– బీజేపీ నేతలను కాపాడేందుకేనంటూ విమర్శలు
న్యూఢిల్లీ : ఢిల్లీ హింసోన్మాదంపై కేంద్రాన్ని, రాష్ట్ర ప్రభుత్వాన్ని, ఢిల్లీ పోలీసులను తప్పు పట్టిన ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎస్.మురళీధర్‌ను హడావుడిగా బుధవారం రాత్రి బదిలీచేశారు. సుప్రీంకోర్టు సిఫారసుల మేరకు ఆయనను పంజాబ్, హర్యానా హైకోర్టుకు బదిలీచేస్తున్నట్టు రాష్ట్రపతి కోవింద్ ఆదేశాలు జారీచేశారు. బీజేపీ నేతలపై ఎఫ్‌ఐఆర్‌కు ఆదేశాలు జారీచేసిన కొద్ది గంటల వ్యవధిలోనే ఆ న్యాయమూర్తిని కేంద్రం బదిలీచేస్తూ నిర్ణయం తీసుకోవటం చర్చనీయాంశమైంది. సుమారు రెండు వారల క్రితం సుప్రీంకోర్టు ప్యానెల్ చేసిన సిఫారసులను పురస్కరించుకుని జస్టిస్ మురళీధర్ బదిలీ జరిగిందని చెబుతున్నప్పటికీ.. ఢిల్లీ హింసకు ముందు రెచ్చగొట్టే వ్యాఖ్యలుచేసిన బీజేపీ నేతలను కాపాడేందుకు ఈ చర్య తీసుకున్నట్టు సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి. ‘రాజ్యాంగంలోని నిబంధనలను అనుసరించి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తితో సంప్రదించిన తర్వాత జస్టిస్ మురళీధర్‌ను ఢిల్లీ హైకోర్టు నుంచి పంజాబ్-హర్యానా హైకోర్టుకు బదిలీచేస్తూ రాష్ట్రపతి నిర్ణయం తీసుకున్నారు. పంజాబ్, హర్యానా హైకోర్టుల్లో బాధ్యతలు స్వీకరించాలని ఆదేశించారు’ అని బదిలీ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. జస్టిస్ మురళీధర్ బదిలీకి సంబంధించిన నోటిఫికేషన్‌ను బుధవారం రాత్రి 11 గంటల ప్రాంతంలో జారీ చేశారు. సాధారణంగా న్యాయమూర్తులను బదిలీ చేసినప్పుడు ఆయన తన కొత్త పోస్టులో చేరేందుకు 14 రోజుల వ్యవధినిస్తారు. కానీ జస్టిస్ మురళీధర్ విషయంలో అలా జరగకపోవడం గమనార్హం. ఢిల్లీలో హింసాత్మక ఘటన నేపథ్యంలో నలుగురు బీజేపీ నేతలపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలని జస్టిస్ మురళీధర్ నేతృత్వంలోని ధర్మాసనం బుధవారం ఆదేశించిన విషయం తెలిసిందే. 1984 లాంటి సిక్కు అల్లర్ల పరిస్థితి పునరావృతంకాకుండా చూడాలని ఆయన ఆదేశించారు.
జస్టిస్ మురళీధర్ నేపథ్యమేంటి?
సుప్రీంకోర్టు కొలీజియం ఈ నెల 12న జస్టిస్ మురళీధర్‌ను బదిలీకి సిఫార్సు చేసింది. న్యాయమూర్తి బదిలీని వ్యతిరేకిస్తున్న న్యాయవాదులు ఈ నెల 20న నిరసన ప్రదర్శన చేశారు. ఢిల్లీ బార్ అసోసియేషన్ కూడా బదిలీని ఖండిస్తూ ఇటీవల ఓ తీర్మానం చేసింది. సుప్రీంకోర్టు కొలీజియంకు తమ వైఖరిని బార్ అసోసియేషన్ స్పష్టంచేసింది. జస్టిస్ మురళీధర్ చాలా సీనియర్ న్యాయమూర్తి అనీ, ఆయన్ను ఈ తరహాలో బదిలీ చేయడం సముచితం కాదని బార్ అసోసియేషన్ అధ్యక్షుడు మోహిత్ మయూర్ అన్నారు. 1984లో చెన్నైలో న్యాయవాద వృత్తిని ఎస్ మురళీధర్ ప్రారంభించారు. 1987 నుంచి ఢిల్లీ హైకోర్టు, సుప్రీంకోర్టుల్లో న్యాయవాదిగా ప్రాక్టీసు ప్రారంభించారు. ఎటువంటి ఫీజు తీసుకోకుండా కేసులు వాదించారు. అలా వాదించిన కేసుల్లో భోపాల్ గ్యాస్ విషాదం, నర్మదా ఆనకట్ట వంటివి ఉన్నాయి. పలు ప్రజాప్రయోజన వ్యాజ్యాల్లో సుప్రీంకోర్టు ఆయన్ను న్యాయ మిత్రగా నియమించింది. 2006లో ఆయన ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు.
Courtesy Nava Telangana