- పురుషులతో సమానంగా వేతనాలు
- బీసీసీఐ కీలక నిర్ణయం
న్యూఢిల్లీ: దేశ క్రికెట్‌లో లింగ సమానత్వాన్ని ప్రోత్సహించే దిశగా బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకుంది. సెంట్రల్ కాంట్రాక్ట్‌లో ఉన్న మహిళా క్రికెటర్లకు పురుషులతో సమానంగా మ్యాచ్ రుసుములు ఇవ్వనున్నట్టు ప్రకటించింది. కొత్తగా ప్రవేశపెట్టే విధానంలో..మహిళా క్రికెటర్లు పురుష ఆటగాళ్లతో సమానంగా ఒక్కో టెస్ట్ మ్యాచ్‌కు రూ. 15 లక్షలు, వన్డేకు రూ. ఆరు లక్షలు, టీ20కి మూడు లక్షల చొప్పున అందుకుంటారు. గతంలో ఒక్కో వన్డే, టీ20కి రూ. లక్ష, టెస్ట్‌కు రూ. నాలుగు లక్షల చొప్పున వారికి వేతనం లభించేది. గురువారం జరిగిన బోర్డు అపెక్స్ కౌన్సిల్ సమావేశం అనంతరం అధ్యక్షుడు రోజర్ బిన్నీ మాట్లాడుతూ ‘బీసీసీఐ తాజా నిర్ణయం దేశ మహిళా క్రికెట్‌కు… మొత్తంగా క్రికెట్ అభివృద్ధికి మరింత బాటలు వేస్తుంది’ అని అన్నాడు.
‘భారత క్రికెట్ కొత్త శకంలోకి అడుగుపెడుతున్న తరుణంలో ఇదో గొప్ప నిర్ణయం. అలాగే పురుషులతో సమానంగా మహిళలకు మ్యాచ్ ఫీజులనే విధానం వివక్షను రూపుమాపే దిశలో ముందడుగు’ అని కార్యదర్శి జై షా అభివర్ణించాడు. పురుషులతో సమానంగా మహిళా క్రికెటర్లకు వేతనాలు ఇచ్చే రెండో దేశంగా భారత్ నిలిచింది. న్యూజిలాండ్ క్రికెట్ ఇప్పటికే ఈ విధానాన్ని అమలు చేస్తోంది. క్రికెట్ ఆస్ట్రేలియా కూడా ఈ దిశగా అడుగులు వేస్తోంది. ఈ ఏడాది మహిళా ఐపీఎల్ కూడా నిర్వహించాలని బీసీసీఐ నిర్ణయించిన నేపథ్యంలో మ్యాచ్ ఫీజుల ప్రకటన వెలువడడం విశేషం.