కరోనా ఎఫెక్ట్: డీజేగా మారిపోతున్న బాల్కనీలు

0
234

కరోనా వైరస్ యావత్ ప్రపంచాన్ని వణికిస్తున్న నేపథ్యంలో స్వీయ నిర్బంధం(సెల్ప్ ఐసోలేషన్)లో ఉంటున్న వారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. కోవిడ్ సోకుతుందన్న భయంతో ప్రజలు ఇళ్లకే పరిమితమవుతున్నారు. స్వీయ నిర్బంధాల సంఖ్య పెరుగుదల ఆందోళన కలిగిస్తున్నా కొన్ని సానుకూల అంశాలు కూడా వెలుగులోకి వస్తున్నాయి.

సెల్ప్ ఐసోలేషన్ లో ఉన్న వారు కమ్యూనికేషన్ కు సరికొత్తగా విభిన్న పద్దతులు అవలంభిస్తున్నారు. ఒంటరిగా ఇళ్లలో ఉంటున్న వారు బోర్ కొట్టకుండా ఆట, పాటలతో కాలక్షేపం చేస్తున్నారు. దీంతో అమెరికా నుంచి యూరోప్ వరకు ఇళ్ల బాల్కనీలు డీజే వేదికలుగా మారిపోయాయి. అంతేకాదు ఫిట్ నెస్ పరంగా కూడా సమయాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారు. స్పెయిన్ లోని సెవిల్లెలోని ఓ అపార్ట్ మెంట్ కింద ఫిట్ నెస్ ట్రైనర్ సూచనలు ఇస్తుంటే బాల్కనీల్లో పదుల సంఖ్యలో జనం కసరత్తులు చేస్తున్న వీడియో ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేయగానే వైరల్ అయింది. వీకెండ్ లో మాడ్రిడ్, గ్రనడాలో అత్యవసర సేవల సిబ్బంది చేస్తున్న సేవలను అభినందిస్తూ కిటికీల నుంచి చప్పట్లు చరిచి మెచ్చుకున్నారు. కాగితాలపై అభినందనల సందేశాలు రాసి బాల్కనీల నుంచి ప్రదర్శించి ప్రశంసిస్తున్నారు. సోమవారం నాటికి స్పెయిన్ లో కరోనా మృతుల సంఖ్య 309కి చేరింది.

ఇటలీలో ఓపెరా సింగర్ మౌరిజియో మార్చిని తన బాల్కనీ నుంచి పాట పాడి చుట్టుపక్కల వారిని అలరించారు. ఈ వీడియోను ట్విటర్, ఫేస్ బుక్ లో వేలాది మంది షేర్ చేశారు. బాల్కనీల నుంచే ఒకరికొకరు సహాయం చేసుకోవడం, ఆట పాటలతో పొరుగున్న వారిని అలరిస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. బాల్కానీల నుంచి ఇద్దరు వ్యక్తులు టేబుల్ టెన్నిస్ ఆడుతున్న దృశ్యాలు, ఏరోబ్రిక్స్ విన్యాసాలు చేస్తున్న వీడియోలు సామాజిక మాధ్యమాల్లో పంచుకుంటున్నారు. కరోనా మహమ్మారి తమను ఒంటరి చేసినా టెక్నాలజీ సాయంతో మనుషులు అమూల్యమైన సమయాన్ని ప్రయోజనకరంగా మార్చుకునేందుకు ప్రయత్నిస్తుండటం సానుకూల పరిణామం.

Leave a Reply