కె. శ్రీనివాస్
కరోనాను అయినా సరే క్యాష్ చేసుకుంటారు, కన్నీళ్లతో బ్యాలెట్లు నింపుకుంటారు. మన దేశభక్తినీ సొమ్ము చేసుకుంటారు. బేషరతు నమ్మకం కంటె అనుమానమే మంచిది. ప్రతిదాన్నీ శంకించమన్నాడు బుద్ధుడు.
చైనా వాడి దాష్టీకం వల్లనే గల్వాన్ సమస్య వచ్చిపడినా, బిహార్ రెజిమెంట్‌కు కలిగిన నష్టం, రాజకీయవాదులకు బిహార్ ఎన్నికల్లో లాభం కాకుండా ఉంటుందా? అర్జెంటుగా టీకాను ఆవిష్కరించాలనే అసంబద్ధపు ఆత్రుత వెనుక, రెండు రాష్ట్రాల ఎన్నికల ముందుచూపు లేదంటారా? వినండి, ఈ ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అధోలోకంలో మాత్రమే వినిపించేవి ఇప్పుడు ఉపరితలంలో కూడా ప్రతిధ్వనిస్తున్నాయి. అందుకే, గమనించాలి. ఏ కదలిక ఎటు దారితీసేదో కనిపెట్టాలి. దాచిపెట్టిన వ్యూహాన్ని, చేయబోయే ద్రోహాన్ని విప్పి చెప్పాలి.
అలనాడు ఇందిరాగాంధీ పరిపాలన చేస్తూ ఉండిన రోజుల్లో, అత్యవసర పరిస్థితి అలియాస్ అనుశాసన పర్వం అలియాస్ చీకటిరోజులు ఇంకా మూలమలుపులో నిరీక్షిస్తున్న సమయంలో, రైల్వే మంత్రిగా ఉండిన లలిత్ నారాయణ్ మిశ్రా ఒక బాంబు పేలుడులో చనిపోయాడు. అలవాటుగా ఇందిరాగాంధీ ఆ హత్య వెనుక ‘విదేశీ హస్తం’ ఉన్నదని ఆరోపించారు. విదేశీహస్తం అంటే సిఐఎ ప్రమేయం అన్న మాట. క్షేత్రస్థాయిలో హత్యకు కారకులుగా ‘ఆనంద్‌మార్గ్’ సంస్థకు చెందిన కొందరు వ్యక్తులపై అభియోగం మోపారు. ప్రచ్ఛన్న యుద్ధ కాలంలో, భారతదేశం అలీనవాదంతో ఉన్నట్టు కనిపించినా, భూభౌగోళిక రాజకీయాలలో సోవియట్ యూనియన్ పక్షానే ఉండేది. బ్యాంకుల జాతీయీకరణ, రాజభరణాల రద్దు వంటి చర్యలతో ప్రగతిశీల ప్రధానిగా పేరుతెచ్చుకున్న ఇందిరాగాంధీ, కొద్దికాలానికే పెద్ద ప్రజా ఉద్యమాన్ని ఎదుర్కొనవలసి వచ్చింది. ఆ ఉద్యమాన్ని, దానికి నాయకత్వం వహించిన లోక్‌నాయక్ జయప్రకాశ్ నారాయణ్‌ను కూడా ఇందిర వర్గీయులు సిఐఎ ఏజెంట్లుగా ఆరోపించేవారు. అటువంటప్పుడు, ఇందిర మంత్రివర్గ సహచరుడు హత్యకు గురి అయితే, దాన్ని సిఐఎ కుట్ర అని నిందించడంలో ఆశ్చర్యం ఏముంది?
ప్రభుత్వం ఏమి చెప్పినా, పాలకులు, వారి ప్రత్యర్థులు ఏమి ఆరోపణలు చేసుకున్నా, పత్రికలలో ఏయే అధికార, అనధికార కథనాలు వెల్లువెత్తినా, ప్రజలు– ముఖ్యంగా రాజకీయ పరిణామాలను, నేతల స్వభావాలను గమనిస్తున్న ప్రజలు– తమలో తాము, తమకు తోచిన నిర్ధారణలు లేదా ఆరోపణలు చేసుకుంటారు. వాటిని వదంతులు అనవచ్చు, గుసగుసలు అనవచ్చు, లేదా అధోజగత్ వ్యాఖ్యానాలు అనవచ్చు. వాటికి ప్రధానస్రవంతి ప్రసార, ప్రచార సాధనాలలో స్థలం దొరకకపోయినా, ప్రజల వ్యవహారంలో, రచ్చబండ ముచ్చట్లలో మాత్రం చోటు దొరుకుతుంది. ఎల్.ఎన్. మిశ్రా ఇందిర విషయంలో అవిధేయంగా ఉండడం మొదలుపెట్టారని, ఆ దూరమే హత్యకు కారణమై ఉంటుందని జనం అనుకునే వారు.
ఇందిరే హత్య చేయించిందని అనుకున్నంత మాత్రాన అదే నిజం కాకపోవచ్చు. ఇందిర స్వభావం గురించి, ఆ నాటి రోజులలో రాజకీయ నడవడిలో ఇమిడి ఉన్న ప్రమాదాల గురించి ప్రజల అవగాహనను మాత్రమే ఆ గుసగుస తెలియజేస్తుంది. నిజానికి ఆరోజులలో అమెరికా, రష్యా రాజకీయాలకు భారత్ కూడా వేదికగా ఉండింది. కెజిబిలో రహస్యపత్రాలను భద్రపరచే ఉద్యోగం చేసిన మిత్రోఖిన్ అనే అతను, తనకు తారసపడిన ఆసక్తికరమైన సమాచారాన్ని నోట్స్ రూపంలో రాసుకునేవాడు. సోవియట్ యూనియన్ పతనానంతరం, 1992లో అతను దేశం విడిచి వెళ్లిపోయి, ఆ నోట్స్‌ను మిత్రోఖిన్ ఆర్కైవ్స్ పేరుతో ప్రచురించాడు. అందులో ఆయన ఇందిరాగాంధీ, ఎల్‌ఎన్ మిశ్రా ఇద్దరూ కెజిబి నుంచి ముడుపులు తీసుకున్నవారేనని పేర్కొన్నాడు. నిజం దేవుడికే తెలియాలి. ఇందిర దేశం కోసం రష్యా వైపున్నారా, రష్యా వైపు ఉండడానికి భారత్‌లో పనిచేశారా– అన్న సందేహాన్ని ఆ సమాచారం కలిగిస్తుంది. మరి మిశ్రాని అమెరికాయే చంపించిందా?
అట్లాగే, తాష్కెంట్‌లో లాల్ బహదూర్ శాస్త్రి మరణం ఎట్లా జరిగిందన్న కుతూహలం అపరిష్కృతంగానే ఉండిపోయింది. రష్యా వాళ్లు చేయించారని, లేదు, శాస్త్రి మరణంతో లబ్ధిపొందిన అనంతర ప్రధాని ప్రమేయం కూడా అందులో ఉన్నదని వదంతుల వంటి అచారిత్రక కథనాలు వింటుంటాము. అందులో ఆయా శక్తులు అట్లాగే వ్యవహరించకపోయినా, శాస్త్రిది సహజమరణమే అయినా– ప్రజలు ఆ సంఘటన లోని వివిధ పక్షాల ప్రయోజనాల గురించి వేసుకునే అంచనాలు అటువంటి కథనాలలో ప్రతిఫలిస్తాయి. విమానప్రమాదంలో సంజయ్‌గాంధీ మరణించినప్పుడు, ప్రమాదస్థలిని దర్శించిన ఇందిరాగాంధీ అక్కడ నేల మీద పడి ఉన్న తాళపు చెవుల వంటి వస్తువేదో తీసుకున్నారు. దానిపై కూడా అనేక ఊహాగానాలు వెలువడ్డాయి. ఎమర్జెన్సీ కాలంలో సంజయ్ చర్యల కారణంగా, ఇందిర ఓటమిని, కష్టాలను ఎదుర్కొన్నారు. మూడేళ్ల తరువాత తిరిగి అధికారానికి వచ్చిన వెంటనే విమానప్రమాదం జరిగింది. రాజమహళ్లలో కుట్రల గురించి, అంతపుర కుతంత్రాల గురించి కథలు కథలు చెప్పుకోవడం ప్రజాసంప్రదాయం.
ఇందిరను ఆమె అంగరక్షకులు కాల్చిచంపడం రాజకీయ కారణాలతోనే అయినప్పటికీ, హంతకుల వెనుక పెద్ద శక్తులేవో ఉన్నట్టు దర్యాప్తులో వినలేదు. కనీసం పంజాబ్‌లోని మిలిటెంట్ సంస్థలతో కూడా హంతకులకు ఏ సంబంధమూ లేదు. ఇందిర దృఢవైఖరిని ఇచ్చగించని పెద్ద శక్తులేవో హత్యకు పాల్పడ్డాయని రాజకీయ ఆరోపణలు వచ్చాయి కానీ, అవి మొక్కుబడిగా మాత్రమే ధ్వనించాయి. రాజీవ్‌గాంధీ హత్య జరిగినప్పుడు, అది శ్రీలంక టైగర్ల చర్య అని, భారత్ శాంతిసేనలను పంపినందుకు ప్రతీకారంగా జరిగిన దాడి అని స్పష్టంగా తెలిసిన తరువాత కూడా, దాని వెనుక సూత్రధారులెవరన్న చర్చ విస్తృతంగా జరిగింది. అంతర్జాతీయ కుట్ర, హతుల స్థాయిని పెంచుతుంది. రాజీవ్ హత్యకు ఎవరెవరు పూనుకుని ఉండవచ్చు? అన్న ప్రతిపాదనలు, ఊహాగానాలతో మణిశంకర్ అయ్యర్ ఒక కాలమ్ రాశారు కూడా. జనరల్ ఎన్నికల రెండు దశల మధ్య, భారత ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేసే రీతిలో జరిగిన రాజీవ్ హత్య యాదృచ్ఛికం కాకపోవచ్చునని, భారత్‌ను బలహీనపరచాలనుకునే శక్తుల కుట్ర కావచ్చునని, సిఐఎ నుంచి మోస్సద్ దాకా ఏ సంస్థ ప్రమేయమైనా ఉండవచ్చునని ఆ ఊహాగానాలు సాగా యి.
ఆర్థిక సంస్కరణలను అమలు చేయడానికి జనరంజక ప్రభుత్వం ఉండరాదని, అతి బలహీనమైన, తక్కువ మెజారిటీ ఉన్న ప్రభుత్వం మాత్రమే తీవ్రమైన చర్యలు చేపట్టగలదని భావించిన శక్తులే మొత్తం పరిణామాలను రచించారని ప్రతిపాదించినవారున్నారు. ప్రజల అనధికార కథనాల్లో అయితే, మరీ విపరీత వ్యాఖ్యానాలు వినిపించాయి. ఊహలకు అంతు ఎక్కడ? అదే సమయంలో ప్రపంచతంత్రంలో అసాధ్యమైనది ఏమున్నది? అమిత్‌షా, నరేంద్రమోదీ ద్వయం 2014 నాటి తమ ఘనవిజయానికి 2002లోనే పునాదులు వేసుకున్నారని, ఒక క్రమానుగత వ్యూహమే వారి అధికారప్రాప్తికి కారణమని వాదించేవారున్నారు. ఎవరైనా తాము అనుకున్నట్టుగా పరిణామాలను నిరాఘాటంగా దీర్ఘకాలం నడిపించగలరా? కానీ, కనిపించని శక్తులేవో వెనుకనుంచి నడిపిస్తే, అన్ని కదలికలూ ఒకే దిశగా నడుస్తూ ఉంటే, దేశస్వరూప స్వభావాలనే తలకిందులు చేయగలమన్న సంకల్పబలం ఉంటే– సాధ్యం కావచ్చునేమో? ఇప్పుడు దేశంలో జరుగుతున్న పరిణామాలు ఎంత పకడ్బందీగా, ఎంత శ్రద్ధగా జరుగుతున్నాయి!
బంగ్లాదేశ్ యుద్ధాన్ని ఇందిర నిజంగా అవసరమయ్యే చేశారా, తన ప్రతిష్ఠను, అధికారాన్ని దేశంలో సుస్థిరం చేసుకునేందుకు చేశారా– అన్న సందేహాన్ని ఆ రోజుల్లోనే వ్యక్తం చేసినవారున్నారు. అటువంటి సందేహాలను బాహాటంగా వ్యక్తం చేయడం కష్టమే. కార్గిల్ యుద్ధం 1999 ఎన్నికల్లో లబ్ధి చేకూర్చలేదా? పుల్వామా, బాలాకోట్ సంఘటనలు మోదీ రెండో ఎన్నికను సులభం చేయలేదా? ఆ ప్రయోజనాల కోసమే ఆ సంఘటనలు జరిగాయని అననక్కరలేదు, దేశభద్రతకు సంబంధించిన ఆ సంఘటలను, 1971లో వలె, రాజకీయనేతలు తమకోసం వినియోగించుకోలేదా? అన్నవి ప్రశ్నలు. రాజకీయ సహజ జ్ఞానం కలిగిన ప్రజలు ఈ విషయాలను ఇంత డొంకతిరుగుడుగా మాట్లాడుకోరు. చైనా వాడి దాష్టీకం వల్లనే గల్వాన్ సమస్య వచ్చిపడినా, బిహార్ రెజిమెంట్‌కు కలిగిన నష్టం, రాజకీయవాదులకు బిహార్ ఎన్నికల్లో లాభం కాకుండా ఉంటుందా? అర్జెంటుగా టీకాను ఆవిష్కరించాలనే అసంబద్ధపు ఆత్రుత వెనుక, రెండు రాష్ట్రాల ఎన్నికల ముందుచూపు లేదంటారా? వినండి, ఈ ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అధోలోకంలో మాత్రమే వినిపించేవి ఇప్పుడు ఉపరితలంలో కూడా ప్రతిధ్వనిస్తున్నాయి.
అందుకే, గమనించాలి. ఏ కదలిక ఎటు దారితీసేదో కనిపెట్టాలి. దాచిపెట్టిన వ్యూహాన్ని, చేయబోయే ద్రోహాన్ని విప్పి చెప్పాలి. భౌతిక, రాజకీయ, మానసిక హత్యల వెనుక ఏ విదేశీ శక్తులు, ఏ స్వదేశీ వ్యక్తులు ఉండే అవకాశమున్నదో బేరీజు వేసుకోవాలి, ఇంత అనుభవం ఉన్నది కదా, ముందు కీడే ఎంచాలి.
చెడు ఎందుకు ఆలోచించాలి అని మనం మంచి బుద్ధితో అనుకుంటాము కానీ, రాజకీయవాదులకు ఆ వెసులుబాటు ఇవ్వవద్దు. కరోనాను అయినా సరే క్యాష్ చేసుకుంటారు, కన్నీళ్లతో బ్యాలెట్లు నింపుకుంటారు. మన దేశభక్తినీ సొమ్ము చేసుకుంటారు. బేషరతు నమ్మకం కంటె అనుమానమే మంచిది. ప్రతిదాన్నీ శంకించమన్నాడు బుద్ధుడు.
Courtesy AndhraJyothy