పరిహారం.. పరిహాసమే..

0
235

ఐదు నెలలైనా ఢిల్లీ అల్లర్ల బాధితులకు అందని సాయం
ఆఫీసుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్న వైనం

న్యూఢిల్లీ : దేశ రాజధానిలో మత ఘర్షణలు చోటుచేసుకుని ఐదు నెలలు కావస్తున్నా బాధితులకు నష్టపరిహారం ఇంకా అందలేదు. ఈ ఏడాది ఫిబ్రవరి 23 నుంచి 26 మధ్య ఈశాన్య ఢిల్లీలో జరిగిన అల్లర్లలో 53 మంది మరణించగా.. వందలాది మంది క్షతగాత్రులయ్యారు. కాగా, అల్లర్ల కారణంగా సర్వం కోల్పోయిన బాధితులను ఆదుకుంటామని బీజేపీ, ఆప్‌ సర్కారులు ప్రకటించినా.. ఇప్పటికీ దానికి సంబంధించిన నమోదు ప్రక్రియ కూడా పూర్తికాకపోవడం గమనార్హం.

నష్టపరిహారం కోరుతూ మొత్తం 3,200 కంప్లెయింట్లు రాగా.. జూన్‌ చివరినాటికి వాటిలో 1,700 ఆమోదించారు. 700 పెండింగ్‌లో ఉండగా.. 900 ఫిర్యాదులను అధికారులు నిరాకరించారు. అల్లర్ల కారణంగా భారీ ఆస్తి నష్టం వాటిల్లిందని ప్రభుత్వమే అంచనా వేయగా.. ఇప్పటిదాకా రూ. 20 కోట్లను మాత్రమే పరిహారంగా అందించారు. గాయాలపాలై పరిహారం కోరినవారిలో.. 359 ఫిర్యాదులకు గానూ 105 పెండింగ్‌లోనే ఉన్నాయి. ఇండ్లు ధ్వంసమైన కేసులలో 150కి పైగా ఫిర్యాదులను పరిష్కరించాల్సి ఉంది. దుకాణాలు, ఆస్తుల ధ్వంసమైన 2,700 ఫిర్యాదుల్లో 900 కంప్లెయింట్లను తిరస్కరించారు. లాక్‌డౌన్‌ నిబంధనల పేరు చెప్పి అధికారులు ఫైళ్లను ముందుకు తీసుకెళ్లడం లేదని బాధితులు వాపోతున్నారు.
అల్లరి మూక చేసిన దాడికి ఈశాన్య ఢిల్లీలోని హపూర్‌ బీజేపీ మైనారిటీ సెల్‌ ఆఫీస్‌ బేరర్‌ మోహిసిన్‌ సైతం ప్రాణాలు కోల్పోయాడు. ఢిల్లీ సర్కారు అతడికి రూ. 9 లక్షల నష్టపరిహారం అందిస్తామని హామీ ఇచ్చింది.

ఇదే విషయమై అతడి కుటుంబసభ్యులు స్పందిస్తూ.. ‘మోహిసిన్‌ మరణ ధృవీకరణ పత్రం లేదని మాకు నష్టపరిహారం అందడం లేదు. సంబంధిత పత్రం కోసం క్రైం బ్రాంచి పోలీసులు మమ్మల్ని ఖజూరి కాస్‌ పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లమని సూచించారు. అక్కడికెళ్తే వాళ్లు ఈశాన్య ఢిల్లీ మున్సిపల్‌ కార్పొరేషన్‌ కార్యాలయానికి వెళ్లమన్నారు. మున్సిపల్‌ అధికారులు లోక్‌నాయక్‌ ఆస్పత్రికి పంపారు. బాధితుడి తండ్రి ఆదివారం కూడా ప్రభుత్వ ఆఫీసుల చుట్టూ తిరిగాడు. ఇప్పటికీ మాకు మోహిసిన్‌ డెత్‌ సర్టిఫికెట్‌ రాలేదు. అది ఇంకెన్ని రోజులు పడుతుందో తెలియదు. అతడు చనిపోయినప్పటి నుంచీ మా కుటుంబానికి జీవనాధారం పోయింది. లాక్‌డౌన్‌ కారణంగా బయట ఏం పనిచేయడానికి రావడం లేదు. మేమెలా బతకాలి..?’ అని ప్రశ్నించారు.

ఘర్షణల్లో చనిపోయిన అకీబ్‌ తండ్రి మాట్లాడుతూ.. ‘భగీరథి విహార్‌లోని ఒక అద్దె ఇంట్లో ఉండేవాళ్లం. ఏప్రిల్‌లో నా కూతురు పెండ్లి ఉండటంతో ఫిబ్రవరి 24న ఆకీబ్‌ బట్టలు కొనడానికి బయటకు వెళ్లాడు. కానీ తిరిగిరాలేదు. అల్లర్లలో గాయాలపాలై మార్చి 2న చనిపోయాడు. పరిహారం ఇప్పిస్తామని అధికారులు చెప్పారు. కానీ ఇంతవరకూ అది ఎక్కడిదాకా వచ్చిందో తెలియడం లేదు’ అని అంటూ ఆవేదనకు గురయ్యాడు. తన భార్య ఒంటి మీద ఉన్న కొద్దిపాటి బంగారాన్ని అమ్మి కుటుంబాన్ని నెట్టుకొస్తున్నానని తెలిపాడు.

అల్లర్లలో ప్రాణాలు కోల్పోయిన వారికి రూ. 10 లక్షలు, తీవ్ర గాయాలకు రూ. 2 లక్షలు, స్వల్ప గాయాలకు రూ. 20 వేలు.. ఇండ్లు, దుకాణాలు కోల్పోతే రూ. 5 లక్షలు, అవి బాగా దెబ్బతింటే రూ. 2.5 లక్షలు ఇస్తామని ఢిల్లీ ప్రభుత్వం ప్రకటించిన విషయం విదితమే.

Courtesy Nava Telangana

Leave a Reply