ఈ ‘న్యాయం’ దిక్కూమొక్కూ లేని వారికేనా?

0
28

ఎ. సునీత
కె. సజయ

హైదరాబాద్ లోని సింగరేణి బస్తీలో ఈ నెల 9వ తేదీన ఆరేళ్ళ పాప అత్యాచారం, హత్యకి గురయిన సంఘటన ప్రతి ఒక్కరినీ కలిచివేసింది. కొన్ని నెలల క్రితం ఖమ్మంలో, ఇంట్లో పని చేసే బాలిక మీద జరిగిన హత్యాచారం, అంతకుముందు లాక్‌డౌన్ సమయంలో అమీన్‌పూర్ లోని అనాథబాలల ఆశ్రమంలో పన్నెండేళ్ల బాలిక లైంగిక దోపిడీ వల్ల చనిపోవడం, మొన్నటికి మొన్న గాంధీ ఆసు పత్రిలో జరిగిన అత్యాచారం అన్నీ కూడా అణగారిన కులాల, వర్గాల బాలికలు, స్త్రీలపై జరిగినవే. ఈ దురాగతాల్లో చాలావరకు తెలిసినవాళ్ళు, బాధితులను సంరక్షించాల్సిన వ్యక్తులు చేసినవే. రోజురోజుకీ పెరుగుతున్న ఈ దుర్మార్గాలను గమనిస్తే బాలికలు, స్త్రీలు, మరీ ముఖ్యంగా అణగారిన సమూహాల వారిపై లైంగికహింస జరుగుతోందని అర్థమవుతోంది. నిత్యం జరుగుతున్న ఈ హింసా రిరంసను మన ప్రభుత్వం, పోలీసు, అధికార వ్యవస్థలు పట్టించుకుంటున్నాయా? అసలు వీటిని లా అండ్ ఆర్డర్ సమస్యగా తీసుకుంటున్నాయా? అనే బలమయిన అనుమానాలను ప్రజల్లో కలుగజేస్తున్నాయి. అవి, అనేక నిరసనలకు దారితీశాయి, తీస్తున్నాయి.

స్త్రీలపై హింసాత్మక సంఘటనలు– అవి కుటుంబహింస కావచ్చు, అత్యాచారాలు కావచ్చు–- దక్షిణాది రాష్ట్రాలన్నింటిలో కూడా తెలంగాణ లోనే ఎక్కువని జాతీయ నేర నమోదు శాఖ లెక్కలు తెలుపుతున్నాయి. కోర్టుల్లో పెండింగ్‌లో ఉన్న కేసుల శాతం కూడా ఎక్కువే. ఈ రెండూ, స్త్రీల రెండవశ్రేణి పరిస్థితిని సూచించడమే కాకుండా, వారిపై జరుగుతున్న హింస పట్ల ఉన్న రాజకీయ అప్రాధాన్యతను తెలుపుతున్నాయి. ప్రభుత్వ పరంగా ‘షి టీములు’, ‘భరోసా సెంటర్లు’, ‘సఖి సెంటర్లు’ ఎన్ని పెట్టినా హింసకు ప్రధానంగా మూలమయిన పితృస్వామ్య భావజాలాన్ని పాలకపార్టీ ద్వారా పెంచి పోషిస్తున్నప్పుడు దానికి ప్రోత్సాహమే కలుగుతుంది గానీ తగ్గే మార్గాలుండవు. 2019 వరకూ మంత్రివర్గంలో స్త్రీలు లేరు. ఉన్నత న్యాయస్థానం అక్షింతలు వేసేవరకూ మహిళా కమిషన్‌కు చైర్‌పర్సన్‌ను నియమించలేదు. ఏ వేదిక చూసినా కేవలం పురుషులే కనిపిస్తారు. ఇక గత రెండేళ్లలో కొవిడ్ పుణ్యమా అని పెరిగిన పేదరికం, నిరుద్యోగం, అవకాశాలు లేకపోవటం వల్ల జరిగిన అనర్థాలు మామూలు కావు. వాటిల్లో స్త్రీలపై పెరిగిన హింస ప్రధానమయింది.

వీటన్నింటి మధ్యలో తెలంగాణ పోలీసులు 2019లో దిశ అనే హైదరాబాద్‌ యువతిపై జరిగిన హత్యాచారం తర్వాత ముద్దాయిలను ఎన్‌కౌంటర్ పేరుతో తుపాకులతో కాల్చి చంపారు. తద్వారా స్త్రీలు, బాలికలపై జరిగే హింసకి సంబంధించిన న్యాయపాలనలో చట్టాలు, న్యాయవ్యవస్థకు అతీతంగా ‘సత్వరన్యాయం’ అనే ప్రక్రియను ప్రారంభించారు. ప్రతిరోజూ ఆగకుండా జరిగే లైంగిక హింసాఘటనల్లో 99.99 శాతం సంఘటనల్ని ఎవరూ పట్టించుకోరు. నిందితుల్లో తండ్రులు, మామలు, బాబాయిలు, ఇరుగుపొరుగువాళ్ళు, హాస్టల్ వార్డెన్లు, డాక్టర్లు.. ఇలా చాలామందే తెలిసినవాళ్లు ఉంటారు. బాధితులు చాలావరకు బతికి బట్టకడతారు కూడా. దిశ సంఘటనలో, ఆ యువతి చనిపోవడం, మధ్యతరగతి అగ్రకులానికి చెందిన పెళ్లి కాని అందమైన యువతి కావడం వల్ల కావచ్చు, లేదా మన సమాజంలో అత్యాచారమంటే అపరిచిత చిల్లర యువకులు పెళ్లి కాని యుక్తవయసు అమ్మాయిల శీలాన్ని హరించడం అనే భావనకు ఉన్న బలం వల్ల కావచ్చు, నిందితులు దిక్కూ మొక్కూ లేని వారవడం కావచ్చు, వారిని భౌతికంగా మట్టుపెట్టడం ద్వారానే లైంగికదాడులు ఆగుతాయనే భ్రమకు జనాభిప్రాయం లోనయింది. దిశ తల్లి ఫోన్ చేస్తే పట్టించుకోని పోలీసు వ్యవస్థకు తమ అసమర్ధతను కప్పిపుచ్చుకోవడానికి వారిని మట్టుబెట్టడం మంచిమార్గంగా కన్పించింది. ఈ ఒక్క చర్యతో జీరోల నుంచి హీరోలయ్యారు మన పోలీసులు. హ్రస్వదృష్టితో మాత్రమే చూసే దేశవ్యాప్త జనాభిప్రాయానికి ‘హైదరాబాద్ ఎన్‌కౌంటర్’ ఒక స్లోగన్‌గా మారింది.

దురదృష్టవశాత్తు ఆ నలుగురినీ చంపడంతో ఆగిపోతాయని అందరూ భావించిన లైంగికదాడులు మాత్రం ఆగలేదు. తండ్రుల దగ్గరి నుంచి అపరిచితుల వరకూ స్త్రీలు, బాలికల మీద ఈ దాడులు చేస్తూనే ఉన్నారు. సింగరేణి కాలనీ సంఘటన ఇలా ఇరుగుపొరుగు మగవాళ్ళు చేసిన దాడుల్లో ఒకటి. ఆరేళ్ళపాప చనిపోవడంతో మీడియా నుంచి ప్రజాసంఘాల వరకూ, పవన్ కళ్యాణ్ నుంచి షర్మిల వరకూ అందరూ దీన్ని ఒక ప్రభుత్వ వైఫల్యంగా చూశారు. దాంతో ప్రభుత్వానికి అదొక ‘పరువు’ సమస్యగా పరిణమించింది. ఎన్‌కౌంటర్ చేసేస్తామని టిఆర్ఎస్ మంత్రి మల్లారెడ్డి, ఆయనకు తీసిపోకుండా ప్రతిపక్ష నాయకుడు రేవంత్‌రెడ్డి ఉన్మాదంతో ఊగిపోయారు. పబ్లిక్‌గా ఉరి తీయాలని, ఎన్‌కౌంటర్ చేయాలని కొన్ని సంఘాలు బానర్లు కూడా పెట్టుకున్నాయి. ట్విటర్‌లో కూడా అనేక మంది ఇలాగే వీరంగం చేశారు. ఎన్‌కౌంటర్ చేయడం చట్టరీత్యా జరగకూడదని, ఇటువంటి కోరికలు చట్టరాహిత్యాన్ని డిమాండు చేస్తున్నాయనే స్పృహ పూర్తిగా కరువయింది.

అయితే ఇక్కడ ప్రభుత్వానికి చిన్న సమస్య ఎదురయింది. దిశ కేసులో నిందితులను నిజంగానే ఎన్‌కౌంటర్‌లో చంపారా అన్న విషయాన్ని నిర్ధారణ చేసుకోవడానికి జస్టిస్ వి.ఎస్‌. సిర్పూర్కర్ నేతృత్వంలో సుప్రీంకోర్టు నియమించిన జ్యుడీషియల్ కమిషన్ గత నెల రోజులుగా తెలంగాణ హైకోర్టు ప్రాంగణంలోనే విచారణ సాగిస్తోంది. 1970లలో ఎమర్జెన్సీ సమయంలో జరిగిన ఎన్‌కౌంటర్లపై వేసిన భార్గవ కమిషన్, 1996 లో జాతీయ మానవహక్కుల కమిషన్ అప్పటి ఎన్‌కౌంటర్లపై జరిపిన విచారణ తర్వాత సుప్రీంకోర్టు ఒక తెలుగురాష్ట్రంలో ఎన్‌కౌంటర్లపై వేసిన కమిషన్ ఇదే. దీని ముందు హాజరయిన పోలీసులు చెప్పేదానికి, రికార్డులో ఉన్నదానికి పొంతన కరువయిందని వైర్, టైమ్స్ ఆఫ్ ఇండియా, ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌ పత్రికలు క్రమం తప్పకుండా రిపోర్టు చేస్తున్నాయి.

ఇలా దిశ కేసులో జరిపిన ‘సత్వరన్యాయం’పై విచారణ జరుగుతుండడంతో సింగరేణి నిందితుడు రాజును శిక్షించి జనాభిప్రాయం కోరుతున్న రీతిలో అదే సత్వరన్యాయం అందించడం ప్రభుత్వానికి కష్టతరమయిపోయింది. అందుకే రాజు ‘ఆత్మహత్య’ పేరుతో రైలుపట్టాల మీద తేలాడు. ఆ వెంటనే పోస్టుమార్టం, శవదహనం కూడా ఎవరో వెంటబడినట్లు త్వరత్వరగా జరిగిపోయాయి. ఇలా సింగరేణి చిన్నారికి సైతం దిశకు జరిగిన ‘న్యాయం’, కొద్దిపాటి మార్పులతో లభించింది. జనాభిప్రాయానికి సత్వరన్యాయం పేరుతో కోరుకున్న ప్రతీకారం లభించగా ప్రభుత్వానికి పరువు కూడా దక్కింది.

అయితే కొన్ని ప్రశ్నలు మాత్రం మిగిలిపోయాయి. దిశ కేసులో ‘సత్వరన్యాయం’ ఇవ్వని ఫలితాలు సింగరేణి చిన్నారి కేసులో జరిగిన సత్వరన్యాయం ఇస్తుందా? పలుకుబడి, పరువు, ప్రతిష్ఠ ఉన్న మగాళ్లు లైంగికదాడులకు పాల్పడినప్పుడు కూడా ‘సత్వరన్యాయం’ అమలు జరుగుతుందా? లేక ఇదంతా దిక్కూమొక్కూ లేని యువకులకు మాత్రమే పరిమితమయిందా? ఇలా న్యాయవ్యవస్థ బయట ‘సత్వర న్యాయం’ అమలవుతున్నప్పుడు, పకడ్బందీగా మందీమార్బలంతో నేర విచారణ చేయడానికి ఏర్పాటుచేసిన పోలీసు డిపార్టుమెంటులు, న్యాయవ్యవస్థలు, నేరస్థులకు జైళ్లు ఎందుకున్నట్లు? అసలు ప్రజాప్రతినిధులే ఎన్‌కౌంటర్ డిమాండ్లు చేస్తుంటే, న్యాయస్థానం వారిని హెచ్చరించకుండా ఎందుకు కళ్ళుమూసుకు కూర్చుంది? పౌరహక్కుల సంస్థలు, మహిళాసంఘాలు ఈ విషయాన్ని ఉన్నత న్యాయమూర్తి దృష్టికి తీసుకెళ్లినా కూడా ఎందుకు స్పందించలేదు? శతాబ్దాల మథనంతో నిర్మింపబడుతూ వచ్చిన ఆధునిక, రాజ్యాంగబద్ధ వ్యవస్థను ఈ సత్వరన్యాయం పేరుతో నీరుకార్చడం ఏ రకమయిన సమాజానికి, ప్రజాస్వామ్యానికి దారితీస్తోంది?

క్రిమినల్ కోర్టుల్లో ఎప్పటి నుంచో ఖాళీగా ఉన్న పబ్లిక్ ప్రాసిక్యూటర్ పోస్టుల గురించి, వాటిని నింపడంలో ప్రభుత్వం కనపరుస్తున్న తీవ్ర అలసత్వం గురించి మూడు రోజుల క్రితం తెలంగాణ హైకోర్టు ప్రశ్నించింది. అనేక మహిళా కోర్టుల్లో, పోక్సో కోర్టుల్లో పూర్తిస్థాయి జడ్జీలు లేరు. కోర్టుల కెళ్లే స్త్రీలు న్యాయం కోసం సంవత్సరాలు వేచిచూడాలని అందరికీ తెలిసిందే. కోర్టులు, పోలీసుస్టేషన్లను బలపరిచి స్త్రీలపై నేరాల విచారణ సమర్థంగా జరిగేటట్లు చూడడం, ఫాస్ట్‌ట్రాక్ కోర్టులను సిద్ధపరచడం వెంటనే చేపట్టాల్సిన చర్యలు. స్త్రీలపై, బాలికలపై జరిగే లైంగిక హింసను ఎదుర్కోవడానికి సమర్థమయిన విచారణ, త్వరితగతిన నేరస్థులకు శిక్షలు పడేటట్లు చూడడం మాత్రమే దీనికి తగిన పరిష్కారం తప్ప ఇలా సత్వరన్యాయం పేరుతో అనాలోచిత చర్యలకు పాల్పడటం సరికాదు!

Courtesy Andhrajyothi

Leave a Reply