పార్లమెంటు ఆవరణలో ధర్నాలు, నిరసనలు బంద్‌

0
78
  • రాజ్యసభ సర్క్యులర్‌.. విపక్షాల ఆగ్రహం
  • నిజాలు నిర్ధారించుకోకుండా ఆరోపణలు చేయొద్దు: స్పీకర్‌

న్యూఢిల్లీ : ‘అన్‌పార్లమెంటరీ’ పదాలపై వివాదం సద్దుమణగకముందే మరో వివాదం తెరపైకి వచ్చింది. పార్లమెంటు భవనం ఆవరణలో ధర్నాలు, నిరసనలు, సమ్మెలు, నిరాహార దీక్షలు చేయరాదని రాజ్యసభ స్పష్టం చేసింది. ఎలాంటి మతపరమైన వేడుకలు కూడా నిర్వహించరాదని రాజ్యసభ సెక్రటరీ జనరల్‌ పీసీ మోదీ సర్క్యులర్‌ జారీచేశారు. దీనిపై ప్రతిపక్షాలు శుక్రవారం మండిపడ్డాయి. ఇది ప్రజాస్వామ్య గొంతుకను అణచివేసే ప్రయత్నమేనని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత జైరాం రమేశ్‌, సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి ధ్వజమెత్తారు. పార్లమెంటు ఆవరణలో నిరసన తెలపడం ఎంపీల హక్కని.. దానిని ఉల్లంఘిస్తున్నారని దుయ్యబట్టారు.

ఈ విషయంలో రాజ్యసభ చైర్మన్‌, లోక్‌సభ స్పీకర్‌ తక్షణం జోక్యం చేసుకోవాలని ఆర్‌జేడీ నేత మనోజ్‌ ఝా డిమాండ్‌ చేశారు. దీని తర్వాత పార్లమెంటరీ ప్రశ్నలను నియంత్రిస్తారేమోనని శివసేన ఎంపీ ప్రియాంక చతుర్వేది వ్యాఖ్యానించారు. అయితే ప్రతి సమావేశాలకు ముందు ఇలాంటి నోటీసులు ఇవ్వడం రొటీనేనని రాజ్యసభ సచివాలయం స్పష్టం చేసింది. 2013లో కాంగ్రెస్‌ సారథ్యంలోని యూపీఏ ప్రభుత్వ హయాంలో జారీచేసిన సర్క్యులర్‌ ప్రతులను విడుదల చేసింది. విపక్షాల విమర్శలపై లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా స్పందించారు. వాస్తవాలు తెలుసుకోకుండా ఆరోపణలు చేయొద్దని హితవు పలికారు. ఇలాంటి సర్క్యులర్లు ఎన్నో ఏళ్లుగా విడుదలవుతున్నాయని గుర్తుచేశారు. విపక్షాలు గతంలో పార్లమెంటు ప్రాంగణంలో, మహాత్మాగాంధీ విగ్రహం వద్ద నిరసనలు తెలిపిన సంగతి తెలిసిందే.

Leave a Reply