అన్నదాతకు ఆపత్కాలం!

0
370
ఎ. కృష్ణారావు

కొత్త వ్యవసాయ బిల్లులు ప్రవేశపెట్టడం ద్వారా ప్రభుత్వం దేశంలో రైతులకు ప్రయోజనం చేకూర్చాలన్న చిత్తశుద్ధిని ప్రదర్శించిందా లేక ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన కార్పేరేట్ రంగాన్ని సంతృప్తి పరిచి వారికి నూతనావకాశాలు కల్పించాలన్న ప్రేమను ప్రకటించిందా, లేక తన వైఫల్యాల నుంచి చేతులు దులుపుకునే ప్రయత్నంలో భాగంగా ఈ శాసన నిర్మాణ చర్యలు చేపట్టిందా? ఈ వ్యవసాయ బిల్లులు రైతుల భవిష్యత్‌ను అంధకారంలో పడవేస్తాయని, కార్పొరేట్ల దయాదాక్షిణ్యాలపై వారు ఆధారపడే పరిస్థితి కల్పిస్తాయని గ్రామీణ రంగ నిపుణుడు పాలగుమ్మి సాయినాథ్ వ్యాఖ్యానించడం గమనార్హం.

ఆదివారం నాడు రాజ్యసభలో జరిగిన ఘటనలతో చాలా రోజుల తర్వాత వ్యవసాయం జాతీయ స్థాయి రాజకీయాల్లో ప్రధానాంశంగా మారింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వం పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన రెండు కీలక బిల్లులు రైతుల జీవితాల్లో సమూల మార్పులు తీసుకువచ్చి నిజంగా వారి ఆదాయాన్ని రెట్టింపు చేస్తాయా లేక వారి జీవితాలను మరింత అతలాకుతలం చేస్తాయా అన్న విషయంలో రేగుతున్న చర్చ ఒక ఎత్తైతే పార్లమెంట్‌లో ఈ బిల్లులను ఆమోదించిన తీరు ప్రజాస్వామ్యాన్ని ఒక ప్రహసనంగా మార్చిందనడంలో ఏ మాత్రం సందేహం లేదు. 243 మంది సభ్యులున్న ప్రస్తుత రాజ్యసభలో సగానికి పైగా సభ్యులు ఈ బిల్లులను ఆగమేఘాలపై ఆమోదించడాన్ని వ్యతిరేకిస్తున్నారన్న విషయం స్పష్టమైంది. రాజ్యసభలో బిజెపి సారథ్యంలోని ఎన్డీఏ సంఖ్యాబలం 112 కాగా ఎన్డీఏలో భాగస్వామ్య పార్టీ అయిన అకాలీదళ్ బిల్లుకు వ్యతిరేకంగా ఓటు వేయమని తమ పార్టీకి చెందిన ముగ్గురు సభ్యులకు త్రీలైన్ విప్ జారీ చేసింది. గతంలో ఎలాంటి కీలక బిల్లులు వచ్చినా తెలంగాణ రాష్ట్ర సమితి, బిజూజనతాదళ్, బహుజన సమాజ్ పార్టీ తదితర పార్టీలు ఆదుకునేవి. కాని ఈ సారి ఈ పార్టీలు తమ వైఖరిని స్పష్టం చేశాయి. ఈ బిల్లులను సమర్థించే ప్రసక్తి లేదని తెలంగాణ రాష్ట్ర సమితి స్పష్టం చేసింది. కనీసం సెలెక్ట్ కమిటీకి నివేదించాలని బిజూజనతాదళ్ కోరింది. ఈ బిల్లులు సంపన్నులకే మేలు చేస్తాయని బిఎస్‌పి అధినేత్రి మాయావతి ప్రకటించారు. ఎన్డీఏ వెలుపల ఉన్న ఇతర పార్టీల్లో ఆరుగురు సభ్యులున్న వైసీపీ, చెరొక సభ్యుడున్న తమిళ మనీలా కాంగ్రెస్, బోడే పీపుల్స్ ఫ్రంట్ మాత్రమే మద్దతు ప్రకటించాయి. కొవిడ్‌–19 సోకినందువల్ల ఎంపీల్లో చాలా మంది రాలేదు కాని, అన్ని పార్టీల సభ్యులూ హాజరై ఉంటే పరిస్థితి చాలా భిన్నంగా ఉండేది. బహుశా భారతీయజనతా పార్టీ అధినేతలు ఈ బిల్లులను ఇప్పుడు ప్రవేశపెట్టేందుకు సాహసించేవారు కాదేమో. ఒకరకంగా కొవిడ్ పరిస్థితులు బిజెపికి వరంగా మారాయి.

నిజానికి అత్యంత వ్యూహాత్మకంగా పార్లమెంట్ ఉభయసభలను చెరి నాలుగు గంటలు సమావేశపరిచి, పెద్దగా చర్చ లేకుండా కీలకమైన బిల్లులను ఆమోదింపచేసేందుకు ప్రభుత్వం కొద్దిరోజుల ముందే రంగం సిద్ధం చేసింది. ఏ బిల్లును ఏ రోజు ఆమోదింపచేయాలో ఒక పథకాన్ని రూపొందించుకుని దానికి తగ్గట్గ్లుగానే పావులు కదిపింది. అందువల్లనే ఒక్కో రోజు నాలుగు బిల్లులను సైతం ప్రవేశపెట్టి ఆమోదింపచేసేందుకు కూడా ప్రభుత్వం వెనుకాడలేదు. కనుకనే రాజ్యసభలో వ్యవసాయ బిల్లులను ఆమోదించేటప్పుడు తమకు మెజారిటీ ఉందా లేదా అన్న విషయం ప్రభుత్వం ఆలోచించలేదు. ఎన్డీఏలో భాగస్వామి అయిన అకాలీదళ్‌కు చెందిన మంత్రి రాజీనామా చేసిన తర్వాత కూడా ప్రభుత్వం వెనక్కు తగ్గలేదు. దాదాపు 18 పార్టీలు ఈ బిల్లులను వ్యతిరేకిస్తున్నాయని తెలిసినప్పటికీ పట్టించుకోలేదు. రాజ్యసభ రాష్ట్రాలకు ప్రాతినిధ్యం వహించే సభ. కొన్ని నెలలుగా కేంద్రప్రభుత్వం ప్రవేశపెడుతున్న బిల్లులు పూర్తిగా కేంద్రీకృత వ్యవస్థను ఏర్పాటు చేసేందుకు, రాష్ట్రాలను విస్మరించేందుకు ఉద్దేశించినవే. వీటిపై రాష్ట్రాల ముఖ్యమంత్రులతో మాట్లాడడం కానీ, వారి అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోవడం కానీ చేయలేదు. ఒక బిల్లును ఏదో రకంగా, కనీస చర్చ లేకుండా, సభ్యుల మనోభావాలతో నిమిత్తం లేకుండా తాను అనుకున్న రోజే ఆమోదింపచేయాలని ప్రభుత్వం గట్టిగా నిర్ణయం తీసుకున్న తర్వాత సభాధ్యక్షుల పాత్ర నిమిత్తమాత్రమే అవుతుందని జరిగిన పరిణామాలు నిరూపిస్తున్నాయి. ఈ క్రమంలో రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హరివంశ్‌ను పెద్దగా విమర్శించి ప్రయోజనం లేదు. ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేసి, దుర్ఫాషలాడిన ప్రతిపక్ష సభ్యుల ప్రవర్తన కూడా నిరాశా నిస్పృహలకు లోనై వ్యక్తమయ్యిందే. పార్లమెంట్‌లోనే గందరగోళం మధ్య దేశ భవిష్యత్‌ను నిర్ణయించే కీలకమైన బిల్లులను ఎలాంటి చర్చ లేకుండా మూజువాణీ ఓటుతో లాగిస్తే ఇక దేశంలోని వివిధ అసెంబ్లీలలో స్పీకర్లు నిర్విచక్షణగా, నిర్దాక్షిణ్యంగా వ్యవహరిస్తే ప్రశ్నించడానికి ఏముంటుంది? మొత్తానికి దేశ ప్రజాస్వామ్యం రోజురోజుకూ ఒక ప్రహసనంగా మారుతోంది.

ఈ బిల్లులను ప్రవేశపెట్టడం ద్వారా ప్రభుత్వం దేశంలో రైతులకు ప్రయోజనం చేకూర్చాలన్న చిత్తశుద్ధిని ప్రదర్శించిందా లేక ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన కార్పేరేట్ రంగాన్ని సంతృప్తి పరిచి వారికి నూతనావకాశాలు కల్పించాలన్న ప్రేమను ప్రకటించిందా, లేక తన వైఫల్యాల నుంచి చేతులు దులుపుకునే ప్రయత్నంలో భాగంగా ఈ చర్యలు చేపట్టిందా అన్న అంశాలపై చర్చ జరగాల్సి ఉంది. నిజానికి 2019లో బిజెపి తన ఎన్నికల ప్రణాళికలో 2022 కల్లా రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయాలన్న సంకల్పాన్ని ప్రకటించింది. కాని ప్రస్తుత బిల్లుల గురించి ఆ హామీ పత్రంలో ఏ ప్రస్తావనా లేదు. ఈ ఎన్నికల ప్రణాళికలో ముఖ్యమైనది ఉత్పాదకతతను పెంచేందుకు వ్యవసాయ, గ్రామీణ రంగాల్లో రూ 25 లక్షల కోట్ల పెట్టుబడి పెట్టడం. రెండవది, దేశమంతటా గిడ్డంగుల నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేసి సమర్థవంతమైన నిల్వ, రవాణా యంత్రాంగాన్ని ఏర్పాటు చేస్తానని ఈ ప్రణాళికలో ప్రకటించారు. ఇప్పటికి ఈ రెండు కర్తవ్యాలనూ మోదీ ప్రభుత్వం నెరవేర్చలేదు. అంతేకాదు గ్రామస్థాయిలో నిల్వ పథకాన్ని అమలు చేస్తామని, రైతులు తాము నిల్వ చేసుకున్న ఉత్పత్తులకు గాను రుణాలు ఇస్తామని ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ చేసిన ప్రకటన ఎప్పుడు అమలులోకి వస్తుందో తెలియదు. నిజానికి ఇలాంటి చర్యలు అమలయి ఉంటే ఇవాళ ఈ రెండు బిల్లులను మోదీ ప్రభుత్వం చేపట్టాల్సిన అవసరం ఉండేది కాదు. ఇతర హామీల విషయానికి వస్తే చిన్న, మధ్యతరహా రైతులకు పింఛను పథకం కానీ, పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజనను దేశంలో అందరు లబ్ధిదారులకు అమలు చేయడం కానీ లక్ష్యాలకు సమీప దూరంలో కూడా లేవని గణాంక వివరాలను బట్టి అర్థమవుతుంది. రైతులకు వడ్డీ లేకుండా కిసాన్ క్రెడిట్ కార్డు రుణాలు ఇవ్వడం, రైతులు భరించదగ్గ రేట్లలో వారి ఇంటికే నాణ్యమైన విత్తనాలు సరఫరా చేసి గుమ్మం వద్దే టెస్టింగ్‌ సౌకర్యాలు కల్పించడం, సహకార సంఘాల ద్వారా వ్యవసాయ, పాడి, మత్స్య ఉత్పత్తులను నేరుగా మార్కెట్ చేయడం, నూనెగింజల విషయంలో స్వయంసమృద్ధి సాధించడం లాంటి హామీలు అమలులోకి వచ్చిన దాఖలాలు కనపడడం లేదు. అత్యంత వేగంగా దేశంలో పెండింగ్‌లో ఉన్న నీటిపారుదల ప్రాజెక్టులను పూర్తి చేస్తామని, మన నీటిపారుదల సామర్థ్యాన్ని నూటికి నూరు శాతం వినియోగించుకుంటామని ఇచ్చిన హామీలు కూడా నీటిపై రాతలుగా మిగిలిపోయాయి. అసలు ఇవన్నీ చేయడానికి మోదీ ప్రభుత్వం దగ్గర డబ్బులెక్కడివి? రాష్ట్రాలకు న్యాయసమ్మతంగా చెల్లించాల్సిన జీఎస్టీ బకాయీలే చెల్లించలేక చేతులెత్తేసిన ప్రభుత్వం వ్యవసాయరంగాన్ని ఏ విధంగా ఆదుకుంటుంది? బహుశా తన నిస్సహాయతను కప్పిపుచ్చుకునేందుకే మోదీ ప్రభుత్వం వ్యవసాయ రంగంపై కార్పోరేట్ అస్త్రం ప్రయోగించి ఉండవచ్చు.

ఎన్నికల ప్రణాళికలో ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా మోదీ ప్రభుత్వం వ్యవసాయరంగాన్ని కార్పోరేటీకరణ చేసేందుకు ప్రధాన కారణం ఇచ్చిన హామీల నుంచి చేతులు దులుపుకుని రైతును కంపెనీల దయాదాక్షిణ్యాలకు వదిలిపెట్టడమేనని ఈ నేపథ్యంలో ప్రధానంగా విమర్శలు వస్తున్నాయి. ముఖ్యంగా ప్రాంతీయ పార్టీల అధినేతలు ఈ బిల్లులపై తీవ్ర విమర్శలకు పూనుకున్న తర్వాతనే కాంగ్రెస్‌లో కదలిక ఏర్పడింది. ఈ బిల్లులు తేనె పూసిన కత్తులని, చిన్న, మధ్యతరహా రైతుల జీవితాలను దుర్భరంగా మారుస్తాయని తెలంగాణ రాష్ట్రసమితి అధినేత కేసిఆర్ స్పష్టంగా ప్రకటించారు. మొక్కజొన్నలపై దిగుమతి పన్నును 50 శాతం నుంచి 15 శాతానికి తగ్గించి మన రైతుల పొట్టకొట్టడంతోనే కేంద్రం స్వభావం అర్థమయిందని ఆయన ధ్వజమెత్తారు. టిఆర్‌ఎస్‌తో పాటు అకాలీదళ్, తృణమూల్ కాంగ్రెస్, డిఎంకె, శివసేన, ఎన్‌సిపి, సమాజ్‌వాది పార్టీ తదితర ప్రాంతీయ పార్టీలు చేసిన విమర్శలకు తోడు వివిధ రైతు, వ్యవసాయ సంఘాలు తీవ్ర నిరసన వ్యక్తం చేయడం, వీధుల్లోకి వచ్చి రవాణాను స్తంభింపచేయడం దేశంలో చాలా కాలం తర్వాత మోదీ ప్రభుత్వానికి ఒక బలమైన వ్యతిరేకత వ్యక్తమవుతోందన్న అభిప్రాయానికి దారితీసింది. ఇది రైతుల భవిష్యత్‌ను అంధకారంలో పడవేస్తుందని, కార్పొరేట్ల దయాదాక్షిణ్యాలపై రైతులు ఆధారపడే పరిస్థితి కల్పిస్తుందని పాలగుమ్మి సాయినాథ్ వంటి గ్రామీణరంగ నిపుణులు వ్యాఖ్యానించడం గమనార్హం.

నిజానికి ఈ బిల్లులపై పారదర్శకంగా, ప్రజాస్వామికంగా చర్చలు జరిపి, అనేక పక్షాలను విశ్వాసంలోకి తీసుకుని, పార్లమెంట్‌లో కూడా చర్చలకు ఆస్కారం కలిగించి ఉంటే ఇంత వేడి రాజుకునేది కాదు. సెలెక్ట్ కమిటీకి పంపించి పద్ధతి ప్రకారం వ్యవహరించినా ఇంత చర్చ జరిగేది కాదు. ఎవర్నీ లెక్కచేయని ధోరణి ప్రదర్శించి బిల్లులను ఇష్టారాజ్యంగా ఆమోదించే ప్రయత్నం చేయడం అనేక ప్రశ్నలు రేగేందుకు కారణమైంది. ఈ లెక్కచేయని కేంద్రీకృత అధికార వ్యవస్థ భవిష్యత్‌లో ఎటువంటి మార్పులకు దారితీస్తుందోనన్న భయాందోళనలకు కూడా కారణమవుతున్నది. ఈ బిల్లుల మూలంగా దేశమంతటా రేగిన చర్చ ఎటువంటి రాజకీయ పరిణామాలకు దారితీస్తుంది? ప్రాంతీయ పార్టీలు లేవనెత్తిన అంశాల ఆధారంగా దేశంలో ప్రత్యామ్నాయ రాజకీయాల గురించి చర్చ బలపడుతుందా? ఒకప్పుడు బోట్స్‌క్లబ్‌లో 5 లక్షలమంది రైతులతో నిరసన ప్రదర్శన జరిపి రాజీవ్‌గాంధీ ప్రభుత్వాన్ని తన డిమాండ్లకు ఒప్పించిన మహేంద్ర సింగ్ తికాయత్ వంటి రైతునేతలు ఉద్భవించే అవకాశాలున్నాయా? ఎటువంటి నిర్ణయాన్నైనా తీసుకోవడానికి వెనుకాడని మోదీ దుస్సాహసాన్ని ఎదుర్కొనగల నేత ఎవరు?

Courtesy Andhrajyothi

Leave a Reply