వ్యాక్సిన్‌.. మనకొస్తుందా? రాదా?

0
283
  • భారత్‌ బయోటెక్‌కు ఐసీఎంఆర్‌ సహకారం.. ఎప్పుడొచ్చినా.. మనకే తొలి వ్యాక్సిన్‌!.. భారత ప్రభుత్వానికి అధికారాలెన్నో.. తేల్చి చెబుతున్న నిపుణులు
  • 9 కోట్ల డోసులకు బ్రిటన్‌ ముందే ఒప్పందం
  • 100 కోట్లు డోసుల తయారీకి సీరం ఏర్పాట్లు!
  • అన్నీ భారత్‌  సహా అభివృద్ధి చెందుతున్న దేశాలకే

ఆక్స్‌ఫర్డ్‌ వర్సిటీ-ఆస్ట్రాజెనెకా అభివృద్ధి చేసిన వెక్టర్‌ (ఎడినోవైరస్‌) వ్యాక్సిన్‌.. బయోఎన్‌టెక్‌/ఫైజర్‌, ఇంపీరియల్‌ కాలేజ్‌ అభివృద్ధి చేసిన ఎంఆర్‌ఎన్‌ఏ వ్యాక్సిన్‌, ఫ్రాన్స్‌కు చెందిన వాల్నెవా సంస్థ తయారు చేసిన ఇనాక్టివేటెడ్‌ హోల్‌ వైరస్‌ వ్యాక్సిన్‌.. ఈ మూడిట్లో ఏది ఉత్పత్తి దశకు వచ్చినా బ్రిటన్‌కు విక్రయించాల్సిందే! మూడూ కలిపి తొలి దశలో 9 కోట్ల వ్యాక్సిన్‌ డోసులు కొనుగోలు చేయడానికి ఆయా సంస్థలతో బోరిస్‌ జాన్సన్‌ సర్కారు ఒప్పందం చేసుకుంది!

ఇక అమెరికా 2021 జనవరికల్లా వ్యాక్సిన్‌ అందుబాటులోకి తేవడమే లక్ష్యంగా ‘ఆపరేషన్‌ వార్ప్‌ స్పీడ్‌’ పేరుతో మోడెర్నా కంపెనీకి సాయం అందిస్తోంది! ఆక్స్‌ఫర్డ్‌-ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్‌ను 4 కోట్ల డోసుల మేర కొనుగోలు చేసేందుకు ఫ్రాన్స్‌, జర్మనీ, ఇటలీ, నెదర్లాండ్స్‌ దేశాలతో కూడిన ‘ఇంక్లూజివ్‌ వ్యాక్సిన్స్‌ అలయెన్స్‌’ ఒప్పందం కుదుర్చుకుంది. మరి మన పరిస్థితి ఏమిటి? 130 కోట్లకు పైగా జనాభా ఉన్న భారతదేశానికి కావాల్సిన వ్యాక్సిన్లు అందుబాటులో ఉంటాయా? భారత్‌ బయోటెక్‌, జైడస్‌ క్యాడిలా వంటి సంస్థలు అభివృద్ధి చేసిన వ్యాక్సిన్లలో మన వాటాగా ఎన్నొస్తాయి?ఇలా ఎన్నో సందేహాలు. వాటికి నిపుణుల సమాధానాలు..

కొవిడ్‌-19ను కట్టడి చేసే వ్యాక్సిన్‌ అభివృద్ధికి ప్రపంచవ్యాప్తంగా 150 కంపెనీలు, పరిశోధన సంస్థలు ప్రయత్నిస్తున్నాయి. అందులో 15లోపు సంస్థలు మాత్రమే మానవ ప్రయోగాల దశకు చేరాయి. ఆక్స్‌ఫర్డ్‌ విశ్వవిద్యాలయం, భారత్‌ బయోటెక్‌, మోడెర్నా కంపెనీలు ఇప్పటికే మానవ పరీక్షలు మొదలుపెట్టాయి. మనదేశంలో భారత్‌ బయోటెక్‌ చేస్తున్న మానవ పరీక్షలు మొదటి దశలో ఉంటే.. మోడెర్నా చేస్తున్న పరీక్షలు చివరి దశకు చేరుకున్నాయి.

రష్యా అయితే వచ్చే నెల్లోనే వ్యాక్సిన్‌ను అందుబాటులోకి తెచ్చేస్తానని చెబుతోంది. దీంతో ఈ కంపెనీల నుంచి వీలైనన్ని డోసులను కొనుగోలు చేయటానికి బ్రిటన్‌, అమెరికా వంటి ధనిక దేశాలు ప్రయత్నాలు ప్రారంభించాయి. బ్రిటన్‌తో ఆక్స్‌ఫర్డ్‌ విశ్వవిద్యాలయం కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం- వ్యాక్సిన్‌ విజయవంతమైతే వచ్చే ఏడాది చివరి నాటికి 10 కోట్ల వ్యాక్సిన్‌ డోసులను సరఫరా చేయాల్సి ఉంటుంది. ఈ ఒప్పందాల ప్రకారం.. వచ్చే ఏడాది చివరి నాటికి బ్రిటన్‌ వద్ద 23 కోట్ల వ్యాక్సిన్‌ డోసులు అందుబాటులో ఉంటాయి.

మనమెక్కడ..
మన దేశంలో 7 కంపెనీలు వ్యాక్సిన్‌ను తయారుచేయటానికి ప్రయత్నిస్తున్నాయి. భారత్‌ బయోటెక్‌ కోవ్యాక్సిన్‌ను 375 మంది వలంటీర్లపై పరీక్షించడం మొదలయింది.  వ్యాక్సిన్‌ విజయవంతమయితే తొలి దశలో 3-5 కోట్ల డోస్‌ల ఉత్పత్తికి సిద్ధంగా ఉన్నామని ఈ కంపెనీ ప్రకటించింది. జైడస్‌ క్యాడిలా కంపెనీ కూడా త్వరలోనే వ్యాక్సిన్‌ పరీక్షలను ప్రారంభించనుంది. వ్యాక్సిన్‌ తయారీకి ఆక్స్‌ఫర్డ్‌ విశ్వవిద్యాలయంతో ఒప్పందం కుదుర్చుకున్న సీరం ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా కూడా వచ్చే నెల నుంచి తొలి దశ మానవ పరీక్షలను ప్రారంభించాలని నిర్ణయించింది. వీటిలో కోవ్యాక్సిన్‌ను భారత్‌ బయోటెక్‌ సంస్థ ఐసీఎంఆర్‌ సహాయంతో అభివృద్ధి చేసింది. కాబట్టి ఐసీఎంఆర్‌కు కూడా దానిపై హక్కులుంటాయని సంబంధిత నిపుణులు చెబుతున్నారు.

‘‘మేధో సంపత్తి హక్కులు సాధారణంగా కంపెనీ వద్దే ఉంటాయి. ఐసీఎంఆర్‌ కూడా భాగస్వామి కాబట్టి  దానికీ కొన్ని హక్కులుంటాయి. అవేమిటనే విషయం మనకు ఒప్పందాలను చూస్తే తప్ప తెలియదు. చట్టప్రకారం ప్రభుత్వానికి సంక్రమించే ఆ హక్కులను ఎవరైనా అంగీకరించాల్సిందే! ముఖ్యంగా ఫార్మా రంగంలో వీటిని చాలా జాగ్రత్తగా అమలు చేస్తూ ఉంటారు. కొవిడ్‌ వ్యాక్సిన్‌ విషయంలో సమస్యలు ఉంటాయని నేను భావించట్లేదు. మనకు అవసరమైనన్ని డోస్‌లు అందుబాటులోకి వస్తాయనుకుంటున్నా’’ అని ఆరోగ్య శాస్త్ర విశ్లేషకుడు అనంతభాన్‌ పేర్కొన్నారు.

మన దేశంలో అభివృద్ధి చేస్తున్న వ్యాక్సిన్లు ముందు మనవద్దే విడుదల అయ్యే అవకాశముందని టెక్నాలజీ డెవల్‌పమెంట్‌ బోర్డుకు చెందిన మాజీ  ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు. ‘‘వ్యాక్సిన్ల అభివృద్ధిని ఒక కీలకమైన చోదక శక్తిగా ప్రభుత్వం ఎప్పుడో గుర్తించింది. టెక్నాలజీ డెవల్‌పమెంట్‌ బోర్డు (టీడీబీ), డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ బయోటెక్నాలజీ (డీబీటీ)లు చాలా కాలంగా మన దేశంలో అనేక కంపెనీల పరిశోధనలకు నిధులు అందిస్తున్నాయి.

కొవిడ్‌ వ్యాక్సిన్‌ను ఐసీఎంఆర్‌ సహకారంతో అభివృద్ధి చేస్తున్నామని భారత్‌ బయోటెక్‌ ఇప్పటికే ప్రకటించింది.   సాధారణంగా ఇలాంటి ఒప్పందాలు కుదుర్చుకున్నప్పుడు మొదటి ప్రాధాన్యం ఎవరికి ఇవ్వాలనే విషయం చాలా స్పష్టంగా ఉంటుంది. అందువల్ల భారత బయోటెక్‌ తయారుచేసే వ్యాక్సిన్‌ను మొదట మన దేశంలోనే విడుదల చేస్తారనుకుంటున్నా. ఇక మిగిలిన కంపెనీలతో కూడా చర్చలు ప్రారంభించాలని ప్రభుత్వం యోచిస్తోంది.’’ అని టీడీబీకి చెందిన ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు.

ప్రైవేట్‌ రంగం ద్వారా కూడా..
ఆక్స్‌ఫర్డ్‌ విశ్వవిద్యాలయంతో ఒప్పందం కుదుర్చుకున్న సీరం సంస్థ కూడా తాము 100 కోట్ల డోస్‌లను ఉత్పత్తి చేస్తామని ప్రకటించింది. ఈ డోస్‌లను భారత్‌కు, తక్కువ ఆదాయం ఉన్న దేశాలకు అందిస్తామని కూడా వెల్లడించింది. ‘‘మన దేశంలో తయారుచేసే వ్యాక్సిన్లను నియంత్రించటానికి అవసరమైన అధికారాలన్నీ ప్రభుత్వానికి ఉన్నాయి.  ఉదాహరణకు ప్రజలకు ఒక మందు కానీ, వ్యాక్సిన్‌ కానీ అవసరమైందనుకుందాం.

దానిని ఎన్ని డోసులు తయారుచేయాలి? ఖరీదు ఎంత ఉండాలనే విషయాన్ని కొన్నిసార్లు ప్రభుత్వం నిర్దేశిస్తుంది. ఉదాహరణకు ఒక కంపెనీ కేన్సర్‌ ఔషధానికి వెయ్యి రూపాయల ధర పెట్టిందనుకుందాం. దానికి ప్రభుత్వ అనుమతి ఉండాలి. వెయ్యి రూపాయలు ఎక్కువ ధర అని ప్రభుత్వం భావిస్తే దానిని తగ్గించాల్సిందిగాకంపెనీని ఆదేశించే అధికారం ప్రభుత్వానికి ఉంది. కొవిడ్‌ వ్యాక్సిన్‌ ధరను ప్రభుత్వమే నిర్ణయిస్తుందనటంలో ఎటువంటి సందేహం లేదు’’ అని టీడీబీ ఉన్నతాధికారి వ్యాఖ్యానించారు.

కొవిడ్‌ వ్యాక్సినేషన్‌పై ముందస్తు వ్యూహం మేలు… బయోకాన్‌ అధినేత్రి కిరణ్‌ మజుందార్‌ షా
బెంగళూరు : కొవిడ్‌-19 వ్యాక్సిన్‌ అందుబాటులోకి రాగానే.. ప్రజలందరికీ వ్యాక్సినేషన్‌ చేసేందుకు అవసరమైన ప్రణాళికను భారత్‌ ఇప్పుడే సిద్ధం చేసుకోవాలని బయోకాన్‌ కంపెనీ ఎగ్జిక్యూటివ్‌ చైర్‌పర్సన్‌ కిరణ్‌ మజుందార్‌ షా సూచించారు. ఈ డిసెంబరు నుంచి వచ్చే జూన్‌ దాకా ఏ నెలలోనైనా వ్యాక్సిన్‌ అందుబాటులోకి రావచ్చని ఆమె అంచనా వేశారు. ఒక్కొక్కరికి వ్యాక్సిన్‌కు సంబంధించిన రెండు డోసులను వేయాల్సి రావచ్చని.. అది అంత చౌక వ్యవహారమేం కాదని వ్యాఖ్యానించారు. గరిష్ఠ ఇన్ఫెక్షన్‌ ముప్పును ఎదుర్కొంటున్న వర్గాల్లో కనీసం 20 శాతం మందికి వ్యాక్సిన్‌ను చేరవేయగలిగితే.. వైర్‌సను చాలావరకు కట్టడి చేయవచ్చన్నారు.

అంటే 25 కోట్ల మందికి పైగానే!  ‘‘అంత ఖర్చును ప్రభుత్వం భరించగలదా?’’ అని కిరణ్‌ మజుందార్‌ షా ప్రశ్నించారు. తక్కువ సమయంలో వందల కోట్ల వ్యాక్సిన్‌ డోసుల ఉత్పత్తి అసాధ్యమని.. ఈనేపథ్యంలో దేశంలోని 130 కోట్ల జనాభాకు సరిపడా వ్యాక్సిన్లను ఒకే విడతలో అందించే పరిస్థితి ఉండదని పేర్కొన్నారు. కాబట్టి. ఎంత తక్కువ మందికి వ్యాక్సిన్‌ వేయగలిగితే ప్రస్తుతానికి సరిపోతుందో ఎపిడమాలజిస్టులు అంచనా వేయాలన్నారు. ‘నెలకు గరిష్ఠంగా 8-10కోట్ల డోసుల వ్యాక్సిన్లను ఉత్పత్తి చేయవచ్చు. ఆ పది కోట్ల డోసులను ఎవరికి ఇవ్వాలి? ఈ ప్రణాళికను రచించుకోవాల్సిన సమయమిది’ అని ఆమె వివరించారు.

Courtesy Andhrajyothi

Leave a Reply