– ఆర్థికంగా, సామాజికంగా.. రాష్ట్రాల హక్కులు గల్లంతు
– పీఎంఓ, హోంశాఖ చెప్పినట్టు వినాల్సిందే : రాజకీయ విశ్లేషకులు
– ఏ నిర్ణయం తీసుకోవాలన్నా కేంద్రం వైపు చూడాల్సిందే!
లాక్‌డౌన్ ప్రకటనకు ముందు మోడీ సర్కార్ అమల్లోకి తీసుకొచ్చిన చట్టం ‘విపత్తు నిర్వహణ చట్టం’. దీని ప్రకారం ఆయా రాష్ట్రాలకు, స్థానిక సంస్థలకు కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. లాక్‌డౌన్ నిబంధనలకు కట్టుబడి ఉండాలన్నది దాంట్లోని సారాంశం. రాష్ట్రస్థాయిలో, జిల్లాస్థాయిలో అధికారాలన్నీ ‘మహమ్మారి నియంత్రించే’ కార్యదళం చేతుల్లోకి వెళ్లిపోయాయి. ఈ కార్యదళం, విపత్తు నిర్వహణ సంస్థ కేంద్ర హోంశాఖ పరిధిలో పనిచేస్తున్నది. న్యూఢిల్లీ : ‘కరోనా మహమ్మారి’ ఈదేశ ప్రజల్ని, ప్రజాస్వామ్యాన్ని ప్రమాదంలో నెట్టిందా? వైరస్ వ్యాప్తిని అరికట్టే పేరుతో మోడీ సర్కార్ చేపట్టిన చర్యలు రాష్ట్రాల్ని బలహీనం చేస్తున్నాయా?…అంటే రాజకీయ విశ్లేషకులు అవుననే చెబుతున్నారు. ఆర్థికంగా రాష్ట్రాలు చితికిపోవటంతో ముందు ముందు ప్రజాస్వామ్యానికి ప్రమాదం పొంచివుందని, కేంద్రం అండదండల కోసం పాలకులు పాకులాడక తప్పదని రాజకీయవిశ్లేషకులు అంచనావేస్తున్నారు.
లాక్‌డౌన్ పేరుతో దేశమంతా పోలీస్ రాజ్యంగా మార్చేశారని సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతున్నది. ప్రతి ఒక్క విషయంలో రాష్ట్రాలు తమపై ఆధారపడేట్టు చేయటమే కేంద్రంలోని పాలకుల ఉద్దేశమని తెలుస్తున్నది. ఎన్నో సందేహాలు, అస్పష్టత నెలకొన్న ‘విపత్తు నిర్వహణ చట్టా’ని మోడీ సర్కార్ ప్రయోగించినప్పుడే రాష్ట్రాలకు గుబులు మొదలైంది. ‘మహమ్మారి వ్యాధులు, 1897’ చట్టాన్ని ప్రయోగించాల్సిందిగా కేంద్రమే రాష్ట్రాలకు సూచించిందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. బ్రిటిష్ కాలంనాటి ‘మహమ్మారి వ్యాధుల’ చట్టం ద్వారా…ఎవర్నైనా, ఎక్కడైనా అరెస్టు చేసే అవకాశం, నిర్బంధించే హక్కు, పోలీస్ బలగాల్ని ప్రయోగించటం…ఇవన్నీ రాష్ట్ర ప్రభుత్వాలకు దఖలుపడ్డాయి. అయితే ఇక్కడ చిన్న కిటుకుంది. రాష్ట్రాలు ఏది చేసినా..అది కేంద్రం కనుసన్నల్లో ఉండాల్సిందే. రాజకీయ, న్యాయ నిపుణులు చెప్పినదాని ప్రకారం, కరోనా వ్యాప్తిని అరికట్టడంపై రాష్ట్రాలు స్వయంగా నిర్ణయాలు తీసుకునే హక్కులేదు. ఉదాహరణకు రాష్ట్రాలకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా మోడీ సర్కార్ మార్చి 24న దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ అమల్లోకి తెచ్చింది. గంటల వ్యవధిలో 135కోట్లమంది ప్రజల్ని ప్రభావితం చేశారు. దేశం యావత్తు ఒక జైలులా మారిపోయింది. భౌతిక దూరం కొత్త చట్టమై కూర్చుంది. కనీస ఆదాయం, తిండి లేకున్నా…ప్రజలు కేంద్రం విధించిన నిబంధనలు పాటించాల్సిన పరిస్థితి కల్పించారు.
అధికారాలన్నీ ప్రధాని వద్దే !
ఆసియా దేశాల్లో సునామీ తలెత్తిన సమయంలో ‘విపత్తు నిర్వహణ చట్టం’ యూపీఏ ప్రభుత్వం తీసుకొచ్చింది. ఈ చట్టం మంచీచెడూ పెద్దగా ఆలోచించకుండా అమల్లోకి తెచ్చారని న్యాయనిపు ణులు అనేకమంది అభిప్రాయపడ్డారు. ఆ తర్వాత దీనిపై ఎవరూ పెద్దగా దృష్టిపెట్టలేదు. ఈ చట్టం లోని ప్రధానమైన అంశం..అత్యున్నత అధికారాలు కేంద్రానికి, ఎన్‌డీఎంఏ సంస్థకు దఖలుపడతాయి. ప్రధాని నేతృత్వంలోని ‘జాతీయ విపత్తు నిర్వహణ సాధికార సంస్థ’ (ఎన్‌డీఎంఏ) పనిచేస్తుంది. సెక్షన్ 35, 62, 72 ప్రకారం దేశంలోని ఏ సంస్థకైనా, ఎవరికైనా, ఎక్కడైనా…కేంద్రం ఆదేశించగలదు. తానిచ్చిన మార్గదర్శకాలు అమలుచేయాలని ఆదేశిస్తుంది. కేంద్ర మంత్రిత్వశాఖలు, రాష్ట్రాలు, రాష్ట్రాల విపత్తు నిర్వహణ సంస్థలు అన్నీ కేంద్రం పరిధిలోకే వస్తాయి. ఆదేశాలు అమలవుతున్నాయా? లేదా? అన్నది ప్రధాని కార్యాలయం, కేంద్ర హోంశాఖ పర్యవేక్షిస్తుంది. దీని ప్రకారం ప్రధాని మోడీ, అమిత్ షా ఈ దేశంలో అత్యంత శక్తిమంతులుగా మారారని, వారి కనుసన్నుల్లో రాష్ట్ర ప్రభుత్వాలు నడుచుకోవాల్సిన పరిస్థితి వచ్చిందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఆర్థికంగా రాష్ట్రాలు ఆదాయాల్ని కోల్పోయి కేంద్రంపై ఆధారపడే పరిస్థితి తీసుకొచ్చారని, మనుగడ కోసం రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజాస్వామ్యాన్ని పక్కకు పెట్టే ప్రమాదముందని ఆందోళన వ్యక్తమవుతున్నది.
Courtesy Nava Telangana