పీవీ సంస్కరణల ఫలితాలేమిటి?

0
212
సారంపల్లి మల్లారెడ్డి

మాజీ ప్రధాని పీ.వీ. నరసింహ్మారావు శత జయంతి సందర్భంగా పాలక పక్షాలన్నీ ప్రధానిగా ఆయన కాలంలో జరిగిన సంస్కరణల వల్ల 1991లో వచ్చిన ఆర్థిక సంక్షోభం పరిష్కరించబడిందనీ, దేశం ఆర్థికంగా అభివృద్ధిలోకి వచ్చిందనీ విస్తృతమైన ప్రచారాలు చేస్తున్నారు. అతనికి భారతరత్న ఇవ్వాలని కూడా కోరుతున్నారు. పాలకవర్గాలు ఎవరికి ఏ బిరుదులను ఇచ్చుకున్నా అభ్యంతరం లేదు గానీ, చరిత్రను వక్రీకరించడం నేరమవుతుంది. పీ.వీ 21.06.1991 నుంచి 16.05.1996 వరకు ప్రధానిగా పని చేశారు. అంతకు ముందు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా 1971 సెప్టెంబర్‌ 30 నుంచి 1973 జనవరి 10 వరకు పని చేశారు. ముఖ్యమంత్రిగా, ప్రధానిగా పీవీ తెచ్చిన సంస్కరణల మూలంగా ఎలాంటి ప్రభావాలు నేటికి కొనసాగుతున్నాయనేది ఆలోచించాలి. 1991లో దేశం ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతుందని ప్రచారం ప్రారంభించారు. దీనికి కారణం గాట్‌ ఒప్పందంపై భారతదేశం సంతకాలు చేయటానికి ధనిక దేశాలు ఒత్తిడి ప్రారంభించాయి. అందులో భాగంగా సంస్కరణల విధానాన్ని భుజానికి ఎత్తుకున్నాయి. 1991లో రాజీవ్‌గాంధీని ఎన్నికల ప్రచారంలో మద్రాసులో హాత్య గావించడం వల్ల అప్పుడున్న పరిస్థితులను బట్టి కాంగ్రెస్‌ను ఐక్య పర్చగలిగిన వ్యక్తిగా, పార్టీ విధేయుడిగా ఉన్న పీ.వీ.ని ఎంపిక చేశారు. అతనికి మన్మోహాన్‌సింగ్‌ను ఆర్థిక మంత్రిగా నియమించారు. రూపాయి విలువ తగ్గించాలని అమెరికా తదితర విదేశాలు చేస్తున్న ఒత్తిడికి లొంగి 1991 మార్చిన డాలరుకు అంతకు ముందు రూ.7.5 ఉండగా, దానిని రూ.19.64 పైసలకు తగ్గించారు. ఆ తరువాత రూ.24.58కి తగ్గించారు. ఈ తగ్గింపుతో డాలర్లలో ఉన్న అప్పులు ఆటోమెటిక్‌గా పెరిగాయి. ఆ రోజు అప్పు రూ.8.90 లక్షల కోట్లకు పెరిగింది. అంతేకాక భారత ప్రజలందరు గాట్‌ ఒప్పందంపై సంతకాలు పెట్టకూడదని పెద్ద ఎత్తున ఆందోళనలు చేసినప్పటికీ 1994 డిసెంబర్‌ 31 రాత్రి 11గంటలకు భారత ప్రభుత్వం సంతకాలు చేసింది.

ఈ సంతకాలు చేయడంతో ప్రపంచ మార్కెట్‌లోకి భారతదేశం నెట్టబడింది. గాట్‌ ప్రపంచ వాణిజ్య సంస్థగా మార్పు చెందాలని వ్యవసాయంలో భారతదేశం ఇస్తున్న రాయితీలకు కోతపెట్టడం, రైతులను ఆత్మహాత్యలవైపు నెట్టడం జరిగింది. ధనిక దేశాల లాభాల కోసం భారత రైతును బలిపెట్టారు. పీ.వీ. హాయంలోనే నూతన అర్థిక విధానం, నూతన వ్యవసాయ విధానం, నూతన పారిశ్రామిక విధానం, నూతన జౌళి విధానం, నూతన విద్యా విధానం పేర్లతో ప్రతి రంగంలో సంస్కరణలు ప్రారంభించి ప్రయివేట్‌ రంగానికి పెద్ద ఎత్తున్న అవకాశాలు కల్పించారు. ప్రజల నుంచి సేకరించిన వేల కోట్ల పన్నులతో నిర్మాణం చేసిన ప్రభుత్వరంగంలోని భారీ పరిశ్రమలలో వాటాల ఉపసంహరణ పేరుతో అమ్మకాలు ప్రారంభించారు. 1991 నుంచి ప్రారంభించిన ప్రభుత్వ సంస్థల అమ్మకాలు నేటికి మోడీ ప్రభుత్వం మరింత వేగంగా కొనసాగిస్తూ మొత్తం లక్షల కోట్ల ప్రభుత్వ సంస్థలను ఆదాని, రిలయన్స్‌ వంటి కార్పొరేట్లకు హస్థగతం చేస్తున్నారు.

1990కి నేటి 2019కి వ్యవసాయరంగ ఉత్పత్తులను అవకాశాలను పోల్చి చూస్తే వాస్తవాలు తెలుస్తాయి. 1991లో ఆహార ధాన్యాల దిగుమతిని తగ్గించుకోవటమే కాక స్వయం పోషకత్వం కలిగి ఆహార ధాన్యాలను ఎగుమతులు చేశాం. భారతదేశ ఎగుమతులను తట్టుకోలేని ధనిక దేశాలు, భారత దేశాన్ని తమ మార్కెట్‌గా తయారు చేసుకోటానికి కుట్రలు సాగించాయి. ప్రపంచ జనాభాలో రెండవ స్థానంలో ఉన్న భారతదేశాన్ని తమ మార్కెట్‌గా మార్చుకుంటే లబ్ది పొందడమే కాక లాభాలు సంపాదించవచ్చని ఆశించి పీ.వీ హాయంలోని ఐదేండ్లలో సంస్కరణల పేరుతో మన ఆహార స్వయం సమృద్ధిని, పరిశ్రమల అభివృద్ధిని అడ్డగించటానికి పథకాలు వేశాయి. ఆ పథకాలే నేటికీ కొనసాగుతున్నాయి. మోడీ ప్రభుత్వం ప్రయివేటీకరణను నిస్సిగ్గుగా అమలు జరుపుతున్నది. ప్రజల నుంచి వస్తున్న వ్యతిరేకతను నిర్భందం ద్వారా ఆణచాలని చూస్తున్నది. గత చరిత్ర గమనించినప్పుడు నిర్భాందాల ద్వారా ప్రజా వ్యతిరేక చర్యలను ఏ పాలక వర్గమూ అమలు చేయలేకపోయిందనేది వాస్తవం. పీ.వీ. సంస్కరణలను పొగుడుతున్న నేటి పాలకులు ఆ సంస్కరణల ఫలితాలను మాత్రం చెప్పలేకపోతున్నారు. దేశంలో దారిద్య్రం ఈ సంస్కరణల ఫలితంగా పెరిగిందే తప్ప, ఏ మాత్రం తగ్గలేదు. గత 5 సంవత్సరాలలో 3లక్షల మంది రైతులు ఆత్మహాత్యలకు పాల్పడటం జరిగింది. సంస్కరణల ఫలితంగా దేశంలో కార్పొరేట్‌ సంస్థలు 52 నుంచి 110కి పెరిగాయి. నేడు ప్రపంచంలో అత్యంత ధనికులుగా 4వ స్థానంలో రిలయన్స్‌ ఉండటం గమనించాలి. ఈ రిలయన్స్‌ సంస్థ 1991 నుంచే తన ప్రస్థానం ప్రారంభించింది. అంబానీ కుటుంబానికి, రాజీవ్‌ కుటుంబానికి ఉన్న అత్యంత సాన్నిహిత్యం ఈ సంస్కరణల ద్వారా వారి పెరుగుదలకు దోహదపడింది. ప్రస్తుతం ఆదాని, మోడీ సాన్నిహిత్యంలో ఈ పెరుగుదలను గమనించాలి.

కాంగ్రెస్‌ విధానాలనే బీజేపీ మరింత వేగంగా ముందుకు తీసుకెళ్తున్నది. 1992 డిసెంబర్‌ 6న బీజేపీ నేతృత్వంలో కర సేవకులు బాబ్రి మసీదును కూల్చి వేశారు. ఆ రోజు పార్లమెంట్‌ సమావేశం జరుగుతున్నది. ఏ పరిస్థితులలోనూ కూల్చి వేతను జరగనివ్వననీ, తగిన బలగాలను ఏర్పాటు చేశాననీ పీ.వీ. పార్లమెంట్‌లో ఉదయం 11గంటలకు ప్రకటించారు. తిరిగి ఆ పీ.వీ.గారే ఆదే రోజు సాయంత్రం 5గంటలకు బాబ్రి మసీదు కూల్చబడిందని పార్లమెంట్‌లో చావు కబురు చల్లాగా చెప్పారు. 1992 డిసెంబర్‌ 6 నుంచి – ఆగస్టు 5, 2020 (బాబ్రీ మసీదు విధ్వంసం – రామ మందిర శంకుస్థాపన) వరకు జరిగిన ఘటనలను పరిశీలిస్తే పీ.వీ. వేసిన అడుగుల ఫలితాలు ఎన్ని వేల ప్రాణాలను హరించాయో గుర్తించవచ్చు.

అలాగే 1971 సెప్టెంబర్‌ 30 నుంచి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు ముఖ్యమంత్రిగా ఉన్న పీ.వీ. నరసింహ్మారావు 1973 జనవరి 10 వరకు పని చేశాడు. పదవి నుంచి పోతూనే భూసంస్కరణల చట్టాన్ని ఆమోదింప చేశాడు. 1973 జనవరి 1న చట్టం ఆమోదింప జేశాడు. కానీ ఆ చట్టంలో అనేక లోపాలను చేర్చడంతో దానిని అమలు చేసిన ముఖ్యమంత్రి జలగం వెంగల్రావు నీరుగార్చారు. 7,91,701 ఎకరాల మిగులు భూమి ప్రకటించి 5,19,455 ఎకరాలు మాత్రమే పంపిణీ చేసినా, నేటికీ ఆ మిగులు సీలింగ్‌ భూములు భూస్వాముల చేతుల్లోనే ఉన్నాయి. చట్టంలోనే 1. ట్రస్టులకు, 2. క్యాబినేట్‌ ఆమోదించిన వారికి, 3. రబ్బరు కాపీ తోటలు వేసిన వారికి మినహాయింపులు ప్రకటించారు. ఈ మూడు లోపాలను అడ్డుపెట్టుకొని రెవెన్యూశాఖ మంత్రిగా పనిచేసిన అశోక్‌ గజపతిరాజు విజయనగరంలో 6 వేల ఎకరాల భూమి తమ కుటుంబ సభ్యుల పేరుతో ట్రస్టు ఏర్పర్చి నేటికీ ఆక్రమ ఆక్రమణలో ఉన్నాడు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో పంచిన భూములు తిరిగి భూ స్వాముల చేతుల్లోకే వెళ్ళాయి.

ఈ విధంగా దేశ, రాష్ట్ర ఆర్థిక పరిస్థితులకు తీవ్ర నష్టం కలిగిస్తున్న సంస్కరణల అధ్యుడు పీ.వీ.నరసింహ్మారావు కాలంలో జరిగిన వాస్తవాలను అధ్యయనం చేయాలి. సంస్కరణలు అభివృద్ధి దిశ వైపు ఉండాలి కానీ, తిరోగమనంవైపు ఉండరాదు. కానీ ఈ తిరోగమన సంస్కరణలు ఈ దేశం శాతాబ్ద కాలంలో సాధించిన అభివృద్ధిని వెనక్కు నెట్టి వేశాయి. అయినా ఆ సంస్కరణలనే నేటికి పాలకులు పాటించడం, అమలు జరపడం అత్యంత దుర్మార్గం. మనకన్నా చాలా చిన్న దేశాలు దారిద్య్ర నిర్మూలనలో, మానవ వనరుల కల్పనలో అత్యంత ముందు పీఠిన ఉన్నాయి. 235 దేశాలలో భారత దేశ అభివృద్ధి స్థానం 130లో ఉంది. దీన్ని బట్టి పీ.వీ. ప్రారంభించిన సంస్కరణలు దేశాన్ని ముందుకు తీసుకెళ్లాయా, ఆదోగతికి తీసుకెళ్లాయా అన్నది పరిశీలించాలి. సంస్కరణల ఫలితాల వల్ల దేశం ఆదోగతిలోకి వెళ్తున్నదని అనేక పరిశోధక వ్యాసాలు బట్టబయలు చేశాయి. అయినా పాలకులు వాటినే పట్టుకొని ప్రచారం చేయడం అత్యంత విచారకరం. ప్రస్తుతం అమలు జరుపుతున్న సంస్కరణలను విడనాడి అభివృద్ధి దిశవైపు సంస్కరణలు మారనిచో వ్యవసాయ, పారిశ్రామిక రంగాలు మరింత అధోగతిలోకి వెళ్తాయి. ఇప్పటికైనా శాస్త్రీయంగా ఆలోచించి అభివృద్ధి వైపు అడుగులు వేయాలి.

Courtesy Nava Telangana

Leave a Reply