జననాలపై వాయు కాలుష్యం

0
221

– 2019లో నెలలు నిండకముందే 60లక్షల శిశు జననాలు
– తక్కువ బరువుతో పుడుతున్న బిడ్డలు.. భవిష్యత్తులో తీవ్ర పరిణామాలు
– యూసీఎస్‌ఎఫ్‌, యూనివర్సీటీ ఆఫ్‌ వాషింగ్టన్‌ల సంయుక్త అధ్యయన నివేదిక

న్యూఢిల్లీ: అభివృద్ధి పేరిట ప్రకృతి విధ్వంసం రోజురోజుకూ పెరిగిపోతూనే ఉంది. దీనికి తోడూ కాలుష్యం సైతం రికార్డు స్థాయిలో పెరిగిపోతుండటం మానవ మనుగడపై తీవ్ర ప్రభావం చూపుతోంది. వాయు కాలుష్యం కారణంగా ఒక్క 2019 ఏడాదిలోనే ప్రపంచవ్యాప్తంగా దాదాపు 60లక్షల మంది నెలలు నిండకముందే జననాలు (ముందస్తు ప్రసవాలు) చోటుచేసుకున్నాయని తాజాగా ఓ అధ్యయనం వెల్లడించింది. అలాగే, దాదాపు 30లక్షల మంది శిశువులు తక్కువ బరువుతో జన్మించడానికి వాయు కాలుష్యం కారణమైందని ఈ నివేదిక పేర్కొంది. ఈ పరిస్థితులు, ప్రస్తుతం కొనసాగుతున్న వాయు కాలుష్యం మన్ముందు కూడా ఇలానే కొనసాగితే మానవ మనుగడకు ప్రమాదం తప్పదని నివేదిక హెచ్చరించింది. ఈ నివేదికను అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్‌ కాలిఫోర్నియా శాన్‌ ఫ్రాన్సిస్కో (యూసీఎస్‌ఎఫ్‌), యూనివర్సిటీ ఆఫ్‌ వాషింగ్టన్‌ పరిశోధకులు సంయుక్తంగా పరిశోధించి.. 204 దేశాల డేటాను ఉపయోగించి ప్రపంచవ్యాప్తంగా ఇండోర్‌, అవుట్‌ డోర్‌ కాలుష్య ప్రభావాలను అంచనా వేశారు.

ఈ అధ్యయనం తాజాగా ప్రముఖ మెడికల్‌ జర్నల్‌ పీఎల్‌వోఎస్‌లో ప్రచురితమైంది. ఈ అధ్యయనం అతి సూక్ష్మ రేణువులు (పీఎమ్‌2.5) గర్భాధారణపై ఎలాంటి ప్రభావాలు చూపుతున్నాయనే విషయాన్ని లోతుగా పరిశీలించి వెల్లడించింది. వీటిలో గర్భాధారణ వయస్సు, నెలల నిండకముందే జననాలు, బరువు తక్కువ శిశు జననాలు, జననాల అనంతరం త్వరగా బరువు తగ్గిపోవడం, శిశు మరణాలు వంటి అంశాలు ఉన్నాయి. దీనికి ప్రధాన కారకాలుగా వంట చేయడానికి ఉపయోగించే స్టవ్‌లు ఉన్నాయనీ, మూడింట రెండు వంతులు ఇదే కారణమని పరిశోధకులు తెలిపారు. కాలుష్యం నివారించడం కారణంగా దక్షిణాసియా, సబ్‌ సహారా ఆఫ్రికా దేశాల్లో నెలలు నిండక ముందే జననాలను 78 శాతం వరకు తగ్గించవచ్చునని పేర్కొంది. నవజాత శిశువుల మరణాలకు ప్రధాన కారణం నెలలు నిండకముందే జరిగే జననాలు అని నివేదిక పేర్కొంది. ప్రతియేటా 15 మిలియన్లకు పైగా శిశువులను కాలుష్యం ప్రభావితం చేస్తున్నదని తెలిపింది. కాగా, ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచనా ప్రకారం ప్రపంచ జనాభాలో 90 శాతానికి పైగా కలుషితమైన బహిరంగ గాలితో నివసిస్తున్నారు. ప్రపంచ జనాభాలో సగం మంది ఇంటి లోపల బొగ్గు, పిడకలు, కలపను కాల్చడం వల్ల ఇండోర్‌ వాయు కాలుష్యానికి గురవుతున్నారు.

Courtesy Nava Telangana

Leave a Reply