్లోనే కాలం వెళ్లదీస్తున్నారు.

ప్రతి పేదోడికీ ఇల్లు కట్టించివ్వాలి : మహబూబ్‌నగర్‌ సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి ఎ.రాములు
జిల్లా వ్యాప్తంగా అనేక మంది ఇండ్లు లేని వారున్నారు. ప్రభుత్వం వారిని గుర్తించి సొం తింటి నిర్మాణం చేసి ఇవ్వాలి. ముఖ్యంగా జాతీయ రహదారి వెంట ఉన్న బాలనగర్‌, రాజాపూర్‌ మండలాల్లో పేదలు బాత్‌రూముల్లో జీవిస్తున్నారంటే.. మారు మూల గ్రామాల పేదల పరిస్థితి ఘోరంగా ఉంది. ప్రభుత్వం వెంటనే అర్హులైన పేదలకు సొంతింటి నిర్మాణం చేసి ఇవ్వాలి.

Courtesy Nava Telangana

Leave a Reply