అంబులెన్స్‌లను అడ్డుకోవద్దు

0
290
  • రాష్ట్ర పోలీసులకు హైకోర్టు ఆదేశం
  • హఠాత్తుగా లాక్‌డౌన్‌ ప్రకటిస్తే ప్రజలు ఎలా సిద్ధమవుతారు?
  • కొవిడ్‌ నియంత్రణ తీరుపై అసంతృప్తి

అత్యవసర వైద్యం కోసం పొరుగు రాష్ట్రాల నుంచి వస్తున్న అంబులెన్స్‌లను అడ్డుకోవడం అమానవీయం. కేంద్ర మార్గదర్శకాల ప్రకారం అంతర్రాష్ట్ర ప్రవేశాలపై ఎలాంటి నిషేధం లేదు. తెలంగాణ ప్రభుత్వం ఎలాంటి ఉత్తర్వులుకానీ… సలహాగానీ ప్రకటించకుండా ఏకపక్షంగా సరిహద్దులను మూసివేయడం రాజ్యాంగ ఉల్లంఘనే. ఎలాంటి నిషేధం లేనప్పుడు దేశవ్యాప్తంగా ఎక్కడైనా సంచరించే హక్కు పౌరులకు ఉంది.

వెల్లడిస్తున్న కేసుల ఆధారంగా కేంద్రం ఆక్సిజన్‌, రెమ్‌డెసివిర్‌ ఇంజక్షన్లను కేటాయిస్తోంది. పరీక్షలు తగ్గించడంతోపాటు లెక్కలను వాస్తవంగా వెల్లడించకపోవడంతో మందులు, ఆక్సిజన్‌ సరఫరాను కేంద్రం తగ్గిస్తోంది. దీనివల్ల రాష్ట్రానికి మీరే(రాష్ట్ర ప్రభుత్వం) నష్టం చేస్తున్నారు.

గత విచారణ సందర్భంగా ప్రజలు పరీక్షలకు ముందుకు రావడంలేదన్నారు. కానీ పత్రికల్లో, మీడియాలో చూస్తే పరీక్ష కేంద్రాల వద్ద జనం పడిగాపులు పడుతున్నారు. కిట్‌ల కొరతతో పరీక్షలను తగ్గించేసి పైపైపూతలతో మభ్యపెడుతున్నారు.  కుంభమేళాకు వెళ్లి వచ్చినవారిని గుర్తించకుండా క్వారంటైన్‌లో ఉండాలని ఓ ప్రకటన ఇచ్చి ఊరుకున్నారు. రంజాన్‌ సందర్భంగా పాతబస్తీలో ప్రార్థనల సమయాన గుమిగూడుతున్నా పట్టించుకోవడం లేదు. కొవిడ్‌ నిబంధనలు పాటించడం లేదు. మతం కంటే ప్రజల ప్రాణాలు ముఖ్యం. చెబుతున్నదానికి.. క్షేత్ర స్థాయిలో పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి. ప్రమాద ఘంటికలు మోగుతున్నాయి. ఇది సంక్షోభ పరిస్థితి. ఇలాంటి స్థితిలో నిర్లక్ష్యం సరికాదు. హైకోర్టు

హైదరాబాద్‌: పొరుగు రాష్ట్రాల నుంచి వైద్యసేవల నిమిత్తం కొవిడ్‌ రోగులతో వచ్చే అంబులెన్స్‌లను అడ్డుకోరాదని తెలంగాణ పోలీసులను మంగళవారం హైకోర్టు ఆదేశించింది. ఎలాంటి ఉత్తర్వులు…మార్గదర్శకాలు లేకుండా రాకపోకలను అడ్డుకోవడానికి వీల్లేదని స్పష్టం చేసింది. లాక్‌డౌన్‌ నేపథ్యంలో రంజాన్‌ సందర్భంగా ఎలాంటి ప్రత్యేక ఉత్తర్వులు అవసరంలేదని… ఆంక్షల సడలింపు ఉన్న సమయంలో అదీ పండుగ రోజైన ఈనెల 14న ప్రజలు గుమిగూడకుండా చర్యలు తీసుకోవాలని ముగ్గురు నగర పోలీసు కమిషనర్లకు స్పష్టం చేసింది. ముఖ్యమైన ప్రాంతాల్లో వీడియో తీసి కోర్టుకు సమర్పించాలని ఆదేశించింది.

కొవిడ్‌ మార్గదర్శకాలను సక్రమంగా అమలు చేయని పక్షంలో కమిషనర్లపై కోర్టు ధిక్కరణ చర్యలు తీసుకుంటామని పేర్కొంటూ విచారణను ఈనెల 17కు వాయిదా వేసింది. పాతబస్తీలో ప్రజలు మాస్క్‌లు ధరించకుండా, సురక్షిత దూరం పాటించకుండా ఇష్టానుసారం గుమిగూడుతున్నారని పత్రికల్లో వచ్చిన కథనాల నేపథ్యంలో కొవిడ్‌పై దాఖలైన పిటిషన్‌లను మంగళవారం ఉదయం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ హిమా కోహ్లి, జస్టిస్‌ బి.విజయ్‌సేన్‌రెడ్డిలతో కూడిన ధర్మాసనం విచారించింది. విచారణకు నగర పోలీసు కమిషనర్లు అంజనీకుమార్‌, మహేష్‌భగవత్‌, సజ్జనార్‌లతోపాటు జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ లోకేష్‌కుమార్‌లు హాజరయ్యారు.

అనాలోచితంగా అడ్డుకుంటారా?
‘‘పొరుగు రాష్ట్రాల్లో కొవిడ్‌ తీవ్రత నేపథ్యంలో గత నెల 23న సరిహద్దులు మూసేయాలని మేం చెప్పలేదు. నియంత్రణపై దృష్టి సారించాలని చెబితే కేంద్రం మార్గదర్శకాల ప్రకారం రాకపోకలను నిషేధించలేమని, అవసరంలేదని ప్రభుత్వం చెప్పింది. ఇప్పుడేమో ఇతర రాష్ట్రాల నుంచి వస్తున్న అంబులెన్స్‌లను ఆపేస్తున్నారు.  అనాలోచితంగా రాకపోకలను అడ్డుకుంటారా’’ అని ధర్మాసనం ప్రశ్నించింది.

ఆర్‌ఎంపీలు గాలికొదిలేస్తున్నారు: ఏజీ
పొరుగు రాష్ట్రాల నుంచి వచ్చేవారి వల్ల ఇక్కడి ప్రజలకు సరైన వసతులు కల్పించలేకపోతున్నామని అడ్వొకేట్‌ జనరల్‌ బి.ఎస్‌.ప్రసాద్‌ తెలిపారు. బెడ్‌లు ఖాళీ లేకపోయినా ఆ రాష్ట్రాల ఆర్‌ఎంపీలు రోగులను ఇక్కడికి తీసుకొచ్చి వారిని గాలికి వదిలేస్తున్నారని వివరించారు. సరిహద్దులో డాక్టర్ల బృందం ఉందని, అంబులెన్స్‌లో ఉన్న రోగి పరిస్థితి ఆధారంగా నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు. నివాసం ఆధారంగా వైద్యాన్ని నిరాకరించడానికి వీల్లేదని న్యాయస్థానం స్పష్టం చేసింది.

ఉన్నట్టుండి లాక్‌డౌన్‌ ప్రకటిస్తే ఎలా?
కొవిడ్‌ తాజా పరిస్థితిని మధ్యాహ్నం మంత్రి మండలి సమీక్షిస్తుందని అక్కడ తీసుకొనే నిర్ణయాన్ని తెలియజేయడానికి కొంత సమయం ఇవ్వాలని ఏజీ న్యాయస్థానాన్ని కోరారు. ‘‘కొవిడ్‌ తీవ్రత నేపథ్యంలో కర్ఫ్యూ సమయం పొడిగించడం, వారాంతపు లాక్‌డౌన్‌ను పరిశీలించాలని గతంలో మేం సూచిస్తే అలాంటి అవసరంలేదని ప్రభుత్వం తెలిపింది. గత నెల 23న 7,400 కేసులుండగా ప్రస్తుతం 4,900కు తగ్గాయి. పరిస్థితి బాగున్నపుడు సమీక్షించడం ఎందుకు’’ అని ప్రశ్నిస్తూ మధ్యాహ్నానికి విచారణ వాయిదా వేసింది. అనంతరం ఏజీ స్పందిస్తూ బుధవారం నుంచి మే 21 వరకు లాక్‌డౌన్‌కు ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని తెలిపారు. ‘‘ఉన్నట్టుండి లాక్‌డౌన్‌ ప్రకటిస్తే ప్రజలు ఎలా సిద్ధమవుతారు? పొరుగు రాష్ట్రాల నుంచి వచ్చిన వలస కూలీలు మిగిలిన కొద్ది గంటల్లో సరిహద్దులు దాటగలరా? ప్రజలు తమకు అవసరమైన నిత్యావసర సరకులు సమకూర్చుకోగలరా’’ అని ధర్మాసనం ప్రశ్నించింది.

వలస కూలీలకు రవాణా ఏర్పాట్లు
ఉదయం 6 నుంచి 10 వరకు ఆంక్షల సడలింపు ఉంటుందని, నిత్యావసర సరకులకు ఇబ్బంది ఉండదని ఏజీ తెలిపారు. ‘‘వలస కూలీలు ఇప్పటికే 50 శాతం వెళ్లిపోయారు. మిగిలినవారి అవసరాలను ప్రభుత్వం చూస్తుంది. వెళ్లాలనుకునేవారికి రవాణా ఏర్పాట్లు చేస్తుంది. లేదంటే భోజన వసతులను కల్పిస్తుంది’’ అని తెలిపారు. వ్యాక్సిన్‌ రెండో డోసు నిమిత్తం వెళ్లేవారిని మొదటి డోసు ధ్రువీకరణ పత్రం ఆధారంగా ఆసుపత్రులకు వెళ్లడానికి అనుమతించాలని న్యాయస్థానం సూచించింది. ఆక్సిజన్‌ను 430 నుంచి 450 మెట్రిక్‌ టన్నులకు పెంచినట్లు కేంద్రం తరఫున అదనపు సొలిసిటర్‌ జనరల్‌ టి.సూర్యకరణ్‌రెడ్డి చెప్పారు. 600 టన్నులు అవసరమని ప్రతిపాదించినట్లు ఏజీ చెప్పారు. మందుల ధరలపై నిత్యావసర ధరల చట్టాన్ని ఎందుకు ప్రయోగించరని న్యాయస్థానం ప్రశ్నించింది. విపత్తుల నిర్వహణ చట్టం కింద కమిటీ ఏర్పాటు చేయకపోవడంపై అసహనం వ్యక్తం చేసింది.

న్యాయస్థానం ఆదేశాలు ఇలా…
 ప్రాణావసర మందుల సరఫరా, ఆసుపత్రుల్లో అధిక ఛార్జీల నియంత్రణకు చర్యలు తీసుకోవాలి.
 ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో పరీక్షలతో సహా మందులు, కిట్‌లు, మాస్క్‌లు, ఇతర పరికరాల వినియోగానికి సంబంధించి ధరలను నిర్దేశిస్తూ ఉత్తర్వులు జారీ చేయాలి.
 4 వారాల్లో 14 ఆర్‌టీపీసీఆర్‌ పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేస్తామని గతంలో ఇచ్చిన హామీ గడువు పూర్తయింది. దీనిపై వచ్చే నివేదికలో స్పష్టత ఇవ్వాలి.
 గతంలో ఆక్సిజన్‌ విషయంలో తమిళనాడు సహకరించలేదన్నారు. ఆ లోటును ఎలా పూడ్చారో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అఫిడవిట్‌ దాఖలు చేయాలి.
ఇతర రాష్ట్రాల నుంచి అత్యవసర పరిస్థితుల్లో ఉన్న రోగులతో వచ్చే అంబులెన్స్‌లను అడ్డుకోవడాన్ని ఏ విధంగా సమర్థించుకుంటారో లిఖితపూర్వకంగా తెలియజేయాలి.

Courtesy Eenadu

Leave a Reply