నేషనల్‌ హెరాల్డ్‌ కేసులో ఈడీ ముందు సోనియా హాజరు

0
61
  • నేషనల్‌ హెరాల్డ్‌ కేసులో హాజరు.. 2 గంటలు ప్రశ్నించిన ఏజెన్సీ
  • 25న మళ్లీ రావాలని సమన్లు.. ఇది కక్ష సాధింపే: టీఆర్‌ఎస్‌
  • రాష్ట్రాల్లో కాంగ్రెస్‌ నిరసనలు.. ఢిల్లీలో 75 మంది ఎంపీల అరెస్టు
  • హస్తినలో కార్యకర్తల రైల్‌రోకో.. బెంగళూరులో కారు దహనం

న్యూఢిల్లీ : నేషనల్‌ హెరాల్డ్‌ పత్రిక వ్యవహారంలో మనీలాండరింగ్‌ కేసుకు సంబంధించి కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియాగాంధీ గురువారం ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) ముందు హాజరయ్యారు. కరోనా అనంతర ఇబ్బందులతో బాధపడుతున్న ఆమె వినతి మేరకు అధికారులు రెండు గంటలు మాత్రమే ప్రశ్నించారు. వాంగ్మూలం నమోదు చేసుకుని పంపేశారు. మళ్లీ ఈ నెల 25న రావాలని ఆమెకు సమన్లు జారీచేశారు. ఈ కేసులో కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీని కూడా గత నెల 13, 14, 15, 20, 21 తేదీల్లో.. ఐదు రోజులపాటు మొత్తం 53 గంటలు విచారించిన సంగతి తెలిసిందే. అప్పటిలాగే ఇప్పుడు కూడా తమ నాయకురాలిని విచారణకు పిలవడంపై కాంగ్రెస్‌ నేతలు, కార్యకర్తలు దేశవ్యాప్తంగా ‘సత్యాగ్రహ’ నిరసనలు చేపట్టారు. సీఆర్‌పీఎఫ్‌ భద్రత నడుమ.. ఉదయం 11.30 తర్వాత కుమారుడు రాహుల్‌, కుమార్తె ప్రియాంకాగాంధీ వాద్రా వెంటరాగా సోనియా ఈడీ ప్రధాన కార్యాలయానికి చేరుకున్నారు. కాంగ్రెస్‌ కార్యకర్తలు ఆ వైపు రాకుండా పోలీసు, ఆర్‌ఏఎఫ్‌, కేంద్ర బలగాలు పెద్దఎత్తున మోహరించాయి. బారికేడ్లు ఏర్పాటుచేశాయి. మధ్యాహ్నం 12.30 గంటలకు విచారణ మొదలైంది. కరోనా అనంతర ఇబ్బందులతో తన తల్లి బాధపడుతున్నందున మందులు సకాలంలో అందించడానికి తాను కూడా విచారిస్తున్న గదిలో ఉండేందుకు ప్రియాంక అనుమతి కోరారు. ఈడీ అధికారులు నిరాకరించారు. అయితే పక్కగదిలో కూర్చునేందుకు అనుమతించారు. విచారణ సందర్భంగా సోనియా అలిసిపోతే విశ్రాంతికి అవకాశమిస్తామని, ఇంటికి పంపేస్తామని తెలిపారు. రాహుల్‌ కాసేపు ఉండి వెళ్లిపోయారు. విచారణ బృందంలోని ఈడీ అదనపు డైరెక్టర్‌ మోనికా శర్మ, తదితరులు ముందుగానే కొవిట్‌ పరీక్ష చేయించుకుని నెగటివ్‌ సర్టిఫికెట్‌ తీసుకున్నారు. రాహుల్‌ను ప్రతిరోజూ పదేసి గంటలపాటు ప్రశ్నించిన ఈడీ.. సోనియా ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని కేవలం రెండుగంటలే ప్రశ్నించింది. మళ్లీ 25న రావాలని కోరింది. ఆమె వినతి మేరకే ఆమెను ఈడీ పంపేసినట్లు తెలిసింది. ప్రశ్నించేందుకు ఇంకేమీ లేదని, వెళ్లిపోవచ్చని ఈడీ అధికారులే చెప్పారని కాంగ్రెస్‌ సీనియర్‌ నేతలు పి.చిదంబరం, జైరాం రమేశ్‌ వెల్లడించారు. అడగాల్సింది ఇంకేమైనా ఉంటే రాత్రి 8-9 గంటల వరకు ఉండేందుకు తాను సిద్ధమని సోనియా చెప్పారని జైరాం ట్విటర్‌లో తెలిపారు. కాగా.. తొలుత ఈ నెల 26న రమ్మని కోరామని.. అయితే ఆమె వినతి మేరకు 25న రమ్మని సమన్లు జారీచేసినట్లు ఈడీ అధికారులు పేర్కొన్నారు.

ఇదీ కేసు..
ఏఐసీసీ ఆధ్వర్యంలోని నేషనల్‌ హెరాల్డ్‌ పత్రిక ప్రస్తుత ‘యంగ్‌ ఇండియన్‌’ ప్రైవేటు లిమిటెడ్‌ అధీనంలో ఉంది. దానిని ప్రచురించే సంస్థ పేరు అసోసియేటెడ్‌ జర్నల్స్‌ లిమిటెడ్‌ (ఏజేఎల్‌). యంగ్‌ ఇండియన్‌ కంపెనీకి రాహుల్‌, సోనియా ప్రమోటర్లుగా ఉన్నారు. అందులో చెరి 38ు వాటా వారికి ఉంది. ఈ కంపెనీ కేవలం రూ.50లక్షలే చెల్లించి.. ఏజేఎల్‌కు కాంగ్రెస్‌ ఇచ్చిన రూ.90.25 కోట్ల రుణాన్ని రికవరీ చేసే హక్కు పొందడంపై బీజేపీ ఎంపీ సుబ్రమణ్యంస్వామి 2013లో ప్రైవేటు ఫిర్యాదు దాఖలు చేశారు. సోనియా, రాహుల్‌ తదితరులు మోసంతో నిధుల దుర్వినియోగానికి పాల్పడ్డారని ఆరోపించారు. గత ఏడాది ఈడీ ఎఫ్‌ఐఆర్‌ నమోదుచేసింది. దీనిపై సమాధానమివ్వాలని సోనియా, రాహుల్‌ను ఢిల్లీ హైకోర్టు ఆదేశించింది కూడా. ఈ వ్యవహారంలో కాంగ్రెస్‌ సీనియర్‌ నేతలు మల్లికార్జున్‌ ఖర్గే, పవన్‌ బన్సల్‌ను ఇప్పటికే ఈడీ విచారించింది. ఎలాంటి అవకతవకలూ లేవని.. యంగ్‌ ఇండియన్‌ కంపెనీ లాభదాయక సంస్థ కాదని కాంగ్రెస్‌ అంటోంది. ఏజేఎల్‌కు రూ.800 కోట్ల ఆస్తులు ఉన్నాయని.. యంగ్‌ ఇండియన్‌ లాభదాయక సంస్థ కాకపోతే దాని భూములు, భవనాలను అద్దెకు ఇవ్వడం వంటి వాణిజ్య కార్యకలాపాలు ఎలా చేపడుతోందని ఈడీ ప్రశ్నిస్తోంది.

కాంగ్రెస్‌ శ్రేణుల సత్యాగ్రహం..
సోనియాకు ఈడీ సమన్లను నిరసిస్తూ కాంగ్రెస్‌ కార్యకర్తలు దేశవ్యాప్తంగా సత్యాగ్రహ ఆందోళనలు చేపట్టారు. కొన్ని చోట్ల ఇది హింసాత్మకమైంది. ఢిల్లీలో రైల్వే ట్రాక్‌పై బైఠాయించి రైళ్లను ఆపేశారు.  బెంగళూరులో ఓ కారును దహనం చేశారు. అసోంలోని గువాహటిలో కార్యకర్తలు పోలీసులతో తలపడ్డారు. పలు రాష్ట్రాల్లో పోలీసులు కాంగ్రెస్‌ శ్రేణులను అదుపులోకి తీసుకున్నారు. కాగా, కాంగ్రెస్‌ పార్టీ నిరసనలకు దిగడంపై బీజేపీ మండిపడింది. వారిది సత్యాగ్రహం కాదని.. కాం గ్రెస్‌ ఫస్ట్‌ ఫ్యామిలీని కాపాడుకునేందుకు.. దేశంపై, దర్యాప్తు సంస్థలపై, చట్టంపై చేపట్టిన దురాగ్రహమని బీజేపీ సీనియర్‌ నేత రవిశంకర్‌ ప్రసాద్‌ మండిపడ్డారు.

సోనియాకు కేరళ కోర్టు నోటీసు
కాంగ్రెస్‌ పార్టీ నుంచి తనను సస్పెండ్‌ చేయడాన్ని సవాలు చేస్తూ ఓ కార్యకర్త దాఖలు చేసిన దావాలో విచారణకు హాజరు కావాలంటూ కేరళలోని ఒక కోర్టు కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియా గాంధీని బుధవారం ఆదేశించింది. ఆగస్టు మూడో తేదీన వ్యక్తిగతంగాగానీ, న్యాయవాది ద్వారాగానీ హాజరుకావాలని కొల్లాం జిల్లాలోని మున్సిఫ్‌ మేజిస్రేటు కోర్టు సూచించింది. 2019లో తనను పార్టీ నుంచి నిబంధనలకు విరుద్ధంగా సస్పెండ్‌ చేశారని పేర్కొంటూ పి.పృధ్వీరాజ్‌ అనే కార్యకర్త ఈ దావా వేశారు. సోనియాతోపాటు, పీసీసీ అధ్యక్షుడు కె.సుధాకరన్‌, డీసీసీ అధ్యక్షుడు పి.రాజేంద్ర ప్రసాద్‌లకూ మున్సిఫ్‌కోర్టు అర్జంట్‌ నోటీసులు పంపింది.

Leave a Reply