పర్యావరణ పరిరక్షణకా? పరిశ్రమాధిపతుల రక్షణకా?

0
310

హత్యలు ఆపడం చేతకాకపోతే హత్యలు చేయడాన్నే చట్టబద్దం చేసినట్లుంది నేటి కేంద్ర ప్రభుత్వ విధానం. కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ (ఎం.ఒ.ఇ.ఎఫ్‌.సి.సి) ఇలాంటి పద్ధతి లోనే ఎన్విరాన్‌మెంటల్‌ ఇంపాక్ట్‌ అసెస్‌మెంట్‌ యాక్ట్‌ (ఇఇఎ)లో సవరణ చేయబోతోంది. దేశంలో నిర్మించబోయే అభివద్ధి ప్రాజెక్టులు, వాటి వలన జరగబోయే పర్యావరణ నష్టాలను ఈ చట్టం ప్రకారం అంచనా వేస్తారు. ఆ తరువాతే ప్రాజెక్టును కట్టాలా? వద్దా అన్నది నిర్ణయిస్తారు.

‘పర్యావరణ రక్షణ చట్టం-1986’లో భాగంగా 1994లో తొలుత దీని విధి విధానాలను రూపొందించారు. 2006లో ఒకసారి సవరణ చేశారు. తిరిగి ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం కొత్తగా మరికొన్ని సవరణలు చేయబోతోంది. 2006లో ఉన్నవి ఏమిటి? ప్రస్తుతం సవరణలు చేయబోతున్నవి ఏమిటి? వాటి ప్రభావం ఎలా ఉంటుందన్నది పరిశీలించాలి. ఒక పరిశ్రమ నిర్మాణం చేయాలంటే దాని గురించి ఎటువంటి దాపరికం లేకుండా వ్యవహ రించాలని, సమగ్రంగా, స్థిరమైన అభివద్ధికి బాటలు వేయాలని ఆ చట్టం చెబుతోంది. వికేంద్రీకరణకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని, పర్యావరణానికి ఎటువంటి నష్టం కలగకుండా చూడాలని నిర్దేశిస్తుంది. పర్యావరణ పరిరక్షణకు సంబంధించిన అన్ని అనుమతులను పరిశ్రమమల యజమానులు పొందాలి. దీనికోసం పరిశ్రమ నిర్మించే ప్రాంతంలో ముందుగా ప్రజాభిప్రాయ సేకరణ చేయాలి. ఈ కార్యక్రమానికి ప్రభుత్వాధికారులతో పాటు పరిశ్రమాధిపతులు కూడా హాజరు కావాలి. ప్రజల అభిప్రాయాలను పరిగణ లోకి తీసుకుని వాటికి బాధ్యత వహించాలి. ఇంత పారదర్శకంగా ఉండాలని చట్టం చెబుతున్నా పారిశ్రామికవేత్తలు అనేక చోట్ల దీనిని తుంగలోకి తొక్కారు. ప్రభుత్వ యంత్రాంగం అమలు చేయడంలో విఫలమైంది.

2006 చట్టం చదవడానికి, వినడానికి చక్కగా ఉండి, సమర్ధవంతంగా కనపడతున్నప్పటికీ ఆచరణలో ప్రభావవంతంగా అమలుకు నోచుకోలేదు. దీనిలో ఉన్న బలహీనతలను అధిగమించాల్సి ఉంది. అయితే, మోడీ ప్రభుత్వం తీసుకువస్తున్న సవరణలు దీనికి భిన్నంగా ఉన్నాయి. పర్యావరణం, అడవులు, వాతావరణం మార్పు మంత్రిత్వ శాఖ ఈ ఏడాది మార్చి 12న విడుదల చేసిన ముసాయిదాను చూస్తే ఈ విషయం అర్థమవుతుంది. ప్రభుత్వం చేస్తున్న సవరణలు చూస్తే ఇప్పటి వరకు ఏవైతే అక్రమమని భావిస్తున్నామో వాటికే చట్టబద్దత లభించనుంది.
కొత్త ముసాయిదా ప్రకారం పరిశ్రమల నిర్మాణం పూర్తయిన తరువాత అనుమతులు పొందవచ్చు (పోస్టు ఫ్యాక్టో క్లియరెన్స్‌). ఇప్పటి వరకు ముందస్తు అనుమతులు పొందాల్సి ఉంది. దీనికి భిన్నంగా కట్టిన తరువాత అనుమతులంటే దాని అర్థమేమిటో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. పరిశ్రమను ఎక్కడైనా, ఎటువంటి పరిస్థితుల్లోనైనా కట్టవచ్చన్నది దీని సారాంశం. ఫలానా ప్రాంతంలో ఫ్యాక్టరీ కట్టామని దరఖాస్తు చేసుకుంటే, ప్రభుత్వం అనుమతులు ఇచ్చేస్తుంది. రెండవ సవరణ ప్రకారం తాను ఏర్పాటు చేసే పరిశ్రమ ద్వారా పర్యావరణానికి జరిగే హని గురించి యజమాని ప్రభుత్వానికి నివేదిస్తే సరిపోతుంది. దీనిని సెల్ఫ్‌ సరెండర్‌గా సవరణల్లో పేర్కొన్నారు. యజమాని నివేదించిన అంశాలను పరిశీలించి ఏం చేయాలో ప్రభుత్వం చెబుతుంది. ఒకసారి ఇది అమలు లోకి వస్తే ప్రజలు చేసే ఫిర్యాదులకు ఎంత ప్రాధాన్యత లభిస్తుందో అర్ధం చేసుకోవచ్చు.

ఏ ప్రాజెక్టునైనా ప్రభుత్వం వ్యూహాత్మకమైనది అని గుర్తిస్తే ప్రజాభిప్రాయాన్ని కూడా పరిగణలోకి తీసుకోనవసరం లేదు. ఈ తరహా పరిశ్రమలకు ప్రజాభిప్రాయ సేకరణ నుంచి మినహాయిస్తున్నట్లు పేర్కొన్నారు. ఇది ఒక రకంగా ప్రజల సంపదను దోపిడి చేయడానికి అనుమతి ఇవ్వడమే. గతంలో ప్రజలు తమ అభిప్రాయాలు చెప్పడానికి 30రోజులు గడువు ఇచ్చారు. తాజా సవరణల్లో దానిని 20 రోజులకు కుదించారు.

పరిశ్రమలలో చేసేందుకు తలపెట్టిన మార్పులు, అభివద్ధి నివేదికను ప్రతి ఆరునెలలకు ఒకసారి యాజమాన్యం ప్రభుత్వానికి సమర్పించాలని గతంలో ఉండేది. తాజా సవరణల ప్రకారం దీనిని 12నెలలకు పొడిగించారు. అంతే గాకుండా పర్యావరణ అనుమతులు, లైసెన్స్‌ కాలాన్ని పొడిగించారు. ఈ సవరణలను పరిశీలిస్తే పర్యావరణ పరిరక్షణ కంటే విధ్వంసమే ఎక్కువ జరుగుతోందని అర్ధమవుతోంది. ఫలితంగా ఈస్ట్‌ ఇండియా ప్రాంతంలో ఇప్పటి వరకు జాగ్రత్తగా కాపాడుకున్న పర్యావరణ ప్రాంతం భవిష్యత్‌లో దెబ్బతినే ప్రమాదం ఉంది. ప్రస్తుతం చట్టం కఠినంగా ఉన్నట్టు కనిపిస్తున్నప్పటికీ ఉల్లంఘనలు జరుగుతూనే ఉన్నాయి. జనావాసాల మధ్య ప్రమాదకర పరిశ్రమలు ఏర్పాటవుతూనే ఉన్నాయి. విశాఖ ఎల్‌.జి పాలిమర్స్‌ గ్యాస్‌ లీక్‌, అసోం ఆయిల్‌ గ్యాస్‌ లీక్‌లు దీనికి తాజా ఉదాహరణలు. 2020లో కొత్తగా చేసిన సవరణలు అమలు చేస్తే పర్యావరణానికి మరింత ముప్పు, జనావాసాలకు తీవ్ర ప్రమాదం ఏర్పడే అవకాశం ఉంది.

కొత్తగా చేయబోయే సవరణలను బహిర్గతం చేసిన వారిని ఢిల్లీలో ఐ.టి చట్టం, యాంటీ టెర్రరిజం చట్టం కింద పోలీసులు నోటీసులు పంపారు. పర్యావరణాన్ని పరిరక్షించే ముసుగులో దానికి భిన్నంగా వ్యవహరిస్తూ… మానవాళి మనుగడకు ముప్పుగా మారే సవరణలను వ్యతిరేకించే వారిని అణచివేయాలని చూడటం…వారి గొంతు నొక్కడానికి టెర్రరిస్టు ముద్ర వేయడం ఎంత అప్రజాస్వామికమో!

సెల్‌ : 9490098980
వి. శ్రావణి, డి.ఎ. వంశీకృష్ణ

Leave a Reply