స్త్రీలపై హింస ఎన్‌కౌంటర్లతో ఆగేది కాదు

0
217

ఝాన్సీ గెడ్డం

మార్చి 8న మహిళా దినోత్సవం గురించి అందరికీ తెలుసు. ‘మహిళలపై హింసకు వ్యతిరేక దినోత్సవం’ గురించి పెద్దగా ఎవరికీ తెలియదు. ప్రతి ఏటా నవంబరు 25 తేదీని మహిళలపై హింసకు వ్యతిరేక దినోత్సవంగా (International Day for Elimination of Violence Against Women) జరపాలని ఐకరాజ్య సమితి 1999లో పిలుపునిచ్చింది. నవంబరు 25 నుంచి మొదలుకొని డిసెంబరు 10న జరిగే మానవ హక్కుల దినోత్సవం దాకా పదహారు రోజులపాటు మహిళలపై హింసకు వ్యతిరేకంగా ప్రచారోద్యమాన్ని జరపాలని ఐక్య రాజ్య సమితి సభ్య దేశాలకు సూచించింది. ఈ పదహారు రోజుల కార్యక్రమాన్ని ఐక్యరాజ్య సమితి ‘ఆరెంజ్ ద వరల్డ్’ పేరుతో పిలుస్తుంది. భవిష్యత్తు ఆశాజనకంగా ఉండాలని సూచించేందుకు నారింజ రంగును ఎంపిక చేసినట్లు ఐక్య రాజ్య సమితి మహిళా విభాగం ప్రకటించింది. లింగ సమానత్వం కోసం ఈ ప్రచారోద్యమాన్ని ప్రభుత్వాలు పెద్ద ఎత్తున జరిపితే బావుంటుంది. కానీ ఇంతవరకూ ఈ కార్యక్రమాన్ని మన ప్రభుత్వం జరపలేదు. గత పదిహేనేళ్లుగా ‘దళిత స్త్రీ శక్తి’ తరఫున మేము ఈ పదహారు రోజులపాటు దళిత గిరిజన స్త్రీలపైన, బాలికలపైన జరుగుతున్న అన్ని రకాల హింసకు వ్యతిరేకంగా ప్రచార ఉద్యమాన్ని చేపడుతున్నాం. ఈ సంవత్సరం కూడా చేపట్టనున్నాం. ఈ ప్రచారోద్యమం నవంబర్‌ 25న విజయవాడ అంబేడ్కర్‌ భవన్‌‍లో ప్రారంభమై డిసెంబర్ 10 వరకు కొనసాగుతుంది. ఇందులో భాగంగా రెండు తెలుగు రాష్ట్రాలలోని అనేక పాఠశాలల్లో, కళాశాలల్లో, గ్రామాల్లో, మురికి వాడల్లో సభలు సమావేశాలు నిర్వహిస్తాం. హింసలకు గురైన మహిళా బాధితులతో రౌండ్‌ టేబుల్‌ సమావేశాలు, పట్టణ కూడళ్లలో మానవ హారాలు వంటి కార్యక్రమాలను చేపడతాం.

మహిళలపై ఏదైనా తీవ్రమైన లేదా వికృతమైన నేరం జరిగినప్పుడు ప్రజలందరూ ఉద్యమించడం, పేపర్ల పతాక శీర్షికలన్నీ ఈ వివరాలతో నిండిపోవటం మనం చూస్తున్నాం. నిందితుడిని ఎన్‌కౌంటర్ చేయమనో, రాళ్లతో కొట్టి చంపమనో ప్రజలు డిమాండ్‌ చేస్తున్నారు. దానికి తలవొగ్గి పోలీసులు రాజ్యాంగ విరుద్ధంగా నిందితుడిని కడతేరుస్తున్నారు. ఇది ఇటీవల చాలాసార్లు జరిగింది. ఇలా వికృత సంఘటనలు జరిగినప్పుడు మాత్రమే స్పందించి, నిత్యం స్త్రీలపై వివిధ రూపాల్లో వివిధ స్థాయిల్లో జరుగుతున్న హింసను, దాని వెనుకున్న ఆధిపత్య స్వభావాన్ని అర్థం చేసుకోకపోతే, దాన్ని రూపుమాపే ప్రయత్నం చేయకపోతే ప్రయోజనం లేదు. స్త్రీలపై హింసకు అనేక కారణాలున్నాయి. పాలకుల భావజాలం, పోలీసు, న్యాయవ్యవస్థల పని తీరు అత్యంత అమానవీయంగా ఉన్నాయి. ప్రెస్ మీట్ల నుంచి చట్టసభల దాకా రాజకీయ నాయకులు మాట్లాడే భాష స్త్రీలను చులకన చేసే విధంగా ఉంటోంది. ప్రభుత్వ ప్రతిపక్షాలు పరస్పరం తిట్టుకుంటూ ‘‘గాజులు తొడుక్కుని కూర్చోలేదు’’ లాంటి స్త్రీలను కించపరిచే భాషను వాడుతున్నారు. ఈ ధోరణి సమాజంపై ఎలాంటి ప్రభావాన్ని చూపుతుందో పాలకులకు అర్థం కావటం లేదు. పోలీసు, న్యాయ వ్యవస్థల పని తీరు సరేసరి. ఆధునిక యుగంలో కూడా పోలీసు వ్యవస్థలో మార్చు రాలేదనడానికి మరియమ్మ లాకప్‌ హత్య, వీర శేఖర్‌పై పోలీసు జులుం వంటివి ఉదాహరణలు. అత్యంత హింసాత్మక సంఘటనల వెనుక పురుషాధిపత్య ధోరణితో పాటు మద్యం, మాదక ద్రవ్యాల వినియోగం పాత్ర ఎంతో ఉంది. ఇవేగాక స్మార్ట్ ఫోన్ల ద్వారా అరచేతిలోకి వచ్చిచేరిన అశ్లీల వీడియోలు తమ వంతు పాత్ర పోషిస్తున్నాయి. అందుకే మహిళలపై హింస అరికట్టాలంటే ముందు సమాజంలో పెచ్చుమీరుతున్న ఇలాంటి రుగ్మతలను అరికట్టాలి. అంతే కాక ప్రతి అంశాన్ని జెండర్‌ దృక్పథంతో పరిశీలించి సమాజాన్ని చైతన్యపరచాలి. పిల్లల పాఠ్యాంశాలు మొదలుకొని ప్రతి అంశంలోనూ లింగ సమానత్వాన్ని చాటాలి. అదేవిధంగా దిశా చట్టం లాంటి చట్టాల్ని ప్రజల మెప్పు కోసం, వారి ఆవేశాన్ని సంతృప్తి పరచటం కోసం వినియోగించటం మానేయాలి. ప్రస్తుతం రాజ్యాంగ విలువల ప్రకారం చట్టబద్ధ పాలనకు బదులు రాచరిక తరహా పాలన కొనసాగుతోంది. మెజారిటీ వచ్చిన పార్టీ నాయకులు ప్రజాస్వామ్య స్ఫూర్తిని గాలికి వదిలి ఇష్టారాజ్యంగా పాలిస్తున్నారు. ఈ ధోరణి ఎట్టి పరిస్థితుల్లోనూ సమర్థనీయం కాదు. దీన్ని ప్రజలూ, నాయకులూ గుర్తించాలి. ప్రజలు అత్యాచార నిందితులను ఉరి తీయాలని లేదా ఎన్‌కౌంటర్ చేయాలనీ డిమాండ్ చేయటానికి బదులు ప్రభుత్వాలు రాజ్యాంగ ప్రకారం శిక్షలను అమలు చేయాలని, ఈ ప్రక్రియ పర్యంతం మానవ హక్కులను కాపాడాలని డిమాండ్ చేయాలి. ప్రజల్లో ఇలాటి చైతన్యం రావాలంటే రాజ్యాంగ విలువల గురించి విస్తృత ప్రచారం జరగాలి. ఈ ఉద్దేశంతోనే లింగ సమానత్వంపై చైతన్యాన్ని పెంచే ఉద్దేశంతో ఐక్యరాజ్య సమితి పదహారు రోజుల ఈ ప్రచారోద్యమానికి పిలుపునిచ్చింది. ఈ కార్యక్రమానికి తగినంత ప్రాధాన్యత కల్పించాల్సిన బాధ్యత మనందరిపైనా ఉంది.

Courtesy Andhrajyothi

Leave a Reply