చేగువేరాను టీ షర్టులకు పరిమితం చేయొద్దు

0
160
  • ఫొటోలపై ఉన్న ఆసక్తి ఆయన ఆశయ సాధనలో చూపాలి: చేగువేరా కుమార్తె డాక్టర్‌ అలైదా గువేరా
  • ఒక దేశంపై మరో దేశం దాడి తగదు: జస్టిస్‌ రాధారాణి
  • ఎన్నడూ లేనంతగా అసమానతలు: హరగోపాల్‌
  • ‘లౌకిక’ను తొలగించాలని కేంద్రం యత్నం: వినోద్‌కుమార్‌

హైదరాబాద్‌ సిటీ : క్యూబా విముక్తి పోరాట యోధుడు చేగువేరాను టీ షర్టులు, ఫొటోలకు పరిమితం చేయొద్దని ఆయన కుమార్తె డాక్టర్‌ అలైదా గువేరా కోరారు. ఆయన ఆశయాలను ముందుకుతీసుకెళ్లాలని సూచించారు. ఆదివారం రవీంద్ర భారతిలో నిర్వహించిన క్యూబా సంఘీభావ సభకు అలైదా, ఆమె కుమార్తె ప్రొఫెసర్‌ ఎస్తఫానియా హాజరయ్యారు. అలైదా మాట్లాడుతూ చేగువేరా ఫొటోలపై చూపించే ఆసక్తి ఆయన ఆశయ సాధనలో చూపాలని చెప్పారు. క్యూబా మహిళనైనందుకు గర్వపడుతున్నాని, తనను చేగువేరా కూతురిగా కాకుండా క్యూబా మహిళగానే చూడాలని కోరారు. క్యూబాలోని వనరులకు ప్రజలే యజమానులని చెప్పారు. ప్రపంచంలో పలు దేశాల వనరులు దోచుకుంటున్న అమెరికా క్యూబా ధైర్యాన్ని చూసి భయపడుతోందన్నారు. క్యూబాను స్ఫూర్తిగా తీసుకుని ఇతర దేశాలు ప్రతిఘటిస్తాయన్న ఆందోళన అమెరికాకు ఉందని, దాంతో క్యూబాను ఆర్థిక దిగ్బంధం చేస్తోందన్నారు. ప్రజల ఐక్యతతోనే అమెరికాకు ఎదురొడ్డుతున్నామని, ప్రజల శక్తి ఎవరూ అడ్డుకోలేరన్నారు. క్యూబా మహిళలు అన్నీ రకాలుగా సమానత్వాన్ని అనుభవిస్తున్నారని తెలిపారు.

ఏ దేశమైనా ముందుకుపోవాలంటే విద్య అవసరమని, క్యూబాలో చదువుకు ఎక్కువ ప్రాధాన్యత ఉంటుందన్నారు. ఏ దేశం కూడా ఇంకో దేశంపై దాడి చేయడానికి వీల్లేదని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ రాధారాణి అన్నారు. అమెరికా, రష్యా తదితర దేశాలు ఇతర దేశాలపై దాడి చేయడం వల్ల ఎన్నో దుష్ఫలితాలు ఎదురవుతున్నాయని అన్నారు. క్యూబా ఎంతోమంది డాక్టర్లను తయారుచేయడమే కాకుండా కరోనా కష్టకాలంలో పలు దేశాలకు పంపిందన్నారు. క్యూబా తరహాలో విద్య, వైద్యాన్ని ప్రజలకు చేరవేయడంలో విఫలమయ్యామన్నారు. దేశంలో ఆర్థికాభివృద్ధి పేరుతో ప్రస్తుతం సృష్టించిన అసమానతలు గతంలో ఎప్పుడూ లేవని ప్రొఫెసర్‌ హరగోపాల్‌ ఆందోళన వ్యక్తం చేశారు. సామ్రాజ్యవాద ఆఽధిపత్యంలో దేశ ఆర్థిక వ్యవస్థ ఉందన్నారు. రాజ్యాంగం పీఠికలో ఉన్న లౌకిక, సామ్యవాదం పదాలను తొలగించాలని కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోందని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్‌ ఆరోపించారు. ఆర్థిక అంతరాలు పెరుగుతున్న తరుణంలో సామాజిక స్పృహ, మార్క్సిస్టు ఆలోచనా విధానంతో ముందుకుపోవాలన్నారు. ‘ఆంధ్రజ్యోతి’ ఎడిటర్‌ కె.శ్రీనివాస్‌ మాట్లాడుతూ ఎదురొడ్డి పోరాడే సందర్భంలో మరణించడానికి నిరాకరించిన విప్లవకారుడు చేగువేరా అని, ఓడిపోవడానికి నిరాకరించిన గొప్ప దేశం క్యూబా అని అన్నారు. ప్రపంచంలో తనపై ఎవరూ పెత్తనం చేయకూడదని క్యూబా గట్టిగా నిలబడడం చూస్తుంటే మనకు కూడా అంతటి ఆత్మగౌరవం ఉంటే బాగుండననిపిస్తుందన్నారు. మన పాలకులు ప్రజల పట్ల పీడకులుగా, అగ్రరాజ్యాల పట్ల దాసులుగా ఉంటారన్నారు. క్యూబా సామ్రాజ్యవాద శక్తుల నుంచి ముప్పు ఎదుర్కొంటుంటే మన దేశం ఫాసిజం నుంచి అలాంటి ప్రమాదం ఎదుర్కొంటోందని తెలిపారు. క్యూబాకు సంఘీభావం తెలుపుతూనే దేశం ఎదుర్కొంటున్న దుర్మార్గ పరిస్థితికి ప్రపంచం నుంచి సంఘీభావం కోరుకోవాల్సిన అవసరముందని అభిప్రాయపడ్డారు. ఎమ్మెల్సీ గోరటి వెంకన్న పాటలు పాడి ఉర్రూతలూగించారు. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు, టీపీసీసీ ఉపాధ్యక్షుడు వినోద్‌ రెడ్డి ప్రసంగించారు. ప్రొఫెసర్‌ నాగేశ్వర్‌, పలు పార్టీల నేతలు రావుల చంద్రశేఖర్‌ రెడ్డి, పోటు రంగరావు, సీహెచ్‌.మురహరి, సాధినేని వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.

మఖ్దూం భవన్‌కు చేగువేరా వారసులు

హైదరాబాద్‌ : చేగువేరా కుమార్తె అలైదా గువేరా ఆదివారం సీపీఐ రాష్ట్ర కార్యాలయం మఖ్దూం భవన్‌ను సందర్శించారు. ఆమెతో పాటు ఆమె కుమార్తె ప్రొఫెసర్‌ ఎస్తేఫానియా కూడా ఉన్నారు. వీరికి సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు, జాతీయ కార్యదర్శి సయ్యద్‌ అజీజ్‌ పాషా, పల్లా వెంకట్‌రెడ్డి తదితరులు స్వాగతం పలికారు. కాగా, ఫొటోల కోసం కమ్యూనిస్టు నాయకులు, కార్యకర్తలు దూసుకురావడంతో అలైదా, ఎస్తేఫానియా కొంత అసౌకర్యానికి లోనయ్యారు. అంతకుముందు శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయంలో అలైదా గువేరాకు సీపీఐ, సీపీఎం నాయకులు ఘన స్వాగతం పలికారు.

Leave a Reply