నోట్లరద్దు అట్టర్ ఫ్లాప్..

0
178

– 4 నవంబర్‌ 2016లో నగదు చలామణి రూ.17.7 లక్షల కోట్లు..
ఆరేండ్ల తర్వాత.. రూ.30.88 లక్షల కోట్లు
అవినీతి, నల్లధనంపై కేంద్రం చెప్పినవన్నీ కాకమ్మ కథలు : ఆర్థిక నిపుణులు

న్యూఢిల్లీ : మోడీ సర్కార్‌ నవంబర్‌ 8, 2016లో చేపట్టిన నోట్ల రద్దు ప్రక్రియ పేదలు, సామాన్యుల్ని ఎంతగానో ఇక్కట్లకు గురిచేసింది. రూ.500, రూ.1000 నోట్లరద్దుతో చిన్న, సూక్ష్మ, మధ్యతరహా పరిశ్రమలు దెబ్బతిని..కోట్లాది మంది రోడ్డున పడ్డారు. నోట్లరద్దు నిర్ణయం ఎంత అట్టర్‌ ఫ్లాప్‌ అయ్యిందో అందరికీ తెలుసు. ఈ నిర్ణయం తీసుకున్న సమయంలో జాతినుద్దేశించి ప్రసంగించిన ప్రధాని మోడీ, అప్పుడు చెప్పినదానికి..ఇప్పుడు జరుగుతున్నదానికి పొంతన లేదు.

అవినీతిని రూపుమాపటం, నల్లధనాన్ని వెలికి తీయటం కోసమే నోట్లరద్దు చేశామన్నారు. తక్కువ నగదు చలామణి గల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దటమే నోట్లరద్దు లక్ష్యమని కేంద్రం పలుమార్లు ప్రకటించింది. అయితే ఇందులో ఇసుమంతైనా నిజం లేదని తాజా గణాంకాలు చెబుతున్నాయి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా రూ.30.88 లక్షల కోట్ల విలువైన నగదు చలామణిలో ఉందని రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా డేటా చెబుతోంది. దీని ప్రకారం అక్టోబర్‌ 21, 2022 నాటికి ఆర్థిక వ్యవస్థలో నగదు రూపంలో చలామణిలో ఉన్న నోట్ల విలువ రూ.30.88 లక్షల కోట్లు. నవంబర్‌ 4, 2016లో (నోట్లరద్దుకు ముందు) నగదు చలామణి కేవలం రూ.17.7 లక్షల కోట్లు. ఆరేండ్ల క్రితంనాటితో పోల్చితే…నగదు చలామణి 71.84శాతం పెరిగింది. ఆర్థిక వ్యవస్థలో నగదు వినియోగం అనూహ్యంగా పెరిగిందనేది సుస్పష్టం.

కరెన్సీ లావాదేవీలు, వస్తువులు, సేవల కొనుగోలుకు వాడే నోట్లు, నాణెలను లెక్కించి ఆర్‌బీఐ డేటా విడుదల చేస్తోంది. నోట్ల రద్దు తర్వాత డిజిటల్‌ మోడ్‌లోనూ ఆర్థిక లావాదేవీలు మొదలయ్యాయి. ఆరేండ్ల తర్వాత ఇవి అనూహ్యస్థాయికి చేరుకున్నాయి. కోవిడ్‌ సంక్షోభం కారణంగా డిజిటల్‌ లావాదేవీలు ఎన్నోరెట్లు పెరిగాయి.నోట్లరద్దు నిర్ణయాన్ని దేశ, విదేశాల్లోని ఎంతోమంది ఆర్థికవేత్తలు, నిపుణులు వ్యతిరేకించారు.

ఇది పూర్తిగా రాజకీయ ఉద్దేశంతో కూడుకున్నదని విమర్శించారు. నల్లధనం, అవినీతి ఎన్నో రెట్లు పెరిగిందేగానీ, తగ్గలేదు. దర్యాప్తు ఏజెన్సీల దాడుల్లో నోట్ల కట్టలు, సంచులు దొరుకుతున్నాయి. నగదు చలామణి అనూహ్యంగా పెరగటమేగాక, డిజిటిల్‌ చెల్లింపులు సైతం ఎన్నోరెట్లు ఉన్నాయి.

స్థూల దేశీయోత్పత్తిలో (జీడీపీ)కి, నగదు చలామణికి మధ్య ఉన్న సంబంధంలో నగదు చలామణి భారీగా పెరిగింది. అదే స్థాయిలో ఆర్థిక వృద్ధి మాత్రం నమోదు కాలేదు. ఆర్థిక వ్యవస్థలో నగదు చలామణి భారీగా పెరగటం ద్రవ్యోల్బణానికి దారితీస్తుందన్నది తెలిసిందే. ఇప్పుడు దీనిని అరికట్టలేక ఆర్‌బీఐ చేతులెత్తేసింది.

Leave a Reply