సంజయ్‌ రౌత్‌ అరెస్ట్‌

0
39
  • పాత్రాచాల్‌ కుంభకోణంలో 9 గంటలపాటు ఈడీ విచారణ
  • మా పార్టీని అంతమొందించే కుట్ర: ఉద్ధవ్‌ ఠాక్రే

ముంబయి: శివసేన (ఉద్ధవ్‌ ఠాక్రే వర్గం) అధికార ప్రతినిధి, రాజ్యసభ సభ్యుడు సంజయ్‌ రౌత్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) అధికారులు ఆదివారం అరెస్టు చేశారు. నగదు అక్రమ చలామణి కేసుకు సంబంధించి ముంబయిలోని ఆయన నివాసంలో సోదాలు నిర్వహించిన అధికారులు లోతైన విచారణ కోసం రౌత్‌ను అదుపులోకి తీసుకున్నట్లు అంతకుముందు ప్రకటించారు. గృహ సముదాయం (పాత్రాచాల్‌) పునరాభివృద్ధిలో భారీ అక్రమాలు జరిగాయంటూ సంజయ్‌ రౌత్‌ భార్య, అతని సన్నిహితులపై ఆరోపణలున్నాయి. ఇదే కేసులో సంజయ్‌ రౌత్‌ జులై 1న ఈడీ అధికారుల ఎదుట హాజరై వాంగ్మూలం ఇచ్చారు. ఆ తర్వాత రెండు సార్లు సమన్లు జారీ అయినా పార్లమెంటు సమావేశాలు ఉన్నాయంటూ గైర్హాజరయ్యారు. ఈ నేపథ్యంలో ఆదివారం ఉదయం 7 గంటలకు ఈడీ అధికారులు సంజయ్‌ రౌత్‌ నివాసం ‘మైత్రి’కి చేరుకున్నారు. 9 గంటలపాటు విచారించిన తర్వాత ఆయనను ముంబయిలోని ఈడీ కార్యాలయానికి తీసుకెళ్లారు. అర్ధరాత్రి దాటాక రౌత్‌ అరెస్టు విషయాన్ని ప్రకటించారు.

శివసేనను వీడను..ఎవరికీ తలొగ్గను
ఈడీ అధికారుల సోదాలపై సంజయ్‌ రౌత్‌ ట్విటర్‌ వేదికగా స్పందించారు. రాజకీయ కుట్రలో భాగంగానే తనపై దాడులకు దిగుతున్నారని ఆరోపించారు. ఎలాంటి తప్పు చేయలేదన్నారు. ‘ఎట్టి పరిస్థితుల్లోనూ శివసేనను వీడేది లేదు. చనిపోయినా సరే..ఎవరికీ తలొగ్గను. బాలాసాహెబ్‌ ఠాక్రేపై ప్రమాణం చేసి చెబుతున్నా…కుంభకోణంతో సంబంధం లేదు. ఎలా పోరాడాలో బాలాసాహెబ్‌ మాకు నేర్పారు’అని అంతకుముందు ట్వీట్‌ చేశారు. శివసేనను అంతమొందించే కుట్రలో భాగంగానే ఈడీ సోదాలు జరుగుతున్నాయని ఆ పార్టీ అధ్యక్షుడు ఉద్ధవ్‌ ఠాక్రే ఆరోపించారు. ఈడీ భయంతోనే శివసేన ఎమ్మెల్యేలు పలువురు తిరుగుబాటు నేత శిందే వర్గంలో చేరారని విమర్శించారు. సంజయ్‌ రౌత్‌ నిరపరాధి అయితే ఈడీ అధికారుల చర్యలకు భయపడాల్సిన అవసరం లేదని మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్‌ శిందే అన్నారు.

ఏమిటీ పాత్రాచాల్‌ కుంభకోణం?
ఉత్తర ముంబయిలోని సిద్ధార్థ నగర్‌లో 47 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న గృహ సముదాయం పాత్రా చాల్‌. 672 కుటుంబాలు అక్కడ ఉండేవి. హెచ్‌డీఐఎల్‌ అనే స్థిరాస్తి కంపెనీ అనుబంధ సంస్థ.. గురు ఆశీష్‌ కన్‌స్ట్రక్షన్‌(జీఏసీ). 2008లో పాత్రాచాల్‌ సొసైటీ, మహారాష్ట్ర హౌసింగ్‌ అండ్‌ ఏరియా డెవలప్‌మెంట్‌ అథారిటీ(ఎంహెచ్‌ఏడీఏ), జీఏసీ మధ్య కుదిరిన త్రైపాక్షిక ఒప్పందం ప్రకారం…672 ఫ్లాట్లను పాత అనుభవదారులకు జీఏసీ సమకూర్చాలి. మరో 3వేల వరకు ఫ్లాట్లను ఎంహెచ్‌ఏడీఏకి అందజేయాలి. మిగిలిన ప్రాంతాన్ని డెవలపర్‌ అయిన జీఏసీ విక్రయించుకోవచ్చు. అయితే, ఎంహెచ్‌ఏడీఏని తప్పుదోవపట్టించిన జీఏసీ…తాను ఫ్లాట్లను నిర్మించాల్సిన స్థలాన్ని 9 మంది డెవలపర్లకు రూ.901.79 కోట్లకు విక్రయించింది. 672 మంది పాత అనుభవదారులకు ఫ్లాట్లను నిర్మించక పోగా మరో ప్రాజెక్టును తెరపైకి తీసుకొచ్చి బుకింగ్‌ల ద్వారా కొనుగోలుదారుల నుంచి రూ.138 కోట్లను జీఏసీ వసూలు చేసింది. ఆ తర్వాత హెచ్‌డీఐఎల్‌ ఖాతాల నుంచి సుమారు రూ.100 కోట్లు జీఏసీ మాజీ డైరెక్టర్‌ ప్రవీణ్‌ రౌత్‌కు బదిలీ అయ్యాయి. ఆ మొత్తాన్ని ప్రవీణ్‌ రౌత్‌…తన సన్నిహితులకు, కుటుంబ సభ్యులకు వాటాలుగా పంచారు. ఈ సొమ్ముకు సంబంధించే 2010లో రూ.83లక్షలు ప్రవీణ్‌ రౌత్‌ భార్య మాధురీ నుంచి సంజయ్‌ రౌత్‌ భార్య వర్షా రౌత్‌కు హామీలేని రుణంగా వెళ్లాయని ఈడీ ఆరోపణ. వర్షా రౌత్‌ దాదర్‌లో ఒక ఫ్లాట్‌ కొనుగోలు చేశారు. ఈడీ దర్యాప్తు ప్రారంభమైన తర్వాత వర్షా రౌత్‌ రూ.55 లక్షలను మాధురీ రౌత్‌ బ్యాంకు ఖాతాకు బదిలీ చేశారు. ఖిమ్‌బీచ్‌, అలీబాగ్‌లలో కొన్ని ప్లాట్లు కూడా వర్షారౌత్‌, స్వప్నాపాట్కర్‌ పేర్ల మీద రిజస్టరై ఉన్నట్లు గుర్తించారు. సంజయ్‌రౌత్‌కు సన్నిహితుడైన సుజిత్‌ పాట్కర్‌ భార్యే స్వప్న. ఈ క్రమంలో ఏప్రిల్‌లో వర్షా రౌత్‌కు చెందిన రూ.11.15 కోట్ల విలువ చేసే ఆస్తులను, సన్నిహితుల ఆస్తులను కూడా దర్యాప్తు సంస్థ జప్తు చేసింది. రూ.వెయ్యి కోట్లకు మించిన పాత్రాచాల్‌ భూ కుంభకోణం కేసుకు సంబంధించి ఇప్పటికే సంజయ్‌రౌత్‌ సన్నిహితుడు ప్రవీణ్‌ రౌత్‌ను ఈడీ అదుపులోకి తీసుకుంది. ప్రస్తుతం ఆయన జ్యుడీషియల్‌ కస్టడీలో ఉన్నారు. కోర్టు వివాదాలు తదనంతర పరిణామాల అనంతరం అక్కడ ఫ్లాట్లు నిర్మించి అందజేసే బాధ్యతలను ఎంహెచ్‌ఏడీఏ చేపట్టింది.

Leave a Reply