ధరల పెరుగుదల, జిఎస్‌టి పెంపు : ప్రజలపై క్రూరమైన దాడి

0
245

ఈ ప్రభుత్వమే 2019లో కార్పొరేట్‌ పన్నులు తగ్గించింది. దాంతో రూ.1.45 లక్షల కోట్ల ఆదాయం నష్టపోయింది. కార్పొరేట్లకు వరుసగా రుణాల రద్దులను ప్రకటించింది. సంపన్నులు బ్యాంకులకు బకాయిపడి కట్టనటువంటి రుణాల మొత్తం రూ. 2.4 లక్షల కోట్లుగా వుంది. ఇటువంటి రాయితీలు, బెయిలవుట్ల వల్ల నష్టపోయిన ఆదాయాన్ని భర్తీ చేసుకోవడానికి, పెట్రోలియం ఉత్పత్తులపై పన్నులు, ఆహార పదార్ధాలపై, ప్రజలు ఎక్కువగా వినియోగించే వస్తువులపై జిఎస్‌టి రేట్లు పెంచడం వంటి పరోక్ష పన్నులతో క్రూరమైన దాడి జరుపుతోంది.

వాణిజ్య, కరంట్‌ అకౌంట్‌ లోట్లు పెరిగిపోతున్న నేపథ్యంలో మొదటిసారిగా డాలరుతో రూపాయి మారకం 80 దాటింది. రూపాయి విలువ నిరంతరం క్షీణిస్తూ వుండడం ద్రవ్యోల్బణ ఒత్తిళ్ళు పెరగడానికి దారితీస్తోంది. దీనికి తోడు ఇప్పటికే వున్న ద్రవ్యోల్బణం, అధిక నిరుద్యోగం ఇవన్నీ చూస్తుంటే, మోడీ ప్రభుత్వం బడా వ్యాపారవేత్తలకు అనుకూలంగా వుండే విధానాలను అనుసరించడం వల్ల ఆర్థిక వ్యవస్థ ఎలా పక్కదారులు పడుతోందో తెలియచేస్తోంది. టోకు, రిటైల్‌ ద్రవ్యోల్బణ రేట్లు వరుసగా 15 శాతం, 7 శాతంగా కొనసాగుతునే వున్నాయి. ఫలితంగా అన్ని నిత్యావసర వస్తువుల ధరలు ముఖ్యంగా ఆహార పదార్ధాల ధరలు అడ్డూ అదుపు లేకుండా పెరిగిపోతున్నాయి. వీటికి అదనంగా, పెరుగుతూ పోతున్న ఇంధన ధరల భారం ప్రజలపై పడుతూనే వుంది. వంట గ్యాస్‌ సిలిండర్ల ధరలు కూడా విపరీతంగా పెరిగిపోయాయి.

గత మూడేళ్ళుగా రూపాయి విలువ క్షీణిస్తూనే వస్తోంది. ఇందుకు అనేక కారణాలు వున్నాయి. బ్యాలెన్స్‌ ఆఫ్‌ పేమెంట్ల(చెల్లింపుల సమతూకం)కి సంబంధించి వాణిజ్య, కరంట్‌ అకౌంట్‌ లోటు పెరిగిపోవడం వీటిలో ముఖ్యమైన కారణంగా వుంది. అమెరికా ఫెడరల్‌ రిజర్వ్‌ వడ్డీ రేట్లను పెంచినప్పటి నుండి విదేశీ పోర్టుఫోలియో పెట్టుబడులు నిష్క్రమించడం ప్రస్తుతం రూపాయి విలువ తగ్గడానికి ప్రధాన కారణంగా వుంది. ఉదాహరణకు, ఈ ఏడాది ఇప్పటి వరకు ఈక్విటీలను విక్రయించడం ద్వారా 3 వేల కోట్ల డాలర్లను విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు తీసేసుకున్నారు.

పెద్ద మొత్తంలో విదేశీ మారక నిల్వలు వున్నందున బహిరంగ మార్కెట్‌లో జోక్యం చేసుకోవడం ద్వారా భారత రిజర్వ్‌ బ్యాంక్‌ రూపాయి క్షీణతను అడ్డుకోవచ్చు. కానీ అలా చేయకుండా, ఏవో కొన్ని సందర్భాల్లో మినహాయించి చాలాసార్లు…భారత ఎగుమతుల పోటీని పెంచేందుకు, వాణిజ్య లోటును తగ్గించేందుకుగానూ…రూపాయిల్లో దిగుమతులు మరింత వ్యయ భరితమయ్యేలా చేసేందుకు రూపాయి విలువ క్షీణించడానికి ఆర్‌బిఐ అనుమతించిందని అర్ధమవుతోంది. కానీ, రూపాయి విలువ క్షీణించడమనేది ప్రధానంగా పెట్టుబడులు తరలిపోవడం, అలాగే విదేశీ పోర్టుఫోలియో పెట్టుబడులు వెళ్ళిపోవడం వల్ల జరిగింది. అందువల్ల రూపాయి విలువ తగ్గడం వాణిజ్య లోటు తగ్గడానికి దారి తీయదు.
రూపాయి విలువ క్షీణత ప్రభావం దేశవ్యాప్తంగా పడనుంది. ఎందుకంటే, దీనివల్ల దిగుమతుల వ్యయం పెరిగిపోనుంది. దిగుమతి చేసుకునే ఎరువులు, పెట్రోలియం ఉత్పత్తులపై అధిక మొత్తంలో సబ్సిడీల కారణంగా సబ్సిడీల భారం పెరిగిపోనుంది. అందువల్ల సబ్సిడీలను తగ్గించాలని ప్రభుత్వం భావిస్తోంది. సాధారణ ద్రవ్యోల్బణం, ధరల పెరుగుదలకు ఇది కూడా తోడైంది.

అధిక ధరల కారణంగా సాధారణ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్న సమయంలో వివిధ వస్తువులపై జిఎస్‌టి రేట్ల పెంపు భారాన్ని ప్రభుత్వం మోపింది. మొదటిసారిగా, ముందుగానే ప్యాక్‌ చేసి పెట్టే తృణధాన్యాలు, పప్పు ధాన్యాలు, పెరుగు, పన్నీర్‌, మాంసం, చేపలు వంటి కొన్ని ఆహార ఉత్పత్తులపై 5 శాతం పన్ను విధించింది. శవ దహన చార్జీలు, ఆస్పత్రి పడకలు, చెక్కుల ద్వారా చెల్లింపులతో సహా ఇతర సర్వీసులపై కూడా జిఎస్‌టి రేట్లు పెరిగాయి.

పన్నులు వేసి ఆహార పదార్ధాల ధరలు పెంచడం ద్వారా ప్రజలపై ఇలాంటి భారాలు మోపడం గురించి నిర్లక్ష్యపూరితమైన ప్రభుత్వమే పరిశీలిస్తుంది. జిఎస్‌టి కౌన్సిల్‌ ఆమోదించిన కొత్త జిఎస్‌టి ప్రతిపాదనలు ఏకాభిప్రాయంతో తీసుకున్నవని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ చెప్పారు. ఏ రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన ప్రతినిధీ ఈ ప్రతిపాదనలను వ్యతిరేకించలేదన్నారు. ఇది పూర్తిగా అవాస్తవం.

జిఎస్‌టి రేట్ల సవరణ అమలుపై వేసిన మంత్రుల బృందం (జిఓఎం)లో కేరళ ఆర్థిక మంత్రి కె.ఎన్‌.బాలగోపాల్‌ సభ్యుడిగా వున్నారు. ఈ ప్రతిపాదనలపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ, గతేడాది నవంబరు 29నే ఆయన ఒక లేఖ రాశారు. సామాన్యుడిపై భారం మోపకుండా జిఎస్‌టి వ్యవస్థ ద్వారా ఆదాయాలను పెంచుకోవడమెలా అనే అంశంపై మరింత సవివరమైన అధ్యయనం జరపాలని కోరారు. కేరళ ప్రభుత్వ వైఖరిని పునరుద్ఘాటిస్తూ, జూన్‌ 17న జరిగిన చివరి మంత్రుల బృందం సమావేశానికి ఈ లేఖను మళ్ళీ పంపారు.

చండీగఢ్‌లో జరిగిన జిఎస్‌టి కౌన్సిల్‌ సమావేశంలో మొత్తంగా అన్ని ఆహార పదార్ధాలపై జిఎస్‌టి రేట్లు పెంచాలన్న నిర్ణయం చూస్తే, కౌన్సిల్‌లో నిర్ణాయక క్రమం ఎంత అపారదర్శకంగా వుందో స్పష్టమవుతోంది. కుటుంబశ్రీ వంటి సంస్థలు లేదా చిన్న దుకాణాల్లో ఒకటి లేదా రెండు కిలోలు ప్యాకెట్లలో విక్రయించే ఆహార పదార్ధాలపై ఎలాంటి పన్ను విధించరాదని కేరళ ప్రభుత్వం తాజాగా నిర్ణయించింది.

ఆహార పదార్ధాలపై పన్ను విధించరాదని, గృహ వినియోగదారీ వస్తువులపై తక్కువ జిఎస్‌టి విధించాలనేటువంటి సరైన వైఖరిని… గత ఎల్‌డిఎఫ్‌ ప్రభుత్వ హయాంలో కేరళ ఆర్థిక మంత్రిగా థామస్‌ ఐజాక్‌ వున్నప్పటి నుండి కేరళ ప్రభుత్వం తీసుకుంటూ వస్తోంది. వీటిపై పన్ను విధించడానికి బదులుగా ముందుగా విధించిన 28 శాతం స్లాబ్‌ను పునరుద్ధరించడం ద్వారా విలాసవంతమైన వస్తువులపై పన్ను రేటును పెంచాలని సూచించింది.

అయితే, సంపన్నులపై, విలాసవంతమైన వినియోగంపై పన్నులు వేయాలని మోడీ ప్రభుత్వం భావించడం లేదు. ఈ ప్రభుత్వమే 2019లో కార్పొరేట్‌ పన్నులు తగ్గించింది. దాంతో రూ.1.45 లక్షల కోట్ల ఆదాయం నష్టపోయింది. కార్పొరేట్లకు వరుసగా రుణాల రద్దులను ప్రకటించింది. సంపన్నులు బ్యాంకులకు బకాయిపడి కట్టనటువంటి రుణాల మొత్తం రూ.2.4 లక్షల కోట్లుగా వుంది. ఇటువంటి రాయితీలు, బెయిలవుట్‌ల వల్ల నష్టపోయిన ఆదాయాన్ని భర్తీ చేసుకోవడానికి, పెట్రోలియం ఉత్పత్తులపై పన్నులు, ఆహార పదార్ధాలపై, ప్రజలు ఎక్కువగా వినియోగించే వస్తువులపై జిఎస్‌టి రేట్లు పెంచడం వంటి పరోక్ష పన్నులతో క్రూరమైన దాడి జరుపుతోంది.

ఇటువంటి తిరోగమన విధానం అంతం కావాలి. ఇకనైనా, పెంచిన జిఎస్‌టి రేట్లను, సర్‌చార్జీలను, వెంటనే ఉపసంహరించాలి. పెట్రోల్‌, డీజిల్‌లపై సెస్సులను రద్దు చేయాలి. బదులుగా సూపర్‌ సంపన్నులపై, కార్పొరేట్లపై మరిన్ని పన్నులు విధించాలి.

Leave a Reply