కరెంట్‌ ఉద్యోగుల కన్నీళ్లు!

0
109
  • జీతాలకు సంస్థల వద్ద డబ్బుల్లేవు..
  • 12 లేదా 15న జీతాలు అందే అవకాశం

హైదరాబాద్‌ : విద్యుత్‌ సంస్థల పుట్టి మునుగుతోంది. రుణాలిచ్చేందుకు బ్యాంకులు ముఖం చాటేయడం, నిల్వలన్నీ కరిగిపోవడంతో ఉద్యోగులకు జీతాలు కూడా ఇవ్వలేని దయనీయ స్థితి నెలకొంది. ప్రభుత్వ ఆదేశానుసారం 24 గంటల పాటు విద్యుత్‌ను సరఫరా చేసేందుకు బహిరంగ విపణిలో అత్యధిక ధరకు కరెంట్‌ కొంటూ విద్యుత్‌ సంస్థలు ఖజానాను ఖాళీ చేసేసుకున్నాయి. దీంతో తమ సంస్థల చరిత్రలో మరెన్నడూ లేనివిధంగా తొలిసారిగా ఉద్యోగులకు వేతనాలు ఇవ్వలేని స్థితికి దిగజారిపోయాయి. ఇక ఖజానాలో ఉన్న కాసింత నిల్వలతో ఆర్టిజన్లు, పెన్షనర్ల వేతనాలు చెల్లించగా… మరో 25 వేల మందికి 12 లేదా 15వ తేదీన వేతనాలు చెల్లించనున్నట్లు సమాచారం ఇచ్చాయి. అది కూడా కరెంట్‌ బిల్లులను వినియోగదారులు కడితే… విద్యుత్‌ కొనుగోళ్లకు కట్టే డబ్బులు పోను ఉద్యోగులకు వేతనాలు చెల్లించవచ్చని భావిస్తున్నాయి. రెగ్యులర్‌ ఉద్యోగులకు జీతాలివ్వాలంటే మరో రూ.400 కోట్ల దాకా కావాల్సి ఉండడంతో ఇబ్బందులు తప్పడం లేదు.

యూనిట్‌కు రూ.8.14ల నష్టం
ఐదేళ్లుగా వ్యవసాయ వినియోగం, దానికి కరెంట్‌ సరఫరా చేయడానికి అయ్యే వ్యయం భారీగా పెరుగుతున్నా ఆ మేరకు ప్రభుత్వం సబ్సిడీలు పెంచకపోవడంతో డిస్కమ్‌లు పీకల్లోతు నష్టాల్లో కూరుకుపోనున్నాయి. డిస్కమ్‌ల లెక్కల ప్రకారం వ్యవసాయానికి ఒక యూనిట్‌ విద్యుత్‌ను అందించడానికి ఎస్పీడీసీఎల్‌లో అయ్యే వ్యయం (2022-23 సంవత్సరంలో) రూ.9.20లు కాగా… అదే ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీతో యూనిట్‌కు రూ.1.06లు వస్తోంది. అంటే ఒక యూనిట్‌ కరెంట్‌ వ్యవసాయ పంపుసెట్లకు అందించడం వల్ల రూ.8.14లు నష్టం వస్తోంది. ఎన్పీడీసీఎల్‌లో వ్యవసాయానికి ఒక యూనిట్‌ కరెంట్‌ అందించడానికి రూ.8.96లు యూనిట్‌కు అవుతుండగా… వచ్చే ఆదాయం సబ్సిడీ, ఇతరత్రా రూపేణా కలుపుకొని యూనిట్‌కు రూ.4.44లు. 2022-23 ఆర్థిక సంవత్సరంలో 69,237 మిలియన్‌ యూనిట్ల విద్యుత్‌ అవసరమని అంచనా వేశారు. ఈ లెక్కన డిస్కమ్‌ల వార్షిక ఆదాయ అవసరాలు రూ.48,708 కోట్లుగా లెక్కించారు. ఇక వ్యవసాయ వినియోగం 18707 మిలియన్‌ యూనిట్లుగా ఉంటుందని లెక్క. దీని ప్రకారం మొత్తం విద్యుత్‌లో వ్యవసాయం వాటా 30 శాతం. అదే ఎత్తిపోతలు కలుపుకొని 40 శాతం దాటాలి. ఈ లెక్కన ఈ రెండు కేటగిరీలకే ప్రభుత్వం రూ.19 వేల కోట్లకు పైగా నిధులివ్వాలి. కానీ వ్యవ సాయ సబ్సిడీ కింద రూ.6754 కోట్లు, ఎత్తిపోతలకు రూ.1780 కోట్లు కలుపుకొని రూ.8534 కోట్లు మాత్రమే ఇవ్వాలని నిర్ణయించడంతో 2022-23లో రూ.10 వేల కోట్లకు పైగా నష్టాన్ని డిస్కమ్‌లు చవిచూడనున్నాయి.

Leave a Reply