కూలుతున్న డబుల్

0
429

కాంట్రాక్టర్ల కక్కుర్తి.. 
నాణ్యతకు తిలోదకాలు
ఖమ్మం, భద్రాద్రి జిల్లాలో నాలుగుచోట్ల కూలిన వైనం
ఆందోళనలో పేద లబ్దిదారులు

పేదల సొంతింటి కల తీరుస్తామని గొప్పగా చెప్పిన సీఎం కేసీఆర్‌ హామీకి కొందరు కాంట్రాక్టర్లు తూట్లు పొడుస్తున్నారు. డబ్బుకు కక్కుర్తి పడి డబుల్‌ బెడ్‌రూం ఇండ్లను నాసిరకంగా నిర్మిస్తున్నారు. ఫలితంగా చిన్నపాటి వర్షాలకే అవికాస్తా నిర్మాణ దశలోనే కూలిపోతున్నాయి. ఇప్పటికే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో నాలుగు ప్రాంతాల్లో పేదల ఇండ్ల నిర్మాణంలో నాణ్యత డొల్లతనం బయటపడింది. ప్రభుత్వం ఇచ్చే ధర సరిపోదన్న కారణంతోనే కొందరు కాంట్రాక్టర్లు తూ.తూ మంత్రంగా పనులు పూర్తిచేసి చేతులు దులుపుకుంటున్నారనే ఆరోపణలు వినిపిస్తు న్నాయి. తాజాగా భద్రాద్రి జిల్లా పాల్వంచ మండలంలోని ఎస్సీ కాలనీలో వర్షాలకు డబుల్‌ బెడ్‌రూం ఇండ్ల గోడలు కూలి పోవడంతో పేద లబ్దిదారుల్లో ఆందోళన వ్యక్తమౌతోంది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మూడున్నరేండ్లుగా ఇండ్లనిర్మాణాలు కొనసాగు తూనే ఉన్నాయి. ఖమ్మం జిల్లాలో 7,185, భద్రాద్రి జిల్లాలో 6,818 ఇండ్ల నిర్మాణానికి ప్రభుత్వం అనుమతులిచ్చింది. కానీ ఇంటి నిర్మాణ వ్యయం భారం కావడంతో ఒప్పందం చేసుకున్న కాంట్రాక్టర్లు సర్కారుకు సర్దిచెప్పలేక అయిన కాడికి పనులు కానించేస్తున్నారు. ఈ క్రమంలోనే పాల్వంచ మండలంలోని దంతెలబోర గ్రామంలోని ఎస్సీ కాలనీలో నిర్మాణంలో ఉన్న డబుల్‌ బెడ్‌రూం ఇండ్లలో సోమవారం తెల్లవారుజామున రెండిండ్ల గోడలు కూలిపోయాయి. ఇటీవల మూడురోజులుగా కురిసిన చిరుజల్లులకే గోడలు కుప్పకూలిపోతున్నాయి. ఇండ్ల నిర్మాణంలో ఏమాత్రం నాణ్యతలేకుండా నిర్మాణాలు చేయడం వల్లనే ఇండ్లు కుప్పకూలిపోతున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇరు జిల్లాల్లో కలిపి 12,386 గృహాలు వివిధ దశల్లో ఉండగా అందులో కొన్నింటిని నాణ్యతలేదన్న కారణంతో నిర్మాణాలను నిలిపివేశారు. అవి అసాంఘిక కార్యకలాపాలకు నిలయాలుగా మారాయి.
నాలుగు మండలాల్లో అదే పరిస్థితి..
ఈ పథకం ప్రారంభించిన తొలిఏడాదే ఖమ్మం జిల్లా కల్లూరు మండలంలోని చిన్నకోరుకొండి గ్రామంలో నిర్మాణంలో ఉన్న 20ఇండ్లలో కొన్ని ఇండ్ల గోడలకు పగుళ్లు వచ్చాయి. అనంతరం పిల్లర్లు, మెట్లకోసం ఏర్పాటుచేసిన గోడలు కూలిపోయాయి. ఇక్కడ పేదలంతా ఆందోళనకు దిగడంతో ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. కాంట్రాక్టర్‌పై చర్యలు తీసుకుని నిర్మాణ పనులను స్వయంగా నాటి కలెక్టర్‌ పరిశీలనలో చేశారు. అనంతరం మధిర మండలంలోని ఇల్లూరులో ఎస్సీ కాలనీకి సమీపంలో 40ఇండ్ల నిర్మాణాలను ఆరంభించారు. ఇక్కడ కాంట్రాక్టర్‌ చేసిన పనికి ఏకంగా ప్రభుత్వం అభాసుపాలైందని స్థానికులు ఆరోపిస్తున్నారు. మూడేండ్ల కిందట ఆరంభించిన ఇండ్లనిర్మాణానికి సంబంధించిన పిల్లర్లు గాల్లో ఊగుతూ, గోడలు కూలిపోవడంతో స్థానికులంతా ఆందోళన చేపట్టారు. ఇంటినిర్మాణాలను నిలిపివేయాలని ధర్నాలకు దిగడంతో కలెక్టర్‌ ఏకంగా 40గృహాల నిర్మాణ సముదాయాన్ని పూర్తిగా బ్లాక్‌లిస్టులో పెట్టారు. ఇది జరిగిన కొద్దిరోజులకే ఖమ్మం జిల్లాలోనే కూసుమంచి మండలానికి చెందిన నేలపట్లలో నిర్మాణంలో ఉన్న 18ఇండ్లలో ఐదు గృహాలకు చెందిన పిల్లర్లు, స్లాబ్‌పైన నిర్మాణం చేసిన గోడలు, మెట్లుపూర్తిగా కూలిపోవడంతో లబ్దిదారులు కాంట్రాక్టర్‌ను నిలదీశారు. దీంతో కలెక్టర్‌ విచారణకు ఆదేశించారు. తాజాగా భద్రాద్రిజిల్లా పాల్వంచ మండలంలో చిరుజల్లులకే కూలిపోవడం పరిస్థితికి అద్దం పడుతోంది. ఒకవేళ ఇంటినిర్మాణాలు పూర్తయిన తర్వాత గోడలు, ఇండ్లుకూలితే ప్రాణహాని తప్పదని లబ్దిదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
నాణ్యత లేకనే కూలిపోయాయి.. : బర్ల చిన్నముత్యం, పాల్వంచ మండలం
దంతెలబోరలో నిర్మాణంలో ఉన్న ఇంటి గోడలు కూలిపోవడానికి కారణం కేవలం నాణ్యతలేకపోవడమే. సిమెంట్‌, కాంక్రీటు, ఇసుక తగుపాళ్లలో లేకపోవడంతోనే గోడలు కూలిపోతున్నాయి. అధికారులు స్పందించాలి. నాణ్యతగా నిర్మాణం చేసేలా చర్యలు తీసుకోవాలి.
ఎవరూ పట్టించుకోవడం లేదు.. : నారాయణ, స్థానికుడు
ఇండ్లనిర్మాణంలో అధికారులు అంతగా పట్టించు కోవడం లేదు. పేదవాళ్లకు ఇచ్చేవి కావడంతోనే ఎవరికీ పట్టడంలేదు. ఇకనైనా కూలిపోతున్న ఇండ్ల గోడలు, స్లాబులు పటిష్టంగా ఉండేలా చర్యలు తీసుకోవాలి. అంతర్గత రహదారులు నిర్మించాలి.
బాధ్యులపై చర్యలకు సిఫారసు చేస్తాం : వనమా వెంకటేశ్వరరావు, ఎమ్మెల్యే కొత్తగూడెం
రెండుపడక గదుల ఇల్లు కట్టించి ఇవ్వాలనుకున్న ప్రభుత్వ ఆశయాలకు తూట్లుపొడుస్తున్న డబుల్‌బెడ్‌రూం ఇండ్ల కాంట్రాక్టర్లపైనా, పర్యవేక్షణ చేయాల్సిన అధికారులపైనా సీఎం కేసీఆర్‌ సహా ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తా. దంతెలబోర ఘటనపై విచారిస్తాం. పేదల సంక్షేమంలో అక్రమాలకు పాల్పడితే చర్యలు తప్పవు.
ఖమ్మం ఉమ్మడి జిల్లాలో డబుల్‌ బెడ్‌రూం ఇండ్ల వివరాలు
వివరాలు ఖమ్మంజిల్లా భద్రాద్రిజిల్లా
మంజూరైన ఇండ్లు 7,185 6,818
నిర్మాణ దశలో ఉన్నవి 2,720 3,200
పూర్తయిన నిర్మాణాలు 2,800 2,900
అసలు నిర్మాణం మొదలు
కానివి 1,665 718
గృహప్రవేశాలు
పూర్తయినవి 837 780

(Courtacy Nava Telangana)

Leave a Reply