ఒక్క వీడియోతో పాపులర్‌

0
184

హైడ్రాక్సీ క్లోరోక్విన్‌, అజిత్రోమైసిన్‌, జింక్‌ కాంబినేషన్‌ను సూచించిన అమెరికా వైద్యుడు
ప్రపంచవ్యాప్తంగా పలుచోట్ల అదే చికిత్స

న్యూయార్క్‌: హైడ్రాక్సీ క్లోరోక్విన్‌.. కరోనాపై పనిచేసే ‘అద్భుతమైన ఔషధం’ అంటూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ కొనియాడిన మందు! దాంతోపాటు అజిత్రోమైసిన్‌, జింక్‌ కలిపి కరోనా పాజిటివ్‌గా తేలినవారికి ఇస్తే బాగా పనిచేస్తోందని పలువురు వైద్యనిపుణులు చెబుతున్నారు. కానీ.. ఈ కాంబినేషన్‌ గురించి ట్రంప్‌కు ఎలా తెలిసింది? హైడ్రాక్సీ క్లోరోక్విన్‌ కరోనాపై పనిచేస్తోందని మొదట కనుగొన్నది ఎవరు? ఈ ప్రశ్నకు సమాధానం తెలియాలంటే.. న్యూయార్క్‌ సిటీ నుంచి కేవలం ఒక గంట ప్రయాణ దూరంలో ఉన్న ‘కిర్యాస్‌ జోయెల్‌’ అనే గ్రామానికి వెళ్లాల్సిందే!

35 వేల మంది హసిడిక్‌ తెగ యూదులు ఉండే ఆ గ్రామానికి చెందిన డాక్టర్‌ వ్లాదిమిర్‌ జెలెంకో (46) అనే సాదాసీదా వైద్యుడు ఈ కాంబినేషన్‌ను (హైడ్రాక్సీక్లోరోక్విన్‌+అజిత్రోమైసిన్‌+జింక్‌ సల్ఫేట్‌) కనిపెట్టాడు. మార్చి మొదటివారం నుంచే ఆయన.. కరోనా లక్షణాలతో తన వద్దకు వచ్చినవారికి ఈ మందులను ఇవ్వడం ప్రారంభించారు. వచ్చిన వారందరికీ నయం కావడం లేదు.. వారిలో ఎవరికీ వెంటలేటర్‌ పెట్టాల్సిన అవసరం లేకపోవడంతో ఆయన మార్చి 21న ఆ విషయాన్ని ఒక వీడియో ద్వారా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌కు తెలిపారు. ఫేస్‌బుక్‌, యూట్యూబ్‌లో కూడా పోస్ట్‌ చేశారు.

వెంటనే ఫ్యాక్స్‌ న్యూస్‌ పాత్రికేయుడు సీన్‌ హానిటి ఆ వీడియోను, జెలెంకో చికిత్సా విధానాన్ని తన టీవీ, రేడియో షోస్‌ ద్వారా పాపులర్‌ చేశారు. వైట్‌హౌస్‌ ఉన్నతాధికారి మార్క్‌ మీడోస్‌.. వ్లాదిమిర్‌ జెలెంకోను పిలిపించి ఆ చికిత్స గురించి చర్చించారు. అనంతరం ట్రంప్‌ ఆ ఔషధం గురించి గొప్పగా ప్రకటించారు. కానీ, వైరస్‌పై ఆ మూడు ఔషధాల ప్రభావం ఎలా ఉంటుందనే అంశంపై పరిశోధన ఏదీ జరగలేదని, మరిన్ని పరీక్షలు చేయాల్సి ఉందని పలువురు వైద్య నిపుణులు హెచ్చరించారు. ముఖ్యంగా హైడ్రాక్సీ క్లోరోక్వీన్‌ ఎక్కువగా తయారయ్యే భారత్‌కు.. దాని కోసం విజ్ఞప్తులు వెల్లువెత్తాయి. ఫ్రాన్స్‌, చైనాల్లో కరోనా పేషెంట్లపై హైడ్రాక్సీక్వోరోక్విన్‌ ప్రభావంతంగా పనిచేస్తున్నట్టు రుజువయింది.

Courtesy Andhrajyothy

 

Leave a Reply