-కోర్టు ధిక్కార నోటీసులపై ప్రశాంత్ భూషణ్ వివరణ
న్యూఢిల్లీ : అంగీకరించలేని, రుచించని అభిప్రాయాన్ని లేదా ఆవేదనను బహిరంగంగా వెలిబుచ్చడం కోర్టు ధిక్కారం కిందకు రాదని పౌరహక్కుల న్యాయవాది ప్రశాంత్ భూషణ్ సుప్రీంకోర్టుకు తెలిపారు. ప్రశాంత్ భూషణ్ చేసిన ట్వీట్లు ప్రధాన న్యాయమూర్తి (సిజెఐ) కార్యాలయంతో పాటు కోర్టు అధికారాన్ని అగౌరవపరచి, న్యాయ వ్యవస్థ ప్రతిష్టకు భంగపరిచే విధంగా ఉన్నాయంటూ సుమోటోగా స్వీకరించిన జస్టిస్ అరుణ్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం ఈ నెల 22న ఆయనకు కోర్టు ధిక్కార నోటీసులు జారీ చేసింది. దీనికి సమాధానంగా ఆయన పైవిధంగా వివరణిచ్చారు. ఈ ట్వీట్లలో ఒకటి మోటారు వాహనంపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి శరద్ ఎ బాబ్డే ఉన్న చిత్రం కాగా, మరోటి గత ఆరు ఏళ్లుగా నలుగురు ప్రధాన న్యాయమూర్తులు ఆధ్వర్యంలో సుప్రీంకోర్టు పనితీరు గురించి ఆయన వ్యక్తం చేసిన అభిప్రాయానికి సంబంధించినది. ప్రశాంత్ భూషణ్‌కు కోర్టుధిక్కరణ నోటీసులను సవాలు చేస్తూ ప్రముఖ సీనియర్ జర్నలిస్టులు. ఎన్. రామ్, అరుణ్ వౌరీ రిట్ పిటిషన్ దాఖలు చేసిన సంగతి విదితమే.
ప్రధాన న్యాయమూర్తి అనేవారు న్యాయస్థానం కాదు. కోర్టు సెలవుల్లో ఒక సిఐజె ప్రవర్తించే తీరుకు సంబంధించిన సమస్యలను లేవనెత్తడం లేదా నలుగురు గత సిజెఐల పనితీరుపై, అదేవిధంగా అధికారవాదం, మెజార్టీవాదం, అసమ్మతిని అరికట్టడం, విస్తృతమైన రాజకీయ ఖైదు మొదలైన వాటిని వ్యాప్తిని అనుమతించే ‘మాస్టర్ ఆఫ్ రోస్టర్’గా అధికారాలను వినియోగించడంలో విఫలం కావడంపై ఆందోళన వ్యక్తం చేయడాన్ని కోర్టు అధికారాలను కించపరచం లేదా తగ్గించడం కిందకు రాదు’ అని భూషణ్ తెలిపారు.
మద్రాస్ హైకోర్టు మాజీ జడ్జి కెఎస్ కరణ్‌పై దాఖలకైన కోర్టు ధికార్క కేసులో సుప్రీంకోర్టులోని రాజ్యాంగ ధర్మాసనం చేసిన వ్యాఖ్యలను ఈ సందర్భంగా ఉటంకించారు. ‘ప్రజాభిప్రాయాలకు భయపడి న్యాయమూర్తుల రక్షణ కోసం ఈ కోర్టు ధిక్కారాన్ని రూపొందించలేదు. న్యాయమూర్తులు ఎంతో క్షమ, ఓర్పుతో ఉండాలని, విపత్కర పరిస్థితులను కూడా తట్టుకునే స్థైర్యాన్ని కలిగి ఉండాలి’ అని పేర్కొన్నారు. భావవ్యక్తీకరణ, స్వేచ్ఛ అనేవి రాజ్యాంగం అందించిన విలువైన సంపదలని, కోర్టు ధిక్కార అధికారాలను సుప్రీంకోర్టు వినియోగించడంలో సహేతుకమైన ఆంక్షలకు మించి ఉండరాదని తెలిపారు. ఆర్టికల్ 129 ప్రకారం ధిక్కార అధికారం న్యాయ పరిపాలనలో సాయపడేందుకు ఉపయోగపడుతుందని అన్నారు. సుప్రీంకోర్టు కమిషన్లు, లోపాల గురించి బాగా తెలిసిన పౌరుల విశ్వసనీయతతో కూడిన విమర్శలను అరికట్టేందుకు ధిక్కార అధికారాలపై ఒత్తిడి తీసుకురావడం సబబు కాదని సూచించారు.
గణనీయంగా దెబ్బతింటున్న ప్రజాస్వామ్యం
గత ఆరేళ్లుగా భారత్‌లో ప్రజాస్వామ్యం ఊహించని రీతిలో దెబ్బతింటోందని ట్వీట్ తొలి భాగంలో అభిప్రాయాన్ని వ్యక్తం చేశానని, ఆ ప్రజాస్వామ్యం నాశనం కావడంలో సుప్రీంకోర్టు గణనీయమైన పాత్ర పోషించిందని రెండవ భాగంలో తెలిపానని,. ఇక చివరిగా..గత నాలుగు ప్రధాన న్యాయమూర్తుల పనితీరుపై తన అసంతృప్తిని వ్యక్తం చేశానని పేర్కొన్నారు. రాజ్యాంగ వ్యవస్థల వ్యవహారాలపై స్వేచ్ఛగా చర్చించే హక్కు ప్రజాస్వామ్యంలో ప్రతి పౌరునికి ఉందని, వ్యవస్థలను సంస్కరించేందుకు వారి అభిప్రాయాలను ఎంతో ఉపయోగపడతాయని సమాధానమిచ్చారు. తాను బహిరంగంగా విమర్శలు చేశానని, అయితే ఆచితూచి, బాధ్యతతో రూపొందించిన విమర్శలని స్పష్టం చేశారు. గతంలో కూడా అసమ్మతిని అణచివేయడంపై సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తులు సైతం ఆందోళన వ్యక్తం చేశారని పేర్కొన్నారు. అసమ్మతి తెలిపిన వారిని దేశ ద్రోహులని సుప్రీంకోర్టు న్యాయమూర్తి చంద్రచూడ్ పేర్కొనడంపై ఆవేదన వ్యక్తం చేశారు. 2018లో ప్రజాస్వామ్యానికి ముప్పు వాటిల్లుతుందని అప్పటి న్యాయమూర్తులు అసమ్మతి వ్యక్తం చేయడాన్ని ఈ సందర్భంగా భూషణ్ మననం చేశారు.
Courtesy Nava Telangana